ఆదాయ పన్ను శాఖ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ : ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై ఆదాయపు పన్ను విభాగం కొరడా ఝళిపించనుంది. పన్ను చెల్లించని వారిపట్ల కఠినంగా స్పందించిన ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పన్ను డిఫాల్టర్ల పాన్ కార్డ్ బ్లాక్ చేయడం, గ్యాస్ సబ్సిడీలను రద్దు చేయడంతో పాటు రుణాలు మంజూరుకాకుండా చేయడం లాంటి చర్యలను తీసుకోబోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ చర్యలు మొదలు పెట్టడానికి పకడ్బందీ చర్యలకు దిగింది. ఎక్కువ మంది పన్నులను తప్పించుకోవడం, ఎగవేతకు పాల్పడుతుండటంతో వీటిని నిరోధించడానికి ఈ చర్యలను ఎన్నుకుంది. దీనికి సంబంధించి అన్ని పత్రాలను తయారుచేసింది. పీటీఐ నుంచి అనుమతిని కూడా పొందింది. ఈ నిర్ణయం మూలంగా ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగొట్టే వారి పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) కార్డును బ్లాక్ చేస్తారు. డిఫాల్టర్లకు ఇకమీదట దేశంలో ఎక్కడా కూడా రుణాలు మంజూరు కావు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం కూడా రద్దు కానుంది.
వారికి ఇన్నాళ్లుగా వచ్చే గ్యాస్ సబ్సిడీ సౌకర్యాన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించడంతో, డిఫాల్టర్లకు ఈ సౌకర్యాన్ని కూడా తీసేస్తున్నట్టు పేర్కొంది. ఈ చర్యలు డిఫాల్టర్లకు ఆటంకంగా మారి, పన్ను చెల్లిస్తారని ఆదాయపు పన్ను విభాగం చెప్పింది. బ్లాక్ చేసిన పాన్ కార్డులను రిజిస్ట్రార్ ఆఫ్ ప్రాపర్టీస్ లకు పంపనుంది. దానివల్ల వాళ్ల ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు కూడా సాధ్యం కావని ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది.
టాక్స్ ఆఫీసులన్నింటికీ డిఫాల్టర్ల సమాచారం వెళ్తుందని, దానివల్ల దేశమంతటా ఎక్కడ కూడా డిఫాల్టర్లు రుణాలు, సబ్సిడీలు పొందలేరని పన్ను అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (సిబిల్) డేటాను ఆదాయపు పన్ను విభాగం సబ్ స్క్రైబ్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ సబ్ స్క్రిప్షన్ తో డిఫాల్టర్ల ఆర్థిక లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. పన్నులను రాబట్టుకోవడం, ఆస్తులను ఫ్రీజ్ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. గతేడాది మొదట్లోనే డిఫాల్టర్ల సమాచారాన్ని "నేమ్ అండ్ షేమ్"గా పేర్కొంటూ ఎక్కువ పన్ను ఎగవేతదారులు వివరాలను జాతీయ పత్రికలలో, అధికారిక వెబ్ పోర్టల్ లో పొందుపర్చడం ప్రారంభించింది.