UTI
-
రిస్క్ తక్కువ.. రాబడులు స్థిరం
రిస్క్ పెద్దగా భరించలేని వారు, అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు యూటీఐ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో రాబడుల చరిత్ర స్థిరంగా ఉంది. గతంలో యూటీఐ ఈక్విటీ ఫండ్‌గా కొనసాగిన ఈ పథకం, 2017 అక్టోబర్‌లో సెబీ తీసుకొచ్చిన పునర్వ్యవస్థీకరణ నిబంధనల అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది.ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగాల్లో స్వేచ్ఛగా ఇన్వెస్ట్ చేయగలవు. మెరుగైన అవకాశాలున్న చోట ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనల పరంగా వెసులుబాటు ఉంటుంది. రిస్క్–రాబడుల సమతుల్యానికి ఈ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఈ పథకం 2008, 2011, 2020 కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో చూస్తే సగటున మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ఎస్అండ్పీ నిఫ్టీ 500 సూచీ ప్రామాణికం. ఏడాది కాలంలో ఈ పథకం 24 శాతం మేర రాబడులు అందించింది. ఐదేళ్ల కాలంలో సగటున వార్షికంగా 16.47 శాతం రాబడులు ఇచ్చింది.ఏడేళ్ల కాలంలో ఏటా 14 శాతం, పదేళ్ల కాలంలో ఏటా 12.50 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. పోటీ పథకాలతో పోల్చితే రాబడులు కొంత తక్కువగా కనిపించినప్పటికీ.. కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడంలో ఈ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడుల చరిత్ర గొప్పగా లేకున్నా, దీర్ఘకాలానికి మెరుగ్గా ఉంది. స్థిరంగా తక్కువ ఆటుపోట్లతో ఉన్నందున రిస్క్ తక్కువ కోరుకునే వారికి మంచి ఎంపిక అవుతుంది. ముఖ్యంగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మెరుగైన రాబడులు అందుకోవచ్చు. పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.27,706 కోట్ల పెట్టుబడులు (నిర్వహణ ఆస్తులు/ఏయూఎం) ఉన్నాయి. దీర్ఘకాల చరిత్ర ఉండడంతో పెద్ద పథకాల్లో ఒకటి కావడం గమనార్హం. నిర్వహణ ఆస్తుల్లో 96 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 0.52 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టింది. 3.45 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ దిద్దుబాటులో ఆకర్షణీయ అవకాశాలకు వీలుగా నగదు నిల్వలు కలిగి ఉన్నట్టు అర్థమవుతోంది.ఈక్విటీ పెట్టుబడులు గమనించగా, 70 శాతం వరకు లార్జ్‌క్యాప్‌లో ఉంటే, మిడ్‌క్యాప్‌లో 28 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులు పెట్టింది. టాప్–10 స్టాక్స్‌లోనే 42 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడులను గమనించినట్టయితే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ వెయిటేజీ ఇస్తూ, 22 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు 22 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ రంగానికి 18 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 12 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
వేల్యుయేషన్స్ మరీ అధికంగా లేవు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయులను తాకుతున్నా, వేల్యుయేషన్స్ మరీ అధిక స్థాయికి చేరలేదని మ్యుచువల్ ఫండ్ సంస్థ యూటీఐ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐవో) వెట్రి సుబ్రమణ్యం చెప్పారు. వాస్తవానికి 2021 నాటితో పోలిస్తే ఇంకా కాస్త తక్కువలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ నిబ్బరంగా ఉన్న అమెరికాలో పరిస్థితులేమైనా మారి, మాంద్యంలాంటిదేమైనా వస్తే మార్కెట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అయితే, ప్రస్తుతం మాత్రం అటువంటిదేమీ కనిపించడం లేదని పేర్కొన్నారు. స్మాల్‌క్యాప్ వేల్యుయేషన్స్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో లార్జ్ క్యాప్స్ మెరుగ్గా ఉన్నాయని సోమవారమిక్కడ విలేకరులకు సుబ్రమణ్యం చెప్పారు. పెట్టుబడులకు సంబంధించి ఫైనాన్షియల్స్, ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ తదితర రంగాలు కొంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని వివరించారు. తాజాగా యూటీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజీ ఫండ్ పేరిట కొత్త ఫండ్ (ఎన్ఎఫ్వో)ను ప్రారంభిస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. ఇది జూలై 21న ప్రారంభమవుతుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ ద్వారా సేకరించే నిధులను వేల్యుయేషన్స్ ప్రాతిపదికన ఈక్విటీ, ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తామని, తద్వారా అధిక రాబడులు అందించేందుకు ప్రయతి్నస్తామని సుబ్రమణ్యం చెప్పారు. -
ఆటో రంగంలో పెట్టుబడులా!
సాక్షి, హైదరాబాద్: థీమ్యాటిక్ ఫండ్స్ అన్నవి ఫలానా రంగాలకే పెట్టుబడులను పరిమితం చేసేవి. గత కొన్నేళ్లుగా ఆటోమొబైల్ రంగం ఎన్నో సవాళ్లను, సంస్కరణలను చవిచూసింది. తదుపరి వృద్ధికి ఈ రంగం సిద్ధంగా ఉందని ఎక్కువ మంది విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక రిస్క్ ఎక్కువ ఉన్నా ఫర్వాలేదు, మంచి రాబడులు కావాలని కోరుకునే వారు ఆటోమొబైల్ రంగాన్ని పెట్టుబడులకు పరిశీలించొచ్చు. ఈ విభాగంలో యూటీఐ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ప్రస్తుత ట్రెండ్.. నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు మంచి పనితీరు చూపించిన వాటిల్లో ఒకటి. 2021 అక్టోబర్ తర్వాత నుంచి చూస్తే ఆటోమొబైల్ రంగం నుంచి 171 లిస్టెడ్ కంపెనీలు ఉంటే, అందులో 50 స్టాక్స్ ఇప్పటికే గరిష్టాలకు చేరాయి. దీంతో స్టాక్స్ వ్యాల్యూషన్లను కొంత విస్తరించాయని అర్థం చేసుకోవాలి. కానీ, సాధారణంగా ఆటోమొబైల్ రంగంలో సైకిల్ మొదలైందంటే కనీసం రెండు నుంచి మూడేళ్లపాటు కొనసాగుతుందని నిపుణుల అంచనా. కనుక పెట్టుబడులకు ఇంకా మంచి అవకాశాలున్నట్టుగానే భావించాలి. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ యాక్టివ్ ఫండ్ ఇదొక్కటే. ఈ విభాగంలో ప్యాసివ్ ఫండ్‌ను కోరుకునే వారు నిఫ్టీ ఆటో ఈటీఎఫ్‌ను సైతం పరిశీలించొచ్చు. రాబడులు.. యూటీఐ ట్రాన్స్పోర్ట్ పథకం ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో అటు నిఫ్టీ టోటల్ రిటర్న్ ఇండెక్స్, నిఫ్టీ టీఆర్ఐ500 టీఆర్ఐ, నిఫ్టీ ఆటో టీఆర్ఐ కంటే మెరుగైన రాబడులు అందించడం గమనించాలి. అంటే చూడ్డానికి సైక్లికల్ రంగానికి సంబంధించిన పథకమే అయినా రాబడుల విషయంలో దీర్ఘకాలంలో మెరుగ్గా పనిచేయడాన్ని విస్మరించకూడదు. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 29 శాతం రాబడినిచ్చింది. మూడేళ్లలో వార్షిక రాబడి రేటు 24 శాతంగా ఉంది. ఐదేళ్లలో ఏటా 18 శాతానికి పైనే రాబడినిచ్చింది. 2004లో ఈ పథకం ప్రారంభం కాగా, 16 శాతం వార్షిక రాబడినిచ్చింది. పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.1,886 కోట్ల పెట్టుబడులున్నాయి. 96.42 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన పెట్టుబడులను నగదు, ఇతర రూపాల్లో కలిగి ఉంది. పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు 73 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. మిడ్‌క్యాప్ విభాగానికి 20 శాతం, స్మాల్‌క్యాప్ విభాగానికి 7 శాతం వరకు కేటాయించింది. పెట్టుబడుల ప్రాధాన్యాన్ని గమనించినట్టయితే నూరు శాతం తీసుకెళ్లి ఆటోమొబైల్ స్టాక్స్‌లో పెట్టలేదు. ఈ రంగానికి 80 శాతాన్ని కేటాయించింది. సేవల రంగ కంపెనీలకు 12.34 శాతం, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్‌కు 2.45 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
ఆకర్షణీయంగా హెల్త్‌కేర్, ఆటోమొబైల్
మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నా, ఇది బబుల్ వేల్యుయేషన్ కాకపోవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ (ఈక్విటీ) వి. శ్రీవత్స. ఇన్వెస్టర్లు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి సిద్ధపడి, ఈ స్థాయిలోనూ పెట్టుబడులను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, మెటల్స్ తదితర రంగాలు మధ్యకాలికంగా ఇన్వెస్ట్మెంట్కి ఆకర్షణీయంగా ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరిన్ని వివరాలు.. ► ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్‌పై మీ అంచనాలేమిటి. ఈ ఏడాది మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కరోనా వైరస్ పరిణామాల కారణంగా తొలినాళ్లలో ప్రపంచ దేశాలతో పాటు భారత మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఎకానమీ కూడా తీవ్రంగా దెబ్బతింది. అయితే, లాక్డౌన్ నిబంధనలను సరళతరం చేసి, ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించిన తర్వాత నుంచి మార్కెట్లు క్రమంగా సాధారణ స్థాయికి రావడం మొదలెట్టాయి. ఈ ఏడాది మార్చి కనిష్ట స్థాయి నుంచి రికార్డు స్థాయికి ర్యాలీ చేశాయి. డిమాండ్ పుంజుకుని, కార్పొరేట్లు మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిచ్చింది. ప్రస్తుతం మార్కెట్లు సముచిత వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ట్రేడవుతున్నాయి. వైరస్ రిస్కు లు ఇంకా పొంచి ఉన్నందున కాస్త కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. ► మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లకు మీ సలహా ఏంటి. మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ట్రేడవుతూ, వేల్యుయేషన్లు కూడా సగటుకు మించిన స్థాయిలో ఉన్నప్పటికీ ఇవి బుడగలాగా పేలిపోయే బబుల్ వేల్యుయేషన్లని భావించడం లేదు. అలాగే, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన స్థాయిలో అసంబద్ధమైన పరిస్థితులేమీ కూడా లేవు. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించవచ్చు. అయితే, కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి మాత్రం సంసిద్ధంగానే ఉండాలి. ఇక మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధించిన ప్రతికూల ప్రభావం పడకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల ఒడిదుడుకుల మార్కెట్లో సగటు కొనుగోలు రేటు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కాగలదు. ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టాలంటే, దీర్ఘకాలిక సగటు కన్నా మార్కెట్లు చౌకగా ట్రేడవుతున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ► ఈక్విటీ ఇన్వెస్టర్లకు రాబోయే రోజుల్లో ఎలాంటి పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం కోవిడ్ సంబంధ బలహీన పరిస్థితుల నుంచి కోలుకుంటున్న దేశీ ఆధారిత పరిశ్రమలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంది. ఇక ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్ వంటి కొన్ని దేశీయ పరిశ్రమల వేల్యుయేషన్లు దీర్ఘకాలిక సగటుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. వ్యయ నియంత్రణకు ప్రాధాన్యం పెరిగి, డిజిటల్ మాధ్యమం వైపు మళ్లుతుండటం వల్ల వినియోగదారులతో నేరుగా లావాదేవీలు జరిపే సంస్థలకు ఎంతో ఆదా కానుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణల ఊతంతో పాటు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న యుటిలిటీస్ రంగ సంస్థలు కూడా ఆశావహంగానే ఉంటాయి. ► మధ్యకాలికంగా ఏయే రంగాలు మెరుగ్గా ఉండవచ్చు. వేటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆటోమొబైల్స్, హెల్త్‌కేర్, మెటల్స్, యుటిలిటీస్, భారీ యంత్ర పరికరాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సముచిత వేల్యుయేషన్లలో లభిస్తుండటం, మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఇక, ఫైనాన్షియల్స్, కన్జూమర్ గూడ్స్ షేర్ల విషయంలో కొంత అండర్‌వెయిట్‌గా ఉన్నాం. నాణ్యమైన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల స్టాక్స్ చాలా ఖరీదైనవిగా మారడం ఇందుకు కారణం. ► మీరు నిర్వహిస్తున్న యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ పనితీరు ఎలా ఉంది. గత ఏడాది కాలంగా యూటీఐ హెల్త్‌కేర్ సెక్టార్ మెరుగ్గా రాణించడంతో పాటు బెంచ్‌మార్క్‌ను కూడా అధిగమించింది. ఫార్మా రంగం .. మొత్తం మార్కెట్‌కు మించిన పనితీరు కనబర్చింది. భవిష్యత్ వృద్ధి అవకాశాలు ఆశావహంగా ఉండటం ఇందుకు కారణం. మరోవైపు, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ అనేది ఎక్కువగా లార్జ్, మిడ్ క్యాప్ విభాగం స్టాక్స్‌పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది కాలంగా ఇది కాస్త ఆశించిన స్థాయి కన్నా తక్కువగానే రాణించింది. దీర్ఘకాలికంగా లాభదాయకత రికార్డు ఉండి, చౌక వేల్యుయేషన్స్‌లో లభించే సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. -
నేటి నుంచి మూడు ఐపీఓలు
ప్రైమరీ మార్కెట్ మళ్లీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లతో కళకళలాడుతోంది. గతవారమే మూడు కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ వారం... అదీ...నేటి(మంగళవారం) నుంచి మరో మూడు ఐపీఓలు (–మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్) సందడి చేయనున్నాయి. గతవారం ఐపీఓలకు మంచి స్పందన వచ్చినట్లే ఈ ఐపీఓలకు కూడా ఇన్వెస్టర్ల నుంచి స్పందన లభించవచ్చని అంచనా. గురువారం (అక్టోబర్ 1న) ముగిసి వచ్చే నెల 12న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే ఈ ఐపీఓలకు సంబంధించి మరిన్ని వివరాలు... మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తున్న తొలి ప్రభుత్వ రంగ ఐపీఓ ఇది. రూ.135–145 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఇష్యూ సైజు రూ.444 కోట్లు. కనీసం 103 షేర్లకు దరఖాస్తు చేయాలి. లిస్టింగ్ లాభాలు, దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ఐపీఓకు దరఖాస్తు చేయవచ్చని పలు బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) 90 శాతం(రూ.125–130) రేంజ్లో ఉండటంతో లిస్టింగ్‌లో మంచి లాభాలు వస్తాయని నిపుణులంటున్నారు. యూటీఐ ఏఎమ్‌సీ ఈ వారంలో వస్తున్న అతి పెద్ద ఐపీఓ ఇదే. రూ.552–554 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,260 కోట్లు సమీకరించగలదని అంచనా. కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.40–42 రేంజ్లో ఉంది. లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయిల్, గ్యాస్పైప్లైన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలందించే ఈ కంపెనీ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ. 117–120గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.20 రేంజ్లో ఉంది. -
పెట్టుబడులపై రాబడితోపాటు బీమా
పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ ఎవరైనా కానీ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తట్టుకుని, దీర్ఘకాలంలో అధిక రాబడులు సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే ఉంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఈక్విటీ మార్కెట్లు ఎంతో అస్థిరతంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రిస్క్ తీసుకోలేని ఇన్వెస్టర్లు ఈ తరహా ఆటుపోట్ల నుంచి రక్షణకు బ్యాలన్స్డ్ లేదా హైబ్రిడ్ డెట్ ఫండ్స్‌ను పెట్టుబడుల కోసం పరిశీలించొచ్చు. ఇవి స్థిరమైన రాబడులను ఇస్తాయి. అదే సమయంలో పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను తగ్గిస్తాయి. ఓ వ్యక్తి జీవితంలో ఎన్నో ఆర్థిక లక్ష్యాలు ఉంటుంటాయి. మధ్యలో ఊహించని ఆసక్మిక పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. కనుక పెట్టుబడులతోపాటు జీవిత బీమా రక్షణ కూడా ఉండడం ఎంతో అవసరం. సరైన జీవిత బీమా కవరేజీ కూడా ఒక రకమైన పెట్టుబడే అవుతుందంటారు నిపుణులు. ఈ రకంగా చూసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) ఆఫర్ చేసే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్) జీవితానికి రక్షణతోపాటు, దీర్ఘకాలంలో సంపద సృష్టికి వీలు కల్పిస్తాయి. వీటిల్లో యూటీఐ యులిప్ ఇతర యులిప్‌లతో పోలిస్తే భిన్నమైన ఫీచర్లతో మెరుగ్గా ఉంటుంది. యూటీఐ యులిప్ ఓపెన్ ఎండెడ్, పన్ను ఆదా చేసే బీమా ప్లాన్. ఈ పథకంలో చేసే పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపుతోపాటు రూ.15 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. సుదీర్ఘకాల చరిత్ర యూటీఐ యులిప్ మన దేశంలో మొట్టమొదటి యులిప్ పాలసీ. 1971 అక్టోబర్ 1న ఆరంభమైంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి ఎల్ఐసీ నుంచి జీవిత బీమా కవరేజీ ప్లాన్ లభిస్తుంది. జీవిత బీమాతోపాటు ప్రమాద బీమా కవరేజీని కూడా యూటీఐ యులిప్ ఆఫర్ చేస్తుండటం గమనార్హం. పెట్టుబడి ఆస్తుల్లో 40 శాతాన్ని ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన మొత్తాన్ని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెడతారు. రిస్క్ అన్నది తక్కువ నుంచి మధ్యస్థంగా ఉంటుంది. రూ.15 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ, రూ.50 వేలకు ప్రమాద బీమా కవరేజీ తీసుకోవచ్చు. పైగా బీమా కవరేజీ కోసం ఇన్వెస్టర్లు రూపాయి చెల్లించక్కర్లేదు. ప్రీమియం భారాన్ని పూర్తిగా యూటీఐ మ్యూచువల్ ఫండ్ భరిస్తుంది. కాల వ్యవధి పాలసీ కాల వ్యవధి 10 నుండి 15 ఏళ్లు. ఇందులో టార్గెట్ అమౌంట్ అని ఉంటుంది. కనీసం రూ.15,000, గరిష్టం రూ.15 లక్షలు. ఇన్వెస్టర్ వీటిల్లో ఏ మేరకు టార్గెట్ అమౌంట్ ఎంచుకుంటే ఆ మొత్తాన్ని ఏడాదికోసారి లేదా అర్ధ సంవత్సరం వారీగా లేక సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తుండాలి. 12 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులు దీన్ని తీసుకోవచ్చు. వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండడం గమనించాలి. ఇన్వెస్టర్ తనకు అవసరమైనప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఎగ్జిట్‌లోడ్ ఉంటుంది. ఆలస్యపు చెల్లింపులపై పెనాల్టీ లేదు. మెచ్యూరిటీ బోనస్‌గా 10 ఏళ్ల పాలసీపై 5 శాతం, 15 ఏళ్ల పాలసీపై 7.5 శాతాన్ని టార్గెట్ అమౌంట్‌పై ఇవ్వడం జరుగుతుంది. కాల వ్యవధి తీరిన తర్వాత ప్రతీ ఏడాదికి టార్గెట్ అమౌంట్‌పై 0.50 శాతాన్ని కూడా బోనస్‌గా ఇస్తారు. కాల వ్యవధి తర్వాత క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణను ఎంచుకునే ఆప్షన్ ఉంది. ఈ పథకంలో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 1.7 శాతం. ఇతర ఫండ్స్ పథకాల్లోని ఎక్స్పెన్స్ రేషియోతో పోలిస్తే తక్కువే. యులిప్ అంటే దీర్ఘకాలం కోసం తీసుకునేది. ఈ పథకంలో పదేళ్ల రాబడులను పరిశీలిస్తే వార్షికంగా 8.54 శాతం చొప్పున ఉన్నాయి. రిస్క్‌ను పరిమితం చేసి, రాబడులను అధికం చేసే విధానంలో ఈ పథకం పెట్టుబడులను కొనసాగిస్తుంటుంది. లార్జ్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకుని, దీర్ఘకాలం వాటిల్లో పెట్టబడులను కొనసాగించడం ఇదే తెలియజేస్తుంది. తక్కువ చార్జీలు, ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేకపోవడం, పారదర్శకత, జీవిత, ప్రమాద బీమా కవరేజీలు ఇవన్నీ ‘యూటీఐ యులిప్’ను స్మార్ట్ పెట్టుబడి పథకంగా మార్చేశాయి. -
యూటీఐ నుంచి కొత్త ఈక్విటీ ఫండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మ్యూచువల్ ఫండ్ సంస్థ యూటీఐ ఎంఎఫ్ తాజాగా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్– V (ఫైవ్)ని ప్రవేశపెడుతోంది. ఈ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ ఈ నెల 20న ప్రారంభమై డిసెంబర్ 4న ముగుస్తుందని సంస్థ ఈవీపీ, ఫండ్ మేనేజర్ వి.శ్రీవత్స శుక్రవారమిక్కడ విలేకరులకు చెప్పారు. ఈ ఫండ్ పరిమాణం సుమారు రూ. 500 కోట్లుగా ఉంటుందని, దీర్ఘకాలిక వ్యవధితో ఇన్వెస్ట్ చేయదల్చుకునేవారికి ఇది అనువైనదిగా ఉంటుందని శ్రీవత్స తెలిపారు. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో గరిష్టంగా 25–30 స్టాక్స్ ఉంటాయని తెలిపారు. ప్రధానంగా బ్యాంకింగ్, ఫార్మా, లాజిస్టిక్స్, లైఫ్‌స్టయిల్ రంగాల షేర్లు ఉంటాయన్నారు. బీఎస్ఈ–200 బెంచ్‌మార్క్ కన్నా 20–25 శాతం మేర అధిక రాబడులు అందించాలన్నది లక్ష్యమని చెప్పారాయన. ఫిక్సిడ్ డిపాజిట్లు మొదలైన వాటిపై రాబడులు తగ్గడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లవైపు చూస్తున్నారని శ్రీవత్స తెలిపారు. మూడీస్ తాజాగా భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు మరింతగా రాగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నిర్వహణలో ఉన్న అసెట్స్ (ఏయూఎం)పరంగా చూస్తే .. తమ ఫండ్ ఆరో స్థానంలో ఉందని, ఏయూఎం సుమారు రూ.2.5 లక్షల కోట్ల మేర ఉంటుందని శ్రీవత్స తెలిపారు. -
ఆర్థిక ఫలితాలే దిక్సూచి
♦ ఫలితాలు బాగుంటే మార్కెట్లు ఇంకా పెరుగుతాయి ♦ కానీ క్యూ4లో డీమోనిటైజేషన్ ప్రభావం ఉండొచ్చు ♦ మార్కెట్లపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోంది ♦ బ్యాంకింగ్, నిర్మాణ రంగాలు ఆశావహంగా ఉన్నాయి ♦ సాక్షి’తో యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఈవీపీ సంజయ్ డోంగ్రే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీమోనిటైజేషన్ ప్రభావాలు నాలుగో త్రైమాసికంలోనే పూర్తి స్థాయిలో ప్రతిఫలించనున్న నేపథ్యంలో క్యూ4లో ఆదాయాలపరంగా చూస్తే కంపెనీల ఆర్థిక ఫలితాలు ఒక మోస్తరుగానే ఉండొచ్చని తెలిపారు యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ డోంగ్రే. ద్విచక్ర వాహనాలు, ఎఫ్ఎంసీజీ, సిమెంట్ రంగాలపై పెద్ద నోట్ల రద్దు గణనీయంగా పడిందని చెప్పారాయన. ఐఐపీ తగ్గుదల తదితర గణాంకాలు డీమోనిటైజేషన్ ప్రభావాలను కొంత ప్రతిబింబించేవిగా ఉన్నాయని, అయితే రీమోనిటైజేషన్ జరిగే కొద్దీ ప్రతికూల ప్రభావాలు క్రమంగా తొలగిపోయి పరిస్థితులు మెరుగుపడగలవని సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ల దిశానిర్దేశానికి ఆర్థిక ఫలితాలే కీలకంగా ఉండగలవని ఆయన వివరించారు. స్వల్పకాలికంగా మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని, కార్పొరేట్ల ఫలితాలు మెరుగ్గా ఉంటే.. మరింత పైకి పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇన్ఫ్రా... బ్యాంకింగ్.. ప్రైవేట్ రంగ స్థితిగతుల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో మౌలిక రంగంలో పెట్టుబడులు ఎక్కువగా ప్రభుత్వం నుంచే రావాల్సి ఉంటుందని సంజయ్ చెప్పారు. మౌలిక సదుపాయాల కల్ప నకు తోడ్పడేలా వివిధ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటోందన్నారు. ఇక బ్యాంకింగ్ రంగం విషయానికొస్తే అధిక మొండిబకాయిల రూపంలో అసెట్ క్వాలిటీ సమస్యలు ప్రధానంగా ఉంటున్నాయన్నారు. అయితే కార్పొరేట్లకు ఎక్కువగా రుణాలిచ్చిన బ్యాంకులతో పోలిస్తే రిటైల్ రుణాలపై దృష్టి పెట్టిన బ్యాంకుల పరిస్థితి మెరుగ్గానే ఉండగలదన్నారు. రుణాల మంజూరీ వృద్ధి తక్కువగానే ఉండటంతో.. లాభాలు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటాయని, ఎకానమీ మెరుగుపడే కొద్దీ వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో ఎన్పీఏలు కూడా తగ్గు ముఖం పట్టి కార్పొరేట్లకు రుణాలిచ్చిన బ్యాంకులు కూడా కొంత మెరుగైన ఆర్థిక ఫలితాలే ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. పెరుగుతున్న దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు .. దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లలో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నారని సంజయ్ చెప్పారు. రియల్టీ తదితర రంగాల పరిస్థితి ఆశావహంగా లేకపోవడంతో గడిచిన రెండు మూడేళ్లలో మార్కెట్లలోకి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. మార్కెట్ల తీరుతెన్నులు, వాటి హెచ్చుతగ్గుల గురించి ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోందని, దీంతో ఈక్విటీలకు అధిక కేటాయింపులు జరుపుతున్నారని వెల్లడించారు. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు వచ్చే కొద్దీ మార్కెట్లలో కొంత చెప్పుకోతగ్గ కదలికలు ఉంటాయన్నారు. ప్రస్తుతం మార్కెట్ల వేల్యుయేషన్స్ మరీ ఖరీదైనవిగా గానీ లేదా మరీ చౌకైనవిగా గానీ అనుకోవడానికి లేదని సంజయ్ చెప్పారు. మొత్తం లాభాల్లో డిఫెన్సివ్ రంగాలతో పోలిస్తే సీజనల్ రంగాల వాటా ఎక్కువగా ఉంటోందన్నారు. రంగాలవారీగా చూస్తే ఆటోమొబైల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, సిమెంటు, నిర్మాణం మొదలైన సీజనల్ రంగాల సంస్థలు మెరుగ్గా ఉండొచ్చని సంజయ్ చెప్పారు. -
వచ్చే ఏడాది యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ!
ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూపు ముంబై: మ్యూచువల్ ఫండ్ దిగ్గజం యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. వచ్చే ఏడాది రెండో అర్థభాగంలో ఐపీఓకు వచ్చే అవకాశాలున్నాయని యూటీఐ ఎండీ, లియో పురి చెప్పారు. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, ఏ క్షణమైనా ప్రభుత్వ ఆమోదం లభించగలనది పేర్కొన్నారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే మర్చంట్ బ్యాంకర్లను నియమిస్తామని, సెబీ ఆమోదం కోసం దరఖాస్తు చేస్తామని వివరించారు. ఐపీఓ నిధులతో ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థలను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సంస్థ విలువ వంద కోట్ల డాలర్లు (సుమారుగా రూ.6,800 కోట్లు) ఉ ండొచ్చని అంచనా. మ్యూచువల్ ఫండ్ రంగంలో యూటీఐదే గతంలో అగ్రస్థానం. యూఎస్ 64 స్కీమ్ సంక్షోభం తర్వాత కష్టాల్లో పడిన ఈ సంస్థ ప్రస్తుతం రూ.1,29,888 కోట్ల నిర్వహణ ఆస్తులతో ఆరో స్థానంలో ఉంది. . యూటీఐ ఐపీఓకు వస్తే, స్టాక్ మార్కెట్లో లిస్టయిన తొలి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇదే అవుతుంది. యూటీఐ మ్యూచువల్ ఫండ్‌లో ఎస్బీఐ, ఎల్ఐసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్–ఒక్కో సంస్థకు 18.5 శాతం చొప్పున, అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ, టి రొవె ప్రైస్‌కు 26 శాతం చొప్పున వాటాలున్నాయి. -
ఫార్చ్యూన్ నెక్స్ట్ 500లో జస్ట్‌డయల్, ఐఆర్సీటీసీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫార్చ్యూన్ నెక్స్ట్ 500 భారతీయ కంపెనీల జాబితాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ వెల్లడించింది. జస్ట్ డయల్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఐఆర్సీటీసీ తదితర సంస్థల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీల్లో చాలా వరకూ మిడ్ సైజ్ కంపెనీలు. ఈ కంపెనీలను స్మాల్ వండర్స్‌గా ఈ మ్యాగజైన్ అభివర్ణించింది. ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీలు ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. వివరాలు.., ♦ ఈ జాబితాలో డైనమాటిక్ టెక్నాలజీస్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. రూ.1,693 కోట్ల వార్షిక ఆదాయంతో ఈ కంపెనీ ఈ ఘనత సాధించింది. ♦ ఆ తర్వాతి స్థానాల్లో నెక్టార్ లైఫ్‌సైన్స్(రూ.1,692 కోట్లు), ఓస్వాల్ ఉలెన్ మిల్స్(రూ.1,689 కోట్లు), వీఆర్ఎల్ లాజిస్టిక్స్(రూ.1,682.5 కోట్లు), హిటాచి హోమ్ అండ్ లైఫ్ సొల్యూషన్స్(రూ.1,682 కోట్లు)లు ఉన్నాయి. ♦ నెక్స్ట్ 500 జాబితాలోని మొత్తం కంపెనీల ఆదాయం రూ.5,14,788 కోట్లుగా ఉంది. ఒక్కో కంపెనీ సగటు ఆదాయం రూ.1,000 కోట్ల పైమాటే. ♦ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీలు వివిధ రంగాలకు చెందినవి. ఈ కంపెనీలు బేసిక్ మెటీరియల్స్, ఆర్థిక సేవలు, ఆహారం,వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఇనుము, ఉక్కు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ♦ టాప్10లో ఉన్న కంపెనీల్లో కొన్ని-గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొ, లుకాస్-టీవీఎస్,గతి, అడెక్కో ఇండియా, జిందాల్ అల్యూమినియం, ♦ ఇండియన్ రైల్వేస్ టూరిజమ్ అండ్ కేటరింగ్ విభాగం ఐఆర్సీటీసీ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. గత ఏడాది జాబితాలో 328గా ఉన్న ఈ కంపెనీ ర్యాంక్ ఈసారి జాబితాలో 199కు పెరిగింది. ♦ ఈ జాబితాలో తొలిసారిగా చేరిన యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి 442, జస్ట్ డయల్ కంపెనీకి 449 ర్యాంక్‌లు లభించాయి. ♦ ఇటీవలే ఐపీఓకు వచ్చిన నారాయణ హృదయాలయ, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్ కంపెనీలు ఈ జాబితాలో స్థానాలు సాధించాయి. -
మనీ ‘ఫండి’స్తున్నారు...
భారతదేశంలో రెండవ మహిళా ఫండ్ మేనేజర్. 1998లో ఫండ్ మేనేజర్‌గా యూటీఐలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఈమె నిర్వహిస్తున్న ఆస్తుల విలువ రూ.7,000 కోట్లుపైనే ఉంది. యూటీఐ మాస్టర్ షేర్, ఎంఎన్సీ, ట్యాక్స్ సేవింగ్, టాప్ 100, డివిడెండ్ ఈల్డ్ వంటి ప్రధానమైన ఫండ్స్‌ను ఈమే నిర్వహిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రంగంపై మహిళలు ఆసక్తి చూపుతున్నారనేది స్వాతి మాట. పేరు: స్వాతి కులకర్ణి(48) హోదా: యూటిఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ: రూ. 7,000 కోట్లు రీసెర్చ్ ఎనలిస్ట్‌గా 1995లో కెరీర్ ప్రారంభించారు. 2007లో ఎస్బీఐలో రీసెర్చ్ హెడ్ అయ్యారు. 2010లో ఫండ్ మేనేజర్‌గా పదోన్నతి. ప్రస్తుతం ఈమె ఎస్బీఐ బ్లూచిప్, వన్ ఇండియాకి చెందిన రూ.1,200 కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్నారు. ‘‘ఈ కెరీర్లో చాలా సవాళ్లున్నాయి. ఒక షేరును అంతా ఎగబడి కొంటున్నప్పుడు నేనైతే దానికి దూరంగా ఉండటానికే ఇష్టపడతా. అవసరమైతే ఆ లాభం పోగొట్టుకోవటానికైనా సిద్ధమే’’ అంటారు సొహిని. పేరు: స్వాతి42) హోదా: ఎస్బీఐఎంఎఫ్ ఫండ్ మేనేజర్ నిర్వహిస్తున్న ఆస్తులు: రూ.1,200కోట్లు అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ మేనేజర్‌గా... రూ.8,000 కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్నారు జ్యోతి వాశ్వాని. తాను పనిచేసిన జేఎం క్యాపిటల్, జేఎం షేర్ బ్రోకర్స్, ప్రభుదాస్ లీలాధర్ వంటి ప్రతిచోటా ఆమె పురుషులతో పోటీపడి వారికంటే ముందుండేవారు. ‘‘నేను 1995లో కెరీర్ ప్రారంభించినప్పుడు ఈ రంగంపై మహిళలకు ఆసక్తి లేదు. కానీ ఇప్పుడు ఫండ్ మేనేజర్లుగా రాణించడానికి చక్కటి వాతావరణం ఉంది’’ అంటారు జ్యోతి. పేరు: జ్యోతి వాశ్వాని (43) హోదా: అవైవా చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ నిర్వహిస్తున్న ఆస్తులు: రూ.8,000 కోట్లు {ఫాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఫండ్ మేనేజర్‌గా రూ.2,500 కోట్లకుపైగా ఆస్తులను నిర్వహిస్తున్నారు రోషి జైన్. 1998 సీఏ ఎగ్జామ్స్‌లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ సాధించిన జైన్... గోల్డ్‌మాన్ శాక్స్‌లో ఎనలిస్ట్‌గా వృత్తిని ప్రారంభించారు. సీఏ చేస్తుండగానే స్టాక్ మార్కెట్‌పై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించారీమె. కెరీర్ కోసం పెళ్లికాకుండా ఒంటరిగా మిగిలిపోయినా... తనకు ఎలాంటి బాధా లేదంటున్నారీమె. పేరు: రోషి జైన్ (36) హోదా: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ -
ప్రస్తుత ఒడిదుడుకులకు రూపాయే కారణం
ఇప్పటికే ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడంతో రానున్న రోజుల్లో అమెరికా ఉద్దీపన ప్యాకీజీలను ఉపసంహరించుకున్నా మన మార్కెట్లపై అంతగా ప్రభావం ఉండదంటున్నారు యూటీఐ ఫండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్ సంజయ్ డాంగ్రే. కొన్ని రంగాల షేర్ల ధరలు నిఫ్టీ 9,000 పాయింట్ల స్థాయి వద్ద ఉంటే మరికొన్ని 2,000 పాయింట్ల స్థాయి వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లు పెరిగినా, తగ్గినా భారీ స్థాయిలోనే ఉంటున్నాయి. ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులను ఏ విధంగా చూసున్నారు? ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులకు ప్రధాన కారణం రూపాయే. గత రెండు నెలల నుంచి రూపాయి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడుతోంది. క్షీణిస్తున్న రూపాయి ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచుతోంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 100 డాలర్ల నుంచి 115 డాలర్లకు చేరడం, ద్రవ్యలోటు వంటివి మార్కెట్లను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఒక్కసారి రూపాయిలో స్థిరత్వం వస్తే ఈ ఒడిదుడుకులకు అడ్డుకట్ట పడుతుంది. చాలా రోజుల తర్వాత గురువారం బ్యాంకు షేర్లు పరుగులు తీశాయి. బ్యాంక్ షేర్లలో పతనం అయిపోయిందని భావించొచ్చా? గత రెండు నెలల్లో బ్యాంకు షేర్లు 40-42 శాతం వరకు క్షీణించాయి. దీంతో విలువ పరంగా చాలా బ్యాంకు షేర్లు ఆకర్షణీయ ధరకు వచ్చి చేరాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకుల షేర్లయితే వాటి పుస్తక విలువ స్థాయికి పడిపోయాయి. దీనికితోడు ఆర్బీఐ బుధవారం తీసుకున్న చర్యలతో బ్యాంకులకు చౌకగా డాలర్లలో నిధులు సేకరించే వెసులుబాటు కలిగింది. ఒక్కసారి రూపాయి దిగివస్తే కఠిన లిక్విడిటీ చర్యలు తొలగిస్తుందన్న సంకేతాలు బలపడటం, షార్ట్‌కవరింగ్ వంటి కారణాలతో గురువారం బ్యాంకు షేర్లు పరుగులు పెట్టాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ)లు దేశీయ మార్కెట్‌ను ఏ విధంగా చూస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలను తొలగించడం మొదలు పెడితే ఆ ప్రభావం మన ఆర్థిక మార్కెట్లపై ఏ విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? గత రెండు నెలల్లో ఎఫ్ఐఐలు ఈక్విటీల్లో 2.5 నుంచి 3 మిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపితే డెట్ మార్కెట్లో 8 బిలియన్ డాలర్ల వరకు జరిపారు. ప్రస్తుతం ఎఫ్ఐఐల ప్రవర్తన అనేది అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, దేశీయ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌పై ఆధారపడి ఉంటుంది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరించుకున్నా మన మార్కెట్లపై ఇక పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. రూపాయి కదలికలు ఏ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు? రూపాయి ఒడిదుడుకులను అడ్డుకోవడానికి ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. బంగారం దిగుమతులు వంటి ఆంక్షల వల్ల కరెంట్ అకౌంట్ లోటు దిగొస్తే రూపాయి విలువ తిరిగి బలపడుతుంది. ఉండాల్సిన విలువ కంటూ రూపాయి విలువ చాలా తక్కువ ఉందని ఆర్బీఐ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. ఒక్కసారి ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఫలితమిస్తే డాలరుతో రూపాయి విలువ సంవత్సరం మొత్తం మీద రూ.56-54 వద్ద స్థిరపడుతుంది. ఆర్బీఐ చర్యల వలన వడ్డీరేట్లు తిరిగి పెరుగుతున్నాయి. రానున్న 12 నెలల కాలంలో వడ్డీరేట్లు ఏ విధంగా ఉంటాయని అంచనా..? రూపాయి ఒడిదుడుకులను అరికట్టడానికి తీసకుంటున్న చర్యల వలన స్వల్పకాలిక వడ్డీరేట్లు పెరుగుతున్నాయి. ఒక్కసారి రూపాయి స్థిరపడితే ఆర్బీఐ ఈ ఆంక్షలను ఎత్తేస్తుంది. ఒక్కసారి ఆర్థిక పరిస్థితి చక్కబడితే కాని ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం లేదు. దశాబ్దాల కనిష్టస్థాయికి జీడీపీ పడిపోవడం, ప్రమాద స్థాయిలో ద్రవ్యలోటు వంటివి మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయిలో ఉందన్న సంకేతాలను ఇస్తున్నాయి. కాని ఒకపక్క చూస్తే స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి కేవలం పది శాతం దూరంలో ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు. ఇటువంటి సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని సూచిస్తారా? ఇండెక్స్‌ల పరంగా చూస్తే ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి కేవలం పది శాతం దూరంలోనే ఉన్నప్పటికీ ప్రస్తుత మార్కెట్‌ను రెండు విధాలుగా చూడాలి. కొన్ని రంగాల షేర్లు నిఫ్టీ 8-9 వేల పాయింట్ల స్థాయిలో ఉన్నప్పుడు ఉండే ధర వద్ద ట్రేడ్ అవుతుంటే మరికొన్ని రంగాలు నిఫ్టీ 2,000-3,000 పాయింట్ల స్థాయి వద్ద ఉంటే ఆ ధరల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు అధిక ధరల్లో ట్రేడ్ అవుతుంటే, వడ్డీరేట్ల ప్రభావం చూపే బ్యాంకింగ్, ఇంజనీరింగ్, ఇన్ఫ్రా వంటి రంగాలు ఐదేళ్లు, పదేళ్ళ కనిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుండటం, రూపాయి విలువ క్షీణిస్తుండటంతో ఫార్మా, ఐటీ రంగాలు ఆమేరకు ప్రయోజనం పొందుతున్నాయి. వచ్చే 12 నెలల్లో జీడీపీ వృద్ధిరేటు ఒక మోస్తరుగానే ఉండే అవకాశం ఉండటంతో ఒక సంవత్సరం దృష్టితో ఇన్వెస్ట్ చేసే వారికి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ బాగుంటాయి. అదే మూడు నుంచి ఐదేళ్ళ కాలంతో ఇన్వెస్ట్ చేసేవారికి వడ్డీరేట్లు ప్రభావం చూపే రంగాలకేసి చూడొచ్చు. వచ్చే సంవత్సర కాలంలో ఇండెక్స్‌లు ఏ శ్రేణిలో కదులుతాయి? ప్రస్తుత పరిస్థితుల్లో ఇండెక్స్ కదలికలను అంచనా వేయడం చాలా కష్టం. ఇది పూర్తిగా ద్రవ్యలోటును ఏ విధంగా తగ్గిస్తారన్నదానిపైన, ఆర్బీఐ లిక్విడిటీ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ద్రవ్యలోటు అదుపులోకి వస్తే తిరిగి మార్కెట్లు పరుగులు తీస్తాయి. - బిజినెస్ బ్యూరో, హైదరాబాద్