వచ్చే ఏడాది యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ!
ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూపు
ముంబై: మ్యూచువల్ ఫండ్ దిగ్గజం యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. వచ్చే ఏడాది రెండో అర్థభాగంలో ఐపీఓకు వచ్చే అవకాశాలున్నాయని యూటీఐ ఎండీ, లియో పురి చెప్పారు. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, ఏ క్షణమైనా ప్రభుత్వ ఆమోదం లభించగలనది పేర్కొన్నారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే మర్చంట్ బ్యాంకర్లను నియమిస్తామని, సెబీ ఆమోదం కోసం దరఖాస్తు చేస్తామని వివరించారు. ఐపీఓ నిధులతో ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థలను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.
ఈ సంస్థ విలువ వంద కోట్ల డాలర్లు (సుమారుగా రూ.6,800 కోట్లు) ఉ ండొచ్చని అంచనా. మ్యూచువల్ ఫండ్ రంగంలో యూటీఐదే గతంలో అగ్రస్థానం. యూఎస్ 64 స్కీమ్ సంక్షోభం తర్వాత కష్టాల్లో పడిన ఈ సంస్థ ప్రస్తుతం రూ.1,29,888 కోట్ల నిర్వహణ ఆస్తులతో ఆరో స్థానంలో ఉంది. . యూటీఐ ఐపీఓకు వస్తే, స్టాక్ మార్కెట్లో లిస్టయిన తొలి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇదే అవుతుంది. యూటీఐ మ్యూచువల్ ఫండ్‌లో ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్–ఒక్కో సంస్థకు 18.5 శాతం చొప్పున, అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ, టి రొవె ప్రైస్‌కు 26 శాతం చొప్పున వాటాలున్నాయి.