న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులతో బ్యాంకులు రాజీ పరిష్కారానికి ఆర్‌బీఐ అనుమతించడాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజీ పరిష్కారం, సాంకేతికంగా రుణాల మాఫీ పేరుతో ఆర్‌బీఐ ఇటీవలే ఓ కార్యాచరణను ప్రకటించింది. ఇది బ్యాంకుల సమగ్రత విషయంలో రాజీపడడమేనని, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చడమేనని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ఉద్దేశపూర్వక ఎగవతేదారుల సమస్య పరిష్కారానికి కఠిన చర్యలనే తాము సమర్థిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించాయి. మోసం లేదా ఉద్దేశపూర్వక ఎగవేతదారులంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో రాజీ పరిష్కారానికి అనుమతించడం అన్నది న్యాయ సూత్రాలకు, జవాబుదారీకి అవమానకరమని వ్యాఖ్యానించాయి. నిజాయితీ పరులైన రుణ గ్రహీతలను నిరుత్సాహపరచడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఆర్‌బీఐ తాజా ఆదేశాలు షాక్‌కు గురి చేశాయని పేర్కొన్నాయి. ఇది బ్యాంకింగ్ రంగం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని నీరు గారుస్తుందని, డిపాజిట్ల నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్‌బీఐ తన నిర్ణయాన్ని ఉపంసహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment