చెన్నై: డిజిటల్ మాధ్యమం వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనధికారిక లావాదేవీల నుంచి వినియోగదారులకు భద్రత కల్పించేలా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంకును, కేంద్ర ఆర్థిక శాఖను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కోరింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్, ఆర్థిక శాఖకు మెమోరాండం సమర్పించింది.
డిజిటల్ లావాదేవీలు జరిపేలా ఖాతాదారులను కేంద్రం మరింతగా ప్రోత్సహిస్తున్నప్పటికీ... అనధికారిక లావాదేవీల నుంచి ఖాతాదారులకు తగినంత భద్రత కల్పించేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు భారత బ్యాంకుల్లో లేవని ఏఐబీఈఏ తెలిపింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు భద్రత కల్పించేలా తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, ఈ దిశగా ఆర్‌బీఐ మాస్టర్ సర్క్యులర్ జారీ చేయాలని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం కోరారు.
అలాగే, టెలికంలో విజయవంతమైన నంబర్ పోర్టబిలిటీ తరహాలోనే బ్యాంకింగ్‌లోనూ అకౌంటు పోర్టబిలిటీని ప్రవేశపెట్టాలన్నారు. అలాగే, ఖాతాదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఖచ్చితమైన గడువు, లోపభూయిష్ట సేవలకు పెనాల్టీ విధించడం వంటి నిబంధనలతో చార్టర్ ఆఫ్ కస్టమర్ రైట్స్‌ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని వెంకటాచలం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment