రిస్క్ పెద్దగా భరించలేని వారు, అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు యూటీఐ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో రాబడుల చరిత్ర స్థిరంగా ఉంది. గతంలో యూటీఐ ఈక్విటీ ఫండ్‌గా కొనసాగిన ఈ పథకం, 2017 అక్టోబర్‌లో సెబీ తీసుకొచ్చిన పునర్‌వ్యవస్థీకరణ నిబంధనల అనంతరం ఫ్లెక్సీక్యాప్‌గా మారింది.
ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగాల్లో స్వేచ్ఛగా ఇన్వెస్ట్ చేయగలవు. మెరుగైన అవకాశాలున్న చోట ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనల పరంగా వెసులుబాటు ఉంటుంది. రిస్క్–రాబడుల సమతుల్యానికి ఈ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.
దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు
ఈ పథకం 2008, 2011, 2020 కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో చూస్తే సగటున మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ఎస్‌అండ్‌పీ నిఫ్టీ 500 సూచీ ప్రామాణికం. ఏడాది కాలంలో ఈ పథకం 24 శాతం మేర రాబడులు అందించింది. ఐదేళ్ల కాలంలో సగటున వార్షికంగా 16.47 శాతం రాబడులు ఇచ్చింది.
ఏడేళ్ల కాలంలో ఏటా 14 శాతం, పదేళ్ల కాలంలో ఏటా 12.50 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. పోటీ పథకాలతో పోల్చితే రాబడులు కొంత తక్కువగా కనిపించినప్పటికీ.. కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడంలో ఈ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడుల చరిత్ర గొప్పగా లేకున్నా, దీర్ఘకాలానికి మెరుగ్గా ఉంది. స్థిరంగా తక్కువ ఆటుపోట్లతో ఉన్నందున రిస్క్ తక్కువ కోరుకునే వారికి మంచి ఎంపిక అవుతుంది. ముఖ్యంగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మెరుగైన రాబడులు అందుకోవచ్చు.
పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.27,706 కోట్ల పెట్టుబడులు (నిర్వహణ ఆస్తులు/ఏయూఎం) ఉన్నాయి. దీర్ఘకాల చరిత్ర ఉండడంతో పెద్ద పథకాల్లో ఒకటి కావడం గమనార్హం. నిర్వహణ ఆస్తుల్లో 96 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 0.52 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టింది. 3.45 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ దిద్దుబాటులో ఆకర్షణీయ అవకాశాలకు వీలుగా నగదు నిల్వలు కలిగి ఉన్నట్టు అర్థమవుతోంది.
ఈక్విటీ పెట్టుబడులు గమనించగా, 70 శాతం వరకు లార్జ్‌క్యాప్‌లో ఉంటే, మిడ్‌క్యాప్‌లో 28 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులు పెట్టింది. టాప్–10 స్టాక్స్‌లోనే 42 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడులను గమనించినట్టయితే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ వెయిటేజీ ఇస్తూ, 22 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు 22 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ రంగానికి 18 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 12 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment