రుణ ఎగవేతదారుల జాబితా విడుదల
♦ 5,610 డిఫాల్టర్లు...
♦ 58,792 కోట్ల బకాయిలు: ఏఐబీఈఏ
చెన్నై: బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద రూ.58,792 కోట్ల మేర రుణాలు పొంది ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారి జాబితాను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల్లోని 5,610 ఖాతాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో జాతీయ బ్యాంకులకు రూ.28,775 కోట్ల మేర రుణాలు ఎగవేసిన ఖాతాదారులు 3,192 మంది ఉన్నారు. ఒక్క ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకులకే 1,546 ఖాతాదారుల నుంచి రూ.18,576 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ ఖాతాదారులను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ఎస్‌బీఐ గ్రూపు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఇక ప్రైవేటు బ్యాంకులకు 792 మంది ఖాతాదారులు రూ.10,250 కోట్లు ఎగ్గొట్టారు. ఆర్థిక సంస్థలకు 42 మంది ఖాతాదారుల నుంచి రూ.728 కోట్లు, విదేశీ బ్యాంకులకు 38 ఖాతాదారుల నుంచి రూ.463 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
రోజురోజుకీ పెరుగుతున్న బకాయిలు
ఈ సందర్భంగా ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ... బ్యాంకుల్లోని మొండి బకాయిలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.5.39 లక్షల కోట్లకు చేరుకున్నాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి ఇవి కేవలం రూ.2.78 లక్షల కోట్లేనని ఆయన గుర్తు చేశారు. ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల నుంచి రుణ బకాయిలు రాబట్టేందుకు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.