ఎగ్జిట్ లోడ్ సొమ్ము ఏం చేస్తారు.. ? | What doing with exit load of money? | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్ లోడ్ సొమ్ము ఏం చేస్తారు.. ?

Published Mon, Sep 1 2014 12:40 AM | Last Updated on Mon, Dec 3 2018 1:54 PM

ఎగ్జిట్ లోడ్ సొమ్ము ఏం చేస్తారు.. ? - Sakshi

ఎగ్జిట్ లోడ్ సొమ్ము ఏం చేస్తారు.. ?

మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విక్రయాలపై విధించే ఎగ్జిట్ లోడ్ ద్వారా వచ్చిన సొమ్ములను ఫండ్ హౌస్ ఏంచేస్తుంది? ఎక్స్‌పెన్స్ రేషియో అంటే ఏమిటి?  సదరు ఫండ్ మొత్తం వ్యయాలను ఇది సూచిస్తుందా? ఇవి కాకుండా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వసూలు చేసే ఇతర చార్జీలేమైనా ఉన్నాయా? -ప్రణీత, గుంటూరు
 
ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ నుంచి తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ముందే ఉపసంహరించుకోవడాన్ని నిరోధించడానికి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ ఎగ్జిట్ లోడ్‌ను విధిస్తాయి. గతంలో ఫండ్ మేనేజర్ల వ్యయాలకు గాను ఎగ్జిట్ లోడ్‌ను మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వసూలు చేసేవి. ఇప్పుడు ఈ ఎగ్జిట్ లోడ్‌ను మ్యూచువల్ ఫండ్ కంపెనీలు తిరిగి ఆ ఫండ్ స్కీమ్‌లోనే రీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లకు వచ్చే రిటర్న్‌లు పెరుగుతాయి. ఇక ఎక్స్‌పెన్స్ రేషియో విషయానికొస్తే కంపెనీ నిర్వహణ, వ్యవస్థాపన  సంబంధిత వ్యయాలన్నింటినీ ఎక్స్‌పెన్స్ రేషియో ప్రతిబింబిస్తుంది.

ఇంకా ఎక్స్‌పెన్స్ రేషియోలో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్వైజరీ ఫీజు, ట్రస్టీ ఫీజు, ఆడిట్ ఫీజు, కస్టోడియన్ ఫీజు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్, మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఎక్స్‌పెన్సెస్(ఏజెంట్ కమిషన్‌తో కలిపి), ఇన్వెస్టర్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించి వ్యయాలు, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వ్యయాలు, అకౌంట్ స్టేట్‌మెంట్ వ్యయాలు, డివిడెండ్ రిడంప్షన్ చెక్‌లు, వారంట్ల వ్యయాలు, ప్రకటనల వ్యయాలు, ఇన్వెస్టర్ల అవగాహన వ్యయాలు, బ్రోకరేజ్ వ్యయాలు, సర్వీస్ ట్యాక్స్‌లు, లిస్టింగ్ వ్యయాలు, వంటి ఇతర వ్యయాలు ఉంటాయి. ఫండ్ వ్యయాలన్నీ కవర్ అయ్యేలా నిర్దేశిత పరిమితికి లోబడి ఎక్స్‌పెన్స్ రేషియోను వసూలు చేసుకోవచ్చని సెబీ మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు అనుమతిచ్చింది. టాప్ 15 నగరాలు కాకుండా ఇతర నగరాల ఇన్వెస్టర్ల నుంచి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అదనంగా 0.30% అదనపు చార్జీ విధించవచ్చని సెబీ ఇటీవలనే మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు అనుమతిచ్చింది.
 
మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? యూలిప్‌లలో మంచిదా? నేను బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైనా నిర్ణయమేనా? ఐటీ చట్టం, సెక్షన్ 80 సీ ప్రకారం పన్ను ప్రయోజనాలు ఆశించడంలేదు. కేవలం ఇన్వెస్ట్‌మెంట్స్‌పైనే నా దృష్టి. సరైన సూచనలివ్వండి.
- సంతోష్ కుమార్, హైదరాబాద్

 
యూలిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడమే మంచిది. ఇన్వెస్ట్‌మెంట్‌కే కాదు బీమాకు కూడా పెట్టుబడులకు యూలిప్‌లను పరిగణించకూడదు. యూలిప్‌లకు వ్యయాలు ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. యూలిప్ పాలసీ తీసుకున్న పక్షంలో మీరు 4,5 ఏళ్ల పాటు అధిక వ్యయాలు చెల్లించాల్సి ఉంటుంది. యూలిప్‌లతో పోల్చితే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు చార్జీలు తక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు గరిష్టంగా ఈక్విటీ ఫండ్స్‌పై 2.5%, డెట్‌ఫండ్స్ 2.25 శాతం చొప్పున ఎక్స్‌పెన్స్ రేషియోను వసూలు చేస్తాయి.

యూలిప్‌లు తొలి ఏడాదిలోనే విధించే చార్జీ కనీసం 5-6 %. మ్యూచువల్ ఫండ్స్ తమ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాన్ని, పోర్ట్‌ఫోలియోలను పారదర్శకంగా ఉంచుతాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు  ఫండ్స్ నుంచి వైదొలగవచ్చు. అదే యూలిప్‌ల విషయంలో అయితే లాకిన్ పీరియడ్ ఐదేళ్ల వరకూ ఉంటుంది. ఇక ఈక్విటీ ఫండ్ ఎంపిక విషయానికొస్తే, మీ అవసరాలు, భరించగలిగే రిస్క్ వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవాలి. బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్. దీనికి మా వేల్యూ రీసెర్చ్ ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. నిరభ్యంతరంగా దీనిలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
 
నేనొక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని షేర్లు డివిడెండ్‌లు ఇస్తే, వాటిని మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుంది? ఇలాంటి డివిడెండ్‌ను ఏ ఫండ్ ఎంత ఆర్జించిందో ఎలా తెలుసుకోవచ్చు? - బిస్మిల్లా, నిజామాబాద్
 
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తాను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ నుంచి పొందిన డివిడెండ్ వివరాలను వెల్లడించే నిబంధనలేవీ లేవు.  డివిడెండ్స్ చెల్లించే షేర్లలోనే డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ తమ స్కీమ్‌ల పోర్ట్‌ఫోలియోల వివరాలను నెలవారీ పద్ధతిన వెల్లడిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ ఎన్‌ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) మదింపు, పోర్ట్‌ఫోలియో వేల్యూయేషన్, స్వీకరించిన డివిడెండ్ల తాలూకు అకౌంటింగ్...ఇవన్నీ కఠినమైన నియమ నిబంధనలతో గణించాల్సి ఉంటుంది. అందుకని ఈక్విటీ ఫండ్స్ పొందే డివిడెండ్స్ విషయమై మీరు  ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ ఈక్విటీ ఫండ్ అయినా డివిడెండ్‌లు పొందితే, మీ రాబడులు, ఎన్‌ఏవీ కూడా పెరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement