ప్రస్తుత ఒడిదుడుకులకు రూపాయే కారణం
ప్రస్తుత ఒడిదుడుకులకు రూపాయే కారణం
Published Fri, Sep 6 2013 6:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
ఇప్పటికే ఎఫ్‌ఐఐలు పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడంతో రానున్న రోజుల్లో అమెరికా ఉద్దీపన ప్యాకీజీలను ఉపసంహరించుకున్నా మన మార్కెట్లపై అంతగా ప్రభావం ఉండదంటున్నారు యూటీఐ ఫండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్ సంజయ్ డాంగ్రే. కొన్ని రంగాల షేర్ల ధరలు నిఫ్టీ 9,000 పాయింట్ల స్థాయి వద్ద ఉంటే మరికొన్ని 2,000 పాయింట్ల స్థాయి వద్ద ఉన్నాయని ఆయన అన్నారు.
ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లు పెరిగినా, తగ్గినా భారీ స్థాయిలోనే ఉంటున్నాయి. ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులను ఏ విధంగా చూసున్నారు?
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులకు ప్రధాన కారణం రూపాయే. గత రెండు నెలల నుంచి రూపాయి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడుతోంది. క్షీణిస్తున్న రూపాయి ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచుతోంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 100 డాలర్ల నుంచి 115 డాలర్లకు చేరడం, ద్రవ్యలోటు వంటివి మార్కెట్లను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఒక్కసారి రూపాయిలో స్థిరత్వం వస్తే ఈ ఒడిదుడుకులకు అడ్డుకట్ట పడుతుంది.
చాలా రోజుల తర్వాత గురువారం బ్యాంకు షేర్లు పరుగులు తీశాయి. బ్యాంక్ షేర్లలో పతనం అయిపోయిందని భావించొచ్చా?
గత రెండు నెలల్లో బ్యాంకు షేర్లు 40-42 శాతం వరకు క్షీణించాయి. దీంతో విలువ పరంగా చాలా బ్యాంకు షేర్లు ఆకర్షణీయ ధరకు వచ్చి చేరాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకుల షేర్లయితే వాటి పుస్తక విలువ స్థాయికి పడిపోయాయి. దీనికితోడు ఆర్‌బీఐ బుధవారం తీసుకున్న చర్యలతో బ్యాంకులకు చౌకగా డాలర్లలో నిధులు సేకరించే వెసులుబాటు కలిగింది. ఒక్కసారి రూపాయి దిగివస్తే కఠిన లిక్విడిటీ చర్యలు తొలగిస్తుందన్న సంకేతాలు బలపడటం, షార్ట్‌కవరింగ్ వంటి కారణాలతో గురువారం బ్యాంకు షేర్లు పరుగులు పెట్టాయి.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ)లు దేశీయ మార్కెట్‌ను ఏ విధంగా చూస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలను తొలగించడం మొదలు పెడితే ఆ ప్రభావం మన ఆర్థిక మార్కెట్లపై ఏ విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు?
గత రెండు నెలల్లో ఎఫ్‌ఐఐలు ఈక్విటీల్లో 2.5 నుంచి 3 మిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపితే డెట్ మార్కెట్లో 8 బిలియన్ డాలర్ల వరకు జరిపారు. ప్రస్తుతం ఎఫ్‌ఐఐల ప్రవర్తన అనేది అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, దేశీయ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌పై ఆధారపడి ఉంటుంది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరించుకున్నా మన మార్కెట్లపై ఇక పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు.
రూపాయి కదలికలు ఏ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు?
రూపాయి ఒడిదుడుకులను అడ్డుకోవడానికి ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. బంగారం దిగుమతులు వంటి ఆంక్షల వల్ల కరెంట్ అకౌంట్ లోటు దిగొస్తే రూపాయి విలువ తిరిగి బలపడుతుంది. ఉండాల్సిన విలువ కంటూ రూపాయి విలువ చాలా తక్కువ ఉందని ఆర్‌బీఐ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. ఒక్కసారి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు ఫలితమిస్తే డాలరుతో రూపాయి విలువ సంవత్సరం మొత్తం మీద రూ.56-54 వద్ద స్థిరపడుతుంది.
ఆర్‌బీఐ చర్యల వలన వడ్డీరేట్లు తిరిగి పెరుగుతున్నాయి. రానున్న 12 నెలల కాలంలో వడ్డీరేట్లు ఏ విధంగా ఉంటాయని అంచనా..?
రూపాయి ఒడిదుడుకులను అరికట్టడానికి తీసకుంటున్న చర్యల వలన స్వల్పకాలిక వడ్డీరేట్లు పెరుగుతున్నాయి. ఒక్కసారి రూపాయి స్థిరపడితే ఆర్‌బీఐ ఈ ఆంక్షలను ఎత్తేస్తుంది. ఒక్కసారి ఆర్థిక పరిస్థితి చక్కబడితే కాని ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం లేదు.
దశాబ్దాల కనిష్టస్థాయికి జీడీపీ పడిపోవడం, ప్రమాద స్థాయిలో ద్రవ్యలోటు వంటివి మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయిలో ఉందన్న సంకేతాలను ఇస్తున్నాయి. కాని ఒకపక్క చూస్తే స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి కేవలం పది శాతం దూరంలో ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు. ఇటువంటి సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని సూచిస్తారా?
ఇండెక్స్‌ల పరంగా చూస్తే ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి కేవలం పది శాతం దూరంలోనే ఉన్నప్పటికీ ప్రస్తుత మార్కెట్‌ను రెండు విధాలుగా చూడాలి. కొన్ని రంగాల షేర్లు నిఫ్టీ 8-9 వేల పాయింట్ల స్థాయిలో ఉన్నప్పుడు ఉండే ధర వద్ద ట్రేడ్ అవుతుంటే మరికొన్ని రంగాలు నిఫ్టీ 2,000-3,000 పాయింట్ల స్థాయి వద్ద ఉంటే ఆ ధరల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాలు అధిక ధరల్లో ట్రేడ్ అవుతుంటే, వడ్డీరేట్ల ప్రభావం చూపే బ్యాంకింగ్, ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రా వంటి రంగాలు ఐదేళ్లు, పదేళ్ళ కనిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుండటం, రూపాయి విలువ క్షీణిస్తుండటంతో ఫార్మా, ఐటీ రంగాలు ఆమేరకు ప్రయోజనం పొందుతున్నాయి. వచ్చే 12 నెలల్లో జీడీపీ వృద్ధిరేటు ఒక మోస్తరుగానే ఉండే అవకాశం ఉండటంతో ఒక సంవత్సరం దృష్టితో ఇన్వెస్ట్ చేసే వారికి ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ బాగుంటాయి. అదే మూడు నుంచి ఐదేళ్ళ కాలంతో ఇన్వెస్ట్ చేసేవారికి వడ్డీరేట్లు ప్రభావం చూపే రంగాలకేసి చూడొచ్చు.
వచ్చే సంవత్సర కాలంలో ఇండెక్స్‌లు ఏ శ్రేణిలో కదులుతాయి?
ప్రస్తుత పరిస్థితుల్లో ఇండెక్స్ కదలికలను అంచనా వేయడం చాలా కష్టం. ఇది పూర్తిగా ద్రవ్యలోటును ఏ విధంగా తగ్గిస్తారన్నదానిపైన, ఆర్‌బీఐ లిక్విడిటీ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ద్రవ్యలోటు అదుపులోకి వస్తే తిరిగి మార్కెట్లు పరుగులు తీస్తాయి.
- బిజినెస్ బ్యూరో, హైదరాబాద్
Advertisement
Advertisement