కిలో రూ. 80కి చేరిన ఉల్లిధర
న్యూఢిల్లీ/తాడేపల్లి గూడెం, కర్నూలు న్యూస్‌లైన్: ఉల్లి ధర మరింత పైపైకి దూసుకుపోతోంది. బహిరంగ మార్కెట్లో ఏకంగా కిలో రూ. 80కి చేరుకుంది. నెల రోజుల వరకూ ధరలు దిగివచ్చే అవకాశం లేదని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో ఉల్లి కిలో రూ. 80కి చేరింది. ఆసియా అతిపెద్ద ఉల్లి మార్కెట్ నాసిక్‌లో హోల్‌సేల్ ధర రూ. 45గా ఉంది. ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్రంలోని పలు శాఖల అధికారులు బుధవారం సమావేశమయ్యారు. ఉల్లి ఎగుమతులను తగ్గించేందుకు ఎంఈపీని పెంచాలని, విదేశాల నుంచి దిగుమతులు పెరిగేలా చర్యలు చేపట్టాలని నాఫెడ్ సూచించినట్లు తెలిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో కంటే దేశంలోనే ఉల్లి ధరలు అధికంగా ఉన్నాయని కేంద్ర ఆహార మంత్రి కేవీ థామస్ చెప్పారు. ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన రాష్ట్రంలో ఉల్లిని ఎక్కువగా పండించే కర్నూలు జిల్లాలోనూ ఈసారి దిగుబళ్లు 40 శాతం తగ్గాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతో కర్నూలు మార్కెట్ బంద్ కావడంతో ఉల్లి హైదరాబాద్‌కు తరలుతోంది. పండిన పంటలో 80 శాతాన్ని పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉల్లి ధరలు బుధవారం లోక్‌సభలోనూ మంటలు పుట్టించాయి. ధరలు పెరుగుతున్నా.. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని విపక్షాలు మండిపడ్డాయి. సీపీఎం సభ్యుడు కరుణాకరణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వ చర్యల మూలంగా ధరలు మరింతగా పెరుగుతున్నాయని మండిపడ్డారు.