బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసిన కార్పొరేట్ల పేర్లను బడ్జెట్ సెషన్ లోపు బయట పెట్టాలని అనుకుంటున్నట్టు పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ
పీఏసీ చైర్మన్ కేవీ థామస్
న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసిన కార్పొరేట్ల పేర్లను బడ్జెట్ సెషన్ లోపు బయట పెట్టాలని అనుకుంటున్నట్టు పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ కేవీ థామస్ చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) అసాధారణ స్థాయిలో రూ.6.8 లక్షల కోట్లకు చేరడంతో, బ్యాంకులకు బకాయి పడ్డ కార్పొరేట్ల పేర్లను బయటపెట్టి పరువుతీసే విధానానికి అనుకూలంగా ఆయన స్పందించారు.
రుణదాతలు తమ రుణాలను తిరిగి వసూలు చేసుకునేందుకు ఈ చర్య ఫలితాన్నిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రూ.6.8 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో 70 శాతం పెద్ద కార్పొరేట్ సంస్థలవేనని ఆయన చెప్పారు. రైతులకు ఇచ్చే రుణాలు వీటిలో ఒక శాతంలోపే ఉంటాయన్నారు. బ్యాంకుల ఎన్‌పీఏలపై పీఏసీ అధ్యయన నివేదిక రూపొందించింది. దీన్ని బడ్జెట్ సమావేశాల్లోపు పార్లమెంటుకు సమర్పించనున్నట్టు థామస్ చెప్పారు.