మార్చిలోపు విలీనం లేనట్లే! | SBI pushes merger of 5 associate banks, BMB to next fiscal | Sakshi
Sakshi News home page

మార్చిలోపు విలీనం లేనట్లే!

Published Tue, Jan 3 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

మార్చిలోపు విలీనం లేనట్లే!

మార్చిలోపు విలీనం లేనట్లే!

అనుబంధ బ్యాంకుల విలీనంపై
ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య
ప్రభుత్వ ఆమోదానికి నిరీక్షిస్తున్నట్లు వెల్లడి


ముంబై: తొలుత భావించినట్లుగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో దాని అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017 మార్చి) ముగిసేలోపు పూర్తయ్యేట్లు కనిపించడం లేదు. ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య స్వయంగా ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపారు. విలీనం దిశలో ముందడుగుకు ప్రభుత్వ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆమోదానికి సంబంధించిన ఈ నోటిఫికేషన్‌ విడుదలైన తరువాతే,  విలీన ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పగలుగుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  వచ్చే ఆర్థిక సంవత్సరం విలీనం పూర్తవుతుందనీ ఆమె సూచనప్రాయంగా తెలిపారు. సోమవారం ఇక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘‘బహుశా విలీన ప్రక్రియ ఒక త్రైమాసిక కాలం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే,  ఇందుకు ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది. మేము  ఇందుకు ఎదురుచూస్తున్నాము. ఒకవేళ ఇప్పటికిప్పుడు ప్రభుత్వ ఆమోదం వచ్చినా, చివరి త్రైమాసికంలో విలీనం పూర్తికావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఐటీ సిస్టమ్స్‌లో మార్పులు ఇందులో ప్రధానమైనవి. సాధారణంగా ఐటీ సిస్టమ్స్‌లో ఏదైనా మార్పులు చేయాల్సివస్తే, ఫిబ్రవరి మధ్య కల్లా ఈ ప్రక్రియ బ్యాంకింగ్‌లో పూర్తవుతుంది. ఈ ప్రక్రియ అంతా ఇప్పటికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా పూర్తికావాలన్నది మా విధానం. విలీన పక్రియకు సంబంధించిన అడ్డంకులు ఆయా అంశాల్లో ఇప్పుడు నెలకొనకూడదని భావిస్తున్నాం’’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు.

రియల్టీపై దృష్టి...: రియల్టీ అభివృద్ధికి సంబంధించి తగిన చౌక ధర గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి బిల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని భట్టాచార్య తెలిపారు. ‘‘రేటు కోత నిర్ణయం తీసుకున్నంత మాత్రాన, డిమాండ్‌ లేదా వృద్ధి పెరిగిపోతుందని నేను విశ్వసించను. ఈ దిశలో విజయానికి మరెన్నో నిర్ణయాలు తీసుకోవాలి’ అన్నారు.

కొత్త ప్రొడక్టులు: కాగా గృహ రుణ వృద్ధి లక్ష్యంగా మూడు కొత్త ప్రొడక్టులను ప్రారంభించనున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. ఎస్‌బీఐ బ్రిడ్జ్‌ లోన్స్, ఇన్‌స్ట్రా హోమ్‌ టాప్‌–అప్‌ లోన్స్‌తో పాటు వేతన యేతర వినియోగదారులకు ఒక ప్రొడక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీరు వెల్లడించిన సమాచారం ప్రకారం,  బ్రిడ్జ్‌ లోన్‌ మొదటి యేడాది వడ్డీరేటు 10.45 శాతం ఉంటుంది.  రెండవ ఏడాది 11.45 శాతంగా ఉంటుంది. ఇన్‌స్ట్రా హోమ్‌ టాప్‌–అప్‌ లోన్‌ రుణ రేటు 9 శాతం.

8–9 శ్రేణిలో రుణ వృద్ధి రేటు లక్ష్యం...
బ్యాంక్‌ తాజా 0.9 శాతం రేటు కోత నిర్ణయం రుణ వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నట్లు భట్టాచార్య తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంక్‌ రుణ వృద్ధి రేటు 8 శాతం నుంచి 9 శాతం ఉంటుందని భావిస్తున్నట్లు భట్టాచార్య ఈ సందర్భంగా అన్నారు. ‘‘తొలుత మేము రుణ వృద్ధి రేటు లక్ష్యాన్ని 11 నుంచి 12 శాతంగా పెట్టుకున్నాం. నవంబర్, డిసెంబర్‌లో భారీ క్షీణత తరువాత, రుణ వృద్ధి ఇప్పటివరకూ 6.7–6.8 శాతం శ్రేణిలోనే ఉంది. రేటు కోత నేపథ్యంలో రుణ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం కనీసం 8 నుంచి 9 శాతం శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం’’ అని అన్నారు. ఆదివారం నాటి రేటు కోత విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ, ‘‘ఇది ద్రవ్య లభ్యతను పెంచే నిర్ణయం. మున్నెన్నడూ లేనంతగా ప్రస్తుతం వ్యవస్థలో ద్రవ్యపరిస్థితి ఉంది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో తగ్గించినదానికన్నా ఒకటిన్నర రెట్లు రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాం’’ అని అరుంధతీ భట్టాచార్య అన్నారు.

  డిపాజిట్‌ రేట్లూ కోత!?
రుణ రేట్లలో 90 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు కొత్త సంవత్సర కానుకగా ప్రకటించిన ఎస్‌బీఐ, తదనంతరం డిపాజిట్‌దారులకు షాక్‌ ఇచ్చే పరిస్థితీ కనబడుతోంది. డిపాజిట్‌ రేట్ల మీదా త్వరలో దృష్టి సారించనున్నట్లు ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంక్‌ల వద్ద పెద్ద ఎత్తున నగదు డిపాజిట్లు ఉన్నందున, డిపాజిట్‌ రేటు కోత యోచన చేస్తున్నట్లు తెలిపారు. ‘‘పెద్ద నోట్ల రద్దు అనంతరం తక్కువ వడ్డీకి లోబడిన డిపాజిట్లు భారీగా బ్యాంకుల వద్దకు వచ్చాయి. అయితే నిబంధనలు తొలగించిన తర్వాత వీటిలో కొంత వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. కాగా 40 శాతం పరిమాణం మాత్రం బ్యాంక్‌ వద్దే కొనసాగుతుందని భావిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మేము డిపాజిట్‌ రేటు కోత గురించి ఆలోచిస్తాం’’ అని భట్టాచార్య అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement