Fund Review: Tata India Tax Savings Fund - Sakshi
Sakshi News home page

పన్ను ఆదా.. మెరుగైన రాబడినిచ్చే ఈ ఫండ్‌ గురించి తెలుసా?

Published Mon, Aug 14 2023 8:44 AM | Last Updated on Mon, Aug 14 2023 9:59 AM

fund review Tata India Tax Savings fund - Sakshi

మెరుగైన రాబడులతోపాటు, పన్ను పరిధిలో ఉన్న వారు కొంత ఆదా చేసుకునేందుకు ఉపయోగపడే సాధనాల్లో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) కూడా ఒకటి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇదొక విభాగం. సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆ మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో టాటా ఇండియా ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఒకటి. 

రాబడులు 
టాటా ఇండియా ట్యాక్స్‌ సేవింగ్స్‌ రాబడులు అద్భుతంగా ఏమీ లేకపోయినా.. ఈ పథకం అన్ని కాలాల్లోనూ స్థిరమైన, మెరుగైన ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి. గత ఏడాది కాలంలో ఈ పథకం 14 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల కాలంలో ఏటా 23 శాతం చొప్పున రిటర్నులు ఇచ్చింది. ఐదేళ్లలో 13 శాతం, ఏడేళ్లలో 13 శాతం, పదేళ్లలో 17.56 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. బెంచ్‌ మార్క్‌ సూచీ అయిన ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టీఆర్‌ఐతో పోలిస్తే ఈ పథకం కొన్ని కాలాల్లో మెరుగ్గానూ, కొన్ని కాలాల్లో ఫ్లాట్‌గానూ పనితీరు నమోదు చేసింది. దీర్ఘకాలంలో సూచీతో పోలిస్తే టాటా ఇండియా ట్యాక్స్‌ సేవింగ్స్‌ పథకంలోనే మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకానికి 20 ఏళ్ల చరిత్ర ఉంది. 1996 మార్చిలో ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఏటా 18.40 శాతం చొప్పున ఇప్ప టి వరకు ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చిపెట్టింది.  

పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో 
మార్కెట్‌ అస్థిరతలను అధిగమించేందుకు, దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ఒకింత సురక్షితమనే చెప్పాలి. మూడేళ్ల పాటు ఇందులో చేసే పెట్టుబడులపై లాకిన్‌ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్‌ చేసిన మూడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. దీంతో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలకు రిడెంప్షన్‌ (పెట్టుబడులను ఉపసంహరించుకోవడం) ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. దీంతో ఫండ్‌ మేనేజర్లు పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకునే వెసులుబా టు కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలంలో అధిక రాబడులకూ తోడ్పడుతుంది. ఈ పథకం మల్టీక్యాప్‌ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తుంటుంది.  
మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను వివిధ మార్కెట్‌ విలువ కలిగిన (లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌) స్టాక్స్‌ మధ్య మార్పులు, చేర్పులు చేస్తుంది. ఉదాహరణకు 2017లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగంలో ఈ పథకం తన మొత్తం పెట్టుబడుల్లో 40 శాతాన్ని కేటాయించింది. కానీ, చిన్న, మధ్య స్థాయి షేర్లలో అస్థిరతల నేపథ్యంలో 2018 చివరికి మిడ్, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు తోడ్పడుతున్నాయి. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి 3557 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 97.57 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. 57 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేసింది. మిడ్‌క్యాప్‌ కంపెనీలకు 22.64 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు 10 శాతం వరకు కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్, ఆటోమొబైల్, క్యాపిటల్‌ గూడ్స్, టెక్నాలజీ రంగ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది.  

టాప్‌ ఈక్విటీ హోల్డింగ్స్‌ 
 

కంపెనీ     పెట్టుబడుల శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 10.54 
ఐసీఐసీఐ బ్యాంక్‌ 6.53 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4.84
ఇన్ఫోసిస్‌     4.42 
ఎస్‌బీఐ     4.36 
యాక్సిస్‌ బ్యాంక్‌     3.49 
ఎల్‌అండ్‌టీ     2.94
రాడికో ఖైతాన్‌     2.65 
క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోమేషన్‌ 2.58 
భారతీ ఎయిర్‌టెల్‌     2.35 



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement