అధిక రాబడి ఈక్విటీల్లోనే..! | Know The Income Tax Rules For Mutual Fund Investments | Sakshi
Sakshi News home page

అధిక రాబడి ఈక్విటీల్లోనే..!

Published Mon, Jul 11 2016 12:35 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

అధిక రాబడి ఈక్విటీల్లోనే..! - Sakshi

అధిక రాబడి ఈక్విటీల్లోనే..!

ఏడేళ్ల వ్యవధిలో 20 శాతం రాబడులిచ్చిన ఈక్విటీ ఫండ్స్
* మ్యూచువల్ ఫండ్లలో పెరుగుతున్న పెట్టుబడులు
* ఫండ్ల పెట్టుబడుల్లో 85 శాతం షేర్లలోనే...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  హెచ్చుతగ్గులు, రిస్కులున్నప్పటికీ దీర్ఘకాలంలో ఇతర సాధనాల కన్నా ఈక్విటీలే మెరుగైన రాబడినిస్తున్నాయి. మరి దీర్ఘకాలమంటే ఎంత? రెండేళ్లా? మూడేళ్లా? లేక ఐదేళ్లా? అనే సందేహం రావచ్చు. నిజానికి మూడేళ్లు దాటితే దీర్ఘకాలంగా పరిగణిస్తారు. ఆ రకంగా చూస్తే మన స్టాక్ మార్కెట్లు మెరుగైన రాబడినే ఇచ్చాయి. దాన్ని మన మ్యూచువల్ ఫండ్లు అందిపుచ్చుకున్నాయి కూడా. బహుశా!! ఇది గమనించే కాబోలు! ఇన్వెస్టర్లు మళ్లీ వాటివైపు మళ్లుతున్నారు.

2104లో సుమారు 3.95 కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య... ఈ ఏడాది మార్చి నాటికి 4.77 కోట్లకు చేరింది. వీటిలో 4.54 కోట్ల మంది రిటైల్ ఇన్వెస్టర్లు కాగా.. మిగిలిన వారు సంస్థాగత.. సంపన్న ఇన్వెస్టర్లు. గతేడాది మేలో రూ. 12.26 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం (ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు) ఈ ఏడాది మే నాటికి 18 శాతం పెరిగి రూ.14.46 లక్షల కోట్లకు చేరాయి. సంస్థాగత ఇన్వెస్టర్లను పక్కన పెడితే ఇందులో దాదాపు సగభాగం రూ.6.58 లక్షల కోట్లు వ్యక్తిగత పెట్టుబడులుగా వచ్చినవే.  మ్యూచువల్ ఫండ్ సంస్థల సమాఖ్య (యాంఫీ) గణాంకాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఈక్విటీ ఆధారిత స్కీముల్లో అత్యధికంగా 85 శాతం పెట్టుబడులు రిటైల్, సంపన్న ఇన్వెస్టర్లవే ఉన్నాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు అందిస్తాయన్న విశ్వాసమే దీనికి కారణం.
 
ఏడేళ్లలో అధిక రాబడులు..
వివిధ ఫండ్స్‌ను కలిపి యాంఫీ, రేటింగ్ సంస్థ క్రిసిల్ రూపొందించిన సూచీ ప్రకారం... ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి వెల్లడైన గణాంకాలను చూస్తే ఈక్విటీల్లోనూ, షేర్ల ఆధారిత పథకాల్లోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్‌లు దీర్ఘకాలంలో సగటున గణనీయమైన రాబడులు అందించాయి. ఉదాహరణకు.. అయిదేళ్ల క్రితం ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్) చేసిన పెట్టుబడులు సగటున 11.22 శాతం మేర వార్షిక రాబడులిచ్చాయి. అదే మార్కెట్లు కనిష్ట స్థాయిల్లో తిరుగాడుతున్నప్పుడు ఏడేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే  సగటున 20 శాతం మేర వార్షిక రాబడులొచ్చాయి.

ఇక అటు ఈక్విటీలు ఇటు డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసే బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లు కూడా ఈ కాలంలో సుమారు 18.79 శాతం మేర వార్షిక రాబడులు అందించాయి. అదే సమయంలో ప్రభుత్వ బాండ్లు మొదలైన సురక్షిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్‌లు ఒకే స్థాయిలో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం రాబడులందించాయి. అయితే సంవత్సర కాలంలో ఈక్విటీ ఫండ్‌లు కొంత నష్టాలు పంచినప్పటికీ (దాదాపు 2 శాతం నుంచి 7 శాతం మేర) .. డెట్ ఫండ్ సూచీ మాత్రం సుమారు 7 శాతం స్థాయిలో సానుకూల రాబడులు అందించింది.
 
హెచ్చుతగ్గులు సహా పలు కారణాలు...
2007-08 ప్రాంతంలో మార్కెట్లు గరిష్ట స్థాయిలకి ఎగిశాయి. కనిష్ట స్థాయిలకూ పడిపోయాయి.  2007 ప్రారంభంలో సుమారు 13,000 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ ఆ ఏడాది ఆఖరు నాటికి ఏకంగా 20,287 పాయింట్లకు ఎగిసింది. అదే సెన్సెక్స్.. ఆ మరుసటి ఏడాది 2008 ప్రారంభంలో 20,800 పాయింట్ల స్థాయి నుంచి సంవత్సరం ఆఖరు నాటికల్లా అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల ప్రభావం దరిమిలా 8,450 పాయింట్లకు (గరిష్టం నుంచి 12,000 పైగా పాయింట్ల పతనం) పడింది.  

సరిగ్గా ఇటువంటి సమయంలో కంగారుపడి ఈక్విటీ ఫండ్స్ నుంచి వైదొలగకుండా స్థిరంగా పెట్టుబడులు కొనసాగించిన వారు గణనీయంగా లాభపడ్డారు. మరోవైపు, అప్పటిదాకా దాదాపు ఏడు శాతం స్థాయిలో కొనసాగిన ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు మందగమన పరిస్థితుల్లో వృద్ధికి ఊతమిచ్చే చర్యల వల్ల 4.25 శాతానికి తగ్గాయి. అటుపైన మూడేళ్ల క్రితం దాకా దాదాపు 8.50 శాతం పైగా తిరుగాడిన రేట్లు మళ్లీ ఇప్పుడు ఆరున్నర స్థాయికి దిగొచ్చాయి. తదనుగుణంగానే వడ్డీ రేట్ల ఆధారిత పథకాలూ ఓ మోస్తరు రాబడులిచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement