మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నా, ఇది బబుల్ వేల్యుయేషన్ కాకపోవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ (ఈక్విటీ) వి. శ్రీవత్స. ఇన్వెస్టర్లు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి సిద్ధపడి, ఈ స్థాయిలోనూ పెట్టుబడులను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, మెటల్స్ తదితర రంగాలు మధ్యకాలికంగా ఇన్వెస్ట్‌మెంట్‌కి ఆకర్షణీయంగా ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరిన్ని వివరాలు..
► ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్‌పై మీ అంచనాలేమిటి.
ఈ ఏడాది మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కరోనా వైరస్ పరిణామాల కారణంగా తొలినాళ్లలో ప్రపంచ దేశాలతో పాటు భారత మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఎకానమీ కూడా తీవ్రంగా దెబ్బతింది. అయితే, లాక్‌డౌన్ నిబంధనలను సరళతరం చేసి, ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించిన తర్వాత నుంచి మార్కెట్లు క్రమంగా సాధారణ స్థాయికి రావడం మొదలెట్టాయి. ఈ ఏడాది మార్చి కనిష్ట స్థాయి నుంచి రికార్డు స్థాయికి ర్యాలీ చేశాయి. డిమాండ్ పుంజుకుని, కార్పొరేట్లు మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిచ్చింది. ప్రస్తుతం మార్కెట్లు సముచిత వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ట్రేడవుతున్నాయి. వైరస్ రిస్కు లు ఇంకా పొంచి ఉన్నందున కాస్త కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది.
► మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లకు మీ సలహా ఏంటి.
మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ట్రేడవుతూ, వేల్యుయేషన్లు కూడా సగటుకు మించిన స్థాయిలో ఉన్నప్పటికీ ఇవి బుడగలాగా పేలిపోయే బబుల్ వేల్యుయేషన్లని భావించడం లేదు. అలాగే, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన స్థాయిలో అసంబద్ధమైన పరిస్థితులేమీ కూడా లేవు. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించవచ్చు. అయితే, కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి మాత్రం సంసిద్ధంగానే ఉండాలి. ఇక మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధించిన ప్రతికూల ప్రభావం పడకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల ఒడిదుడుకుల మార్కెట్లో సగటు కొనుగోలు రేటు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కాగలదు. ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టాలంటే, దీర్ఘకాలిక సగటు కన్నా మార్కెట్లు చౌకగా ట్రేడవుతున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం.
► ఈక్విటీ ఇన్వెస్టర్లకు రాబోయే రోజుల్లో ఎలాంటి పెట్టుబడి అవకాశాలు ఉంటాయి.
ప్రస్తుతం కోవిడ్ సంబంధ బలహీన పరిస్థితుల నుంచి కోలుకుంటున్న దేశీ ఆధారిత పరిశ్రమలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంది. ఇక ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్ వంటి కొన్ని దేశీయ పరిశ్రమల వేల్యుయేషన్లు దీర్ఘకాలిక సగటుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. వ్యయ నియంత్రణకు ప్రాధాన్యం పెరిగి, డిజిటల్ మాధ్యమం వైపు మళ్లుతుండటం వల్ల వినియోగదారులతో నేరుగా లావాదేవీలు జరిపే సంస్థలకు ఎంతో ఆదా కానుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణల ఊతంతో పాటు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న యుటిలిటీస్ రంగ సంస్థలు కూడా ఆశావహంగానే ఉంటాయి.
► మధ్యకాలికంగా ఏయే రంగాలు మెరుగ్గా ఉండవచ్చు. వేటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.
ఆటోమొబైల్స్, హెల్త్‌కేర్, మెటల్స్, యుటిలిటీస్, భారీ యంత్ర పరికరాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సముచిత వేల్యుయేషన్లలో లభిస్తుండటం, మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఇక, ఫైనాన్షియల్స్, కన్జూమర్ గూడ్స్ షేర్ల విషయంలో కొంత అండర్‌వెయిట్‌గా ఉన్నాం. నాణ్యమైన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల స్టాక్స్ చాలా ఖరీదైనవిగా మారడం ఇందుకు కారణం.
► మీరు నిర్వహిస్తున్న యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ పనితీరు ఎలా ఉంది.
గత ఏడాది కాలంగా యూటీఐ హెల్త్‌కేర్ సెక్టార్ మెరుగ్గా రాణించడంతో పాటు బెంచ్‌మార్క్‌ను కూడా అధిగమించింది. ఫార్మా రంగం .. మొత్తం మార్కెట్‌కు మించిన పనితీరు కనబర్చింది. భవిష్యత్ వృద్ధి అవకాశాలు ఆశావహంగా ఉండటం ఇందుకు కారణం. మరోవైపు, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ అనేది ఎక్కువగా లార్జ్, మిడ్ క్యాప్ విభాగం స్టాక్స్‌పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది కాలంగా ఇది కాస్త ఆశించిన స్థాయి కన్నా తక్కువగానే రాణించింది. దీర్ఘకాలికంగా లాభదాయకత రికార్డు ఉండి, చౌక వేల్యుయేషన్స్‌లో లభించే సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది.
ఆకర్షణీయంగా హెల్త్‌కేర్, ఆటోమొబైల్
Published Mon, Dec 14 2020 4:00 AM | Last Updated on Mon, Dec 14 2020 4:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment