హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్యాసింజర్ వాహన రంగంలో 2024–25 నాటికి భారీ పెట్టుబడులు రానున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం తెలిపింది. అధికం అవుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధితో సహా కొత్త ఉత్పత్తుల రూపకల్పనకై తయారీ కంపెనీలు సుమారు రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని వెల్లడించింది.
‘ఇప్పటికే కొన్ని సంస్థలు రూ.25,000 కోట్ల విలువైన విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. 2022 ప్రారంభం నుండి ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఆరోగ్యంగా ఉంది. బలమైన అంతర్లీన డిమాండ్‌కుతోడు సెమీకండక్టర్ కొరత సమస్య తగ్గుముఖం పట్టడం ఇందుకు సహాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికిల్ పరిశ్రమ హోల్‌సేల్ పరిమాణం 21–24 శాతం వృద్ధితో 37–38 లక్షల యూనిట్లను తాకవచ్చు. సరఫరా వ్యవస్థ మెరుగుపడడంతో వాహన కంపెనీల సామర్థ్య వినియోగం గత కొన్ని త్రైమాసికాలుగా పటిష్ట స్థాయికి చేరింది.
బలమైన డిమాండ్ సెంటిమెంట్ కొనసాగుతుండడంతో కంపెనీలు ఇప్పుడు తమ సామర్థ్య విస్తరణ ప్రణాళికలను పునరుద్ధరించాయి. కొత్త సామర్థ్యాలను జోడించడం వల్ల రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్లాంట్ల వినియోగ స్థాయిలు స్వల్పంగా తగ్గుతాయి. పటిష్ట డిమాండ్‌తో వినియోగం దాదాపు 70 శాతం వద్ద సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే అవకాశం ఉంది’ అని ఇక్రా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment