KV Thomas
-
మన్మోహన్‌కు పీఏసీ క్లీన్ చిట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) నివేదిక తేల్చి చెప్పింది. పీఏసీ చైర్మన్ కేవీ థామస్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ‘మాజీ ప్రధాని మన్మోహన్ గాని, అప్పటి ప్రధాని కార్యాలయం గాని కామన్వెల్త్ గేమ్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేదని 24 మంది సభ్యులు గల పీఏసీ నివేదిక రూపొందించింది. ఇందులో కాంగ్రెస్ వాళ్లు కేవలం నలుగురే. అధికార పార్టీ అయిన బీజేపీ సభ్యులే 12 మంది ఉన్నారు. ఈ నివేదికను బుధవారం పార్లమెంటుకు సమర్పించనున్నాం. అనంతరం నివేదిక పూర్తి పాఠం వెల్లడవుతుంది’ అని చెప్పారు. -
బడ్జెట్ సెషన్ లోపు డిఫాల్టర్ల పేర్ల వెల్లడి
పీఏసీ చైర్మన్ కేవీ థామస్ న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసిన కార్పొరేట్ల పేర్లను బడ్జెట్ సెషన్ లోపు బయట పెట్టాలని అనుకుంటున్నట్టు పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ కేవీ థామస్ చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు (ఎన్పీఏలు) అసాధారణ స్థాయిలో రూ.6.8 లక్షల కోట్లకు చేరడంతో, బ్యాంకులకు బకాయి పడ్డ కార్పొరేట్ల పేర్లను బయటపెట్టి పరువుతీసే విధానానికి అనుకూలంగా ఆయన స్పందించారు. రుణదాతలు తమ రుణాలను తిరిగి వసూలు చేసుకునేందుకు ఈ చర్య ఫలితాన్నిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రూ.6.8 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో 70 శాతం పెద్ద కార్పొరేట్ సంస్థలవేనని ఆయన చెప్పారు. రైతులకు ఇచ్చే రుణాలు వీటిలో ఒక శాతంలోపే ఉంటాయన్నారు. బ్యాంకుల ఎన్పీఏలపై పీఏసీ అధ్యయన నివేదిక రూపొందించింది. దీన్ని బడ్జెట్ సమావేశాల్లోపు పార్లమెంటుకు సమర్పించనున్నట్టు థామస్ చెప్పారు. -
ప్రధానికైనా సమన్లు ఇస్తాం
పీఏసీ చైర్మన్ కేవీ థామస్ కొచ్చి: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షిస్తామని, అలాగే ప్రధానికి సమన్లు జారీ చేసే అధికారం కూడా తమకుందని ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ కేవీ థామస్ సోమవారం తెలిపారు. దేశంలోని టెలికాం సంస్థలు కాల్ డ్రాప్‌లతో ఇబ్బందులు పడుతుంటే ప్రజలు ఈ–లావాదేవీలు చేయాలని ఆశించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ‘ప్రధాని తన అహాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రూ. రెండు వేల నోట్లను జారీ చేసి మూర్ఖపు నిర్ణయం తీసుకున్నారు’ అని థామస్ మండిపడ్డారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖ, ఆర్థిక వ్యవహారాల శాఖ, బ్యాంకింగ్ శాఖ కార్యదర్శులను జనవరి 20న తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. -
నోట్ల రద్దుపై ఉర్జిత్ ఆ రోజు పెదవిప్పాల్సిందే!
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పరిణామాలపై ఆర్బీఐ గవర్నర్ మౌనంగా ఉండటాన్ని పలువురు పలు రకాలుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మౌనం సెంట్రల్ బ్యాంకు స్వతంత్రను దెబ్బతీస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించే సమయం ఆసన్నమైంది. నోట్ల రద్దుతో ఏర్పడిన పరిణామాలపై ఉర్జిత్ పటేల్ వివరణ ఇవ్వాలని ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) ఆదేశించింది. ఈ మేరకు జనవరి 20వ తేదీన పెద్ద నోట్ల రద్దుపై ఏర్పడిన పరిణామాలపై పీఏసీ చర్చించనుందని కమిటీ చైర్మన్ కేవీ థామస్ చెప్పారు. ఈ మీటింగ్‌లో ఆర్బీఐ గవర్నర్, సంబంధిత అధికారులు ఇచ్చే వివరణను బట్టి కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని థామస్ తెలిపారు. నోట్ల రద్దుపై పీఏసీ సభ్యులు సంధించిన పలు ప్రశ్నలను ఇప్పటికే రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు, ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శులకు పంపినట్టు థామస్ వెల్లడించారు. ఒకవేళ వీరిచ్చే వివరణకు కమిటీ సంతృప్తి చెందని పక్షంలో ప్రధాని నరేంద్రమోదీని సైతం ప్రశ్నించాలని పీఏసీ భావిస్తోంది. ఈ మీటింగ్‌కు గవర్నర్, సంబంధిత అధికారులను జనవరి 20న కమిటీ ముందు హాజరుకావాలని పీఏసీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దుతో ఎంత మొత్తంలో నల్లధనం బయటికి వచ్చింది? ఎంతమొత్తం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చిందో తెలుపుతూ వివరణ ఇవ్వాలని ఆర్బీఐ గవర్నర్‌ను, సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు.. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, నోట్ల రద్దుకు దారితీసిన కారణాలు చెప్పాలని పీఏసీ ప్రశ్నించింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ విచారిస్తోంది. గత శుక్రవారం రాజ్యసభ స్టాండింగ్ కమిటీ కూడా పటేల్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్, ఆర్.గాంధీలనూ నోట్లరద్దుపైనే ప్రశ్నించింది. అయితే కమిటీ వేసిన పలు ప్రశ్నలకు ఆర్బీఐ అధికారుల వద్దనుంచి సరైన సమాధానం రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
'క్రీయాశీలక రాజకీయాల్లోకి ప్రియాంక రావాలి'
న్యూఢిల్లీ: దారుణమైన ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేందుకు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావాలని కేంద్ర మంత్రి కేవీ థామస్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విజయపథంలోకి నడిపించడానికి ప్రియాంక సేవలు అవసరమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం కావాలని థామస్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలివుండే ప్రియాంక కాంగ్రెస్ పార్టీలో పదవిని అలంకరించాలని థామస్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ లోకి రావాలని నేతలు, ప్రజలు కోరుకుంటున్నారని థామస్ అన్నారు. ప్రియాంక రాజకీయాల్లోకి రావడం కుటుంబ వ్యవహారం కాదని థామస్ అన్నారు. -
చక్కెర మిల్లులకు తీపి కబురు..
న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న చక్కెర కర్మాగారాలకు తీపి కబురు ఇది. చెరకు రైతులకు చెల్లింపులు చేసేందుకు మిల్లులకు రూ.6,600 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాలపై వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.2,750 కోట్ల మేరకు ఉండే వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. గురువారం నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ తెలిపారు. ద్రవ్య సంక్షోభం నుంచి చక్కెర మిల్లులు గట్టెక్కడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సారథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం చేసిన సిఫార్సుల మేరకు సీసీఈఏ ఈ నిర్ణయం తీసుకుంది. షుగర్ మిల్లులకు ఈ రుణాలను బ్యాంకులు సమకూరుస్తాయి. చెరకు రైతులకు చెల్లించడానికి మాత్రమే ఈ సొమ్మును వినియోగించాలి. రైతుల పాత బకాయిలనూ తీర్చవచ్చు. గత మూడేళ్లలో చక్కెర మిల్లులు చెల్లించిన ఎక్సైజ్ సుంకానికి సమాన స్థాయిలో రుణాలలిస్తారు. వీటిని ఐదేళ్లలో తిరిగి చెల్లించాలి. రుణ చెల్లింపుపై తొలి రెండేళ్లు మారటోరియం సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. అంటే మూడో ఏట నుంచి రుణ చెల్లింపు ప్రారంభించవచ్చు. పరిమాణపరంగా ఎలాంటి ఆంక్షల్లేకుండా పంచదార ఎగుమతులను కొనసాగించాలన్న ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. దేశీయ మార్కెట్లో అవసరానికి మించి చక్కెర నిల్వలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖల మంత్రి మనీష్ తివారీ చెప్పారు. బొగ్గు గనుల నుంచి గ్యాస్ ఉత్పత్తికి అనుమతి తమ అధీనంలోని బొగ్గు గనుల సహజ వాయువు ఉత్పత్తి చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్‌కు లెసైన్స్ ఇవ్వాలని సీసీఈఏ నిర్ణయించింది. కోల్ ఇండియాకు చెందిన బొగ్గు గనుల్లో కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) అన్వేషణ, ఉత్పత్తికి అనుమతించినట్లు బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ తెలిపారు. ఆహార భద్రతా ప్రణాళిక, వాణిజ్య సహకార ఒప్పందాలపై ఇటీవలి డబ్ల్యుటీఓ సదస్సులో భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరిని సీసీఈఏ సమర్థించింది. భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ సబ్సిడీలపై శాశ్వత పరిష్కారం కనుగొనే వరకు ఈ అంశాన్ని సవాలు చేయరాదని బాలిలో జరిగిన డబ్ల్యుటిఓ సదస్సులో నిర్ణయించారు. -
కిలో రూ. 80కి చేరిన ఉల్లిధర
న్యూఢిల్లీ/తాడేపల్లి గూడెం, కర్నూలు న్యూస్‌లైన్: ఉల్లి ధర మరింత పైపైకి దూసుకుపోతోంది. బహిరంగ మార్కెట్లో ఏకంగా కిలో రూ. 80కి చేరుకుంది. నెల రోజుల వరకూ ధరలు దిగివచ్చే అవకాశం లేదని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో ఉల్లి కిలో రూ. 80కి చేరింది. ఆసియా అతిపెద్ద ఉల్లి మార్కెట్ నాసిక్‌లో హోల్‌సేల్ ధర రూ. 45గా ఉంది. ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్రంలోని పలు శాఖల అధికారులు బుధవారం సమావేశమయ్యారు. ఉల్లి ఎగుమతులను తగ్గించేందుకు ఎంఈపీని పెంచాలని, విదేశాల నుంచి దిగుమతులు పెరిగేలా చర్యలు చేపట్టాలని నాఫెడ్ సూచించినట్లు తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్లో కంటే దేశంలోనే ఉల్లి ధరలు అధికంగా ఉన్నాయని కేంద్ర ఆహార మంత్రి కేవీ థామస్ చెప్పారు. ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన రాష్ట్రంలో ఉల్లిని ఎక్కువగా పండించే కర్నూలు జిల్లాలోనూ ఈసారి దిగుబళ్లు 40 శాతం తగ్గాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతో కర్నూలు మార్కెట్ బంద్ కావడంతో ఉల్లి హైదరాబాద్‌కు తరలుతోంది. పండిన పంటలో 80 శాతాన్ని పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉల్లి ధరలు బుధవారం లోక్‌సభలోనూ మంటలు పుట్టించాయి. ధరలు పెరుగుతున్నా.. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని విపక్షాలు మండిపడ్డాయి. సీపీఎం సభ్యుడు కరుణాకరణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వ చర్యల మూలంగా ధరలు మరింతగా పెరుగుతున్నాయని మండిపడ్డారు.