Sanjay Dongre
-
సోషల్ మీడియాకు కొత్త ఐటీ నిబంధనలు..
సోషల్ మీడియాలో వదంతులకు చెక్ పెట్టే విధంగా కేంద్రం కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)నిబంధనలు రూపొందిస్తోంది. వీటి ప్రకారం సోషల్ మీడియా సంస్థలు వివాదాస్పద సమాచారం మూలాలు గుర్తించడంతో పాటు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోగా సదరు సమాచారాన్ని తమ ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాల్సి ఉంటుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే రాజ్యసభకు ఈ విషయం తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, మెసేజింగ్ యాప్స్ ద్వారా ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా తీసుకోతగిన చర్యల గురించి కేంద్రం గతేడాది డిసెంబర్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీటిని విశ్లేషించిన మీదట తాజా నిబంధనలు రూపొందించింది. -
ఈ ఏడాది ఒడిదుడుకులే..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వేల్యుయేషన్స్‌పరంగా మార్కెట్లు సగటుకన్నా అధిక స్థాయిలో ట్రేడవుతున్న నేపథ్యంలో గత మూడేళ్లుగా నమోదవుతున్న అధిక రాబడులు ఈ సారి కనిపించకపోవచ్చన్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ సంజయ్ డోంగ్రే. ఆటో, సిమెంటు, నిర్మాణ, ఆర్థిక రంగ షేర్లు ఆశావహంగా ఉండవచ్చన్నారు. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు వెల్లడించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... ఈ ఆర్థిక సంవత్సరం మార్కెట్లు ఎలా ఉండొచ్చు? ఈ ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ రాబడులు 18–20% మేర, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 14–15 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. దీనికి గతేడాది బేస్ ఎఫెక్ట్ కూడా కారణం. ప్రధానంగా దేశీ వినియోగ ఆధారిత రంగాల నుంచి ఈ వృద్ధి రావొచ్చు. ఈ సారి జీడీపీ వృద్ధి 7.3 శాతం ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. గతానికన్నా భిన్నంగా తయారీ రంగం వాటా ఇందులో మరింత పెరగొచ్చు. అలాగే ఆటో, సిమెంటు, నిర్మాణ, ఇంజినీరింగ్ ఆర్థిక రంగాలు రెండంకెల స్థాయి వృద్ధిని సాధించొచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, కార్పొరేట్ ఆధారిత ప్రైవేట్ బ్యాంకుల ఆదాయాలు మెరుగుపడొచ్చు. గత ఏడాదిన్నర, రెండేళ్లుగా కార్పొరేట్లకు భారీగా రుణాలిచ్చిన ప్రైవేట్ రంగ బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అయితే, ఈ బ్యాంకులు ప్రస్తుతం ఆయా మొండిపద్దులను గుర్తించి, సరిదిద్దుకునే విషయంలో తుదిదశలో ఉన్నాయి. వచ్చే 12 నెలల్లో వీటి లాభదాయకత మళ్లీ సాధారణ స్థాయికి రావొచ్చు. కాబట్టి, కార్పొరేట్ ఆధారిత ప్రైవేట్ బ్యాంకుల ప్రైస్ టు బుక్ మల్టిపుల్ మెరుగుపడొచ్చు. ఈక్విటీ మార్కెట్ల వేల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? గత పదేళ్లుగా ఫార్వర్డ్ ఎర్నింగ్స్ పరంగా చూస్తే వేల్యుయేషన్స్ సగటున 16 రెట్లు ఉంటున్నాయి. కానీ ప్రస్తుతం 17 రెట్ల స్థాయిలో సగటు కన్నా అధికంగా మార్కెట్లు ట్రేడవుతున్నాయి. కనుక వేల్యుయేషన్స్ అంత చౌకగా ఏమీ లేవు. కాబట్టి మార్కెట్ల నుంచి రాబడుల అంచనాలు కింది వైపుగానే ఉండొచ్చు. గత మూడేళ్లుగా నమోదవుతున్న అత్యధిక రాబడులు ఈ సారి కనిపించకపోవచ్చు. ఇక స్థూల ఆర్థిక పరిస్థితులు చూస్తే.. ద్రవ్యోల్పణం, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. కరెంటు అకౌంటు లోటు దాదాపు 1.6 శాతం మేర ఉంది. మూడేళ్ల పాటు అంతంత మాత్రంగా నమోదైన ఆదాయాలు మళ్లీ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందొచ్చన్న అంచనాలున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ వంటి రంగాల ఆదాయాలు సాధారణ స్థాయికి రావొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు స్థూల ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నా .. మరోవైపు కార్పొరేట్ల ఆదాయాలు మెరుగుపడనున్నాయి. దీనితో ఒకరకంగా సమతుల్యత నెలకొనే అవకాశమున్నా.. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఒడిదుడుకులూ ఎక్కువగానే ఉండొచ్చు. ఏయే రంగాలు ఆశావహంగా ఉన్నాయనుకోవచ్చు? ఏ రంగమైనా, షేరయినా వేల్యుయేషన్స్ నిలకడగా ఉండాలంటే ఆదాయాల వృద్ధే కీలక పాత్ర పోషిస్తుంది. కనక వచ్చే రెండేళ్లలో ఆదాయ వృద్ధి అధికంగా ఉండే రంగాలు, షేర్లలో ఇన్వెస్ట్మెంట్ కొనసాగించవచ్చు. అలాగే మార్కెట్ ఆదాయాల కన్నా తక్కువ స్థాయిలో నమోదు చేసే రంగాల షేర్లలో పెట్టుబడులు తగ్గించుకోవటమే శ్రేయస్కరం. ఆటో, సిమెంట్, ఇంజినీరింగ్, నిర్మాణం, ఆర్థిక రంగ సంస్థలు రాబోయే రెండేళ్లలో అధిక ఆదాయాలు నమోదు చేయొచ్చు. వేల్యుయేషన్స్ పరంగా చూస్తే ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్ స్టాక్స్ గత పదేళ్ల సగటుతో పోలిస్తే గణనీయంగా అధిక వేల్యుయేషన్స్‌తో ట్రేడవుతున్నాయి. మీరు ఇన్ఫ్రా ఫండ్‌ను నిర్వహిస్తున్నారు కదా. ఈ రంగంపై మీ అంచనాలేంటి? దాదాపు 7,400 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై వంటి 12 నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటి విలువ రూ.2 లక్షల కోట్లపైనే. రైల్వే శాఖ కూడా భారీ పెట్టుబడులతో నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. వచ్చే 3–5 సంవత్సరాల్లో ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో కొత్తగా ఎయిర్‌పోర్టుల నిర్మాణం, నాన్ మెట్రోల్లో ఎయిర్‌పోర్టుల ఆధునీకీకరణ మొదలైన వాటిపై భారీగా పెట్టుబడులు రావొచ్చు. ఇక, పలు రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులపై రూ.లక్ష కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాయి. అలాగే, అందరికీ అందుబాటు గృహాల ప్రాజెక్టులకు సంబంధించి రూ.5 లక్షల కోట్ల మేర అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫ్రా రంగం పరిస్థితి ఆశావహంగానే ఉంది. ఆర్బీఐ పాలసీ రేట్ల పెంపు ప్రభావం ఇన్ఫ్రా కంపెనీలపై ఎలా ఉండొచ్చు? ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నింటికీ భారీ పెట్టుబడులు అవసరం. కనుక వడ్డీ రేట్లు ఏమాత్రం పెరిగినా అది కంపెనీ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే, వడ్డీ రేట్ల పెంపునకు అధిక ఆర్థిక వృద్ధి కారణమైన పక్షంలో .. కంపెనీల ఆదాయాలూ అధిక స్థాయిలో ఉండి వడ్డీ రేట్ల పెంపు ప్రభావం తటస్థంగా ఉండొచ్చు. -
ఆర్థిక ఫలితాలే దిక్సూచి
♦ ఫలితాలు బాగుంటే మార్కెట్లు ఇంకా పెరుగుతాయి ♦ కానీ క్యూ4లో డీమోనిటైజేషన్ ప్రభావం ఉండొచ్చు ♦ మార్కెట్లపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోంది ♦ బ్యాంకింగ్, నిర్మాణ రంగాలు ఆశావహంగా ఉన్నాయి ♦ సాక్షి’తో యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఈవీపీ సంజయ్ డోంగ్రే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీమోనిటైజేషన్ ప్రభావాలు నాలుగో త్రైమాసికంలోనే పూర్తి స్థాయిలో ప్రతిఫలించనున్న నేపథ్యంలో క్యూ4లో ఆదాయాలపరంగా చూస్తే కంపెనీల ఆర్థిక ఫలితాలు ఒక మోస్తరుగానే ఉండొచ్చని తెలిపారు యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ డోంగ్రే. ద్విచక్ర వాహనాలు, ఎఫ్ఎంసీజీ, సిమెంట్ రంగాలపై పెద్ద నోట్ల రద్దు గణనీయంగా పడిందని చెప్పారాయన. ఐఐపీ తగ్గుదల తదితర గణాంకాలు డీమోనిటైజేషన్ ప్రభావాలను కొంత ప్రతిబింబించేవిగా ఉన్నాయని, అయితే రీమోనిటైజేషన్ జరిగే కొద్దీ ప్రతికూల ప్రభావాలు క్రమంగా తొలగిపోయి పరిస్థితులు మెరుగుపడగలవని సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ల దిశానిర్దేశానికి ఆర్థిక ఫలితాలే కీలకంగా ఉండగలవని ఆయన వివరించారు. స్వల్పకాలికంగా మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని, కార్పొరేట్ల ఫలితాలు మెరుగ్గా ఉంటే.. మరింత పైకి పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇన్ఫ్రా... బ్యాంకింగ్.. ప్రైవేట్ రంగ స్థితిగతుల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో మౌలిక రంగంలో పెట్టుబడులు ఎక్కువగా ప్రభుత్వం నుంచే రావాల్సి ఉంటుందని సంజయ్ చెప్పారు. మౌలిక సదుపాయాల కల్ప నకు తోడ్పడేలా వివిధ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటోందన్నారు. ఇక బ్యాంకింగ్ రంగం విషయానికొస్తే అధిక మొండిబకాయిల రూపంలో అసెట్ క్వాలిటీ సమస్యలు ప్రధానంగా ఉంటున్నాయన్నారు. అయితే కార్పొరేట్లకు ఎక్కువగా రుణాలిచ్చిన బ్యాంకులతో పోలిస్తే రిటైల్ రుణాలపై దృష్టి పెట్టిన బ్యాంకుల పరిస్థితి మెరుగ్గానే ఉండగలదన్నారు. రుణాల మంజూరీ వృద్ధి తక్కువగానే ఉండటంతో.. లాభాలు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటాయని, ఎకానమీ మెరుగుపడే కొద్దీ వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో ఎన్పీఏలు కూడా తగ్గు ముఖం పట్టి కార్పొరేట్లకు రుణాలిచ్చిన బ్యాంకులు కూడా కొంత మెరుగైన ఆర్థిక ఫలితాలే ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. పెరుగుతున్న దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు .. దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లలో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నారని సంజయ్ చెప్పారు. రియల్టీ తదితర రంగాల పరిస్థితి ఆశావహంగా లేకపోవడంతో గడిచిన రెండు మూడేళ్లలో మార్కెట్లలోకి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. మార్కెట్ల తీరుతెన్నులు, వాటి హెచ్చుతగ్గుల గురించి ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోందని, దీంతో ఈక్విటీలకు అధిక కేటాయింపులు జరుపుతున్నారని వెల్లడించారు. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు వచ్చే కొద్దీ మార్కెట్లలో కొంత చెప్పుకోతగ్గ కదలికలు ఉంటాయన్నారు. ప్రస్తుతం మార్కెట్ల వేల్యుయేషన్స్ మరీ ఖరీదైనవిగా గానీ లేదా మరీ చౌకైనవిగా గానీ అనుకోవడానికి లేదని సంజయ్ చెప్పారు. మొత్తం లాభాల్లో డిఫెన్సివ్ రంగాలతో పోలిస్తే సీజనల్ రంగాల వాటా ఎక్కువగా ఉంటోందన్నారు. రంగాలవారీగా చూస్తే ఆటోమొబైల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, సిమెంటు, నిర్మాణం మొదలైన సీజనల్ రంగాల సంస్థలు మెరుగ్గా ఉండొచ్చని సంజయ్ చెప్పారు. -
ప్రస్తుత ఒడిదుడుకులకు రూపాయే కారణం
ఇప్పటికే ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడంతో రానున్న రోజుల్లో అమెరికా ఉద్దీపన ప్యాకీజీలను ఉపసంహరించుకున్నా మన మార్కెట్లపై అంతగా ప్రభావం ఉండదంటున్నారు యూటీఐ ఫండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్ సంజయ్ డాంగ్రే. కొన్ని రంగాల షేర్ల ధరలు నిఫ్టీ 9,000 పాయింట్ల స్థాయి వద్ద ఉంటే మరికొన్ని 2,000 పాయింట్ల స్థాయి వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లు పెరిగినా, తగ్గినా భారీ స్థాయిలోనే ఉంటున్నాయి. ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులను ఏ విధంగా చూసున్నారు? ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులకు ప్రధాన కారణం రూపాయే. గత రెండు నెలల నుంచి రూపాయి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడుతోంది. క్షీణిస్తున్న రూపాయి ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచుతోంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 100 డాలర్ల నుంచి 115 డాలర్లకు చేరడం, ద్రవ్యలోటు వంటివి మార్కెట్లను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఒక్కసారి రూపాయిలో స్థిరత్వం వస్తే ఈ ఒడిదుడుకులకు అడ్డుకట్ట పడుతుంది. చాలా రోజుల తర్వాత గురువారం బ్యాంకు షేర్లు పరుగులు తీశాయి. బ్యాంక్ షేర్లలో పతనం అయిపోయిందని భావించొచ్చా? గత రెండు నెలల్లో బ్యాంకు షేర్లు 40-42 శాతం వరకు క్షీణించాయి. దీంతో విలువ పరంగా చాలా బ్యాంకు షేర్లు ఆకర్షణీయ ధరకు వచ్చి చేరాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకుల షేర్లయితే వాటి పుస్తక విలువ స్థాయికి పడిపోయాయి. దీనికితోడు ఆర్బీఐ బుధవారం తీసుకున్న చర్యలతో బ్యాంకులకు చౌకగా డాలర్లలో నిధులు సేకరించే వెసులుబాటు కలిగింది. ఒక్కసారి రూపాయి దిగివస్తే కఠిన లిక్విడిటీ చర్యలు తొలగిస్తుందన్న సంకేతాలు బలపడటం, షార్ట్‌కవరింగ్ వంటి కారణాలతో గురువారం బ్యాంకు షేర్లు పరుగులు పెట్టాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ)లు దేశీయ మార్కెట్‌ను ఏ విధంగా చూస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలను తొలగించడం మొదలు పెడితే ఆ ప్రభావం మన ఆర్థిక మార్కెట్లపై ఏ విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? గత రెండు నెలల్లో ఎఫ్ఐఐలు ఈక్విటీల్లో 2.5 నుంచి 3 మిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపితే డెట్ మార్కెట్లో 8 బిలియన్ డాలర్ల వరకు జరిపారు. ప్రస్తుతం ఎఫ్ఐఐల ప్రవర్తన అనేది అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, దేశీయ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌పై ఆధారపడి ఉంటుంది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరించుకున్నా మన మార్కెట్లపై ఇక పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. రూపాయి కదలికలు ఏ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు? రూపాయి ఒడిదుడుకులను అడ్డుకోవడానికి ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. బంగారం దిగుమతులు వంటి ఆంక్షల వల్ల కరెంట్ అకౌంట్ లోటు దిగొస్తే రూపాయి విలువ తిరిగి బలపడుతుంది. ఉండాల్సిన విలువ కంటూ రూపాయి విలువ చాలా తక్కువ ఉందని ఆర్బీఐ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. ఒక్కసారి ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఫలితమిస్తే డాలరుతో రూపాయి విలువ సంవత్సరం మొత్తం మీద రూ.56-54 వద్ద స్థిరపడుతుంది. ఆర్బీఐ చర్యల వలన వడ్డీరేట్లు తిరిగి పెరుగుతున్నాయి. రానున్న 12 నెలల కాలంలో వడ్డీరేట్లు ఏ విధంగా ఉంటాయని అంచనా..? రూపాయి ఒడిదుడుకులను అరికట్టడానికి తీసకుంటున్న చర్యల వలన స్వల్పకాలిక వడ్డీరేట్లు పెరుగుతున్నాయి. ఒక్కసారి రూపాయి స్థిరపడితే ఆర్బీఐ ఈ ఆంక్షలను ఎత్తేస్తుంది. ఒక్కసారి ఆర్థిక పరిస్థితి చక్కబడితే కాని ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం లేదు. దశాబ్దాల కనిష్టస్థాయికి జీడీపీ పడిపోవడం, ప్రమాద స్థాయిలో ద్రవ్యలోటు వంటివి మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయిలో ఉందన్న సంకేతాలను ఇస్తున్నాయి. కాని ఒకపక్క చూస్తే స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి కేవలం పది శాతం దూరంలో ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు. ఇటువంటి సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని సూచిస్తారా? ఇండెక్స్‌ల పరంగా చూస్తే ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి కేవలం పది శాతం దూరంలోనే ఉన్నప్పటికీ ప్రస్తుత మార్కెట్‌ను రెండు విధాలుగా చూడాలి. కొన్ని రంగాల షేర్లు నిఫ్టీ 8-9 వేల పాయింట్ల స్థాయిలో ఉన్నప్పుడు ఉండే ధర వద్ద ట్రేడ్ అవుతుంటే మరికొన్ని రంగాలు నిఫ్టీ 2,000-3,000 పాయింట్ల స్థాయి వద్ద ఉంటే ఆ ధరల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు అధిక ధరల్లో ట్రేడ్ అవుతుంటే, వడ్డీరేట్ల ప్రభావం చూపే బ్యాంకింగ్, ఇంజనీరింగ్, ఇన్ఫ్రా వంటి రంగాలు ఐదేళ్లు, పదేళ్ళ కనిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుండటం, రూపాయి విలువ క్షీణిస్తుండటంతో ఫార్మా, ఐటీ రంగాలు ఆమేరకు ప్రయోజనం పొందుతున్నాయి. వచ్చే 12 నెలల్లో జీడీపీ వృద్ధిరేటు ఒక మోస్తరుగానే ఉండే అవకాశం ఉండటంతో ఒక సంవత్సరం దృష్టితో ఇన్వెస్ట్ చేసే వారికి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ బాగుంటాయి. అదే మూడు నుంచి ఐదేళ్ళ కాలంతో ఇన్వెస్ట్ చేసేవారికి వడ్డీరేట్లు ప్రభావం చూపే రంగాలకేసి చూడొచ్చు. వచ్చే సంవత్సర కాలంలో ఇండెక్స్‌లు ఏ శ్రేణిలో కదులుతాయి? ప్రస్తుత పరిస్థితుల్లో ఇండెక్స్ కదలికలను అంచనా వేయడం చాలా కష్టం. ఇది పూర్తిగా ద్రవ్యలోటును ఏ విధంగా తగ్గిస్తారన్నదానిపైన, ఆర్బీఐ లిక్విడిటీ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ద్రవ్యలోటు అదుపులోకి వస్తే తిరిగి మార్కెట్లు పరుగులు తీస్తాయి. - బిజినెస్ బ్యూరో, హైదరాబాద్