ఈఎల్‌ఎస్‌ఎస్‌లపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుందా? | Would there be a tax on the interest on elss? | Sakshi
Sakshi News home page

ఈఎల్‌ఎస్‌ఎస్‌లపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుందా?

Published Mon, Jun 29 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

ఈఎల్‌ఎస్‌ఎస్‌లపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుందా?

ఈఎల్‌ఎస్‌ఎస్‌లపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుందా?

మూడేళ్ల నుంచి కొన్ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటిల్లోనే ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించమంటారా? ఈ ఈఎల్‌ఎస్‌ఎస్‌ల నుంచి వైదొలగి వేరే స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయమంటారా? తగిన సూచనలివ్వండి.
 - కృష్ణ తేజ, గుంటూరు

 మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఈఎల్‌ఎస్‌ఎస్ స్కీమ్‌లు మంచి రాబడులు ఇస్తున్న పక్షంలో వీటి నుంచి వైదొలగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి అదనపు సొమ్ములుంటే వాటిని కూడా ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ఆదా ప్రయోజనాలు పొందవచ్చు.

 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత ఇన్వెస్ట్ చేశాను.  ఏడాది కాలంలో ఒక ఈక్విటీ ఫండ్ నుంచి మరో ఈక్విటీ ఫండ్‌కు యూనిట్లను బదిలీ చేశాను. మరికొన్ని సార్లు ఈక్విటీ ఫండ్ నుంచి లిక్విడ్ ఫండ్‌కు బదిలీ చేశాను. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను బదిలీ మాత్రమే చేశాను. కానీ, వాటిని విక్రయించలేదు. అందుకని నాకు ఎలాంటి సొమ్ములు రాలేదు. యూనిట్లను బదిలీ చేసినందుకు నేను ఏమైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందా?
 -ఖాలీ మస్తాన్ వలీ, తిరుపతి

 ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేస్తే, పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ బదిలీ సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా జరిగినా, లేదా మరో విధంగా జరిగినా సరే.  ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి యూనిట్లను ఉపసంహరించుకొని, మరో కొత్త మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడంగా యూనిట్ల బదిలీని పరిగణిస్తారు. మీరు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌కు యూనిట్లను ఏడాది కాలంలో బదిలీ చేస్తే, మీరు పొందే లాభాలపై 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఒక వేళ ఈ యూనిట్ల బదిలీ ఏడాది తర్వాత జరిగితే మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఒక లిక్విడ్ ఫండ్ యూనిట్లను మూడేళ్లలోపు వేరే మ్యూచువల్ ఫండ్‌కు బదిలీ చేస్తే మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు పొందే లాభాలను మీ మొత్తం ఆదాయానికి జత చేసి మీ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను లెక్కిస్తారు.

 మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులు ఎక్స్‌పెన్స్ రేషియోను కూడా పరిగణనలోకి తీసుకునే వెల్లడిస్తారా? ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)పై వచ్చే వడ్డీ పన్ను రహితమేనా? లేకుంటే ఏమైనా పన్నులు చెల్లించాలా?
 -సింధూరి, విశాఖపట్టణం

 మ్యూచువల్ ఫండ్ వార్షిక వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే వాటి రాబడులను వెల్లడిస్తారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి రెండు రకాలైన చార్జీలను వసూలు చేస్తాయి. మొదటిది ఎక్స్‌పెన్స్ రేషియా. అంటే ఫండ్ నిర్వహణ, యాజమాన్య వ్యయాలు. ఒక మ్యూచువల్ ఫండ్ రాబడుల నుంచి  ఈ వ్యయాలను తీసివేసిన తర్వాత  ఎన్‌ఏవీని నిర్ణయిస్తారు. ఈక్విటీ ఫండ్స్‌కు ఈ ఎక్స్‌పెన్స్ రేషియో సాధారణంగా 2.5 శాతం నుంచి 3 శాతంగా ఉంటుంది. దీనిని వార్షిక ప్రాతిపదికన ప్రతీ ఏడాది వసూలు చేస్తారు.

 ఇక మ్యూచువల్ ఫండ్ సంస్థలు వసూలు చేసే రెండో వ్యయం ఎగ్జిట్ లోడ్...ఇది ఒక్కసారి చెల్లించే చార్జీ. మ్యూచువల్ ఫండ్ నుంచి ఇన్వెస్టర్ వైదొలిగితే, (ఒక నిర్దేశిత కాలంలో)  ఈ ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్‌కు వర్తించదు. ఒకవేళ ఈ చార్జీ వసూలు చేస్తే, ఈ మేరకు మీకు మీ రాబడుల్లో కోత పడుతుంది. ఇక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్) ఫండ్స్‌పై మీకు ఎలాంటి వడ్డీ రాదు.

వాటిని ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. మీరు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డివిడెండ్స్ వస్తాయి. మార్కెట్ పరిస్థితులను, ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్‌లను బట్టి, ఆ స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్ సంస్థ స్వీకరించిన లాభాలను బట్టి  ఈ డివిడెండ్‌లు వస్తాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల నుంచి వచ్చే డివిడెండ్లపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు.

 మూడేళ్ల నుంచి ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్‌లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. మంచి రాబడులే పొందాను. అయితే ఇటీవల ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించమంటారా?
 -సురేందర్, వరంగల్

 ఏడాది కాలంలో ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ 57 శాతం రాబడిని అందించింది. ఇలాంటి తరుణంలో ఈ ఫండ్ నుంచి వైదొలగాల్సిన అవసరం లేదు. ఈ ఫండ్ ఐదేళ్ల ట్రాక్ రికార్డ్‌ను పరిగణనలోకి తీసుకున్నా మంచి పనితీరునే కనబరిచింది. మా రేటింగ్స్ ప్రకారం ఇది ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్. ఇటీవలి  పనితీరు ఆధారంగా ఈ ఫండ్ నుంచి వైదొలగాలనుకోవడం సమంజసం కాదు. మిడ్, స్మాల్-క్యాప్ కేటగిరీకి చెందిన ఫండ్స్‌లో ఇది ముఖ్యమైన ఫండ్ అని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement