న్యూఢిల్లీ: ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్‌ను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఏఐబీఈఏ ఈ నెల 19న (రేపు) సమ్మెకు పిలుపునిచ్చింది. అధికారులు ఇందులో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) కొన్ని కార్యకలాపాలపై ప్రభావం పడనుంది. నగదు డిపాజిట్, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరింగ్ వంటి లావాదేవీలపై కొంత ప్రభావం ఉండవచ్చని అంచనా. సమ్మె జరిగితే పరిస్థితుల గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మొదలైన పలు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమాచారం అందించాయి.
కొన్ని బ్యాంకులు ఉద్యోగాలను అవుట్‌సోర్స్ చేయడం వల్ల కస్టమర్ల ప్రైవసీకి, వారి సొమ్ముకు రిస్కులు పొంచి ఉండటంతో పాటు కింది స్థాయిలో రిక్రూట్‌మెంట్ తగ్గిపోతోందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. కొన్ని బ్యాంకులు పారిశ్రామిక వివాదాల (సవరణ) చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, సమ్మెలు జరపడం మినహా తమ ఆందోళనను వ్యక్తపర్చేందుకు మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment