
ముంబై: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నిబంధనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సవరణలను ప్రతిపాదించింది. రూ. 25 లక్షలకు పైన బాకీ పడి, స్థోమత ఉన్నా చెల్లించడానికి నిరాకరిస్తున్న వారిని ఈ పరిధిలోకి చేర్చేలా నిర్వచనాన్ని మార్చనున్నట్లు ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ కోవకు చెందిన డిఫాల్టర్లకి రుణ సదుపాయాన్ని పునర్‌వ్యవస్థీకరించుకునేందుకు అర్హత ఉండదు.
అలాగే ఇతరత్రా ఏ కంపెనీ బోర్డులోనూ పదవులు చేపట్టే వీలుండదు. బాకీలను వేగవంతంగా రాబట్టుకునేందుకు అవసరాన్ని బట్టి సదరు రుణగ్రహీతలు, హామీదారులపై బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మొండిబాకీగా వర్గీకరించిన పద్దుకు సంబంధించి ఆరు నెలల వ్యవధిలో ఉద్దేశపూర్వక ఎగవేత అవకాశాలను సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముసాయిదాపై సంబంధిత వర్గాలు అక్టోబర్ 31లోగా ఆర్‌బీఐకి తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది.