10 బలహీన బ్యాంకులకు కేంద్రం 8,586 కోట్లు
చెన్నై: ప్రభుత్వ రంగంలోని బలహీన బ్యాంకులకు కేంద్రం త్వరలో తాజా మూలధనాన్ని సమకూర్చనుంది. మొత్తం 10 బ్యాంకులకు ఈ ఆర్థిక సంవత్సరం(2017–18)లో రూ.8,586 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం వెల్లడించారు. ఈ మేరకు ఆయా బ్యాంకు చీఫ్‌లకు కేంద్రం లేఖ కూడా రాసిందని తెలిపారు. అయితే, ఈ నిధులను దక్కించుకోవాలంటే బ్యాంకుల డైరెక్టర్ల బోర్డులు, యాజమాన్యం ఉద్యోగులు, యూనియన్లు పనితీరుకు సంబంధించి త్రైమాసిక మైలురాళ్ల విషయంలో హామీనివ్వాల్సి ఉంటుందని చెప్పారు.
బ్యాంకుల వారీగా కార్యాచరణ ప్రణాళికను ఎస్‌బీఐ క్యాప్స్ రూపొందించనుందని.. దీని ఆధారంగా బ్యాంకు యాజమాన్యం, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు జరుగుతాయని ఆయన వివరించారు. ఎంఓయూపై సంతకం చేసేందుకు ఏఐబీఈఏ సిద్ధంగా ఉందని కూడా వెంకటాచలం పేర్కొన్నారు. కాగా, నిధులు లభించనున్న బ్యాంకుల్లో ఆంధ్రా బ్యాంక్(రూ.1,100 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా(రూ.1,500 కోట్లు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(రూ.300 కోట్లు), ఐడీబీఐ బ్యాంక్(రూ.1,900 కోట్లు), ఐఓబీ(రూ.1,100 కోట్లు) వంటివి ఉన్నాయి.