Farmers Becoming Defaulters Of Crop Loans Without Renewal In Telangana - Sakshi
Sakshi News home page

పాతది మాఫీ కాక..కొత్త రుణం రాక.. తెలంగాణ రైతుల అరిగోస

Jan 25 2023 4:24 AM | Updated on Jan 25 2023 3:12 PM

Farmers becoming defaulters of crop loans without renewal in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతుబంధు సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తుంటే, ఆ మొత్తాన్ని కొన్ని బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటున్నాయి. రుణాలు రెన్యువల్‌ కాని వారు డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. కొన్ని బ్యాంకులు అప్పులు పెరిగిపోయాయని పేర్కొంటూ కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు.

రైతుల లక్షలోపు రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా, 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల నుంచి 50 వేల వరకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రభు త్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రూ.37 వేల వరకు రుణాలు మాఫీ చేసింది. ఆ తర్వాత రూ.38 వేల వరకున్న రుణాలతో ఒక బిల్లు, రూ.38 వేల నుంచి రూ. 39 వేల వరకున్న రుణాలతో మరో బిల్లును వ్యవసాయ శాఖ తయారు చేసి ఆర్థిక శాఖకు పంపించింది. అయితే రుణమాఫీకి నిధులు సర్దుబాటు చేయకపోవటంతో సొ మ్ము మంజూరు కాలేదని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. 

సర్కారు సూచన పట్టించుకోని బ్యాంకర్లు 
రుణమాఫీని ప్రభుత్వం విడతల వారీగా చేస్తోంది. ఈ విధంగా లక్షలోపు రుణమాఫీలో కేవలం రూ.37 వేల వరకు రుణాలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో మిగతా వారికి రెన్యువల్‌ సమస్య వచ్చింది. రుణాలు రెన్యువల్‌ చేసుకోకపోతే డిఫాల్టర్లుగా మారుతారు. అయితే కొన్నిచోట్ల బ్యాంకులు ప్రభుత్వ సూచనను పట్టించుకోకుండా రైతుబంధు సొమ్మును రుణమాఫీ కింద జమ చేసుకుంటున్నాయి.

దీంతో కొందరి రుణాలు రెన్యువల్‌ అవుతున్నా, అధిక సంఖ్యలో రైతులు రెన్యువల్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులు తొలుత బకాయిలు చెల్లించాలని, తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేస్తామని సూచించింది. కొందరు రైతులు అలా చెల్లించగా, కొందరు రైతులు మాత్రం డబ్బులు లేకపోవడంతో బ్యాంకులకు చెల్లించలేకపోయారు.

దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారినట్లు అంచనా. రుణమాఫీకి అర్హులైన రైతుల సొమ్మును ఇస్తామని, వారిని ఎవరినీ డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని వ్యవసాయశాఖ బ్యాంకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈసారి బడ్జెట్లో అయినా రుణమాఫీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సొమ్ము కేటాయించి విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.  

రూ.20,164.20కోట్లు కేటాయించినా.. 
2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా 36.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

ఇప్పటివరకు రుణమాఫీ కోసం రూ.20,164.20 కోట్లు కేటాయించినా, అందులో రూ.1,171.38 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వాటితో 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా, మరో 31 లక్షల మంది ఎదురుచూపులు చూస్తున్నారు. 2020లో రూ.25 వేలలోపు రుణాల కోసం రూ. 408.38 కోట్లు రుణమాఫీకి బదిలీ చేసింది. 2021 ఆగస్టులో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.

ఇందుకోసం రూ.1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.25 వేల నుంచి రూ.37 వేల లోపు రైతులకు చెందిన రూ.763 కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు.  

ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు  
పంట పెట్టుబడి కోసం బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకున్నా. దిగుబడి రాకపోవడంతో తిరిగి చెల్లించలేకపోయా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సంతోషపడ్డా. లక్ష రూపాయలు మాఫీ అయిపోతాయని ఆశగా ఎదురుచూశా. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. పైగా వడ్డీ లక్షకు పెరిగింది. ఇప్పుడు యాసంగి సాగుకు బ్యాంకులో రుణం ఇచ్చే పరిస్థితిలేకుండా పోయింది. దీంతో బయట అధిక వడ్డీకి అప్పు తీసుకుని 4.26 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశా. 
- కముటం స్వామి రైతు, కేసముద్రం, ఉమ్మడి వరంగల్‌ జిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement