రుణ నిర్వహణకు స్వతంత్ర సంస్థ
ప్రభుత్వ రుణ నిర్వహణ వ్యవహారాల కోసం రిజర్వ్ బ్యాంక్ కాకుండా స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అమలు చేయటానికి సమయం ఆసన్నమైందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘ప్రభుత్వ రుణ నిర్వహణ కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి. ఇది స్వతంత్రంగా ఉంటేనే మరింతగా దృష్టి సారించేందుకు సాధ్యపడుతుంది. రుణ సమీకరణ వ్యయాలు తగ్గించుకోవడానికి ప్రభుత్వానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది‘ అని నీతి ఆయోగ్ శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ నుంచి నిధుల సమీకరణ సహా ప్రభుత్వ రుణ సమీకరణ కార్యకలాపాలన్నీ ఆర్బీఐ నిర్వహణలోనే ఉంటున్నాయి. అయితే, దీన్ని రిజర్వ్ బ్యాంక్ పరిధి నుంచి తప్పించి ప్రభుత్వ రుణ నిర్వహణ ఏజెన్సీని (పీడీఎంఏ) ఏర్పాటు చేసి దాని చేతికివ్వాలని 2015 ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఇది అమల్లోకి రాలేదు కానీ.. తాజాగా రాజీవ్ కుమార్ మరోసారి దీన్ని బైటికి తెచ్చారు. రిజర్వ్ బ్యాంక్ నిర్వర్తించే వేర్వేరు విధులను ఏ విధంగా విభజించాలన్న దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాజీవ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే బాధ్యతలను కూడా ప్రభుత్వం ఆర్బీఐకే అప్పగించింది. మరి వృద్ధి, ఉద్యోగాల కల్పన, రుణ నిర్వహణ, ఇతరత్రా చట్టపరమైన అంశాల నిర్వహణ మొదలైనవి ఎవరు పర్యవేక్షిస్తారు? ఇదిగో ఇలాంటి అంశాలన్నింటిపైనా చర్చ జరగాలి‘ అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయి బ్యాంకింగ్
భారీ అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాలను అందుకోవాలంటే భారత్‌కు ప్రపంచ స్థాయి పెద్ద బ్యాంకులు అవసరమని రాజీవ్ కుమార్ చెప్పారు. వృద్ధికీ ఇది దోహదపడే అంశమని తెలిపారు.
2040 నాటికి 650 బిలియన్
డాలర్లకు రియల్టీ మార్కెట్..
ప్రస్తుతం 120 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2040 నాటికి అయిదు రెట్లు వృద్ధితో 650 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న ఏడు శాతం నుంచి రెట్టింపు స్థాయికి చేరుతుందని ఆయన వివరించారు. ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ నిర్వహించిన అంతర్జాతీయ లగ్జరీ రియల్టీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రాజీవ్ కుమార్ ఈ విషయాలు చెప్పారు.
బ్యాంకుల్లో లోపాల్లేకుండా చేయడం పెద్ద సవాలు:రాజీవ్‌కుమార్
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వంటి ఆర్థిక సంస్థలను పూర్తి దోష రహిత విధానంలో పనిచేసేలా చూడడం అన్నది అతిపెద్ద సవాలుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను మరింత జవాబుదారీగా మార్చడం కూడా మరో సవాలుగా ఆయన అభివర్ణించారు.
ఇక డిపాజిట్లపై సెంట్రల్ రిపాజిటరీ
అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా నడిచే డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో... డిపాజిట్లను స్వీకరించేందుకు అనుమతి ఉన్న సంస్థల వివరాలతో సెంట్రల్ రిపాజిటరీ ఏర్పాటు చేయటానికి మార్గం సుగమమైందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ రిపాజిటరీ వల్ల సామాన్యులు, ఆర్థిక అవగాహన లేని వారు మోసపోకుండా కాపాడుతుందన్నారు.