ELSS
-
పన్ను ఆదాలో ఎన్పీఎస్ టాప్.. రెండో స్థానంలో ఈఎల్ఎస్ఎస్
న్యూఢిల్లీ: పన్ను ఆదా కోసం ఏ సాధనంలో ఇన్వెస్ట్ చేయాలా? అన్న సందేహించే వారికి ఎన్పీఎస్ ఒక మంచి ఆప్షన్ కావచ్చు.! పన్ను ఆదాతోపాటు ఉద్యోగ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఎన్పీఎస్ ఒక మంచి మార్గం అవుతుంది. రాబడులు ఒక్కటే కాకుండా, పెట్టుబడులకు భద్రత, సౌలభ్యం, లిక్విడిటీ, వ్యయాలు, పారదర్శకత, పెట్టుబడుల్లో సౌలభ్యం తదితర అంశాల పరంగా ఎన్పీఎస్ ముందున్నట్టు ఓ సంస్థ నిర్వహించి అధ్యయనంలో తెలిసింది. వరుసగా రెండో ఏడాది పన్ను ఆదాకు టాప్ సాధనంగా నిలిచింది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మొత్తాన్ని ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. అదనంగా, సెక్షన్ 80సీసీడీ (1బి) కింద రూ.50,000ను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ఆదా పొందొచ్చు. ఇక కంపెనీ ఉద్యోగి తరఫున ఎన్‌పీఎస్‌లో జమలపైనా సెక్షన్ 80సీసీడీ (2) కింద.. వేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్పీఎస్ ద్వారా ఈక్విటీలకు 75 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఈక్విడి, డెట్ ఎంపికల ఆధారంగా ఇందులో సగటు వార్షిక రాబడులు 8–16 శాతం మధ్య ఉంటాయి. పన్ను ఆదా, లిక్విడిటీ, రాబడులు వీటన్నింటి విషయంలో ఎన్పీఎస్ తర్వాత ఈఎల్ఎస్ఎస్ రెండో స్థానంలో ఉంది. -
అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు సెబీ గుడ్ న్యూస్!
న్యూఢిల్లీ: పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఈఎల్ఎస్ఎస్ (equity-linked savings scheme )పథకాలకు సంబంధించి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతి మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ఒక్కటే ఈఎల్ఎస్ఎస్ పథకాన్ని నిర్వహించేందుకు సెబీ అనుమతించేది. ఒకటే సంస్థ ఒకటికి మించిన ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌లను నిర్వహించకూడదు. కానీ, ఇక మీదట యాక్టివ్ ఈఎల్ఎస్ఎస్ పథకాలను ఆఫర్ చేసే ప్రతి సంస్థ ప్యాసివ్ విభాగంలో (ఇండెక్స్‌ల పరిధిలోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవి) ఈఎల్ఎస్ఎస్ పథకాన్ని తీసుకొచ్చేందుకు అనుమతించింది. ఈ మేరకు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు సమాచారం ఇచ్చింది. కానీ, ఈ విషయంలో పలు షరతులు విధించింది. ఇప్పటికే యాక్టివ్ ఈఎల్ఎస్ఎస్ పథకం నిర్వహించే అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థ) ప్యాసివ్ స్కీమ్‌ను కూడా తీసుకురావాలని భావిస్తే.. యాక్టివ్ పథకంలోకి ఇక మీదట పెట్టుబడులను తీసుకోకూడదు. -
ఈ స్కీమ్‌లో ఏ విభాగమైనా, పీపీఎఫ్ కంటే రెట్టింపు రాబడులు!
Investment Tips On Elss Scheme స్మాల్ క్యాప్ కంటే మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? మిడ్‌క్యాప్‌లో ఉండే రాబడులు, సవాళ్లు అనేవి స్మాల్‌క్యాప్ మాదిరే ఉంటాయి. పేరుకు తగినట్టుగా ఈ పథకాల పెట్టుబడులు ఉండటాన్ని గమనించొచ్చు. మిడ్‌క్యాప్ పథకాలు ప్రధానంగా మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అదే విధంగా స్మాల్‌క్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనూ చెప్పకోతగ్గ పెట్టుబడులు కలిగి ఉంటాయి. అదే స్మాల్‌క్యాప్ ఫండ్ అయితే ఎక్కువగా స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు పెట్టుబడులు కేటాయిస్తుంది. అలాగే, మిడ్‌క్యాప్‌లోనూ ఎక్స్పోజర్ తీసుకుంటుంది. మార్కెట్ విలువ పరంగా టాప్ –100 కంపెనీలను లార్జ్‌క్యాప్‌గా, తదుపరి 150 కంపెనీలను మిడ్‌క్యాప్‌గా, మిగిలిన కంపెనీలను స్మాల్‌క్యాప్ కంపెనీలుగా సెబీ నిర్వచించింది. ఈ నిర్వచనాన్నే పథకాలు కూడా అనుసరిస్తుంటాయి. అయితే, 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీలన్నీ ఎల్లప్పుడూ మిడ్క్యాప్లోనే ఉంటాయని కాదు అర్థం. మార్కెట్ విలువ ఆధారంగా ఒక కంపెనీని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ అని చెప్పడమే. ఒకవేళ అది చిన్న కంపెనీయే అయినప్పటికీ గొప్పది అయి ఉండొచ్చు. చక్కని నిర్వహణతో, ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారంతో, భరోసానిస్తూ ఉండొచ్చు. ఇలాంటి అంశాలున్న కంపెనీల విషయంలో అది మిడ్ లేదా స్మాల్ క్యాప్ అన్న నిర్వచనం జోలికి వెళ్లక్కర్లేదు. ఉదాహరణకు ఒక మిడ్‌క్యాప్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంత కాలానికి నిర్వహణ ఆస్తుల పరంగా అది పెద్ద పథకంగా మారొచ్చు. అప్పుడు అవి మిడ్క్యాప్లోనే లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు 101 నుంచి 125 వరకు ఉన్న కంపెనీలను ఎంచుకుంటాయి. అవి పేరుకు మిడ్‌క్యాప్ కంపెనీలుగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో లార్జ్‌క్యాప్‌లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈఎల్ఎస్ఎస్ పథకాల నుంచి 10–20 ఏళ్ల కాలంలో ఎంత మేర రాబడులు ఆశించొచ్చు..? ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలకు 30 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ 30 ఏళ్ల రాబడులు పరిశీలించినా లేక ఈ పథకాలకు సంబంధించి 20 ఏళ్ల కాల రోలింగ్ రాబడులను గమనించొచ్చు. ఈ పథకాల్లో రాబడులు సగటున 15–20 శాతం మధ్య ఉంటాయి. ఈ విభాగంలో చెత్త పనితీరు చూపించిన పథకాన్ని గమనించినా.. పీపీఎఫ్ కంటే రెట్టింపు రాబడులు కనిపిస్తాయి. కాంపౌండింగ్ (వడ్డీపై వడ్డీ జమ కావడం) మహిమ ఎలా ఉంటుందన్నది అర్థం చేసుకోవాలి. ఒకవేళ మంచి పథకాన్ని ఎంపిక చేసుకుని, అది అన్ని కాలాల్లోనూ మంచి పనితీరు చూపిస్తుంటే దానితోనే కొనసాగొచ్చు. మార్కెట్‌తో అనుసంధానమైన పెట్టుబడులు ఏవైనా కానీ, పెట్టుబడులు పెట్టేసి మర్చిపోతానంటే కుదరదు. కచ్చితంగా వాటిని పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే మంచి పథకాలన్నవి చెత్తగాను, చెత్త పథకాలుగా ఉన్నవి మంచిగానూ మారిపోతుంటాయి. ఒకే పథకంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లలేం. ఎందుకంటే ఒకవేళ అది చెత్తగా మారొచ్చు. అందుకే పెట్టుబడులను సమీక్షించుకోవడమనే సూత్రాన్ని అనుసరించాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఈఎల్ఎస్ఎస్ పథకం పనితీరు ఆశాజనకంగా లేకపోతే, దాని నుంచి బయటకు వచ్చేయవచ్చు. ఎందుకంటే మూడేళ్లకు పెట్టుబడుల లాకిన్ ముగిసిపోతుంది. చదవండి: Reliance Industries: ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్ -
ఈక్విటీల్లో పన్ను ప్రయోజనం..!
ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోకి అడుగు పెట్టాం. వేతన జీవి తన ఆదాయం, పన్ను భారం, పన్ను ఆదా చేసుకోవడానికి ఇంకా వెసులుబాటు ఉందా? ఉంటే ఏ సాధనంలో ఇన్వెస్ట్ చేయాలి..? ఇలాంటి అంశాలన్నింటినీ ఒకసారి పరిశీలించుకోవాలి. చాలా మంది ఆర్థిక సంవత్సరం చివర్లోనే పన్ను అంశాన్ని పట్టించుకుంటుంటారు. హడావుడిగా ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేసుకునే వారూ ఉన్నారు. కొత్త పన్నువిధానంలోకి మారిన వారికి ఈ పెట్టుబడులపై హడావుడి అవసరమే లేదు. నూతన విధానంలో పన్ను మినహాయింపులు పెద్దగా లేవు. అదే సమయంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, గతం నుంచి ఉన్న పన్ను విధానంలో సెక్షన్ 80సీ, 80సీసీబీ, 80డీ ఇలా ఎన్నో సెక్షన్ల కింద గణనీయమైన పెట్టుబడి ఆదాకు అవకాశం ఉంది. వీటి గురించి ఓ సారి సమీక్షించుకోవాల్సిందే. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకపోవడం మినహాయింపుల్లో అతి ముఖ్యమైన విభాగం. ఈ ప్రయోజనం కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. లక్ష్యాలు ముఖ్యం.. పెట్టుబడికి సంబంధించి ఏ నిర్ణయమైనా అది మీ ఆర్థిక లక్ష్యానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. పన్ను ఆదాను అదనపు ప్రయోజనంగా చూడాలే కానీ, దానినే ఒక లక్ష్యంగా భావించకూడదు. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి మీరు ఇతర పథకాలలో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. పన్ను ఆదా కోసం తిరిగి ఈఎల్ఎస్ఎస్ తరహా ఈక్విటీ సాధనాల వైపు చూడడం సరికాదు. అప్పుడు ఒకే విభాగంలో (ఈక్విటీల్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం) అధిక రిస్క్ (కాన్సంట్రేషన్ రిస్క్) తీసుకున్నట్టు అవుతుంది. సెక్షన్ 80సీ కింద వార్షికంగా రూ.1.5 లక్షలపై పన్ను ఆదాకోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు ఆఫర్ చేసే ఐదేళ్ల ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అన్నీ కూడా ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఉంది. కాకపోతే ఇందులో పెట్టుబడులకు 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీర్ఘకాలం కోసం దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, వేతన జీవులు ఈపీఎఫ్‌కు ప్రతీ నెలా చేసే జమను పరిగణనలోకి తీసుకోవాలి. తనకు, తన జీవిత భాగస్వామి లేదా చిన్నారులకు సంబంధించి జీవిత బీమా ప్రీమియంపైనా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు (గరిష్టంగా ఇద్దరు పిల్లలకే), గృహ రుణానికి సంబంధించి అసలుకు చేసే చెల్లింపులను కూడా చూపించుకోవచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చూడండి. రూ.1.5 లక్షల మొత్తానికి తగ్గితే అప్పుడు.. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఉత్పత్తిని అర్థం చేసుకోవాలి.. ఈఎల్ఎస్ఎస్లో లాకిన్ పీరియడ్ తక్కువగా (మూడేళ్లు) ఉండడం ఆకర్షణీయంగా అనిపిస్తుంది. లాకిన్ పీరియడ్‌లో ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులను వెనక్కి తీసుకోలేరు. సెక్షన్ 80సీ కింద అనుమతి ఉన్న కొన్ని సాధనాల నుంచి నిర్ధేశిత కాలవ్యవధికి ముందే వైదొలగొచ్చు. ఇందుకు జరిమానా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే.. మొత్తం పెట్టుబడి నుంచి 11.5 శాతాన్ని మినహాయిస్తారు. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై 2 శాతం వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. ఈపీఎఫ్, పీపీఎఫ్ పథకాల నుంచి పన్ను ఆదా పొందిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే.. గతంలో పొందిన ప్రయోజనంపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఎన్ఎస్సీ పెట్టుబడిని ఐదేళ్లకు ముందుగా వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేదు. కేవలం డిపాజిట్‌దారు మరణించిన సందర్భాల్లోనే ఉపసంహరణకు అనుమతిస్తారు. ముందు నుంచే ప్రణాళిక.. ఒకవేళ ఈఎల్ఎస్ఎస్ మీకు అనుకూలమైన సాధనం అని భావించినట్టయితే.. పెట్టుబడులకు ముందు నుంచే ప్రణాళిక రచించుకోవాలి. దేశీయ ఈక్విటీలు గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. కనుక పన్ను ఆదా కోసం ఏక మొత్తంలో పెట్టుబడి సూచనీయం కాదు. జనవరి నుంచి మార్చి వరకు మూడు విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. తదుపరి ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే ప్రతీ నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన మార్గం అవుతుంది. దీనివల్ల పెట్టుబడి వ్యయం సగటుగా మారి అధిక రాబడులకు అవకాశం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మార్కెట్లలో ఉండే ఆటుపోట్లను సులభంగా అధిగమించి, పెట్టుబడులపై వాటి ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. ఫండ్స్ పథకాల పనితీరును ముందుగానే సమగ్రంగా సమీక్షించుకుని పెట్టుబడులు ప్రారంభించాలి. ఆ పథకాల్లోనే దీర్ఘకాలం పాటు (ఏవైనా అసాధారణ మార్పులు వస్తే తప్ప) కొనసాగాలి. అంతేకానీ, ప్రతీ ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను ఆదా పథకాలను ఎంపిక చేసుకోవడం సరికాదు. ఎక్కువ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వైవిధ్యం పరిమితి దాటకుండా చూసుకోవాలి. పన్ను బాధ్యతను చూడాలి.. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులు రూ.1.5లక్షలపై ఏటా పన్ను ఆదా చేసుకోవచ్చు. కానీ, వీటిని తిరిగి వెనక్కి తీసుకునే సమయంలో లాభాలపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేదు. కనుక లాకిన్ ముగిసిన అనంతరం ఏటా రూ.లక్ష వరకే వెనక్కి తీసుకోవడం ద్వారా అప్పుడు కూడా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలోనూ పన్ను ఉండదని కోరుకునే వారు.. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎండోమెంట్ జీవిత బీమా సాధనాల వంటి వా టికే పరిమితం కావాల్సి ఉంటుంది. అలాగే, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఏటా రూ.2.5 లక్షల పెట్టుబడికి సైతం పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇతర పన్ను ఆదా సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో రాబడుల పరంగా ఈఎల్ఎస్ఎస్ మెరుగైన సాధనం. కనుక దీర్ఘకాల లక్ష్యాల కోసం పన్ను ఆదాతోపాటు, రాబడిని దీని ద్వారా సమకూర్చుకోవచ్చు. ఇందులోనూ గ్రోత్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ సాధనం కనుక పెట్టుబడి అవసరమైన సందర్భంలో (లాకిన్ ముగిసిన అనంతరం) వెనక్కి తీసుకోవాలంటే.. అదే సమయంలో మార్కెట్లు పతనాలను చూస్తుంటే కొంతకాలం వేచి చూడాల్సిన రిస్క్ ఇందులో ఉంటుంది. -
పన్ను ఆదా.. రాచమార్గాలు!
పన్ను ఆదాయం ఉన్న వారు కొంత మొత్తంపై పన్ను పడకుండా చూసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇక్కడ పన్ను ఆదాయే కాదు, చేసే పెట్టుబడిపై మెరుగైన రాబడులు కూడా రావాలి. అప్పుడే పన్ను ఆదా, రాబడులు అనే రెండు లక్ష్యాలు సాకారం అవుతాయి. సరైన సాధనాన్ని ఎంపిక చేసుకుంటేనే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా కోసం ఏదో ఒకటి ఎంచుకుని పొరపాటు చేయవద్దు. ముఖ్యంగా సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలను తీసుకుంటే.. అందులో రాబడులు ఆశించిన మేర ఉండవు. అలాగే, బీమా రక్షణ విషయంలోనూ వీటికి మార్కులు తక్కువే. పన్ను ఆదా, రాబడులు ఈ రెండింటికీ అస్సలు నప్పని సాధనం ఎండోమెంట్ పాలసీలే. కనుక పన్ను ఆదా సాధనాల్లో వేటిల్లో రాబడులు ఏ మేర ఉన్నాయి, రిస్క్ తదితర వివరాలను తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయాన్ని సులభంగా తీసుకోవచ్చు. ఈ వివరాలను తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది. పీపీఎఫ్ వడ్డీ రేటు ప్రస్తుత త్రైమాసికానికి (జనవరి–మార్చి) 7.9 శాతం. ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ గత ఏడాది కాలంలో గణనీయంగా తగ్గాయి. కానీ, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో పెద్దగా మార్పుల్లేవు. ఇప్పటికీ బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగైన రాబడులే ఉన్నాయి. అలాగే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)లో చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపైన కాకుండా, రాబడులపైనా పన్ను లేదు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడిపెట్టేది ఎక్కువగాసామాన్యులే. కనుక ప్రభుత్వం మరీ దూకుడుగా వడ్డీ రేట్లను తగ్గించలేదు. దీన్ని గమనంలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ తర్వాత అధిక రాబడులను ఇచ్చే సాధనం పీపీఎఫ్. బ్యాంకు పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్‌తో పోల్చితే పీపీఎఫ్ మెరుగైన సాధనం. 15 ఏళ్ల కాల వ్యవధి కలిగిన పెట్టుబడి పథకం ఇది. ఐదో ఏట తర్వాత పాక్షికంగా ఉపసంహరణకు వీలుంటుంది. పోస్టాఫీసులతో పోలిస్తే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్‌లో పెట్టుబడులకు అనుమతిస్తున్న బ్యాంకుల్లో ఖాతా తెరవడం సౌలభ్యంగా ఉంటుంది. వార్షికంగా రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎస్సీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) కూడా చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటి. ఇందులో పెట్టుబడులపైనా సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. రాబడులు ప్రస్తుత త్రైమాసికానికి పీపీఎఫ్ మాదిరే 7.9%గా ఉన్నాయి. పెట్టుబడి సమయంలో ఉన్న రేటే ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. పెట్టుబడులపై లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. కాకపోతే రాబడులు పన్ను పరిధిలోకి వస్తాయి. ఇతర ఆదాయం కింద రిటర్నుల్లో చూపించాలి. రాబడులపైనా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అదెలా అంటే.. ఉదాహరణకు 2020 జనవరిలో ఎన్ఎస్సీలో రూ.50 వేలు ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా పొందారనుకుందాం. ఏడాది తర్వాత రూ.3,950 రాబడి లభిస్తుంది. ఇది ఆటోమేటిగ్గా తిరిగి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక మరుసటి ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తంపైనా పన్ను ఆదా పొందొచ్చు. కాకపోతే కేవలం పోస్టాఫీసుల్లోనే అందుబాటులో ఉంది. పెన్షన్ ప్లాన్లు బీమా సంస్థలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్లు కూడా పన్ను ఆదా జాబితాలో ఉన్నాయి. కాకపోతే ఎన్పీఎస్ వచ్చిన తర్వాత ఇవి ఆదరణ కోల్పోయాయి. ఎన్‌పీఎస్‌లో మాదిరే బీమా ఆధారిత పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడులపై అదనంగా రూ.50,000పై పన్ను మినహాయింపు ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. కానీ, ఎన్‌పీఎస్‌తో పోల్చి చూస్తే బీమా ఆధారిత పెన్షన్ ప్లాన్లలో చార్జీలు అధికంగా ఉంటాయి. పారదర్శకత కూడా తక్కువే. కనుక రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవాలనుకునే వారు, దానిపై పన్ను ఆదా కోరుకునే వారు ఎన్పీఎస్ను ఆశ్రయించడమే మంచిది. ఇక, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కూడా రిటైర్మెంట్ ఫండ్స్ పేరుతో పథకాలను తీసుకొస్తున్నాయి. ఎన్పీఎస్ మాదిరే వీటిల్లోనూ అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్న రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్స్‌పై ప్రస్తుతానికి ఎటువంటి పన్ను ప్రయోజనాలను కేంద్రం ఇవ్వడం లేదు. బీమా పాలసీలు మనలో ఎక్కువ మంది బీమా పాలసీలు తీసుకోవడం చూడొచ్చు. ముఖ్యంగా పన్ను ఆదా కోసమని, పెట్టుబడుల దృష్ట్యా బీమా పాలసీలు తీసుకునే వారు చాలా మందే ఉంటారు. కానీ, తాము అనుసరిస్తున్న మార్గం సరైంది కాదన్నది తర్వాతే తెలుస్తుంది. ఒక వ్యక్తి మరణానికి గురైతే ఆ వ్యక్తి కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకునేది బీమా రక్షణ. కానీ, దీన్నొక పెట్టుబడి సాధనంగా, పన్ను ఆదా సాధనంగా చూడడం సరైనది కాదు. అలాగే, ఇందులో పెట్టుబడులపై దీర్ఘకాలంలో రాబడులు 20 ఏళ్ల ప్లాన్లలో 4.5–5 శాతంగానే ఉంటాయి. అంటే చాలా తక్కువ రాబడులు. ద్రవ్యోల్బణం స్థాయిలోనే రాబడి రేటు ఉంటే, నికర రాబడి సున్నాయే అవుతుంది. బీమా కవరేజీ కూడా వీటిల్లో చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఒక వ్యక్తి కనీసం తన వార్షిక ఆదాయానికి 10 రెట్ల మొత్తానికి అయినా బీమా తీసుకోవాలి. అంటే వార్షికంగా రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారు రూ.50 లక్షల పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇంత కవరేజీ ఎండోమెంట్ ప్లాన్‌లో తీసుకోవాలంటే వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.4–5 లక్షలు ఉంటుంది. అదే టర్మ్ ప్లాన్‌లో కేవలం రూ.7,000–8,000 చెల్లించడం ద్వారా రూ.50 లక్షల కవరేజీ పొందొచ్చు. టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపుల మొత్తం కూడా సెక్షన్ 80సీ కింద పన్ను ఆదాకు అర్హమైనదే. సుకన్య సమృద్ధి యోజన కేవలం పన్ను ఆదా కోసం అని కాకుండా, కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులు వారి భవిష్యత్తు అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకోతగినది సుకన్య సమృద్ధి యోజన పథకం (ఎస్ఎస్వై). ఇది సంప్రదాయ పెట్టుబడి సాధనం. ఇందులో రూ.1.5 లక్షల పెట్టుబడిపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా చేసుకోవచ్చు. పదేళ్లలోపు బాలికల పేరిట తల్లిదండ్రులు (గరిష్టంగా ఇద్దరు పేరిటే) ఎస్ఎస్వై ఖాతా తెరుచుకోవచ్చు. ఖాతాలు రెండు అయినా కానీ, గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షలుగా అమలవుతుంది. ఈ పథకంలో పెట్టుబడులపై వడ్డీ రేటు కూడా ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్‌తో అనుసంధానమై ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు మారిపోవచ్చు. ప్రస్తుతానికి (జనవరి–మార్చి త్రైమాసికం) 8.4 శాతం రేటు అమలవుతోంది. పీపీఎఫ్తో పోలిస్తే అధిక వడ్డీ రేటు ఈ పథకంలో కొనసాగుతోంది. పీపీఎఫ్ మాదిరే ఎస్ఎస్వై పథకంలోనూ రాబడులు పూర్తిగా పన్ను రహితమే. పోస్టాఫీసులు, ఎంపిక చేసిన జాతీయ బ్యాంకుల్లో ఎస్ఎస్వై ఖాతా తెరవచ్చు. ఇందులో పెట్టుబడులు, రాబడులను కుమార్తెల ఉన్నత విద్య, వివాహ అవసరాల కోసమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా డెట్ పథకం. దీనికి బదులు భవిష్యత్తు అవసరాల కోసం అధిక రాబడులను ఇచ్చే మంచి ఈక్విటీ సాధనాల్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. కనుక ఈ పథకంతో పోలిస్తే కొంత రిస్క్ తీసుకునే వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వైపు మొగ్గు చూపొచ్చు. యులిప్‌లు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌లు) కూడా సెక్షన్ 80సీ సాధనాల్లో ఒకటి. ఈ విభాగంలో గత మూడేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 8.09 శాతంగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ పథకాల్లో చార్జీలు భారీగా ఉండేవి. ఐఆర్డీఏఐ సంస్కరణలతో చార్జీలు కొంత మేర దిగొచ్చాయి. అయినా ఇప్పటికీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే వీటిల్లో చార్జీలు ఎక్కువ. ఎందుకంటే ఒకవైపు బీమా రక్షణనిస్తూనే, మరోవైపు పెట్టుబడులపై రాబడులను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ రెండింటి కోసం వసూలు చేసుకునే చార్జీలు ఎక్కువగానే ఉంటున్నాయి. కనుక దీర్ఘకాలానికి చూసుకుంటే ఇందులో పెట్టుబడులపై రాబడులు మోస్తరుగానే ఉంటున్నాయి. పోనీ బీమా రక్షణ అయినా తగినంతగా ఉంటుందా..? అనుకుంటే అదీ లేదు. వార్షికంగా రూ.24,000 ప్రీమియంపై 10 రెట్ల బీమా అంటే రూ.2.4 లక్షల బీమా వర్తిస్తుంది. దీర్ఘకాల రాబడులు ఆకర్షణీయంగా లేవు. తగినంత బీమా రక్షణకైతే కేవలం టర్మ్ పాలసీలను నమ్ముకోవడం మంచిది. అయితే యులిప్‌లలో ప్రయోజనాలూ ఉన్నాయి. యులిప్‌లో చెల్లించే ప్రీమియానికి బీమా రక్షణ 10 రెట్ల వరకే ఉంటే.. వచ్చే రాబడులపై సెక్షన్ 10(10డి) పూర్తిగా పన్ను ఉండదు. పన్ను ఆదా ఎఫ్డీ సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా కోసం ఉద్దేశించిన బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ అనే పేరుతో ఈ సాధనంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి పన్ను ఆదా చేసుకోవచ్చు. కాకపోతే ఐదేళ్ల పాటు మళ్లీ విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించరు. పైగా ఇందులో రాబడులు పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తాయి. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై రాబడి రేటు 6.5–7.6 మధ్య ఉంది. ఒక్కో బ్యాంకు ఒక్కో రేటు ఆఫర్ చేస్తోంది. అయితే, 5 శాతం పన్ను పరిధిలో ఉన్నవారు, అలాగే 10 శాతం, 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి రాబడులు మోస్తరుగా ఉన్నాయి కానీ, 30 శాతం శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను అనంతరం రాబడులు 5 శాతమే అని గమనించాలి. ముందస్తు ప్రణాళిక లేని వారు.. చివరి నిమిషంలో పన్ను ఆదా కోసం చూసే వారు.. తక్కువ పన్ను పరిధిలో ఉన్న వారు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని పరిశీలించొచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ చేసుకునేందుకు కొన్ని బ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) పథకాలు గత మూడేళ్ల కాలంలో ఇచ్చిన సగటు వార్షిక రాబడులు 13%. అంతేకాదు సెక్షన్ 80సీ పన్ను ఆదా సాధనాల్లో అత్యధిక రాబడులు, తక్కువ లాకిన్ పీరియడ్ (మూడేళ్లు) ఉన్నది కూడా వీటిల్లోనే. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం వీటిల్లో మంచి పథకాలను ఎంచుకుని సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఈ పథకాలు నాణ్యమైన కంపెనీల ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఒకే విభాగానికి పరిమితం కాకుండా మల్టీక్యాప్ (భిన్న మార్కెట్ విలువలతో కూడిన కంపెనీలు) విధానాన్ని అనుసరిస్తుంటాయి. రూ.1.5 లక్షలను వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పూర్తి పన్ను ఆదా చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులపై దీర్ఘకాలిక లాభం రూ.లక్ష (విక్రయించినప్పుడు) వరకు ఉంటే పన్ను ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించిన లాభం వస్తే ఆ మొత్తంపైనే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధిక రిస్క్‌తో కూడిన సాధనాల కిందకు ఇవి వస్తాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) ఎన్‌పీఎస్‌లో గత ఐదేళ్ల కాలంలో రాబడులు.. అగ్రెసివ్ విభాగం(ఈక్విటీల్లో పెట్టుబడులు 50%)లో వార్షిక రాబడులు 9.11%. బ్యాలన్స్డ్ విభాగంలో (ఈక్విటీల్లో పెట్టుబడులు 33%) వార్షిక రాబడులు సగటున 9.26%. కన్జర్వేటివ్ విభాగంలో (ఈక్విటీ పెట్టుబడులు 20%) వార్షిక సగటు రాబడులు 9.39%. అలాగే, అల్ట్రా సేఫ్ విభాగంలో (పూర్తిగా డెట్ పెట్టుబడులు) ఐదేళ్ల వార్షిక సగటు రాబడులు 9.57%. అంటే మొత్తం మీద రాబడులు 9.11–9.57% మధ్య ఉన్నాయి. ఈక్విటీ, డెట్ రెండింటి రాబడుల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడానికి ప్రధాన కారణం... ఇటీవలి సంవత్సరాల్లో ఈ రెండు విభాగాలు ర్యాలీ చేయడమే. దీర్ఘకాలంలో 20–30 ఏళ్ల కాలానికి ఈక్విటీ ఎక్స్‌పోజర్‌తో కూడిన విభాగాల్లోనే (అగ్రెసివ్, బ్యాలన్స్డ్, కన్జర్వేటివ్) అధిక రాబడులకు చాన్స్ ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలకు అదనంగా మరో రూ.50వేలను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 సీసీడీ (2) కింద పన్ను లేకుండా ప్రయోజనం పొందే అవకాశం ఇందులోనే ఉంది. -
పరాగ్ పారిఖ్ నుంచి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్
పరాగ్ పారిఖ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ (పీపీఎఫ్ఏఎస్) దాదాపు ఆరేళ్ల తర్వాత తొలి ఈక్విటీ స్కీమ్‌ను ప్రారంభించనుంది. పరాగ్ పారిఖ్ ట్యాక్స్ సేవర్ ఫండ్ పేరిట దీన్ని జూలై మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు సంస్థ చైర్మన్ నీల్ పరాగ్ పారిఖ్ వెల్లడించారు. తమ ఫండ్ హౌస్ నుంచి ఇది మూడో స్కీమ్ అవుతుందని, ఈక్విటీలకు సంబంధించి రెండోదని వివరించారు. ‘గత కొన్నేళ్లుగా ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ప్రారంభించాలంటూ చాలా మంది కోరుతున్నారు. అయితే, తగినంత సంఖ్యలో ఇన్వెస్టర్లు పోగయ్యేవరకు వేచి చూడాలని భావించాం’ అని తెలిపారు. పీపీఎఫ్ఏఎస్ ఇప్పటి దాకా కేవలం ఒకటే ఈక్విటీ స్కీమ్ ఆఫర్ చేస్తోంది. లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ పేరిట నిర్వహిస్తున్న ఈ స్కీము మల్టీ–క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇటు భారత్‌లోనూ అటు విదేశీ స్టాక్స్‌లోనూ దీని ద్వారా ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటు ఉందని తెలిపారు. మరోవైపు ఈక్విటీ స్కీమ్‌లోకి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ సదుపాయం కల్పించేందుకు 2018 మే లో పరాగ్ పారిఖ్ లిక్విడ్ ఫండ్ కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. సెల్ప్ ఇన్వెస్ట్ పేరిట మొబైల్, వెబ్ యాప్‌లూ అందిస్తున్నామన్నారు. -
ఈఎల్ఎస్ఎస్ తక్షణమే ఆరంభిస్తే మంచిది
ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను ఆదాకు ఉపకరించే ఈక్విటీలింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అవుతుంది. ఏప్రిల్ నుంచి ఆరంభించి మార్చి వరకు క్రమానుగతంగా ప్రతీ నెలా ఎంపిక చేసుకున్న ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏడాది చివర్లో ఆందోళన పడక్కర్లేదు. పైగా ఎంపిక విషయంలో పొరపాట్లకు అవకాశం లేకుండాచూసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో మంచి పనితీరు కలిగిన పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ సహా పలు ఫండ్స్ ఉన్నాయి. పన్ను ఆదా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తం పెట్టుబడులపై పన్ను మినహాయింపు అవకాశం ఉంటుంది. సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పథకాల్లో ఈఎల్ఎస్ఎస్ కూడా ఒకటి. అన్ని పన్ను ఆదా సాధనాల్లోనూ తక్కువ లాకిన్ పీరియడ్ (మూడేళ్లు) ఉన్నది కూడా ఈఎల్ఎస్ఎస్లోనే. పైగా ఈక్విటీల్లో పెట్టుబడులకు అవకాశం. మార్కెట్ క్యాప్‌తో సంబంధం లేకుండా మంచి రాబడులకు అవకాశం ఉన్న కంపెనీలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఈ ఫండ్స్ మేనేజర్లకు ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల లక్ష్యాలకు సరిపడా సంపదను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. డివిడెండ్ ఆప్షన్ ఎంచుకుంటే వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సమయంలో వచ్చే లాభం రూ.1 లక్ష వరకు పన్ను ఉండదు. అంతకుమించితే ఆ మొత్తంపై కేవలం 10 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రతీ నెలా రూ.12,500 మొత్తాన్ని సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే 12 నెలల్లో మొత్తం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టవుతుంది. పన్ను ప్రయోజనం పరంగా ఇది అత్యుత్తమ విధానం. సరైన పథకం ముఖ్యంగా పన్ను ఆదా ప్రయోజనం ఒక్కటే ప్రాముఖ్యం కాదు. మంచి రాబడులను ఇచ్చే పథకాన్ని ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యమే. ఆ విధంగా చూసినప్పుడు దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల చరిత్ర ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో చూడొచ్చు. మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో సగటున స్థిరమైన రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో వార్షికంగా 10.54 శాతం, పదేళ్లలో వార్షికంగా 14.3 శాతం చొప్పున రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. -
ఆర్థికంగా వెలిగిపోదాం!
నూతన ఆర్థిక సంవత్సరం 2019–20లోకి ప్రవేశించి మూడు వారాలు గడిచిపోయింది. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, వ్యయాలకు తోడు పన్ను బాధ్యతలు ఎదురవుతుంటాయి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఓ ప్రణాళిక రూపొందించుకుని దానిని ఆచరణలో పెడితే ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జీవనం కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ఏడాదికి ఒకసారి అయినా తప్పకుండా సమీక్షించాలని, అందుకు ఏప్రిల్ మాసం సరైనదిగా నిపుణుల అభిప్రాయం. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి తమ పెట్టుబడులకు సంబంధించి అనుసరించ తగిన మార్గాలపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్లో సిప్ ఏప్రిల్ నుంచే పన్ను ఆదాకు ఉపయోగపడే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ప్రతీ నెలా పెట్టుబడుల ప్రణాళికను ఆరంభించాలి. దీంతో ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా పెట్టుబడుల గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి రాదని తమన్నావర్మ అనే ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచించారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే రిస్క్‌లే ఈఎల్ఎస్ఎస్కు వర్తిస్తాయి. కనుక ప్రతీ నెలా క్రమం తప్పకుండా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆటుపోట్లను అధిగమించి మెరుగైన రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ స్వల్పకాలిక పనితీరు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఒక్కసారి ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లు లాకిన్ అయినట్టే. అయితే, ఇది మెరుగైన రాబడులకు వీలు కల్పిస్తుంది. వాలంటరీ పీఎఫ్ (వీపీఎఫ్) ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) పథకం పరిధిలో ఉన్న వారికి అందు బాటులో ఉన్న చక్కని సాధనం వీపీఎఫ్. ఈపీఎఫ్‌కు అనుబంధంగా సభ్యులు చేసే స్వచ్ఛంద కంట్రిబ్యూషన్. ఈపీఎఫ్‌కు వర్తించే పన్ను మినహాయింపులు వీపీఎఫ్‌కూ వర్తిస్తాయి. సెక్షన్ 80సీ కింద 1.5 లక్షల వరకు పెట్టబడులకు వీపీఎఫ్ చందాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. అలాగే, రాబడులు, ఉపసంహరణలపైనా పన్ను ఉండదు. కనుక మూడు రకాల పన్ను ఆదా ప్రయోజనాలు వీపీఎఫ్‌తో పొందొచ్చు. ఈపీఎఫ్ చందాలకు అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ చెల్లుబాటు అవుతుంది. పీపీఎఫ్‌లోనూ ఇదే మాదిరి పన్ను ఆదా ప్రయోజనాలున్నప్పటికీ ఈపీఎఫ్‌తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువ. డెట్‌లో పెట్టుబడులకు వీపీఎఫ్ మెరుగైన మార్గం. వేతనం బ్యాంకు ఖాతాలో జమ కావడానికి ముందే వీపీఎఫ్ చందాను ఉద్యోగ సంస్థ మినహాయించడం చెల్లింపుల కోణంలో సానుకూలం. ఇంక్రిమెంట్ కూడా... ఏటా ఏప్రిల్‌లో ఇంక్రిమెంట్లు పడుతుంటాయి. అంటే ఆదాయం పెరిగినట్టే. పెరిగిన వేతనానికి తగ్గట్టే పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకోవాలని నిపుణుల సూచన. చాలా మంది ఎప్పటి మాదిరే మ్యూచువల్ ఫండ్స్ సిప్ కొనసాగిస్తుంటారని, పెరిగిన వేతనం మేరకు పెట్టుబడులను పెంచుకునే వారు తక్కువేనంటున్నారు. కనుక ఈ విధమైన పొరపాట్లకు తావివ్వకుండా ఏప్రిల్ నుంచే సిప్ మొత్తాలను పెంచుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన ఇంక్రిమెంట్లో కనీసం 20 శాతాన్ని అయినా పెట్టుబడుల వైపు మళ్లించాలన్నది సూచన. రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. దేశంలో ఎవరైనా సరే ఈ పథకంలో చేరి 60 ఏళ్ల వరకు చందాలు చెల్లిస్తూ వెళ్లొచ్చు. విశ్రాంత జీవన అవసరాల కోసం ఉద్దేశించినది ఈ పథకం. గడువు తీరిన తర్వాత 60% మొత్తాన్ని పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. మిగిలిన 40%తో పెన్షన్ యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తంపై అప్పటి రేటు ప్రకారం పెన్షన్ అందుతుంది. ఈ పథకంలో గరిష్టంగా ఈక్విటీలకు 75% కేటాయింపులు చేసు కోవచ్చు. ఇప్పటికీ ఎన్పీఎస్ ఖాతా తెరవని వారు, ప్రారం భించేందుకు ఏప్రిల్ అనువైనది. నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉండి, కేవైసీ నిబంధనలను ఇప్పటికే పూర్తి చేసిన వారు ఆన్లైన్లోనే ఎన్పీఎస్ ఖాతాను తెరవొచ్చు. ఎన్పీఎస్ పోర్టల్‌కు వెళ్లి అక్కడి సూచనలను అనుసరించండి. పెట్టుబడులకూ ఓ లెక్క... ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక మొత్తాన్ని ఏప్రిల్ నెలలోనే అమలు చేసేయాలని, లేదా మార్చిలో చేయాలనుకోవడం కూడా సరికాదు. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది కనుక, ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ రానుంది. అందులో ఏవైనా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆ మార్పులకు అనుగుణంగా ప్రణాళికను కూడా మార్చుకోవాల్సి రావచ్చు. కనుక ఒకేసారి పెట్టుబడులకు దూరంగా ఉండాలి. క్రమానుగత పెట్టుబడులే ఉత్తమం. ఏడాది పొడవునా పెట్టుబడులను కొనసాగించడం వల్ల మార్పు, చేర్పులకు అవకాశం ఉంటుందని పీక్ ఆల్ఫా ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రియా సుందర్ పేర్కొన్నారు. దీనివల్ల మరింత ప్రయోజనం ఉండే పన్ను ఆదా పథకాలను ఎంచుకునేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. టీడీఎస్... బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 మించితే టీడీఎస్‌ను గతంలో అమలు చేసే వారు. దీన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రూ.40,000కు పెంచారు. అదే 60 ఏళ్లు దాటిన వారికి 50,000 వడ్డీ ఆదాయంపై టీడీఎస్ ఉండదు. ఒకవేళ వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో 40,000–50,000 మించినట్టయితే, అదే సమయంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ.2.5 లక్షలు మించని వారు టీడీఎస్ లేకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఫామ్ 15హెచ్/15జీ ఇవ్వాలి. పన్నుల్లో మార్పులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించిన మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పన్ను పరంగా కొన్ని మార్పులు చేసింది. నూతన ఆర్థిక సంవత్సరం మొదలైంది కనుక మరోసారి వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. రూ.5 లక్షలకు పన్ను లేదు రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కనీస మినహాయింపు రూ.2.5 లక్షల ఆదాయానికి ఆదాయపన్ను లేదన్న విషయం తెలిసినదే. దీనికి అదనంగా మరో రూ.2.5 లక్షల ఆదాయం ఉన్న వారు 5 శాతం పన్ను రేటు ప్రకారం రూ.12,500ను చెల్లించాల్సి ఉండేది. అయితే, సెక్షన్ 87 కింద 12,500 వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. కనుక రూ.2.5 లక్షలపైన ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించేంత ఆదాయం లేకపోయినప్పటికీ రిటర్నులు సమర్పించడం తప్పనిసరి. ప్రామాణిక మినహాయింపు ప్రామాణిక మినహాయింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.40,000 నుంచి రూ.50,000కు పెరిగింది. 2018లో ఈ స్టాండర్డ్ డిడక్షన్‌ను కేంద్రం తిరిగి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో ట్రాన్స్పోర్ట్, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌పై మినహాయింపులను ఎత్తివేసింది. నోషనల్ రెంట్‌పై అద్దెలేదు పన్ను చెల్లింపుదారుల పేరిట రెండో ఇల్లు ఉండి, దానిపై అద్దె ఆదాయం ఏదీ లేకపోయినా నోషనల్ రెంట్ (ఊహాజనిత) పేరుతో పన్ను వేసే వారు. అయితే, 2019–20 నుంచి ఈ తరహా నోషనల్ ఆదాయంపై పన్ను లేదు. టీడీఎస్ పరిమితి పెంపు వడ్డీ ఆదాయం ఏటా రూ.10,000 దాటితే మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్)ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పోస్టాఫీసు అమలు చేసేవి. కాకపోతే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.40,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అమలు చేయరు. అంతకుమించితేనే అమలు చేస్తారు. 60 ఏళ్లు దాటిన వారికి ఇది రూ.50,000గా అమలవుతుంది. ఇంటిపై క్యాపిటల్ గెయిన్స్ ఇల్లు అమ్మగా వచ్చిన మూలధన లాభంపై పన్ను చెల్లించడానికి బదులు ఆ మొత్తంతో మరో ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఇకపై ఒక ఇంటి విక్రయంపై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభంతో (ఎల్టీసీజీ) రెండు ఇళ్లు కొనుగోలు చేసినా గానీ పన్ను చెల్లించక్కర్లేదు. గతంలో ఇది ఒక్క ఇంటికే పరిమితమైంది. కాకపోతే ఎల్టీసీజీ రూ.2 కోట్లకు మించకుండా ఉంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అత్యవసర నిధి ప్రతీ కుటుంబానికీ అత్యవసర నిధి ఎంతో అవసరం. కనీసం 4–6 నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద సమకూర్చి పెట్టుకోవాలని నిపుణుల సూచన. ఒకవేళ అత్యవసర నిధి ఇప్పటికీ సమకూర్చుకోని వారు ఆలస్యం చేయకుండా వెంటనే లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఆరంభించుకోవాలి. -
యుక్త వయస్సు నుంచే ఇన్వెస్ట్మెంట్..
రిటైర్మెంట్ తర్వాత చాలా మంది ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటోందని నివేదికలు చెబుతున్నాయి. పొదుపు చేసిన డబ్బు తక్కువగా ఉండటం వల్ల.. యాభైలు, అరవైలలో ఉన్న వారు భారీగా వ్యయాలు తగ్గించుకోవడం... అప్పటిదాకా అలవాటుపడిన జీవన విధానాలను మార్చుకోవడం చేసుకోక తప్పడం లేదు. చేతిలో డబ్బు ఉన్నప్పుడు.. అనుభవించేంత తీరిక ఉండటం లేదు. తీరా తీరిక దొరికేసరికి చేతిలో డబ్బు ఉండటం లేదు. చాలా మంది తమ పిల్లలో లేదా బంధువుల మీదో ఆధారపడాల్సిన పరిస్థితుల్లోనే ఉంటున్నారు. ఇలాంటిది ఎదురు కాకూడదంటే.. సింపుల్ పరిష్కారం ఉంది. అదేంటంటే.. యుక్త వయస్సు నుంచే ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టడం. మరీ రక్షణాత్మక వైఖరి వద్దు.. సరైన పెట్టుబడి సాధనంలో ఇన్వెస్ట్ చేయడం అన్నింటికన్నా ముఖ్యం. రిస్కులు ఎదుర్కొనడానికి ఇష్టపడక మనలో చాలా మంది తక్కువ రిస్కు ఉండే ఫిక్సిడ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ (పీపీఎఫ్)లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనివల్ల అధిక రాబడులు వచ్చే అవకాశాలను పోగొట్టుకోవడం అవుతుంది. రిస్కు ఉన్నా రిటైర్మెంట్ వంటి అవసరాల కోసం దీర్ఘకాలంలో అధిక రాబడులిచ్చే సాధనాలను ఎంచుకోవడం మంచిది. జీతం అనేది ఎలాగూ ఫిక్సిడ్ ఆదాయమే. కాబట్టి పొదుపు మొత్తాల్లో కొంత భాగాన్ని ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ఉదాహరణకు 2018 మార్చి ఆఖరు నాటికి పదిహేనేళ్ల వ్యవధిలో పీపీఎఫ్ వార్షిక రాబడి 8.25 శాతంగా ఉంది. అదే నిఫ్టీ 500 టీఆర్ఐని తీసుకుంటే.. దాదాపు రెట్టింపు స్థాయిలో 15.46 శాతం స్థాయిలో రాబడులిచ్చింది. (ఐసీఆర్ఏ ఆన్లైన్–ఎంఎఫ్ఐ ఎక్స్‌ప్లోరర్ గణాంకాల ప్రకారం). పన్ను ఆదా ప్రయోజనాలూ ఉంటాయి.. ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పన్నుపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వివిధ సాధనాల్లో చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఏటా రూ. 1.5 లక్ష దాకా పన్నుపరమైన మినహాయింపులు ఉంటున్నాయి. పీపీఎఫ్, నేషనల్ పెన్షన్స్ స్కీమ్, పోస్టాఫీస్ డిపాజిట్ 5 ఏళ్ల బ్యాంక్ డిపాజిట్, ఎల్ఐసీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్ఎస్ఎస్), రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ (తొలిసారిగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి) మొదలైన సాధనాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇవన్నీ కూడా పన్నుపరంగా దాదాపు ఒకే తరహా ప్రయోజనాలు ఇస్తాయి. మరి రిస్కులు, రాబడులను బేరీజు వేసుకుంటే.. వీటన్నింటిలో నుంచి దేన్ని ఎంచుకోవాలి. ఇదిగో.. ఇక్కడే ఈఎల్ఎస్ఎస్ పరిష్కారమార్గంగా ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ వర్సెస్ మిగతా సాధనాలు.. ట్యాక్స్ సేవింగ్ సాధనాలతో రూ. 1.5 లక్షల దాకా పన్ను మినహాయింపు లభిస్తోంది (ఎన్పీఎస్ కాకుండా). ఇదే మొత్తాన్ని రెండు దశాబ్దాల పాటు ఇన్వెస్ట్ చేస్తే.. మొత్తం రూ. 30 లక్షలు పెట్టుబడి అయినట్లవుతుంది. ఈ మొత్తాన్ని పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో 2018 ఆఖరు నాటికి సగటున 8.31 శాతం వార్షిక రాబడితో రూ. 75.47 లక్షలు అవుతుంది (1998 నుంచి ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం). ఇది ఆకర్షణీయమైన మొత్తమే. అయితే, వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందనుకోవడానికి లేదు. ఇక ఏటా రూ.1.5 లక్షలను ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ (నిఫ్టీ 500 టీఆర్ఐ రాబడుల ప్రకారం)లో ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టిన రూ. 30 లక్షలు కాస్తా ఏకంగా రూ. 1.77 కోట్లు అవుతుంది. అంటే పీపీఎఫ్ పోర్ట్‌ఫోలియో విలువ కన్నా 2.4 రెట్లు అధికం. మరో మాటలో చెప్పాలంటే.. మీకు సగటున వార్షిక రాబడి దాదాపు 19.71 శాతం మేర వచ్చినట్లు లెక్క. ఈ 20 ఏళ్ల వ్యవధిలో స్టాక్ మార్కెట్లు రెండు సార్లు భారీగా పతనమైనప్పటికీ.. ఈ స్థాయి రాబడులు అందించడం గమనార్హం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒకవైపు పన్ను పోటును తప్పించుకోవడంతో పాటు మరోవైపు కోటీశ్వరులే అయి ఉండేవారు. మిగతా మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్స్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మటుకు ఫండ్స్ దీర్ఘకాలంలో మెరుగ్గానే రాణిస్తున్నాయి. ఈ ఫండ్స్ ద్వారా వచ్చే రాబడులపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గానీ, డివిడెండ్స్ మీద ట్యాక్స్ గానీ ఉండదు. మిగతా ట్యాక్స్ ఆదా చేసే సాధనాలతో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్ లాకిన్ పీరియడ్ కూడా చాలా తక్కువగా మూడేళ్లే ఉంటుంది. ఇలా ఇన్వెస్ట్ చేయొచ్చు.. సరిగ్గా ఆర్థిక సంవత్సరం ఆఖర్లో పన్ను పోటును తగ్గించుకునే వ్యూహాలపై కసరత్తు చేయకుండా.. ముందు నుంచే కాస్త జాగ్రత్తపడితే మంచిది. ఆఖర్లో ఏకమొత్తంగా ఒకేసారి పెట్టడం కాకుండా.. ప్రతి నెలా కొంత కొంతగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి దేంటంటే.. ఆఖరు నెలల్లో ఆర్థికపరమైన ఒత్తిళ్లు తగ్గించుకోవచ్చు. ఇక రెండోది.. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుంది. ముందుగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగిలినది మాత్రమే ఖర్చులకు ఉపయోగించుకోవడం అలవాటవుతుంది. చివరగా మూడో దాని సంగతికొస్తే.. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయడం వల్ల వేర్వేరు రేట్లకు ఫండ్ యూనిట్స్ కొనుగోలు చేయొచ్చు. మార్కెట్ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. ఈ రకంగా సగటు కొనుగోలు రేటును తగ్గించుకోవచ్చు. ఫలితంగా లాభాలు కూడా దానికి అనుగుణంగానే పెంచుకోవచ్చు. -
ఆఖరి నిముషంలో ఈ తప్పులొద్దు
పన్ను ఆదా కోసం... పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు, యులిప్‌లు, ఈఎల్ఎస్ఎస్లు... వీటిల్లో ఏది అన్న ఎంపిక అంత సులభం కాదు. మార్చి 31తో పన్ను ఆదా కోసం పెట్టుబడులకు గడువు ముగిసిపోతోంది. ఈ స్వల్ప వ్యవధిలోనే పన్ను ఆదా కోసం ఎంత మేర ఇన్వెస్ట్ చేయాలి, అదే సమయంలో మీరు ఆశించే రాబడులు ఏ పథకంలో వచ్చే అవకాశం ఉంది వంటి అంశాల ఆధారంగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవడం క్లిష్టమైనదే. ప్రస్తుతానికి మీకు పన్ను ఆదా చేయాలి, అదే సమయంలో దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు తెచ్చిపెట్టాలి... అప్పుడే మీరు ఎంచుకున్న సాధనం మీకోసం పనిచేసినట్టు అవుతుంది. ఒకటికి మించిన సాధనాలు ఉన్న నేపథ్యంలో కాస్త ముందే మీ ఆదాయం, మీ రిస్క్, మీ రాబడులు, మీ లక్ష్యానికి ఉన్న కాలం ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రణాళిక డిజైన్ చేసుకోవాలి. ముందు నుంచే ఓ పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలని ఆర్థిక నిపుణుల సలహా. ఇన్వెస్టర్లు ముందస్తు ప్రణాళిక లేకుండా, చివరి నిమిషాల్లో చేసే పెట్టుబడుల్లో పొరపాట్లు చేస్తుంటారు. సంపద సృష్టికి ఇవి విఘ్నాలుగా మారకుండా చూసుకోవాలంటే... వీటిని ఫాలో అయిపోతే బెటర్... ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక లేకుండా... ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యతలు వ్యక్తికీ, వ్యక్తికీ వేర్వేరుగా ఉంటాయి. వీటికి అనుగుణంగా పెట్టుబడి మొత్తం, అనువైన పన్ను సాధనాలను ఎంచుకోవాలి. కొన్ని పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనాన్ని కల్పించేది ప్రజల్ని పొదుపు, మదుపుల దిశగా ప్రోత్సహించేందుకే. ముం దు మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకున్న తర్వాత, వాటిని చేరుకునేందుకు ఉపయోగపడే సాధనాలను ఎంపిక చేసు కుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. అందుకే పెట్టుబడుల ప్రణాళిక అన్నది చాలా జాగ్రత్తగా చేసుకోవా ల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తుంటా రు. ఇందులో విఫలమైతే అంచనాలు కూడా తప్పుతాయని మరువద్దు. ఆలస్యం చేయకుండా... ఆర్థిక సంవత్సరం చివరి వరకు పన్ను ఆదా పెట్టుబడుల కోసం వేచి చూడొద్దు. ఎందుకంటే పెట్టుబడి నిర్ణయాలను ఆఖరి సమయంలో హడావుడిగా తీసుకుంటే పెద్ద తప్పులకు దారితీయవచ్చు. ‘‘గడువు సమీపిస్తున్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ ఆరాటపడాల్సి వస్తుంది. సరైన సమయం లేకపోవడంతో వారు తమ లక్ష్యాలు, రిస్క్‌ను విశ్లేషించి, తగిన సాధనాన్ని ఎంచుకోవడం సాధ్యం కాదు’’ అని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ హెడ్ లవ్‌కుమార్ తెలిపారు. సరైన సాధనం ఎంచుకోకపోతే... మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సరిపడని ఏ పెట్టుబడి అయినా మీ ఆర్థిక భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. ఇక సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా కోసం ఎంపిక చేసుకున్న సాధనంలో, గడువు తీరిన తర్వాత వచ్చే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉంటే అది నష్టాన్ని కలిగిస్తుంది. మీరు పొదుపు చేసిన దానితో పోలిస్తే భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అత్యవసర నిధి జోలికెళ్లొద్దు... ఇక పన్ను ఆదా సాధనాల కోసం చేతుల్లో తగినంత లేక అత్యవసరాల కోసం పక్కన పెట్టిన నిధిని వాడుకునేవారూ ఉన్నారు. ఇలా చేస్తే గనుక ఆ తర్వాత ప్రాణావసరం ఎదురైతే చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పన్ను ఆదా పథకాలన్నీ కూడా దీర్ఘకాలానికి ఉద్దేశించినవే. పైగా వీటిల్లో పెట్టుబడులకు మూడేళ్లు, ఆపైనే లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో నిధుల కొరత ఏర్పడుతుంది. దీంతో రుణాలను ఆశ్రయించాల్సి రావచ్చు. ఇదే జరిగితే మీ ఆర్థిక ప్రణాళిక మరింత ఒత్తిడిలోకి వెళ్లినట్టే అవుతుంది. తొందరపాటుతో అధిక రిస్క్ ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా చేసుకోవాలన్న తొం దర్లో మీ స్థాయికి మించిన రిస్క్ ఉండే సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి... అప్పుడు మీ పెట్టుబడిలో గణనీయ మొత్తాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మార్కె ట్ అస్థిరతల భయంతో లాకిన్ తీరిన వెంటనే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే ఇదే జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఒకేసారి... రిస్కీ సాధనంలో ఏక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల, క్రమానుగత పెట్టుబడులతో పోలిస్తే మరింత రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీ మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఒకేసారి కాకుండా సిప్ రూపంలో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. దీనివల్ల కొనుగోలు ధర యావరేజ్ అవుతుంది. దీంతో రిస్క్ తగ్గుతుంది. ఇక సమయం లేక, ఆర్థిక సంవత్సరం చివరి మాసంలో ఉంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం తప్ప మరో పరిష్కారం లేదు. గతమూ కొలమానమే పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పథకాలు అంతకుముందు కాలంలో ఏ విధంగా రాబడులు ఇచ్చాయన్న అధ్యయనం తప్పకుండా చేయాలి. అలా చూసినప్పుడు మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపడే పథకాలను ఎంచుకోవడం సాధ్యపడుతుంది. అంతేకాదు రిస్క్‌ను కూడా తగ్గించుకున్న వారవుతారు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ పథకాల గత పనితీరు ఓ అంచనా కోసమే గానీ, వాటిపైనే పూర్తిగా ఆధారపడడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఓ మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకునే ముందు మార్కెట్ పతనాల్లో సంబంధిత ఫండ్ మేనేజర్ ఏ విధంగా వ్యవహరించారు, అదే సమయంలో మార్కెట్ ర్యాలీల్లో ఎంత మేర ఆల్ఫా రిటర్నులు తీసుకొచ్చారన్నది పరిశీలించడం మంచిదేనని లవ్‌కుమార్ తెలిపారు. డైవర్సిఫికేషన్ లేకుండా... ఇక పన్ను ఆదా కోసమని మొత్తం పెట్టుబడులన్నింటినీ ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా సరైనది కాదు. ఉదాహరణకు సెక్షన్80సీ కింద రూ.1.5 లక్షల మొత్తాన్ని ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువగా తీసుకున్నట్టు అవుతుంది. దీనికంటే ప్రతీ సాధనంలోని సదుపాయాలను పరిశీలించి భిన్న సాధనాలతో కూడిన వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఇక ఈఎల్ఎస్ఎస్ పథకాల విషయంలో గ్రోత్ ఆప్షన్‌కు బదులు డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం దీర్ఘకాలంలో సంపద సృష్టికి విరుద్ధమని, అలాగే, క్లోజ్ ఎండెడ్ పథకాలు కూడా సూచనీయం కాదన్నది నిపుణుల విశ్లేషణ. సమీక్ష మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరగొచ్చు... లేదా ఆదాయం పెరగొచ్చు... ఇటువంటి మార్పులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక కూడా మారాలి. అలా కాకుండా పాత ప్రణాళికనే పాటిస్తుండడం వల్ల చాలా ఆర్థిక లక్ష్యాలకు దూరంగా ఉండిపోవాల్సి రావచ్చు. పర్యవేక్షణ పెట్టుబడులు పెట్టేయడంతో పనైపోదు. మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాలి. మీ లక్ష్యాలను చేరుకునే దిశగానే వాటి రాబడులు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. వాటి పనితీరు ఆధారంగా అవసరమైతే అదనంగా పెట్టుబడి పెంచుకోవడం లేదా ఉన్న వాటిల్లో తొలగింపులు చేసుకోవాల్సి ఉంటుంది. ‘‘తప్పులను తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్లు ఓపిక వహించాలి. అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నా సరే. ఇతరులను అనుసరించొద్దు. భావోద్వేగాలతో కూడిన ఇన్వెస్టింగ్ నష్టాలకు దారితీస్తుంది’’ అని లవ్‌కుమార్ సూచించారు. ‘‘ఎక్కువ మంది ఈఎల్ఎస్ఎస్ పథకాల విషయంలో చేసే తప్పిదం జనవరి/ఫిబ్రవరి వరకు వేచి ఉండడమే. హెచ్ఆర్ విభాగం అడిగిన తర్వాతే పన్ను ఆదా పథకాల గురించి అన్వేషణ మొదలవుతుంది. చక్కని ప్రణాళికతో కూడిన సిప్... చివరి నిమిషాల్లో ఇబ్బందులను తప్పించడంతోపాటు మంచి రాబడులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది’’ – ప్రసన్న పాఠక్, టారస్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫండ్ మేనేజర్ -
ఈఎల్స్‌కు బదులు గౌరవ వేతనం
సాక్షి, హైదరాబాద్ : 2016–17 విద్యా సంవత్సరం వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించినందుకుగాను ఉపాధ్యాయులకు గౌరవ వేతనం మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 25,109 మంది టీచర్లకు గౌరవ వేతనం కింద రూ.2.75 కోట్లను మంజూరు చేశారు. అయితే టీచర్లకు డైలీ అలవెన్స్ అయిన రూ.225లో పన్నెండో వంతు(రూ.22.40) మొత్తాన్ని రోజుకు మంజూరు చేశారని, ఇది తమను అవమానించడమేనని వివిధ ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. తాము వేసవి సెలవుల్లో పని చేసినందుకు ఎర్న్డ్ లీవ్స్ ఇవ్వాలని అడిగితే ముష్టి వేసినట్లు నామమాత్రం డబ్బు మంజూరు చేసి అవమానించారని విమర్శించాయి. వెకేషన్ డిపార్టుమెంట్ అయిన విద్యా శాఖలో పనిచేసే టీచర్లు వేసవి సెలవుల్లో పనిచేస్తే నిబంధనల ప్రకారం ఈఎల్స్ ఇవ్వాలని పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, రవి, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, సదానంద్‌గౌడ్, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంజిరెడ్డి, చెన్నయ్య, టీఆర్టీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, డీటీఎఫ్ అధ్యక్షుడు రఘుశంకర్‌రెడ్డి, టీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి రఘునందన్ పేర్కొన్నారు. ఇది ఉపాధ్యాయుల శ్రమను దోపిడీకి గురి చేయడం లాంటిదేనని విమర్శించారు. తమను దినసరి కూలీల్లా చూస్తూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. -
మెరవని గోల్డ్ ఈటీఎఫ్‌లు
► ఏప్రిల్–ఆగస్టు మధ్య రూ.300 కోట్లు బయటకు! ► నిధుల ఆకర్షణలో ఈఎల్ఎస్ఎస్ గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) తమ కాంతిని కోల్పోవడం కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఇన్వెస్టర్లు రూ.300 కోట్ల మేర గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి వెనక్కు తీసుకున్నారు. గోల్డ్ ఈటీఎఫ్లకన్నా ఈక్విటీల పనితీరు బాగుండటమే దీనికి కారణమన్నది విశ్లేషణ. తాజా గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలను చూస్తే... ♦ గడచిన నాలుగు సంవత్సరాలుగా గోల్డ్ ఈటీఎఫ్‌లు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. 2013–14లో రూ.2,293 కోట్లు ఈటీఎఫ్‌ల నుంచి వెనక్కు మళ్లింది. 2014–15 సంవత్సరం లో ఈ మొత్తం రూ.1,475 కోట్లుగా ఉంది. 2015–16లో రూ.903 కోట్లుకాగా, 2016–17లో రూ.775 కోట్లు. అయితే బయటకు వెళుతున్న మొత్తం తగ్గుతుండటం కొంత ఊరట. ♦ గోల్డ్ ఈటీఎఫ్‌ల పరిస్థితి ఇలా ఉంటే, ఈక్విటీ, ఈక్విటీ అనుసంధాన పొదుపు స్కీమ్‌లలోకి (ఈఎల్ఎస్ఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో రూ.61,000 కోట్లు వచ్చాయి. ఒక్క చివరి నెల వాటా ఇందులో రూ.20,000 కోట్లు ♦ యాంఫి (అసోచామ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య 14 గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్‌ల నుంచి దాదాపు రూ.300 కోట్ల నికర మొత్తం వెనక్కు మళ్లింది. మార్చి ముగిసే నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ కింద (ఏయూఎం) రూ.5,480 కోట్లు ఉంటే ఈ మొత్తం ఆగస్టు ముగిసే నాటికి రూ.5,189 కోట్లు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.462 కోట్లు. -
కరిగిపోతున్న పసిడి ‘పెట్టుబడులు’
ఏప్రిల్ – జూలై మధ్య గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రూ.256 కోట్లు బయటకు... న్యూఢిల్లీ: పెట్టుబడుల రూపంలో పసిడి ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య వెలవెలబోయింది. ఈ కాలంలో 14 గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రూ. 256 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అంటే ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి 14 ఈటీఎఫ్ హౌస్ వద్ద నిర్వహణలో ఉన్న మొత్తం పసిడి పెట్టుబడుల విలువ మార్చిలో దాదాపు 5,354 కోట్ల వద్ద ఉంటే, ఈ మొత్తం జూలై ముగిసే నాటికి రూ.5,098 కోట్లకు పడిపోయింది. దీనికన్నా ఈక్విటీలే మంచిదని ఈ కాలంలో ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని ముఖ్యాంశాలు... నెలవారీగా విత్‌డ్రాయెల్స్ చూస్తే... ఏప్రిల్‌లో రూ.66 కోట్లు, మేలో రూ.71 కోట్లు, జూన్‌లో రూ.81 కోట్లు, జూలైలో 38 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది చిట్టచివరిసారి రూ.20 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. అటు తర్వాత నుంచీ నికరంగా విత్‌డ్రాయెల్స్ కొనసాగుతున్నాయి. ఇక ఈక్విటీ, ఈక్విటీ సంబంధ పొదుపు పథకాల్లో (ఈఎల్ఎస్ఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కాలంలో (ఏప్రిల్–జూలై) రూ.41,000 కోట్లకుపైగా వచ్చి చేరాయి. ఈ కాలంలో స్టాక్ మార్కెట్ మంచి ఊపుమీద ఉండడం గమనార్హం. అమెరికా వడ్డీరేట్ల పెంపు, 2018 నాటికి యూరోప్‌లో కూడా ఉద్దీపనలు వెనక్కు తీసుకునే అవకాశాలు పసిడిపై పెట్టుబడులకు సంబంధించి కొంత ప్రతికూల ప్రభావం చూపే అంశాలని ఫండ్స్ ఇండియా. కామ్‌లో పనిచేస్తున్న ఎంఎఫ్ రీసెర్స్ హెడ్ విద్యా బాల పేర్కొన్నారు. బాల అభిప్రాయం ప్రకారం– యల్లో మెటల్ దిగుమతులు పెరుగుతున్నప్పటికీ, డీమోనిటైజేషన్, డాలర్ మారకంలో రూపాయి బలోపేతం వంటి అంశాలు పసిడి ధరను పెరక్కుండా అడ్డుకుంటున్నాయి. ఈ ఏడాది జూన్ వరకూ పసిడి దిగుమతుల పరిమాణాన్ని చూస్తే, ఇది 2016లో మొత్తం దిగుమతుల పరిమాణాన్ని అధిగమించింది. ఆశలూ ఉన్నాయ్..! భారత మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం– వార్షికంగా చూస్తే... గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల విషయంలో కొంత ఆశాజనకంగా ఉంది. ఇక్కడ నుంచి బయటకు వెళుతున్న డబ్బు క్రమంగా తగ్గుతూ వస్తుండడమే దీనికి కారణం. 2013–14లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి భారీగా రూ.2,293 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. 2014–15లో ఈ మొత్తం రూ.1,475 కోట్లకు తగ్గగా, అటు తరువాత సంవత్సరాల్లో ఈ మొత్తాలు తగ్గుతూ రూ.903 కోట్లు (2015–16), రూ.775 (2016–17)కోట్లకు దిగివచ్చాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య ఈటీఎఫ్ నుంచి రూ. 256 కోట్లు బయటకు వెళ్లిపోతే, గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం ఏకంగా భారీ మొత్తంలో రూ.411 కోట్లుగా ఉంది. -
పన్ను కోతలకు చెక్ పెడదాం !
♦ పెట్టుబడి, పన్ను ఆదా రెండూ చేయొచ్చు ♦ ఈ రెండింటికీ వీలుగా బోలెడన్ని సాధనాలు ♦ బీమా పాలసీలు, ఈఎల్ఎస్ఎస్, ఫిక్స్డ్ డిపాజిట్లు ♦ గృహ రుణంతోనూ పన్ను ప్రయోజనాలు ♦ కొత్త సంవత్సరానికి ముందే ప్లాన్ చేస్తే బెటర్ ♦ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ రెగో సూచన కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేసింది. ప్రతిసారీ వస్తూ వస్తూ... ఓ వైపు ఇన్వెస్ట్మెంట్కి మరోవైపు పన్నులు ఆదా చేసుకునేందుకు అనువైన సాధనాలను అన్వేషించండంటూ గుర్తు చేస్తుంది. కాలం గుర్తు చేయకున్నా... కంపెనీలు మాత్రం గుర్తు చేస్తుంటాయి. ఇప్పటికే యాజమాన్యాలు ఈ ఏడాది మీరు ఏఏ పన్ను మినహాయింపు సాధనాల్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారో చెప్పండంటూ ఉద్యోగుల్ని అడుగుతున్నాయి. అందుకే... ఈ ఏడాది ట్యాక్స్ ప్రయోజనాలు కల్పించేందుకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాధనాల గురించి ఒకసారి తెలుసుకుందాం. సెక్షన్ 80 సి పెట్టుబడి సాధనాలు సెక్షన్ 80 సి కిందకి వచ్చే పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మొత్తం మీద రూ.1,50,000 వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. 80 సి పరిధిలోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అనేకం ఉన్నాయి. ఇటు పెట్టుబడికి, అటు పన్ను ఆదాకు ఉపయోగపడే అటువంటి సాధనాల్లో కొన్ని ఇవి. ఈఎల్ఎస్ఎస్ లేదా ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీము ఈఎల్ఎస్ఎస్ స్కీములు పన్ను ఆదా ప్రయోజనాలు అందించే మ్యూచువల్ ఫండ్ సాధనాలు. వీటిలో మూడేళ్ల లాకిన్ వ్యవధి ఉంటుంది. నెల నెలా సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) రూపంలో చిన్న మొత్తాలు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మెరుగైన రాబడులు పొందవచ్చు. కొన్ని మంచి ఈఎల్ఎస్ఎస్ స్కీములు సుమారు 15 శాతం దాకా వార్షిక రాబడులు ఇస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ప న్ను ఆదా చేసే పెట్టుబడి సాధనంగా ఈఎల్ఎస్ఎస్కు మంచి ఆదరణే ఉంది. ట్యాక్స్ సేవింగ్ సాధనాల్లో వీటినీ పరిశీ లించవచ్చు. మనీ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఆర్థిక బాధ్యతలకు సంపూర్ణ బీమా కవరేజీ కల్పించేలా అదనంగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం మంచిదే. లైఫ్ పాలసీ మొదటిసారి తీసుకుంటున్నా లేదా అదనంగా ప్రొటెక్షన్ కోసం తీసుకుంటున్నా .. మనీ బ్యాక్ పాలసీల్లాంటివి ఆకర్షణీయమైన సాధనాలు. ఇవి ఇటు పెట్టుబడికి.. అటు పన్ను ఆదాకు కూడా మెరుగైన సాధనాలే. పేరుకు తగ్గట్లే.. పాలసీ వ్యవధి మధ్య మధ్యలో నిర్దిష్ట మొత్తాన్ని ఈ పాలసీల ద్వారా అందుకోవచ్చు. ఈ డబ్బును ఆ తర్వాత ఇతరత్రా వ్యయాల కోసం వినియోగించుకోవచ్చు లేదా అధిక రాబడులిచ్చే మరో సాధనంలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏ రకంగా చూసినా మనీ బ్యాక్ పాలసీలు శ్రేయస్కరమైనవే. గృహ రుణం గృహ రుణంపై కట్టే అసలు భాగానికి .. సెక్షన్ 80 సి కింద పన్ను ప్రయోజనాలు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే రూ. 2,00,000 దాకా గృహ రుణంపై వడ్డీ మొత్తానికి కూడా సెక్షన్ 24 బి కింద మినహాయింపు లభిస్తుంది. ఈపీఎఫ్ / పీపీఎఫ్ ఉద్యోగుల భవిష్య నిధి లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌కి కట్టే చెల్లింపులపై కూడా ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ మీకు ఇప్పటిదాకా ఈపీఎఫ్ లేదా పీపీఎఫ్ ఖాతా లేని పక్షంలో ఈ ఏడాది ఒకటి తీసుకోవచ్చు. అలా గాకుండా ఇప్పటికే ఖాతా ఉండి ఉంటే.. కట్టే చందా మొత్తాన్ని పెంచుకోవడం ద్వారా నికరంగా మెరుగైన రాబడులు అందుకోవచ్చు. లాకిన్ వ్యవధి నిబంధన కారణంగా.. వైదొలిగేటప్పుడు పెద్ద మొత్తమే చేతికి రాగలదు. ఒకరకంగా ఇది రిటైర్మెంట్ ప్లానింగ్‌కు కూడా ఈపీఎఫ్.. పీపీఎఫ్ పరిశీలించతగినవే. బ్యాంక్ ఎఫ్డీలు అయిదేళ్ల లాకిన్ పీరియడ్‌తో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అత్యంత సులభతరమైన సాధనాల్లో ఇది ఒకటి. ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేసేస్తే సరిపోతుంది. నెల నెలా లేదా ప్రతీ సంవత్సరం కడుతూ పోనక్కర్లేదు. సెక్షన్ 80సి పరిమితి కింద ఇంకా ఇన్వెస్ట్ చేయతగిన డబ్బు చేతిలో ఉంటే అయిదేళ్ల ఎఫ్డీలను ఎంచుకోవచ్చు. సెక్షన్ 80 డి కింద పన్ను ఆదా చేసే సాధనం.. ఆరోగ్య బీమా: ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మీకు, మీ కుటుంబ సభ్యులకు గానీ మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోతే..ఈ ఏడాది దానిపై దృష్టి పెట్టొచ్చు. సొంతానికి, తమ డిపెండెంట్స్‌కి తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలపై రూ. 25,000 దాకా పన్ను మినహాయింపు పొందవచ్చు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ఇది రూ. 30,000 దాకా ఉంటుంది. ఒకవేళ పేరెంట్స్‌కి కూడా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అదనంగా రూ. 25,000 దాకా (సీనియర్ సిటిజన్స్ అయితే రూ. 30,000) పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80 సీసీడీ కింద... ఎన్Sపీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) ఎన్పీఎస్ కింద చేసే పెట్టుబడులపై అదనంగా రూ. 50,000 దాకా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. లాకిన్ వ్యవధి, కఠినమైన పాక్షిక విత్‌డ్రాయల్స్ నిబంధనల కారణంగా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసం నిధి పోగు చేసుకునేందుకు ఈ సాధనాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా.. ఇందులో సదరు మదుపుదారు పెట్టిన పెట్టుబడిలో గరిష్టంగా 50 శాతం దాకా మాత్రమే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతి ఉంది. పన్ను ప్రయోజనాలు కల్పిస్తూ.. సగటు మించి రాబడులు అందించే సాధనాల్లో ఎన్పీఎస్ మెరుగైనదే. ఇందులో వివరించినవే కాకుండా ఇతరత్రా పన్ను ఆదా చేసే ఇన్వెస్ట్మెంట్ సాధనాలు కూడా ఉన్నాయి. అయితే, అవన్నీ వివిధ సాధనాల మేళవింపుగా ఉంటాయి. వీటన్నింటినీ సరిగ్గా ఉపయోగించుకోగలిగితే పోర్ట్‌ఫోలియోపై అధిక రాబడులతో పాటు ఆదాయ పన్ను ప్రయోజనాలూ అందుకోవచ్చు. -
పన్నుకు మందు..లాభాల్లోనూ ముందు!!
► ఈఎల్ఎస్ఎస్లవైపు మదుపరుల మొగ్గు ► చివరి నిమిషం పన్ను ఆదాకోసం వీటివైపు చూపు ► ఐదేళ్లుగా 20 శాతానికిపైగా రాబడులనిస్తున్న పథకాలు ► గడిచిన ఒక్క ఏడాదిలో చూస్తే 30 శాతంపైనే రాబడి ► దీర్ఘకాలానికి ఇవే ఉత్తమమంటున్న నిపుణులు ► ‘సిప్’ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మంచిదని సూచన ► గడిచిన 10 నెలల్లోనే రూ.6వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఇది పన్నుల కాలం. అంటే... ఒకవైపు జీతంలో పన్ను కోతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి... వాటిని తప్పించుకోవటానికి హడావుడిగా వివిధ పొదుపు పథకాలవైపు పరుగులు తీసే కాలం. ఎవరెన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టినా... అందరూ ఎక్కువగా లబ్ధి పొందేది సెక్షన్ 80సీ నుంచే. దానిక్కూడా గరిష్ఠ పరిమితి రూ.1.5 లక్షలే. దీన్లో కూడా వివిధ బీమా పథకాలు, పిల్లల స్కూళ్లకు చెల్లించే ట్యూషన్ ఫీజులు తీసేస్తే... మహా అయితే ఇతరత్రా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సింది ఏ రూ.50 వేలో ఉంటుంది. సరే!! మరి ఈ 50వేలైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడైతే మన సొమ్ముకు కాస్తంత ఎక్కువ రాబడి వస్తుంది? ఎక్కడైతే దీర్ఘకాలంలో ఊహించనంత లాభాలొస్తాయి? ఇలా ఆలోచించే వారందరికీ కనిపించే పరిష్కారమే ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ పథకాలు(ఈఎల్ఎస్ఎస్). సంక్షిప్తంగా ఈఎల్ఎస్ఎస్లు. ఒకవైపు పన్ను ప్రయోజనాలు... మరోవైపు చక్కని రాబడులు.. ఈ రెండూ కలసి ఉండటమే వీటి ప్రత్యేకత. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద బ్యాంకు డిపాజిట్లు, చిన్నమొత్తాల పొదుపు పథకాలు, బాండ్లు తదితరాల్లో పెట్టుబడి పెట్టినా పన్ను భారం తగ్గుతుంది. కానీ, చక్కని రాబడి కావాలంటే ఈఎల్ఎస్ఎస్ను పరిశీలించాల్సిందే. ఇవి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కనక వీటి రాబడికి ఎలాంటి గ్యారంటీ ఉండదు. కానీ చరిత్ర చూస్తే వీటి రాబడులు మెరుగ్గానే ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్ కింద పెట్టే పెట్టుబడుల్లో సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. 30 శాతం శ్లాబులో ఉన్నవారికైతే ఏడాదికి రూ.7,500 పన్ను ప్రయోజనం లభించినట్టే. అదే పది, ఇరవై ఏళ్ల కాలంలో ఆదా చేసుకునే పన్ను మొత్తం, రాబడులను అంచనా వేస్తే... ఈ అవకాశాన్ని ఎవరూ కాదనుకోరు. పెరుగుతున్న పెట్టుబడులు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. దీంతో ఈఎల్ఎస్ఎస్ పథకాలను ఎంపిక చేసుకునే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. – రాఘవ్ అయ్యంగార్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వైస్ ప్రెసిడెంట్ పథకాల పనితీరు బాగు దీర్ఘకాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు చాలా బాగుంది. చాలా మంది ఈఎల్ఎస్ఎస్ను పన్ను ఆదాకు ఒక అవకాశంగా చూస్తున్నారు – హిమాన్షు వ్యాపక్, రిలయన్స్ కేపిటల్ అస్సెట్ మేనేజ్మెంట్ డిప్యూటీ సీఈవో ‘సిప్’ పద్ధతికి పెరుగుతున్న ఆదరణ బ్యాంకు డిపాజిట్ల వంటి సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడులు బాగా తగ్గిపోతున్న తరుణంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎక్కువ మందికి తెలిసేవి కావు. ఇపుడా పరిస్థితి మారింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షేర్లలో పెట్టుబడి పెడతాయి కనక వీటికి గణనీయమైన రాబడులందించే సామర్థ్యం ఉంటుంది. వీటిలో రిస్క్ ఉంటుందనేది నిజమే అయినా... నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్)లో ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడి పెడుతూ వెళితే రిస్క్ దాదాపు ఉండదనే చెప్పాలి. పైగా రాబడుల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. నేరుగా స్టాక్ మార్కెట్లో మదుపు కంటే ఇది సురక్షితమని చెప్పొచ్చు. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు... ఈఎల్ఎస్ఎస్ల పనితీరు కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లానే ఉంటుంది. కాకపోతే పన్ను మినహాయింపుల కోసం ఇందులో పెట్టే పెట్టుబడులను మూడేళ్ల దాకా వెనక్కి తీసుకోవడానికి ఉండదు. దీనివల్ల దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగుతాయి. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో రాబడులు మెరుగ్గా ఉండడానికి ప్రధాన కారణమిదే. దీనివల్ల ఫండ్ మేనేజర్లకు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఫలితంగా వారు స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి పెట్టుబడుల వరద... మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2016 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పది నెలల కాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి 940 మిలియన్ డాలర్లు్ల వచ్చాయి. అంటే సుమారు రూ.6,194 కోట్లు. ఇదే కాలంలో పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ 29 శాతానికి పైగా ఎగసి జనవరి చివరికి రూ.53,886 కోట్లకు చేరింది. నిజానికి నెలనెలా సిప్ విధానంలో కంటే ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే ఎక్కువ మంది ఈఎల్ఎస్ఎస్ పథకాల వైపు చూస్తుంటారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పన్ను భారం తప్పించుకునేందుకు ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టే ధోరణి ఎక్కువగా ఉంది. వార్షిక రాబడి 30 శాతం కూడా దాటింది మరి!! మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది డిసెంబర్‌కు రూ.16.46 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది రూ.20 లక్షల కోట్లను దాటుతుందని అంచనా. గడిచిన ఏడాది కాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాలు మెరుగైన రాబడులనిచ్చాయి. 30 శాతానికి పైగా రాబడులను ఇచ్చిన ఈఎల్ఎస్ఎస్ పథకాలు చాలానే ఉన్నాయి. వాటినొకసారి చూస్తే... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
ఈఎల్‌ఎస్‌ఎస్‌లపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుందా?
మూడేళ్ల నుంచి కొన్ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటిల్లోనే ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? ఈ ఈఎల్ఎస్ఎస్ల నుంచి వైదొలగి వేరే స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయమంటారా? తగిన సూచనలివ్వండి. - కృష్ణ తేజ, గుంటూరు మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌లు మంచి రాబడులు ఇస్తున్న పక్షంలో వీటి నుంచి వైదొలగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అదనపు సొమ్ములుంటే వాటిని కూడా ఈఎల్ఎస్ఎస్ల్లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ఆదా ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత ఇన్వెస్ట్ చేశాను. ఏడాది కాలంలో ఒక ఈక్విటీ ఫండ్ నుంచి మరో ఈక్విటీ ఫండ్‌కు యూనిట్లను బదిలీ చేశాను. మరికొన్ని సార్లు ఈక్విటీ ఫండ్ నుంచి లిక్విడ్ ఫండ్‌కు బదిలీ చేశాను. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను బదిలీ మాత్రమే చేశాను. కానీ, వాటిని విక్రయించలేదు. అందుకని నాకు ఎలాంటి సొమ్ములు రాలేదు. యూనిట్లను బదిలీ చేసినందుకు నేను ఏమైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందా? -ఖాలీ మస్తాన్ వలీ, తిరుపతి ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేస్తే, పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ బదిలీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా జరిగినా, లేదా మరో విధంగా జరిగినా సరే. ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి యూనిట్లను ఉపసంహరించుకొని, మరో కొత్త మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడంగా యూనిట్ల బదిలీని పరిగణిస్తారు. మీరు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌కు యూనిట్లను ఏడాది కాలంలో బదిలీ చేస్తే, మీరు పొందే లాభాలపై 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ యూనిట్ల బదిలీ ఏడాది తర్వాత జరిగితే మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఒక లిక్విడ్ ఫండ్ యూనిట్లను మూడేళ్లలోపు వేరే మ్యూచువల్ ఫండ్‌కు బదిలీ చేస్తే మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు పొందే లాభాలను మీ మొత్తం ఆదాయానికి జత చేసి మీ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను లెక్కిస్తారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులు ఎక్స్పెన్స్ రేషియోను కూడా పరిగణనలోకి తీసుకునే వెల్లడిస్తారా? ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)పై వచ్చే వడ్డీ పన్ను రహితమేనా? లేకుంటే ఏమైనా పన్నులు చెల్లించాలా? -సింధూరి, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్ వార్షిక వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే వాటి రాబడులను వెల్లడిస్తారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి రెండు రకాలైన చార్జీలను వసూలు చేస్తాయి. మొదటిది ఎక్స్పెన్స్ రేషియా. అంటే ఫండ్ నిర్వహణ, యాజమాన్య వ్యయాలు. ఒక మ్యూచువల్ ఫండ్ రాబడుల నుంచి ఈ వ్యయాలను తీసివేసిన తర్వాత ఎన్ఏవీని నిర్ణయిస్తారు. ఈక్విటీ ఫండ్స్‌కు ఈ ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా 2.5 శాతం నుంచి 3 శాతంగా ఉంటుంది. దీనిని వార్షిక ప్రాతిపదికన ప్రతీ ఏడాది వసూలు చేస్తారు. ఇక మ్యూచువల్ ఫండ్ సంస్థలు వసూలు చేసే రెండో వ్యయం ఎగ్జిట్ లోడ్...ఇది ఒక్కసారి చెల్లించే చార్జీ. మ్యూచువల్ ఫండ్ నుంచి ఇన్వెస్టర్ వైదొలిగితే, (ఒక నిర్దేశిత కాలంలో) ఈ ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తించదు. ఒకవేళ ఈ చార్జీ వసూలు చేస్తే, ఈ మేరకు మీకు మీ రాబడుల్లో కోత పడుతుంది. ఇక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌పై మీకు ఎలాంటి వడ్డీ రాదు. వాటిని ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. మీరు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డివిడెండ్స్ వస్తాయి. మార్కెట్ పరిస్థితులను, ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్లను బట్టి, ఆ స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్ సంస్థ స్వీకరించిన లాభాలను బట్టి ఈ డివిడెండ్లు వస్తాయి. ఈఎల్ఎస్ఎస్ల నుంచి వచ్చే డివిడెండ్లపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మూడేళ్ల నుంచి ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. మంచి రాబడులే పొందాను. అయితే ఇటీవల ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? -సురేందర్, వరంగల్ ఏడాది కాలంలో ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ 57 శాతం రాబడిని అందించింది. ఇలాంటి తరుణంలో ఈ ఫండ్ నుంచి వైదొలగాల్సిన అవసరం లేదు. ఈ ఫండ్ ఐదేళ్ల ట్రాక్ రికార్డ్‌ను పరిగణనలోకి తీసుకున్నా మంచి పనితీరునే కనబరిచింది. మా రేటింగ్స్ ప్రకారం ఇది ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్. ఇటీవలి పనితీరు ఆధారంగా ఈ ఫండ్ నుంచి వైదొలగాలనుకోవడం సమంజసం కాదు. మిడ్, స్మాల్-క్యాప్ కేటగిరీకి చెందిన ఫండ్స్‌లో ఇది ముఖ్యమైన ఫండ్ అని చెప్పవచ్చు. -
ఆదాయపు పన్ను మినహాయింపునకు ఆఖరి అవకాశాలు!
మార్చి వచ్చేస్తోంది. వచ్చేనెల 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. నిజానికి ఆదాయపు పన్ను కాస్త తగ్గించుకోవాలన్నా... దానికి తగ్గట్టు ఆదా చెయ్యాలన్నా ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే చెయ్యాలి. నెలజీతంపై ఆధారపడిన ఉద్యోగులైనా, నికర ఆదాయంపై ఆధారపడే వృత్తి నిపుణులైనా అప్పటికప్పుడు డబ్బులు తేవాలంటే కష్టం కనక ఏడాది ఆరంభం నుంచే ప్లానింగ్ చేయాలి. ఏ నిపుణుడు చేసే సూచనైనా ఇదే. ‘సాక్షి’ ప్రాఫిట్ పేజీని రెగ్యులర్‌గా చూసేవారికి సెక్షన్ 80సీ కింద ఈ ఏడాది రూ.1.5 లక్షల వరకు మినహాయింపు చూపించవచ్చన్న విషయంతో పాటు ఏ సెక్షన్ కింద ఎంత పన్ను మినహాయింపు లభిస్తుందనేది కూడా సవివరంగా తెలుసు. అయితే కొందరు మాత్రం ‘తరవాత చూద్దాంలే’ అనే వైఖరితో ఏడాది చివరిదాకా ఎలాంటి ప్లానింగూ చెయ్యరు. మరి అలాంటి వాళ్ల సంగతేంటి? వాళ్లకు ఆఖరి క్షణంలో పన్ను భారం తగ్గించుకునే మార్గాలేమైనా ఉన్నాయా? ఉంటే ఆ మార్గాలేంటి? ఇదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు ⇒ వడ్డీ కూడా 8.5 నుంచి 9.2 శాతం వరకూ గిట్టుబాటు ⇒ ఈఎల్ఎస్ఎస్ మినహా అన్నిటికీ రిస్క్ తక్కువే ⇒ మార్కెట్లు బాగున్నపుడు ఈఎల్ఎస్ఎస్పై అధిక రాబడి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కేంద్ర ప్రభుత్వ మద్దతున్న ఈ పథకాన్ని 1968లో ప్రవేశపెట్టారు. ఏ వయసు వారైనా దగ్గర్లోని బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ ఖాతా తెరవవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఒక ఖాతా మాత్రమే ఉండాలి. గరిష్టంగా ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలకు మించి డిపాజిట్ చెయ్యకూడదు. ఇలా చేసిన మొత్తంపై పన్ను మినహాయింపూ ఉండదు. వడ్డీ కూడా రాదు. ఏటా మార్చి 31నాటికి ఉండే మొత్తంపై వడ్డీ లెక్కించి చెల్లిస్తారు. 15 ఏళ్ల వ్యవధి తరవాత కూడా కొనసాగించాలనుకుంటే ఐదేళ్ల చొప్పున పెంచుకోవచ్చు. దీనిపై రుణాలు తీసుకోవచ్చు. ఆరేళ్ల తరవాత కొంత మొత్తాన్ని విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. అయితే ప్రతి ఏటా డిపాజిట్ చేయటం తప్పనిసరి. ఏ ఏడాదైనా కనీస మొత్తం డిపాజిట్ చెయ్యని పక్షంలో ఖాతాను డీ-యాక్టివేట్ చేస్తారు. మళ్లీ యాక్టివేట్ చేయాలనుకుంటే ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించాలి. మామూలు పీఎఫ్ లేనివారికి రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో నిధిని అందుకోవటానికి ఇది బాగా పనికొస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వ మద్దతున్న ఈ సేవింగ్స్ సర్టిఫికెట్లను దగ్గర్లోని ఏ పోస్టాఫీసులోనైనా కొనుగోలు చేయొచ్చు. ఐదేళ్లు, పదేళ్ల వ్యవధికి లభిస్తాయి. మనం కొనేటపుడే ఆ సర్టిఫికెట్ తాలూకు మెచ్యూరిటీ విలువ దానిపై ఉంటుంది. ఉదాహరణకు సర్టిఫికెట్ విలువ రూ.1000 ఉందనుకుంటే దానికన్నా తక్కువ మొత్తానికే (వ్యవధిని బట్టి) దాన్ని విక్రయిస్తారు. మెచ్యూరిటీ గడువు తీరాక రూ.1000 చెల్లిస్తారన్న మాట. దీనిపై కూడా రుణాలు లభిస్తాయి. స్వాతంత్య్రం వచ్చాక దేశ నిర్మాణానికి నిధులు అవసరం గనక 1950లలో కేంద్ర ప్రభుత్వం వీటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నిజానికి ఐదేళ్లు గానీ, పదేళ్లుగానీ వరసగా ఈ సర్టిఫికెట్లు కొనుగోలు చేస్తూ వెళ్లినవారు ఆ వ్యవధి తరవాత... ఆ వచ్చే సొమ్మునే మళ్లీ రీ-ఇన్వెస్ట్ చేస్తూ ఆదాయపు పన్ను మినహాయింపుల్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రూ.లక్ష చొప్పున వరసగా ఐదేళ్లు ఇన్వెస్ట్ చేసినవారు... ఆరో ఏడాది నుంచి వచ్చే మెచ్యూరిటీ సొమ్మునే తిరిగి సర్టిఫికెట్లపై పెట్టుబడిగా పెట్టొచ్చన్న మాట. అలా చేస్తే కొత్తగా పన్ను ఆదా కోసం వేరే డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన పని ఉండదు. పెపైచ్చు మెచ్యూర్ అయినప్పుడల్లా చేతికీ కొంత సొమ్ము వస్తుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కేంద్రం 2004లో ఆరంభించిన ఈ పథకాన్ని దగ్గర్లోని పోస్టాఫీసులో గానీ, జాతీయ బ్యాంకుల్లో గానీ ఆరంభించవచ్చు. 60 ఏళ్లు దాటిన వారెవరైనా ఈ పథకానికి అర్హులే. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినవారు 55 ఏళ్లకే దీన్ని ఆరంభించవచ్చు. రక్షణ రంగ ఉద్యోగులు మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా ఆరంభించే అవకాశం ఉంది. దీనికి ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉన్నా... స్వల్ప పెనాల్టీతో ఏడాది తరవాత క్లోజ్ చేసే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి దీనిపై వడ్డీ రేటును సవరించారు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏ షెడ్యూల్డ్ బ్యాంకులోనైనా... ఎక్కడైనా ఐదేళ్ల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే పన్ను రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుతం వివిధ బ్యాంకులు 8.5 శాతం నుంచి 9 శాతం దాకా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకును బట్టి ఈ వడ్డీ మారుతుంది. ఈ వడ్డీ మూడు నెలలకోసారి కాంపౌండింగ్ అవుతుంది. ఈ లెక్కన ఉదాహరణకు రూ.లక్ష గనక డిపాజిట్ చేస్తే 8.5% వడ్డీ రేటుతో ఐదేళ్ల తరవాత రూ.1.52 లక్షలవుతుంది. అదే 8.75 వడ్డీ శాతం దగ్గరైతే మరో రూ.1.54 లక్షలవుతుంది. 9 శాతమైతే మరో 2వేలు అదనంగా వస్తుంది. అయితే ఐదేళ్ల కాలానికి 8.4 వడ్డీ శాతంతో పోస్టాఫీసు ఆఫర్ చేస్తున్న టైమ్ డిపాజిట్ పథకం కూడా ఈ కోవలోకే వస్తుంది. వీటిని గడువు తీరకముందే ప్రీక్లోజర్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ అలా చేస్తే పన్ను ప్రయోజనాలను, కొంత వడ్డీని కోల్పోవాల్సి వస్తుంది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ మ్యూచ్‌వల్ ఫండ్లు ఆఫర్ చేసే ఈ పథకాలన్నీ ఓపెన్ ఎండెడ్వే. అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పథకంలో చేరొచ్చన్న మాట. వీటిలో మనం పెట్టే పెట్టుబడుల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు గనక మనకు వచ్చే రాబడులు కూడా మార్కెట్లు బావుంటేనే బాగుంటాయి. ఇవి కూడా డైవర్సిఫైడ్ ఫండ్ల లాంటివే. అంటే ఏదో ఒక రంగానికో, ఒక ఇండెక్స్కో పరిమితం కాకుండా ఫండ్ మేనేజర్ సూచించిన స్టాక్స్‌లో పెట్టుబడి పెడతారన్న మాట. ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టినా గరిష్టంగా రూ.లక్ష వరకే పన్ను మినహాయింపు లభిస్తుంది. పెపైచ్చు వీటిపై రుణాలు రావు. మూడేళ్లకు ముందు ఎగ్జిట్ కావటం కూడా కుదరదు. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడి పెట్టేవారు ఎలాంటి ఫండ్లను ఎంచుకోవాలనే విషయమై నిపుణులు కొన్ని సూచనలు చేస్తుంటారు. అవి... ⇒ ఏజెంట్ దేన్లో చెబితే దాన్లో ఇన్వెస్ట్ చేయకుండా ట్రాక్ రికార్డు బాగున్న ఫండ్లను చూసుకోవాలి. వాటి మూడేళ్ల ట్రాక్ రికార్డును చూసి... టాప్-3 ఫండ్లలో నచ్చినదాన్ని ఎంచుకుంటే మంచిది. అయితే గతంలో ఉన్న పనితీరు భవిష్యత్తులోనూ ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదండోయ్!! అయినా సరే ఇదే ఉత్తమ మార్గం. ⇒ మూడేళ్ల కన్నా తక్కువ ట్రాక్ రికార్డు ఉన్న ఫండ్ల జోలికి వెళ్లకపోవటమే బెటర్. ⇒ రూ.300 కోట్ల కన్నా తక్కువ ఆస్తులున్న ఫండ్లను కూడా వదిలిపెట్టడమే మంచిది. ఆయా ఫండ్ల ఫ్యాక్ట్ షీట్ చూస్తే దాని ఆస్తులెంత ఉన్నాయనేది తెలుస్తుంది.