పన్ను కోతలకు చెక్‌ పెడదాం ! | Financial Planner Anil Rego | Sakshi
Sakshi News home page

పన్ను కోతలకు చెక్‌ పెడదాం !

Published Sun, May 14 2017 11:31 PM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

పన్ను కోతలకు చెక్‌ పెడదాం ! - Sakshi

పన్ను కోతలకు చెక్‌ పెడదాం !

పెట్టుబడి, పన్ను ఆదా రెండూ చేయొచ్చు  
ఈ రెండింటికీ వీలుగా బోలెడన్ని సాధనాలు
బీమా పాలసీలు, ఈఎల్‌ఎస్‌ఎస్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు  
గృహ రుణంతోనూ పన్ను ప్రయోజనాలు
కొత్త సంవత్సరానికి ముందే ప్లాన్‌ చేస్తే బెటర్‌  
ఫైనాన్షియల్‌ ప్లానర్‌ అనిల్‌ రెగో సూచన
 

కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేసింది. ప్రతిసారీ వస్తూ వస్తూ... ఓ వైపు ఇన్వెస్ట్‌మెంట్‌కి మరోవైపు పన్నులు ఆదా చేసుకునేందుకు అనువైన సాధనాలను అన్వేషించండంటూ గుర్తు చేస్తుంది. కాలం గుర్తు చేయకున్నా... కంపెనీలు మాత్రం గుర్తు చేస్తుంటాయి. ఇప్పటికే యాజమాన్యాలు ఈ ఏడాది మీరు ఏఏ పన్ను మినహాయింపు సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయబోతున్నారో చెప్పండంటూ ఉద్యోగుల్ని అడుగుతున్నాయి. అందుకే... ఈ ఏడాది ట్యాక్స్‌ ప్రయోజనాలు కల్పించేందుకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాధనాల గురించి ఒకసారి తెలుసుకుందాం.

సెక్షన్‌ 80 సి పెట్టుబడి సాధనాలు
 సెక్షన్‌ 80 సి కిందకి వచ్చే పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మొత్తం మీద రూ.1,50,000 వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. 80 సి పరిధిలోకి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు అనేకం ఉన్నాయి. ఇటు పెట్టుబడికి, అటు పన్ను ఆదాకు ఉపయోగపడే అటువంటి సాధనాల్లో కొన్ని ఇవి.

ఈఎల్‌ఎస్‌ఎస్‌ లేదా ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీము
ఈఎల్‌ఎస్‌ఎస్‌ స్కీములు పన్ను ఆదా ప్రయోజనాలు అందించే మ్యూచువల్‌ ఫండ్‌ సాధనాలు. వీటిలో మూడేళ్ల లాకిన్‌ వ్యవధి ఉంటుంది. నెల నెలా సిప్‌ (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) రూపంలో చిన్న మొత్తాలు కూడా వీటిలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. మెరుగైన రాబడులు పొందవచ్చు. కొన్ని మంచి ఈఎల్‌ఎస్‌ఎస్‌ స్కీములు సుమారు 15 శాతం దాకా వార్షిక రాబడులు ఇస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ప న్ను ఆదా చేసే పెట్టుబడి సాధనంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌కు మంచి ఆదరణే ఉంది. ట్యాక్స్‌ సేవింగ్‌ సాధనాల్లో వీటినీ పరిశీ          లించవచ్చు.

మనీ బ్యాక్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు
ఆర్థిక బాధ్యతలకు సంపూర్ణ బీమా కవరేజీ కల్పించేలా అదనంగా ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకోవడం మంచిదే. లైఫ్‌ పాలసీ మొదటిసారి తీసుకుంటున్నా లేదా అదనంగా ప్రొటెక్షన్‌ కోసం తీసుకుంటున్నా .. మనీ బ్యాక్‌ పాలసీల్లాంటివి ఆకర్షణీయమైన సాధనాలు. ఇవి ఇటు పెట్టుబడికి.. అటు పన్ను ఆదాకు కూడా మెరుగైన సాధనాలే. పేరుకు తగ్గట్లే.. పాలసీ వ్యవధి మధ్య మధ్యలో నిర్దిష్ట మొత్తాన్ని ఈ పాలసీల ద్వారా అందుకోవచ్చు. ఈ డబ్బును ఆ తర్వాత ఇతరత్రా వ్యయాల కోసం వినియోగించుకోవచ్చు లేదా అధిక రాబడులిచ్చే మరో సాధనంలోనూ ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఏ రకంగా చూసినా మనీ బ్యాక్‌ పాలసీలు శ్రేయస్కరమైనవే.

గృహ రుణం
గృహ రుణంపై కట్టే అసలు భాగానికి .. సెక్షన్‌ 80 సి కింద పన్ను ప్రయోజనాలు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అలాగే రూ. 2,00,000 దాకా గృహ రుణంపై వడ్డీ మొత్తానికి కూడా సెక్షన్‌ 24 బి కింద మినహాయింపు లభిస్తుంది.

ఈపీఎఫ్‌ / పీపీఎఫ్‌
ఉద్యోగుల భవిష్య నిధి లేదా పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌కి కట్టే చెల్లింపులపై కూడా ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ మీకు ఇప్పటిదాకా ఈపీఎఫ్‌ లేదా పీపీఎఫ్‌ ఖాతా లేని పక్షంలో ఈ ఏడాది ఒకటి తీసుకోవచ్చు. అలా గాకుండా ఇప్పటికే ఖాతా ఉండి ఉంటే.. కట్టే చందా మొత్తాన్ని పెంచుకోవడం ద్వారా నికరంగా మెరుగైన రాబడులు అందుకోవచ్చు. లాకిన్‌ వ్యవధి నిబంధన కారణంగా.. వైదొలిగేటప్పుడు పెద్ద మొత్తమే చేతికి రాగలదు. ఒకరకంగా ఇది రిటైర్మెంట్‌ ప్లానింగ్‌కు కూడా ఈపీఎఫ్‌.. పీపీఎఫ్‌ పరిశీలించతగినవే.

బ్యాంక్‌ ఎఫ్‌డీలు
అయిదేళ్ల లాకిన్‌ పీరియడ్‌తో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అత్యంత సులభతరమైన సాధనాల్లో ఇది ఒకటి. ఏకమొత్తంగా ఇన్వెస్ట్‌ చేసేస్తే సరిపోతుంది. నెల నెలా లేదా ప్రతీ సంవత్సరం కడుతూ పోనక్కర్లేదు. సెక్షన్‌ 80సి పరిమితి కింద ఇంకా ఇన్వెస్ట్‌ చేయతగిన డబ్బు చేతిలో ఉంటే అయిదేళ్ల ఎఫ్‌డీలను ఎంచుకోవచ్చు.

సెక్షన్‌ 80 డి కింద పన్ను ఆదా చేసే సాధనం..
ఆరోగ్య బీమా: ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మీకు, మీ కుటుంబ సభ్యులకు గానీ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ లేకపోతే..ఈ ఏడాది దానిపై దృష్టి పెట్టొచ్చు. సొంతానికి, తమ డిపెండెంట్స్‌కి తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలపై రూ. 25,000 దాకా పన్ను మినహాయింపు పొందవచ్చు. అదే సీనియర్‌ సిటిజన్స్‌ అయితే ఇది రూ. 30,000 దాకా ఉంటుంది. ఒకవేళ పేరెంట్స్‌కి కూడా మెడికల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటే అదనంగా రూ. 25,000 దాకా (సీనియర్‌ సిటిజన్స్‌ అయితే రూ. 30,000) పన్ను మినహాయింపు పొందవచ్చు.

సెక్షన్‌ 80 సీసీడీ కింద...
ఎన్‌Sపీఎస్‌ (నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌)

ఎన్‌పీఎస్‌ కింద చేసే పెట్టుబడులపై అదనంగా రూ. 50,000 దాకా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. లాకిన్‌ వ్యవధి, కఠినమైన పాక్షిక విత్‌డ్రాయల్స్‌ నిబంధనల కారణంగా రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక అవసరాల కోసం నిధి పోగు చేసుకునేందుకు ఈ సాధనాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా.. ఇందులో సదరు మదుపుదారు పెట్టిన పెట్టుబడిలో గరిష్టంగా 50 శాతం దాకా మాత్రమే ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు అనుమతి ఉంది. పన్ను ప్రయోజనాలు కల్పిస్తూ.. సగటు మించి రాబడులు అందించే సాధనాల్లో ఎన్‌పీఎస్‌ మెరుగైనదే.

ఇందులో వివరించినవే కాకుండా ఇతరత్రా పన్ను ఆదా చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు కూడా ఉన్నాయి. అయితే, అవన్నీ వివిధ సాధనాల మేళవింపుగా ఉంటాయి. వీటన్నింటినీ సరిగ్గా ఉపయోగించుకోగలిగితే పోర్ట్‌ఫోలియోపై అధిక రాబడులతో పాటు ఆదాయ పన్ను ప్రయోజనాలూ అందుకోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement