Bank fixed deposits
-
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలెర్ట్, అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు!
ఖాతాదారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల వరకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లను పెంచింది. దీంతో ఎఫ్డీ చేసిన సాధారణ ఖాతాదారులు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజన్లు 7.75 శాతం వడ్డీని పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సవరించిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడు రోజుల నుంచి 14 రోజుల టెన్యూర్ కాలానికి 3 శాతం, 15 రోజుల నుంచి 45 రోజుల కాలానికి 3.50శాతం పెంచింది. 4.5 శాతం ఉన్న వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచి 46 నుంచి 180 రోజుల టెన్యూర్‌కు 5శాతం వడ్డీని, 181 నుంచి 210 టెన్యూర్ కాలానికి 5.50 శాతం,211 నుంచి 270 కాలానికి 6 శాతం, 271 నుంచి ఏడాది లోపు వడ్డీ రేట్లను 6.25 శాతం అందిస్తుంది. అయితే, 399 రోజుల కాలవ్యవధి గల ‘బరోడా తిరంగా ప్లస్’డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేటును 7.25 శాతం నుంచి 7.15 శాతానికి తగ్గించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు 2023 అక్టోబర్ 9 (నేటి) నుంచి అమల్లోకి వచ్చాయి. -
ఫిక్స్డ్ డిపాజిట్లకే బడా ఇన్వెస్టర్ల మొగ్గు
సామాన్యులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో (ఎఫ్డీలు) ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోవడం సాధారణ విషయమే. కానీ, అధిక సంపద కలిగిన వారు (హెచ్ఎన్ఐలు) కూడా మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎఫ్డీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయాన్ని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు 2 శాతం వరకు పెరగడాన్ని సానుకూల అంశంగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రస్తావించింది. ఈ పరిణామాలతో హెచ్ఎన్ఐలు మ్యూచువల్ ఫండ్స్ కంటే బ్యాంక్ ఎఫ్డీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు వివరించింది. ఇతర ఆర్థిక సాధనాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే సానుకూలతలను హెచ్ఎన్ఐలు అర్థం చేసుకున్నప్పటికీ, ఈ రంగంలో గతంలోని ఎదుర్కొన్న సమస్యలు వారిని ఇంకా ఆందోళనకు గురి చేస్తున్నట్టు తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల తరఫున పెద్ద పంపిణీదారులు (రూ.1,000 కోట్లకు పైన ఏయూఎం ఉన్నవారు), ఇనిస్టిట్యూషనల్ సేల్స్ ప్రతినిధులు తదితరుల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఈ నివేదికను మోతీలాల్ ఓస్వాల్ రూపొందించింది. హెచ్ఎన్ఐలు పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ స్కీమ్‌లు (పీఎంఎస్), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు)ల్లో పెట్టుబడులకు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) మార్గంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం లేదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పన్ను ప్రయోజనాలు ఎత్తివేయడంతో, వీటితో పోలిస్తే బ్యాంక్ ఎఫ్డీలకే హెచ్ఎన్ఐలు సానుకూలంగా ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. డెట్ ఫండ్స్‌లో మూడేళ్లకు మించి పెట్టుబడులు ఉంచినప్పుడు వచ్చే రాబడిలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని సర్దుబాటు చేసే ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని 2023 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం ఎత్తివేయడం గమనార్హం. దీంతో డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎంత కాలం ఉంచినా, వచ్చే రాబడి సంబంధిత ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. -
చాలా కాలం తర్వాత ఎఫ్డీలకు కళ!
ముంబై: చాలా ఏళ్ల విరామం తర్వాత బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. వడ్డీ రేట్లు 8 శాతాన్ని దాటాయి. ప్రభుత్వరంగంలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అత్యధికంగా 8–8.5 శాతం వరకు రేట్లను ఆఫర్ చేస్తోంది. ద్రవ్యోల్బణం మించి రాబడిని బ్యాంక్‌లు 200–800 రోజుల డిపాజిట్లపై ఇస్తున్నాయి. ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకోవంతో రుణాలకు డిమాండ్ నెలకొంది. రుణ డిమాండ్‌ను అందుకునేందుకు బ్యాంక్‌లు నిధుల కోసం వేట మొదలు పెట్టాయి. ఫలితంగా డిపాజిట్ రేట్లను సవరిస్తున్నాయి. జనవరి నెలకు ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉండడం గమనించాలి. రుణాలకు డిమాండ్.. జనవరి 13తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకుల రుణ వృద్ధి 16.5 శాతంగా (వార్షికంగా చూస్తే) ఉంది. కానీ, అదే కాలంలో డిపాజిట్లలో వృద్ధి 10.6 శాతంగా ఉంది. ఇక గత ఏడాది కాలంలో డిపాజిట్లలో వృద్ధి 6 శాతం మించి లేదు. ఇటీవల వడ్డీ రేట్లు పెరగడంతో డిపాజిట్లలోనూ వృద్ధి మొదలైందని చెప్పుకోవాలి. ఏడాది కాల పోస్టాఫీసు డిపాజిట్‌పై రేటు 6.6 శాతంగా ఉంటే, రెండేళ్ల కాలానికి 6.8 శాతంగా ఉంది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీ ఈల్డ్ 7.35 శాతంగా ఉంది. వీటితో ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్లు పోటీపడుతున్నాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచింది. దీంతో బ్యాంకులు సైతం రుణాలపై ఇంతే మేర రేట్లు పెంచాయి. ఫలితంగా డిపాజిట్లపై మరింత రాబడిని ఆఫర్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. కానీ, రుణాలపై పెంచిన స్థాయిలో రేట్లను డిపాజిట్లపై ఆఫర్ చేయకపోవడాన్ని గమనించొచ్చు. బ్యాంకుల వారీ రేట్లు.. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 200–800 రోజుల కాలానికి వడ్డీ రేట్లు 7–7.25శాతం స్థాయిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 20వేల శాఖలతో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ 400 రోజుల డిపాజిట్‌పై 7.10 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అదనంగా ఇస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజుల డిపాజిట్‌పై 7.35 శాతం రేటును ఇస్తోంది. యూనియన్ బ్యాంక్ 800 రోజుల డిపాజిట్‌పై 7.30 శాతం, పీఎన్బీ 666 రోజుల డిపాజిట్‌పై 7.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజులు డిపాజిట్‌పై ఇంతే మేర ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 200 రోజుల డిపాజిట్‌పై 7 శాతం ఇస్తుంటే, కెనరా బ్యాంక్ 400 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం, యూకో బ్యాంక్ 666 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 7 శాతం చొప్పున ఇస్తున్నాయి. -
అటు రాబడి... ఇటు భద్రత
వడ్డీ రేట్లు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబడుల కోసం నూరు శాతం రిస్క్ తీసుకోవడం సూచనీయం కాదు. రాబడులు తక్కువే ఉన్నా ప్రతి ఒక్కరి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో డెట్ సాధనాలకూ(స్థిరాదాయ పథకాలు) తప్పకుండా చోటు ఉండాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ.. గడిచిన మూడేళ్ల కాలంలో చూసుకుంటే అధిక శాతం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక డెట్ సాధనాలను ఎంత మాత్రం విస్మరించలేము. మరి డెట్ విభాగంలో పెట్టుబడులకు ఏది ఉత్తమమైన ఎంపిక? అన్న సందిగ్ధత ఉంటే.. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆ విషయమై స్పష్టత వస్తుంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఎస్బీఐ 5.70 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) 6.50 శాతంగా ఉంది. 20 శాతం పన్ను శ్లాబులో ఉన్న వృద్ధులకు నికరంగా మిగిలే రాబడి 5.15 శాతం కాగా, ఇతరులకు ఇది 4.51 శాతంగా ఉంది. అదే 30 శాతం శ్లాబు పరిధిలో ఉన్న వృద్ధులకు నికర రాబడి 4.47 శాతం అయితే, ఇతరులకు 3.92 శాతం రాబడి లభిస్తుంది. పన్ను రేటు సెస్సులతో కలిపి గణించడం జరిగింది. పన్ను ప్రయోజనాలు: సెక్షన్ 80సీ ప్రయోజనం లేదు. అందుకునే రాబడి కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. అనుకూలం: ఎప్పుడు కోరుకుంటే అప్పుడు డిపాజిట్‌ను రద్దు చేసుకుని వెనక్కి తీసేసుకోవచ్చు. ప్రతికూలం: అధిక పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను చెల్లించగా మిగిలేది చాలా తక్కువే. ఎవరికి అనుకూలం?: కోరుకున్నప్పుడు వెంటనే డబ్బులు తీసుకునే వీలుండాలని అనుకునేవారికి. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులు పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐలో పన్ను ఆదా ఎఫ్డీని పరిగణనలోకి తీసుకుంటే వృద్ధులకు 6.50 శాతం, ఇతరులకు 5.70 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. సెక్షన్ 80సీ ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం పన్ను పరిధిలోని వృద్ధులకు నికర రాబడి 6.50 శాతంగాను, ఇతరులకు 5.70 శాతంగాను ఉంటుంది. పన్ను ప్రయోజనం: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. రాబడిపై పన్ను పడుతుంది. అనుకూలం: సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా ప్రయోజనం. ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్‌తో వస్తుంది. కనుక ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని వెనక్కి తీసుకునే వీలుంటుంది. ఎవరికి అనుకూలం?: పన్ను ఆదా కోసం బ్యాంకుల్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాననే వారికి. నోట్: చిన్న బ్యాంకులు అధిక రాబడులను ఆఫర్ చేస్తున్నాయి. రిస్క్ తీసుకునే వారు వాటిని పరిశీలించొచ్చు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుతం వడ్డీ రేటు 7.60 శాతం. పెట్టుబడులపై సెక్షన్ 80సీ పన్ను ప్రయోజనాన్ని వినియోగించుకుంటే 20 శాతం, 30 శాతం పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 7.60 శాతంగానే ఉంటుంది. పన్ను ప్రయోజనాలు: ఈ పథకంలో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. రాబడిపై పన్ను పడుతుంది. అనుకూలం: అధిక వడ్డీ రేటు, ఎటువంటి రిస్క్ లేకపోవడం. పరిమితులు: గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట తల్లిదండ్రులు మాత్రమే ఈ ఖాతాను తెరిచేందుకు ఉంటుంది. ఒక ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునే పరిమితి ఉంటుంది. కుమార్తె విద్యా, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుత రేటు 7.10 శాతం. పన్ను ప్రయోజనాలు: పెట్టుబడులకు సెక్షన్ 80సీ ప్రయోజనాలు వర్తిస్తాయి. రాబడిపైనా పన్ను ఉండదు. అనుకూలతలు: పన్ను లేని అధిక రాబడి రేటు. రిస్క్ ఉండదు. పరిమితులు: 15 ఏళ్ల పథకం. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకోగలరు. రాబడులు: సెక్షన్ 80సీ పన్ను ఆదాను కలిపి చూసుకుంటే 20% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 8.96 శాతం, 30% పన్ను పరిధిలోని వారికి ఇది 10.32 శాతం. ఎవరికి?: పన్ను పరిధిలోని వ్యక్తుల దీర్ఘకాల అవసరాలకు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటు 7.40%. 20% పన్ను పరిధిలోని వారికి 5.86%, 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి రేటు 5.09 శాతంగాను ఉంటుంది. సెక్షన్ 80సీ ప్రయోజనాన్ని వినియోగిం చుకుంటే 20 % పన్ను శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 7.40%గానే ఉంటుంది. పన్ను ప్రయోజనం: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేసే పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను ఆదా పొందొచ్చు. వడ్డీ ఆదాయం మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. అనుకూలం: అధిక వడ్డీ రేటుతోపాటు రిస్క్ అస్సలు ఉండదు. పరిమితులు: 60 ఏళ్లు పైబడిన వారికే పరిమితం. గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షల వరకే. ఐదేళ్ల లాకిన్ అమలవుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ఇందులో ఆఫర్ చేస్తున్న ప్రస్తుత వడ్డీ రేటు 6.80%. పన్ను ప్రయోజనాలు: సెక్షన్ 80సీ పన్ను ఆదాకు అర్హత ఉంది. వడ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. అనుకూలం: ఎటువంటి రిస్క్ లేకపోవడం. ప్రతికూలం: ఐదేళ్ల లాకిన్ అమలవుతుంది. రాబడులు: 20% పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను నికర రాబడి 5.39 శాతం. 30% పన్ను పరిధిలోని వారికి నికర రాబడి 4.68 %. ఎవరికి?: రిస్క్ వద్దనుకునే వారు పరిశీలించదగినది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో రిస్క్ లేని రెండు విభాగాలు లిక్విడ్ ఫండ్స్, ఓవర్‌నైట్ ఫండ్స్‌ను తీసుకుంటే.. లిక్విడ్ ఫండ్స్‌లో రాబడులు వార్షికంగా 5.58% వరకు ఉంటాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌లో 4.70% వరకు ఉండొచ్చు. పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు, రాబడులు ఎటువంటి పన్ను ప్రయోజనాల్లేవు. అనుకూలతలు: ఎటువంటి లాకిన్ ఉండదు. అవసరమైనప్పుడు వేగంగా ఉపసంహరించుకోవచ్చు. ప్రతికూలతలు: భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబడులు ఇంకా తగ్గొచ్చు. ఎవరికి?: అధిక లిక్విడిటీ కోరుకునే వారికి. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఈపీఎఫ్‌కు అనుబంధంగా ఇన్వెస్ట్ చేసుకునే వీలున్న సాధనం. ఇందులో 2018–19లో అమల్లో ఉన్న రేటు 8.65 శాతం. పన్ను ప్రయోజనాలు: ఇందులో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. రాబడిపైనా పన్ను ఉండదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 20 శాతం శ్లాబులోని వారికి నికర రాబడి రేటు 10.92 శాతంగాను, 30 శాతం పన్ను పరిధిలోని వారికి 12.57 శాతంగాను ఉంటుంది. అనుకూలతలు: మార్కెట్ కంటే అధిక రాబడులు ఇందులో ఉంటున్నాయి. పరిమితులు: ఈపీఎఫ్ పరిధిలో ఉన్న వారికే ఇది పరిమితం. అలాగే, ఉపసంహరణలకు పరిమితులు ఉన్నాయి. ఎవరికి?: రిస్క్ రహితంగా దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలని అనుకునే వారికి. ఐదేళ్ల కంపెనీ డిపాజిట్ కంపెనీలు తమ అవసరాల కోసం వివిధ మార్గాల్లో నిధులను సమీకరిస్తుంటాయి. ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, ఎన్బీఎఫ్సీలు డిపాజిట్ల రూపంలో నిధులు సేకరిస్తుంటాయి. వీటిల్లో హెచ్డీఎఫ్సీ ఆఫర్ చేస్తున్న డిపాజిట్‌పై వడ్డీ రేటు పెద్దలకు 7.55 శాతం, ఇతరులకు 7.30 శాతంగా ఉంది. 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వృద్ధులకు నికరంగా వచ్చే రాబడి 5.98 శాతం.. ఇతరులకు 5.78%. 30% పన్ను పరిధిలోని వృద్ధులకు నికరంగా అందే రాబడి 5.19%, ఇతరులకు 5.02 శాతంగా ఉంటుంది. పన్ను ప్రయోజనాలు: పన్ను ప్రయోజనాలు కంపెనీల డిపాజిట్లపై ఉండవు. అనుకూలతలు: బ్యాంకు ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీ రేటు లభిస్తుంది. ప్రతికూలతలు: అధిక రిస్క్ ఉంటుంది. ముందస్తుగా డబ్బులను వెనక్కి తీసుకోవాలంటే నియంత్రణలు ఉంటాయి. ఎవరికి?: అధిక రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి. ఏఏఏ రేటింగ్ కలిగిన సంస్థల డిపాజిట్లనే పరిశీలించడం మంచిది. -
పెట్టుబడులు పెట్టేవారికి ఆర్థిక అవగాహన ముఖ్యం
హర్షేందు బిందాల్ పెట్టుబడుల విషయానికొస్తే మనలో చాలా మంది ఒకే మూస పద్ధతిని అనుసరిస్తుంటారు. అయితే ఒకరికి అనువైన సాధనం మరొకరికి అనువైనది కాకపోవచ్చన్నది విస్మరిస్తుంటారు. సాధారణంగా బంగారం, రియల్ ఎస్టేట్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ పొదుపు ఖాతాల వంటి సాధనాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటిలో బంగారం, రియల్టీ మినహా మిగతావాటిని ఎప్పటికప్పుడు ప్రాతిపదికన తీసుకుంటారే తప్ప... దీర్ఘకాలిక అవసరాల దృష్టితో చూడరు. ఒక రకంగా చెప్పాలంటే నిర్దిష్ట లక్ష్యాలకు తగినట్లుగా పెట్టుబడులు పెట్టే వారు చాలా తక్కువ. ఫలితంగా తీరా కీలక అవసరానికన్నా ముందే మనం పొదుపు చేసిన లేదా పెట్టుబడి పెట్టిన మొత్తాలను వాడేసేయడం జరుగుతుంటుంది. ఆర్థిక అంశాలపై అవగాహన అంతగా లేకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి వాటి వల్లే అధిక రాబడులిస్తామని ఆశ చూపే పోంజీ స్కీముల్లో చిక్కుకుని దాచుకున్నదంతా సమర్పించేసుకోవడం జరుగుతోంది. అలా కాకుండా ఉండాలంటే ఆర్థికంపై అవగాహన ఒకటే మార్గం. దీన్నే మనం ఆర్థిక అక్షరాస్యతగా కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈక్విటీ మార్కెట్లలో రిస్కుం టుందని, అవి అర్థం కానివని చాలామంది భావిస్తుంటారు. అయితే, నిపుణుల సారథ్యంలో నడిచే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే 5-10-15-20 ఏళ్ల పాటు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడం వల్ల రిస్కులు కూడా తగ్గించుకోవచ్చు. ఇక, పెట్టుబడులు పెట్టిన తర్వాత రాబడులపై పన్నులపరమైన ప్రయోజనాలూ చూసుకోవాల్సి ఉంటుంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలపై వచ్చే రాబ డుల మీద ఏటా పన్నులు ఉంటుండగా.. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మాత్రం రిడెంప్షన్ వేళ మాత్రమే పన్నులు ఉంటాయి. అలాగే, ఏడాది పైగా పెట్టుబడి కొనసాగిస్తే ఈక్విటీ ఫండ్ల రాబడులపై పన్ను పడదు. అలాగే, డెట్ ఫండ్స్ విషయానికొస్తే రాబడులు ద్రవ్యోల్బణాన్ని మిం చితేనే పన్ను భారం పడుతుంది. మరోవైపు బీమా సంగతి తీసుకుంటే అసలు లక్ష్యాన్ని విస్మరించి.. ప్రీమియం వెనక్కి తిరిగి రాదనే కారణంతో టర్మ్ ఇన్సూరెన్స్‌ను పక్కన పెట్టి ఇతర పథకాల వైపు వెళుతుంటారు. కానీ అంతే ప్రీమియంతో టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా అధిక కవరేజి పొందవచ్చని తెలుసుకోవాలి. బీమా అనేది ఏదైనా అనుకోనిది జరిగితే ఆర్థికంగా నష్టపోకుండా కాపాడే ఆర్థిక సాధనంగానే చూడాలే తప్ప పెట్టుబడి సాధనంగా చూడకూడదు. ఇలాంటివన్నీ కూడా ఆర్థిక అంశాలపై పరిజ్ఞానం ఉంటేనే తెలుస్తాయి. పెట్టుబడులకు సంబంధించి లక్ష్యాలు, రిస్కులు మొదలైన వాటిపై అవగాహన ఏర్పడుతుంది. అలాగే పిల్లల చదువు/ వారి పెళ్లి, తమ రిటైర్మెంట్ వంటి లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవడం సాధ్యపడుతుంది. -
డెట్ ఫండ్స్‌లో 5-10 ఏళ్లు ఇన్వెస్ట్ చేయవచ్చా?
నేను కొన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. కానీ వీటిపై వచ్చిన రాబడులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన రాబడుల కన్నా స్వల్పమే ఎక్కువ. ఎక్స్పెన్స్ రేషియోను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాబడులు బాగా తక్కువగా ఉంటున్నాయి. ఎక్స్పెన్స్ రేషియోను మినహాయించుకున్న తర్వాతనే మనకు రాబడులను ఇస్తారా? ఈ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 5-10 ఏళ్లపాటు కొనసాగించవచ్చా? తగిన సమాధానాలు ఇవ్వగలరు. - సునయన, విజయవాడ ఫండ్ వ్యయాలను మినహాయించుకున్న తర్వాతనే మ్యూచువల్ ఫండ్ సంస్థలు నెట్ అసెట్ వేల్యూ(ఎన్ఏవీ)ను ప్రకటిస్తాయి. మీకు వచ్చే రాబడులు ఎక్స్పెన్స్ రేషియోను మినహాయించుకున్న తర్వాత వచ్చినవే. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే డెట్ ఫండ్స్‌కు రెండు ప్రధానమైన ప్రయోజనాలున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో స్థిరమైన రాబడి వస్తుంది. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే వడ్డీరేట్ల హెచ్చుతగ్గులను బట్టి రాబడులు ఉంటాయి. వడ్డీరేట్ల హెచ్చుతగ్గులు బాగా ఉంటే వీటి నుంచి మంచి రాబడులు వస్తాయి. ఇటీవల కాలంలో ఒక డెట్ ఫండ్ ఏడాదికి 17 శాతం రాబడిని ఇచ్చింది. డెట్ ఫండ్స్ నుంచి కనిష్టంగా 8.5 శాతం రాబడి పొందవచ్చు. ఇతర స్థిరాదాయ మార్గాలతో పోల్చితే డెట్ ఫండ్స్ మంచి రాబడులనిచ్చే అవకాశాలే ఎక్కువ. ఇక ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్ యూనిట్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. కానీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోలేం. నిర్ణీత గడువు కన్నా ముందుగానే తీసుకుంటే, కొంత రుసుము చెల్లించాల్సి రావచ్చు. పన్ను పరంగా చూసుకున్నా డెట్ ఫండ్స్ ఉత్తమమైనవి. స్వల్పకాలంలో అధిక రాబడులు, లిక్విడిటీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా డెట్ ఫండ్సే ఉత్తమం. డెట్ ఫండ్స్‌లో స్వల్పకాలానికే ఇన్వెస్ట్ చేయాలి. డెట్ ఫండ్స్‌లో 5-10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం సరైన పని కాదు. ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించాలంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 65% ఈక్విటీల్లోనూ, మిగిలిన దానిని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటి నుంచి అధిక శాతం రాబడులు వస్తాయి. పైగా వీటిల్లో ఏడాదికి పైగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే ఎలాంటి పన్ను పోటు ఉండదు. నేను ఇప్పటివరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. కొత్త ఏడాది నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. వచ్చే జనవరి నుంచి ఏదైనా ఒక ఫండ్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. విస్తృత అధ్యయనం అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్, రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. కానీ ఈ ఫండ్స్ ఎన్ఏవీ (నెట్ అసెట్ వేల్యూ) అధికంగా ఉంది. దేనిని ఎంచుకోవాలో తగిన సూచనలివ్వండి. - రుద్ర భూపతి, విజయనగరం మ్యూచువల్ ఫండ్స్‌లో అందునా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నందుకు మీకు అభినందనలు. మీరు షార్ట్‌లిస్ట్ చేసిన ఫండ్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్ ఉత్తమమైనది. మిగిలిన రెండూ మంచి ఫండ్సే కానీ, మూడేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి, మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో అడుగిడుతున్న మీకు హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్ అనువైనది. ఇక ఎన్ఏవీ అధికంగా ఉందని రాశారు. ఇది అసలు సమస్యే కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గతంలోని పనితీరు ఇప్పటి పనితీరు పోల్చడానికి ఎన్ఏవీ పనికి వస్తుంది. ఎన్ఏవీ తక్కువగా ఉంటే ఎక్కువ యూనిట్లు, ఎన్ఏవీ ఎక్కువగా ఉంటే యూనిట్లు తక్కువగా వస్తాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ విలువ ఒక్కలాగే ఉంటుంది. ఎన్ఏవీని బట్టి కాకుండా ఫండ్ పనితీరును బట్టి ఇన్వెస్ట్ చేయాలి. నేరుగా ఈక్విటీల్లో (షేర్లు) ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? - కమలాకర్, నిజామాబాద్ మ్యూచువల్ ఫండ్స్ వార్షిక వ్యయాలను మినహాయించుకొని రాబడులను అందిస్తాయి. ఈ వార్షిక వ్యయాలు 1-2% రేంజ్లో ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. నిపుణులైన ఫండ్ మేనేజర్లు మ్యూచువల్ ఫండ్లను నిర్వహించడమే దీనికి కారణం. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి విస్తృతమైన పరిజాఞనం అవసరం. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ ఏ రంగంలో ఉంది? ఎలాంటి ఉత్పత్తులు, సేవలు అందిస్తోంది? వాటికి మార్కెట్లో స్పందన ఎలా ఉంది? ప్రమోటర్ల ట్రాక్ రికార్డ్.. ఇలాంటి పలు అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే వీటన్నింటినీ చూడ్డానికి నిపుణులైన వ్యక్తులు ఉంటారు. మీకు తగిన సమయం, ఓపిక ఉంటే కంపెనీకి సంబంధించి అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.