పెట్టుబడులపై రాబడితోపాటు బీమా  | Insurance along with return on investment | Sakshi
Sakshi News home page

పెట్టుబడులపై రాబడితోపాటు బీమా 

Published Mon, Sep 30 2019 3:27 AM | Last Updated on Mon, Sep 30 2019 3:27 AM

Insurance along with return on investment - Sakshi

పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్‌ ఎవరైనా కానీ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తట్టుకుని, దీర్ఘకాలంలో అధిక రాబడులు సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే ఉంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఈక్విటీ మార్కెట్లు ఎంతో అస్థిరతంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రిస్క్‌ తీసుకోలేని ఇన్వెస్టర్లు ఈ తరహా ఆటుపోట్ల నుంచి రక్షణకు బ్యాలన్స్‌డ్‌ లేదా హైబ్రిడ్‌ డెట్‌ ఫండ్స్‌ను పెట్టుబడుల కోసం పరిశీలించొచ్చు. ఇవి స్థిరమైన రాబడులను ఇస్తాయి. అదే సమయంలో పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను తగ్గిస్తాయి. ఓ వ్యక్తి జీవితంలో ఎన్నో ఆర్థిక లక్ష్యాలు ఉంటుంటాయి. మధ్యలో ఊహించని ఆసక్మిక పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. కనుక పెట్టుబడులతోపాటు జీవిత బీమా రక్షణ కూడా ఉండడం ఎంతో అవసరం. సరైన జీవిత బీమా కవరేజీ కూడా ఒక రకమైన పెట్టుబడే అవుతుందంటారు నిపుణులు. ఈ రకంగా చూసినప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) ఆఫర్‌ చేసే యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లు (యులిప్‌) జీవితానికి రక్షణతోపాటు, దీర్ఘకాలంలో సంపద సృష్టికి వీలు కల్పిస్తాయి. వీటిల్లో యూటీఐ యులిప్‌ ఇతర యులిప్‌లతో పోలిస్తే భిన్నమైన ఫీచర్లతో మెరుగ్గా ఉంటుంది. యూటీఐ యులిప్‌ ఓపెన్‌ ఎండెడ్, పన్ను ఆదా చేసే బీమా ప్లాన్‌. ఈ పథకంలో చేసే పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపుతోపాటు రూ.15 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ లభిస్తుంది.  

సుదీర్ఘకాల చరిత్ర 
యూటీఐ యులిప్‌ మన దేశంలో మొట్టమొదటి యులిప్‌ పాలసీ. 1971 అక్టోబర్‌ 1న ఆరంభమైంది. ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసే వారికి ఎల్‌ఐసీ నుంచి జీవిత బీమా కవరేజీ ప్లాన్‌ లభిస్తుంది. జీవిత బీమాతోపాటు ప్రమాద బీమా కవరేజీని కూడా యూటీఐ యులిప్‌ ఆఫర్‌ చేస్తుండటం గమనార్హం. పెట్టుబడి ఆస్తుల్లో 40 శాతాన్ని ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం జరుగుతుంది. మిగిలిన మొత్తాన్ని డెట్, మనీ మార్కెట్‌ సాధనాల్లో పెట్టుబడులు పెడతారు. రిస్క్‌ అన్నది తక్కువ నుంచి మధ్యస్థంగా ఉంటుంది. రూ.15 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ, రూ.50 వేలకు ప్రమాద బీమా కవరేజీ తీసుకోవచ్చు. పైగా బీమా కవరేజీ కోసం ఇన్వెస్టర్లు రూపాయి చెల్లించక్కర్లేదు. ప్రీమియం భారాన్ని పూర్తిగా యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ భరిస్తుంది.

కాల వ్యవధి
పాలసీ కాల వ్యవధి 10 నుండి 15 ఏళ్లు. ఇందులో టార్గెట్‌ అమౌంట్‌ అని ఉంటుంది. కనీసం రూ.15,000, గరిష్టం రూ.15 లక్షలు. ఇన్వెస్టర్‌ వీటిల్లో ఏ మేరకు టార్గెట్‌ అమౌంట్‌ ఎంచుకుంటే ఆ మొత్తాన్ని ఏడాదికోసారి లేదా అర్ధ సంవత్సరం వారీగా లేక సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తుండాలి. 12 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులు దీన్ని తీసుకోవచ్చు. వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్స్‌పెన్స్‌ రేషియో తక్కువగా ఉండడం గమనించాలి. ఇన్వెస్టర్‌ తనకు అవసరమైనప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఎగ్జిట్‌లోడ్‌ ఉంటుంది. ఆలస్యపు చెల్లింపులపై పెనాల్టీ లేదు. మెచ్యూరిటీ బోనస్‌గా 10 ఏళ్ల పాలసీపై 5 శాతం, 15 ఏళ్ల పాలసీపై 7.5 శాతాన్ని టార్గెట్‌ అమౌంట్‌పై ఇవ్వడం జరుగుతుంది.

కాల వ్యవధి తీరిన తర్వాత ప్రతీ ఏడాదికి టార్గెట్‌ అమౌంట్‌పై 0.50 శాతాన్ని కూడా బోనస్‌గా ఇస్తారు. కాల వ్యవధి తర్వాత క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణను ఎంచుకునే ఆప్షన్‌ ఉంది. ఈ పథకంలో ఎక్స్‌పెన్స్‌ రేషియో కేవలం 1.7 శాతం. ఇతర ఫండ్స్‌ పథకాల్లోని ఎక్స్‌పెన్స్‌ రేషియోతో పోలిస్తే తక్కువే. యులిప్‌ అంటే  దీర్ఘకాలం కోసం తీసుకునేది. ఈ పథకంలో పదేళ్ల రాబడులను పరిశీలిస్తే వార్షికంగా 8.54 శాతం చొప్పున ఉన్నాయి. రిస్క్‌ను పరిమితం చేసి, రాబడులను అధికం చేసే విధానంలో ఈ పథకం పెట్టుబడులను కొనసాగిస్తుంటుంది. లార్జ్, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ను ఎంచుకుని, దీర్ఘకాలం వాటిల్లో పెట్టబడులను కొనసాగించడం ఇదే తెలియజేస్తుంది. తక్కువ చార్జీలు, ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేకపోవడం, పారదర్శకత, జీవిత, ప్రమాద బీమా కవరేజీలు ఇవన్నీ ‘యూటీఐ యులిప్‌’ను స్మార్ట్‌ పెట్టుబడి పథకంగా మార్చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement