దేన్లోనైతే ‘ఫండు’తుంది? | Income funds with fixed Income | Sakshi
Sakshi News home page

దేన్లోనైతే ‘ఫండు’తుంది?

Published Mon, Aug 31 2015 12:39 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

దేన్లోనైతే ‘ఫండు’తుంది? - Sakshi

దేన్లోనైతే ‘ఫండు’తుంది?

- ఇన్‌కమ్ ఫండ్స్‌తో స్థిర ఆదాయం
- ఈక్విటీ ఫండ్స్‌లో రిస్కూ, రాబడి.. రెండూ ఎక్కువే
- బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌తో భరోసా
(సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం)

ప్రతి వ్యక్తికీకొన్ని ఆర్థిక లక్ష్యాలుంటాయి. అయినా బాగా డబ్బు సంపాదించాలని, అన్నీ సమకూర్చుకోవాలని ఉండనిదెవరికి చెప్పండి!? అందుకే చక్కని రాబడి కోసం పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడులన్నిటి వెనకా బలమైన అవసరం ఉంటుంది. ఇక మ్యూచ్‌వల్ ఫండ్స్ విషయానికొస్తే ఈ అవసరాలకు అనుగుణంగానే కాకుండా... పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి రకరకాల పథకాలను తెస్తున్నాయి. కాకపోతే వీటిలో ఇన్వెస్ట్ చేసే వారు రిస్క్ కూడా భరించాల్సి ఉంటుంది. సరే! రిస్క్ భరిస్తాం కానీ, ఏ ఫండైతే బెటర్  అంటారా...! ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఫండ్స్‌పై కొంత అవగాహన ఉండాలి. అందుకే... ఎలాంటి ఫండ్స్ ఉంటాయి? ఏవి ఎవరికి అనువుగా ఉంటాయి?

అనేది తెలియజేసేదే ఈ కథనం...
కాలం, ఇన్వెస్ట్‌మెంట్ విధానం వంటివి పరిగణనలోకి తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మూడు రకాలు. వాటిలో మొదటివి ఓపెన్ ఎండెడ్ కాగా రెండోవి క్లోజ్డ్ ఎండెడ్. ఇక మూడోవి ఇంటర్వల్ స్కీమ్స్.
 
1. ఓపెన్-ఎండెడ్ స్కీమ్స్
 అంటే ఈ పథకాల్లో ఎప్పుడైనా చేరొచ్చు. ఎప్పుడైనా నిష్ర్కమించవచ్చు. ఇవి ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్లకు ఆహ్వానం పలుకుతూనే ఉంటాయన్న మాట. నిజానికి మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌దే అధిక వాటా. ఇవి మన అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైనా కొనటం, ఎప్పుడైనా విక్రయించటం చేయగలిగే ఈ రకం ఫండ్స్ ముఖ్య లక్ష్యం... అధిక లిక్విడిటీయే.
 
2. క్లోజ్డ్-ఎండెడ్ స్కీమ్స్
ఇవి ఓపెన్ ఎండెడ్ వంటివి కాదు. ఈ ఫండ్స్‌లో ఎప్పుడు పడితే అప్పుడు చేరలేం. బయటకు రాలేం. వీటికొక నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. వీటిని న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఓ) సమయంలో మాత్రమే కొనగలం. ఒక మ్యూచువల్ ఫండ్ ఏవైనా కొత్త పథకాన్ని ప్రకటించినప్పుడు ముందుగా ఎన్‌ఎఫ్‌ఓకు  వస్తుంది. అప్పుడే మనం ఆ ఫండ్స్‌ను కొనడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఇది ముగిస్తే.. తర్వాత కొనడానికి ఆస్కారం లేదు. మళ్లీ ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే వరకు ఆగాల్సిందే.
 
3. ఇంటర్వల్ స్కీమ్స్

ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్... రెండింటి లక్షణాలూ ఈ ఇంటర్వెల్ స్కీమ్స్‌లో ఉన్నాయి. ఈ ఫండ్స్ యూనిట్లను నిర్ణయించిన వ్యవ ధిలో సంబంధిత ఎన్‌ఏవీ ధ ర వద్ద కొనుగోలు చేయవచ్చు లేదా స్టాక్ మార్కెట్‌లోనో, బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు.
 
పెట్టుబడి, రాబడి, రిస్క్ తదితర అంశాల పరంగా మ్యూచువల్ ఫండ్స్ 4 రకాలు
1. గ్రోత్/ ఈక్విటీ స్కీమ్స్: మనం పెట్టిన పెట్టుబడిని పెంచటమే లక్ష్యంగా పనిచేసేవి ఈక్విటీ ఫండ్స్. ఈ ఫండ్స్ మన పెట్టుబడులను ఎక్కువగా ఈక్విటీ మార్కెట్‌లో పెడతాయి. ఈ స్కీమ్స్‌లో డివిడెండ్, మూలధన పెరుగుదల తదితర ఆప్షన్స్ ఉం టాయి. ఇన్వెస్టర్లు వారికి నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఫండ్స్ ఎంచుకున్న వారు అధిక రిస్క్‌కు సిద్ధపడాలి. ఎందుకంటే స్టాక్‌మార్కెట్లు స్థిరంగా ఉండవు కదా!! దీర్ఘకాలంలో ప్రయోజనాలను ఆశించి, ఇన్వెస్ట్ చేసే వారికి ఈ గ్రోత్/ఈక్విటీ స్కీమ్స్ అనువైనవి.
 
2. ఇన్‌కమ్/డెట్ స్కీమ్స్

ఈ ఫండ్స్ నిరంతర, స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఇవి మన డబ్బుల్ని ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్ అయి న బాండ్లు, కార్పొరేట్ డి బెంచర్లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తదితర వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే వీటిలో రిస్క్ తక్కువ. కాకపోతే మన పెట్టుబడి పెరగటానికి ఉన్న అవకాశాలూ పరిమితమే. ఈ ఫండ్స్‌కు వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసే వారికి ఇలాంటి వాటి వల్ల ఎలాంటి భయం అవసరం లేదు. నిరంతర, స్థిర ఆదాయాన్ని కోరుకునే వారు ఈ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.
 
3. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్
ఒకవంక నిరంతర ఆదాయంతోపాటు మరోవంక మూలధన పెరుగుదలనూ అందించే ఫండ్స్ ఇవి. ఈ ఫండ్స్ మన డబ్బును కొంత ఈక్విటీ మార్కెట్లలోను, కొంత ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్‌లోను ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక మోస్తరు ఆదాయ వృద్ధిని కోరుకునే వారు ఈ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. రిస్క్ పరిమితం.
 
4. మనీ మార్కెట్/లిక్విడ్ స్కీమ్స్
ఇవి కూడా ఇన్‌కమ్ ఫండ్స్ లాంటివే. మన డబ్బుల్ని ఇవి ట్రెజరీ బిల్స్, డిపాజిట్ పత్రాలు, వాణిజ్య పత్రాలు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తదితర సాధానాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిలో రిస్క్ తక్కువ. తక్కువ కాలంలో బ్యాంకు వడ్డీతో పోలిస్తే కాస్త అధిక వడ్డీని ఆశించే వారికి, కార్పొరేట్, సాధారణ ఇన్వెస్టర్లకు ఇవి అనువుగా ఉంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement