Balanced Funds
-
బ్యాలెన్స్డ్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయ్?
నేను 2011లో ఒక యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ)ని తీసుకున్నాను. ఐదేళ్ల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేశాను. బీమా మొత్తంలో 20 శాతానికి సమానమైన ప్రీమియమ్‌ను ఈ ఐదేళ్ల కాలంలో చెల్లించాను. ఈ పాలసీని సరెండర్ చేయడంవల్ల వచ్చిన సరెండర్ వేల్యూపై నేను ఏమైనా పన్నులు చెల్లించాలా? వివరించగలరు. – నందు, విజయవాడ పన్ను అంశాల పరంగా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ(యులిప్)లను జీవిత బీమా పాలసీలాగానే పరిగణిస్తారు. యులిప్‌లకు సాధారణంగా లాక్–ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. మీ యులిప్కు ఈ ఐదేళ్ల లాక్–ఇన్ పీరియడ్ ముగిసినందున మీరు పొందిన సరెండర్ వేల్యూపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10డి) కింద మీకు ఈ వెసులుబాటు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద మీరు చెల్లించిన ప్రీమియమ్లకు పన్ను రాయితీ పొందినప్పటికీ, మీకు సరెండర్ వేల్యూపై ఎలాంటి పన్ను భారం ఉండదు. నేను గత కొంత కాలంగా ఒక బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్ రాబడులపై పన్నులు ఎలా ఉంటాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులు ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా? ఉంటే ఏ రేంజ్లో ఈ పన్నులు ఉంటాయి ? – రవళి, విశాఖపట్టణం బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను హైబ్రిడ్ ఫండ్స్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఫండ్స్ డెట్‌లో కొంత, ఈక్విటీలో మరికొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తాయి. దేంట్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశారో దానిని బట్టి వీటిని ఈక్విటీ ఆధారిత లేదా డెట్ ఆధారిత ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక ఫండ్ ఈక్విటీలో కనీసం 65 శాతం ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ ఫండ్‌ను ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్‌గా భావిస్తారు. 65 శాతం కంటే తక్కువగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, దానిని డెట్ ఆధారిత ఈక్విటీ ఫండ్‌గా భావిస్తారు. ఈక్విటీ ఆధారిత బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏడాదికి మించి కొనసాగాయనుకోండి..మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ ఈ ఫండ్స్‌లో ఏడాదిలోపే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, వచ్చిన రాబడులపై మీరు 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్ విషయానికొస్తే, ఈ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్లకు మించి కొనసాగితే, వాటిపై వచ్చే రాబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనాలతో కలుపుకొని ఇది 20 శాతంగా ఉంటుంది. ఈ ఫండ్స్‌ను మీరు మూడేళ్లలోపే విక్రయిస్తే, వచ్చిన రాబడులపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నేను, నా భార్య ఇద్దరమూ ఉద్యోగులమే. మాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. మా నలుగురికి గరిష్టంగా ఎన్ని పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఖాతాలు ఉండొచ్చు? ఈ ఖాతాల్లో గరిష్టంగా ఎంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు? – ఈశ్వర్, వరంగల్ మీరు, మీ భార్య ఇద్దరూ చెరొక పీపీఎఫ్ ఖాతా ప్రారంభించవచ్చు. ఒక్కో ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా రూ. లక్షన్నర వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఇక మీలో ఎవరైనా ఒకరు మీ మైనర్ పిల్లల తరపున మరో పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ పిల్లల్లో ఒకరికి ఒకటి చొప్పున పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఒక వ్యక్తి తన సొంత ఖాతా, గార్డియన్‌గా పిల్లల పేరు మీద తెరచిన పీపీఎఫ్ ఖాతాల్లో మొత్తం కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఇంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. అయితే రూ.లక్షన్నరకు మించి చేసిన డిపాజిట్‌పై ఎలాంటి వడ్డీ రాదు. పైగా లక్షన్నరకు మించి డిపాజిట్ చేసిన దానికి ఎలాంటి పన్ను రాయితీలు కూడా లభించవు. క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తరచుగా వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు కాబట్టి ఇవి మంచి రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ? –వెంకట్, హైదరాబాద్ ఓపెన్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ రెండింటికి కొన్ని ప్రయోజనాలు కొన్ని లోపాలూ ఉన్నాయి. క్లోజ్ ఎండెడ్ ఫండ్‌లో ఉన్న ప్రధాన లోపం.. ఇన్వెస్టర్లు రెగ్యులర్‌గా ఈ తరహా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే వీలు లేకపోవడం. క్లోజ్ ఎండెడ్ ఫండ్‌లో ఇన్వెస్టర్లు తరచుగా తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు. ఈ అంశం ఫండ్ మేనేజర్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో దీర్ఘకాలం రాబడులను దృష్టిలో ఉంచుకునే ఫండ్ మేనేజర్ పెట్టుబడి వ్యూహాలు రూపొందిస్తారు. అయితే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్.. అధిక రాబడులు సాధించిన దాఖలాలు ఏవీ ఇంతవరకూ లేవు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ పనితీరు ఇవి ప్రారంభమైనప్పుడు మార్కెట్ ఎలా ఉంది అనే విషయంపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. – ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
దేన్లోనైతే ‘ఫండు’తుంది?
- ఇన్కమ్ ఫండ్స్‌తో స్థిర ఆదాయం - ఈక్విటీ ఫండ్స్‌లో రిస్కూ, రాబడి.. రెండూ ఎక్కువే - బ్యాలెన్స్డ్ ఫండ్స్‌తో భరోసా (సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) ప్రతి వ్యక్తికీకొన్ని ఆర్థిక లక్ష్యాలుంటాయి. అయినా బాగా డబ్బు సంపాదించాలని, అన్నీ సమకూర్చుకోవాలని ఉండనిదెవరికి చెప్పండి!? అందుకే చక్కని రాబడి కోసం పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడులన్నిటి వెనకా బలమైన అవసరం ఉంటుంది. ఇక మ్యూచ్‌వల్ ఫండ్స్ విషయానికొస్తే ఈ అవసరాలకు అనుగుణంగానే కాకుండా... పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి రకరకాల పథకాలను తెస్తున్నాయి. కాకపోతే వీటిలో ఇన్వెస్ట్ చేసే వారు రిస్క్ కూడా భరించాల్సి ఉంటుంది. సరే! రిస్క్ భరిస్తాం కానీ, ఏ ఫండైతే బెటర్ అంటారా...! ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఫండ్స్‌పై కొంత అవగాహన ఉండాలి. అందుకే... ఎలాంటి ఫండ్స్ ఉంటాయి? ఏవి ఎవరికి అనువుగా ఉంటాయి? అనేది తెలియజేసేదే ఈ కథనం... కాలం, ఇన్వెస్ట్మెంట్ విధానం వంటివి పరిగణనలోకి తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మూడు రకాలు. వాటిలో మొదటివి ఓపెన్ ఎండెడ్ కాగా రెండోవి క్లోజ్డ్ ఎండెడ్. ఇక మూడోవి ఇంటర్వల్ స్కీమ్స్. 1. ఓపెన్-ఎండెడ్ స్కీమ్స్ అంటే ఈ పథకాల్లో ఎప్పుడైనా చేరొచ్చు. ఎప్పుడైనా నిష్ర్కమించవచ్చు. ఇవి ఎప్పుడూ ఇన్వెస్ట్మెంట్లకు ఆహ్వానం పలుకుతూనే ఉంటాయన్న మాట. నిజానికి మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌దే అధిక వాటా. ఇవి మన అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైనా కొనటం, ఎప్పుడైనా విక్రయించటం చేయగలిగే ఈ రకం ఫండ్స్ ముఖ్య లక్ష్యం... అధిక లిక్విడిటీయే. 2. క్లోజ్డ్-ఎండెడ్ స్కీమ్స్ ఇవి ఓపెన్ ఎండెడ్ వంటివి కాదు. ఈ ఫండ్స్‌లో ఎప్పుడు పడితే అప్పుడు చేరలేం. బయటకు రాలేం. వీటికొక నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. వీటిని న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) సమయంలో మాత్రమే కొనగలం. ఒక మ్యూచువల్ ఫండ్ ఏవైనా కొత్త పథకాన్ని ప్రకటించినప్పుడు ముందుగా ఎన్‌ఎఫ్‌ఓకు వస్తుంది. అప్పుడే మనం ఆ ఫండ్స్‌ను కొనడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఇది ముగిస్తే.. తర్వాత కొనడానికి ఆస్కారం లేదు. మళ్లీ ఎన్ఎఫ్ఓ వచ్చే వరకు ఆగాల్సిందే. 3. ఇంటర్వల్ స్కీమ్స్ ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్... రెండింటి లక్షణాలూ ఈ ఇంటర్వెల్ స్కీమ్స్‌లో ఉన్నాయి. ఈ ఫండ్స్ యూనిట్లను నిర్ణయించిన వ్యవ ధిలో సంబంధిత ఎన్ఏవీ ధ ర వద్ద కొనుగోలు చేయవచ్చు లేదా స్టాక్ మార్కెట్లోనో, బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడి, రాబడి, రిస్క్ తదితర అంశాల పరంగా మ్యూచువల్ ఫండ్స్ 4 రకాలు 1. గ్రోత్/ ఈక్విటీ స్కీమ్స్: మనం పెట్టిన పెట్టుబడిని పెంచటమే లక్ష్యంగా పనిచేసేవి ఈక్విటీ ఫండ్స్. ఈ ఫండ్స్ మన పెట్టుబడులను ఎక్కువగా ఈక్విటీ మార్కెట్లో పెడతాయి. ఈ స్కీమ్స్‌లో డివిడెండ్, మూలధన పెరుగుదల తదితర ఆప్షన్స్ ఉం టాయి. ఇన్వెస్టర్లు వారికి నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఫండ్స్ ఎంచుకున్న వారు అధిక రిస్క్‌కు సిద్ధపడాలి. ఎందుకంటే స్టాక్‌మార్కెట్లు స్థిరంగా ఉండవు కదా!! దీర్ఘకాలంలో ప్రయోజనాలను ఆశించి, ఇన్వెస్ట్ చేసే వారికి ఈ గ్రోత్/ఈక్విటీ స్కీమ్స్ అనువైనవి. 2. ఇన్కమ్/డెట్ స్కీమ్స్ ఈ ఫండ్స్ నిరంతర, స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఇవి మన డబ్బుల్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అయి న బాండ్లు, కార్పొరేట్ డి బెంచర్లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తదితర వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే వీటిలో రిస్క్ తక్కువ. కాకపోతే మన పెట్టుబడి పెరగటానికి ఉన్న అవకాశాలూ పరిమితమే. ఈ ఫండ్స్‌కు వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసే వారికి ఇలాంటి వాటి వల్ల ఎలాంటి భయం అవసరం లేదు. నిరంతర, స్థిర ఆదాయాన్ని కోరుకునే వారు ఈ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. 3. బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఒకవంక నిరంతర ఆదాయంతోపాటు మరోవంక మూలధన పెరుగుదలనూ అందించే ఫండ్స్ ఇవి. ఈ ఫండ్స్ మన డబ్బును కొంత ఈక్విటీ మార్కెట్లలోను, కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లోను ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక మోస్తరు ఆదాయ వృద్ధిని కోరుకునే వారు ఈ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. రిస్క్ పరిమితం. 4. మనీ మార్కెట్/లిక్విడ్ స్కీమ్స్ ఇవి కూడా ఇన్కమ్ ఫండ్స్ లాంటివే. మన డబ్బుల్ని ఇవి ట్రెజరీ బిల్స్, డిపాజిట్ పత్రాలు, వాణిజ్య పత్రాలు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తదితర సాధానాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిలో రిస్క్ తక్కువ. తక్కువ కాలంలో బ్యాంకు వడ్డీతో పోలిస్తే కాస్త అధిక వడ్డీని ఆశించే వారికి, కార్పొరేట్, సాధారణ ఇన్వెస్టర్లకు ఇవి అనువుగా ఉంటాయి. -
రోజువారీ సిప్ విధానం.. ఓకేనా?
మార్కెట్ రిస్క్‌ను తట్టుకోవడానికి బ్యాలెన్స్డ్ ఫండ్స్ మంచి మార్గమని మిత్రుడొకడు చెబుతున్నాడు. పన్ను రాయితీలు కావాలంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయాలని మరో మిత్రుడు అంటున్నాడు. బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయాలా? తగిన సలహా ఇవ్వండి. - పార్థసారథి, హైదరాబాద్ మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాం. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ తమ పెట్టుబడుల్లో 65 శాతం ఈక్విటీల్లో, మిగిలింది రుణ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి దాదాపు ఈక్విటీ ఫండ్స్‌లాగానే పనిచేస్తాయి. కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోలేరు. స్వల్పకాలానికి స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుంది. దీంతో ఈక్విటీ ఫండ్స్‌కు స్వల్పకాలంలో భారీగా నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. దీన్ని కొత్త ఇన్వెస్టర్లు జీర్ణించుకోలేరు. బ్యాలెన్స్డ్ ఫండ్స్ రుణ సాధనాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి ఈక్విటీ ఫండ్స్ అంత తీవ్రస్థాయి ఒడిదుడుకులకు ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ గురికావు. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే ఇవి కొంత స్థిరమైనవని చెప్పవచ్చు. అందుకని కొత్త ఇన్వెస్టర్లకు బ్యాలెన్స్డ్ ఫండ్స్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇక పన్ను చెల్లించే ఇన్వెస్టర్లు పన్ను ప్రయోజనాలిచ్చే స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తాం. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే పలు మ్యూచువల్ ఫండ్ సంస్థల ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఈక్విటీల్లోనే 80% వరకూ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పన్ను ప్రయోజనాల కోసం బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని మీరు భావిస్తున్నట్లయితే.. ఫ్రాంక్లిన్ పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెని ఫిట్ ప్లాన్లను పరిశీలించవచ్చు. ఈ రెండు ఫండ్స్ ఈక్విటీ, డెట్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ), సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు రోజువారీ సిప్విధానాన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. రోజువారీ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా? వివరించగలరు. - సరళ, వరంగల్ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ), సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లు ఇవి రెండూ వేర్వేరు ఉద్దేశాల కోసం మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎస్టీపీని వారం, లేదా నెల ప్రాతిపదికన, సిప్‌ను నెలవారీగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, ప్రతి నెలా కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారికి సిప్ విధానాలు శ్రేయస్కరం. ఎస్టీపీ విషయానికొస్తే, మీ దగ్గర భారీ మొత్తంలో డబ్బులున్నాయనుకోండి. వాటిని ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా, వారానికి, లేదా నెలకింత అని ఎస్టీపీ విధానం కింద ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని బట్టి ఎన్ని దఫాలుగా ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. ఇక ఒకేసారి భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేయదగ్గ డబ్బులు లేని వారికి సిప్ విధానం ఉత్తమమైనది. ఈ విధానంలో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫండ్స్ రోజువారీ సిప్ విధానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. కానీ ఈ విధానంలో లావాదేవీలు అధికంగా ఉండి ఇన్వెస్ట్మెంట్ మదింపు కొంత గందరగోళంగా ఉంటుంది. ఒక ఏడాదిలో దాదాపు 250 లావాదేవీలను గణించాల్సి ఉంటుంది. దీర్ఘకాలం పాటు సిప్ విధానంలో నెలవారీ కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. నా వయస్సు 30 సంవత్సరాలు. నా నెలవారీ సంపాదన రూ.50,000. నాకు యాభైఏళ్లు వచ్చేసరికి రూ.2 కోట్ల రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకోవడం నా లక్ష్యం. దీనికి గాను ఇరవై ఏళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్‌లో రూ.3,000, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీలో రూ.3,000, యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీలో రూ.2,500, ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్‌లో రూ.2,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. ఇది సరిపోతుందా? నా లక్ష్యాన్ని సాధించాలంటే ఎంత మొత్తం నేను ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ అవసరమా? తగిన సూచనలివ్వండి ? - రియాజ్, గుంటూరు మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీరు నెలకు రూ.10,500 చొప్పున 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఏడాదికి 12 శాతం రాబడులు వస్తాయనే అంచనాలను బట్టి చూస్తే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో 20 ఏళ్లలో 2 కోట్ల రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేయడం కష్టమే. 20 ఏళ్లలో 2 కోట్ల నిధి కావాలంటే మీరు నెలకు దాదాపు రూ.20,217 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. (12 శాతం రాబడి లెక్కన). సెక్షన్ 80 సీ కింద పన్ను ఆదా చేయడం ప్రాధాన్యాంశంగా మీ పెట్టుబడులు ఉండాలి. ఈ సెక్షన్ కింద మీరు రూ.1.5 లక్షలు పన్ను తగ్గింపులు పొందవచ్చు. దీని కోసం యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. సెక్షన్ 80సీ పరిమితి దాటిన తర్వాతనే ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించాలి. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డీ మ్యాట్ అకౌంట్ తప్పనిసరి ఏమీ కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో డెరైక్ట్‌గా కానీ, ఏజెంట్ల ద్వారా గానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. ధీరేంద్ర కుమర్ సిఈవో,వ్యాల్యూరీసెర్చ్ -
పీఎఫ్ సొమ్ము ఎఫ్డీగా ఓకేనా?
నేను ఒక ప్రభుత్వోద్యోగిని. నా వార్షికాదాయం మూడున్నర లక్షలు. నేను మ్యూచువల్‌ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఎక్కడ నుంచి ప్రారంభించాలి? - ప్రకాశ్, రాజమండ్రి మీరు మొదటిసారిగా మ్యూచువల్‌ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి, జాగ్రత్తగా వ్యవహరించాలి. మొదట్లోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, మీకు మ్యూచువల్ఫండ్స్పైననే నమ్మకం పోతుంది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్‌ల్లో దీర్ఘకాలంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లభించే ప్రయోజనాలను మీరు కోల్పోతారు. ఈక్విటీల్లో 5-10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని ధీటుగా ఎదుర్కొనగలుగుతారు. మరోవైపు చెప్పుకోదగ్గ స్థాయిలో సంపదను సమకూర్చుకున్నవారవుతారు. దీనికోసం మీరు పెద్ద మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా, క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేయండి. మీరు మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త కాబట్టి, మొదటిసారిగా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే వీటిల్లో ఒడిదుడుకులు తక్కువ. పైగా పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. ఈ ఫండ్స్‌నుంచి వచ్చే దీర్ఘకాలిక రాబడులపై ఎలాంటి పన్నులు ఉండవు. మీరు ఎంచుకోవడానికి కొన్ని ఫండ్స్-కెనరా రొబెకో బ్యాలెన్స్, డీఎస్పీ బీఆర్ బ్యాలెన్స్డ్, ఎఫ్టీ ఇండియా బ్యాలెన్స్డ్, టాటా బ్యాలెన్స్డ్. నాలుగేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయడానికి ఎల్ అండ్ టీ బిజినెస్ సైకిల్, రిలయన్స్ బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. నేను సరైన ఫండ్స్‌నే ఎంచుకున్నానా? మీ అభిప్రాయం తెలపండి ? - అవంతిక, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి, 4 ఏళ్ల కాలానికి ఏ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయకూడదో, ఆ ఫండ్స్‌నే మీరు ఎంపిక చేసుకున్నారు. ఎల్ అండ్ టీ బిజినెస్ సైకిల్ అనేది కొత్త మ్యూచువల్ ఫండ్. దీనికి ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. ఇక రిలయన్స్ బ్యాంకింగ్ అనేది సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్. 4 ఏళ్ల కాలానికి ఇది సరైనది కాదు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. వివిధీకరణ తప్పనిసరి అని గుర్తించండి. మంచి పనితీరు ఉన్న లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. 4 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉత్తమం. క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? - పారినాయుడు, శ్రీకాకుళం క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ ఫండ్-మంచి పనితీరు కనబరుస్తున్న డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఒకటి. ఈ ఫండ్‌ను నేరుగానే విక్రయిస్తారు. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతమున్న అన్ని ఈక్విటీ పండ్స్‌ల్లో ఈ ఫండ్కే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇతి అత్యుత్తమమైన ఫండ్ అని చెప్పవచ్చు. మా నాన్నగారు ఇటీవలనే రిటైరయ్యారు. ప్రావిడెండ్ ఫండ్ కింద రూ.25 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. దీనిపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎంత శాతం ఉంటుంది. ఆయనకు వేరే ఆదాయ వనరులు ఏమీ లేవు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా వేరే ఇతరత్రా ఏమైనా సాధానాల్లో ఇన్వెస్ట్ చేయమంటారా? - ఘనీ, నిజామాబాద్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఆర్జించిన వడ్డీపై మీ నాన్నగారి ట్యాక్స్ స్లాబ్‌ను బట్టి పన్ను విధిస్తారు. ఇతర వనరుల నుంచి ఆదాయంగా ఈ ఎఫ్డీ వడ్డీని పరిగణిస్తారు. వడ్డీ మొత్తం రూ.10,000కు మించితే బ్యాంకు 10 శాతం టీడీఎస్‌గా కోత విధిస్తుంది. పీఎఫ్ మొత్తంపై క్రమం తప్పని ఆదాయాన్ని మీ నాన్నగారు ఆశిస్తున్నట్లుగా ఉంది. ఈ దిశగా చూస్తే, ఎఫ్‌డీల కంటే మెరుగైన కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ మొత్తం ఒకేసారి మీ నాన్నగారికి ఆవసరముండదు. అందుకుని ఆయన నెలవారీ ఖర్చు ఎంతో ముందు లెక్కించండి. దీనికి 6 రెట్ల మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేయండి.అ తర్వాత 2-3 సంవత్సరాల మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. దీంతో పన్ను బాధ్యత చెప్పుకోదగిన విధంగా తగ్గిపోతుంది. మిగిలిన మొత్తాన్ని మంచి రేటింగ్ ఉన్న షార్ట్‌టెర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. -
ఇన్వెస్ట్‌మెంట్‌కు వ్యవధి కీలకం...
మార్కెట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని మంచి బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను సూచిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో రూ. 5 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన ఫండ్స్‌ను సూచించండి? - రామరాజు, విజయనగరం ప్రస్తుతమున్న మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి నా రికమండేషన్లు ఉండవు. ఇన్వెస్ట్మెంట్ కాలాన్ని బట్టి నా రికమండేషన్లు ఉంటాయి. 10-15 ఏళ్ల కాలం పాటు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాను. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోలేని వాళ్లు, రిస్క్‌ను భరించలేని వాళ్లకైతే బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉత్తమం. బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ దాదాపు ఒక్కలాగే ఉంటాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఒడిదుడుకులు తక్కువ. ఒక వేళ మీ ఇన్వెస్ట్మెంట్ గడువు మూడేళ్లే అయితే, ఈక్విటీ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించకపోవడమే మంచిది. మీరు ఎలాంటి పన్నులు చెల్లించని వారైతే, బ్యాంక్ డిపాజిట్లు ఉత్తమం. ఒకవేళ మీరు ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నట్లైతే, ఫిక్స్డ్ మెచ్యురిటీ ప్లాన్‌ను పరిశీలించవచ్చు. ఈ రిటర్న్‌లపై మీకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా రిటర్న్‌లు బ్యాంక్ డిపాజిట్లకంటే మెరుగ్గానే ఉండే అవకాశాలున్నాయి. అందుకని మార్కెట్ పరిస్థితులను బట్టి కాకుండా మీరు ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేయగలరు అన్న అంశాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలను తీసుకోవాలి. పదేళ్ల తర్వాత నా కూతురి పెళ్లి చేయాలనుకుంటున్నాను. దీని కోసం కొంత నిధిని ఏర్పాటు చేయడం లక్ష్యంగా నేను 2011 నుంచి ఎల్ఐసీ ఎండోమెంట్ ప్లస్ పాలసీ కోసం ఏడాదికి రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇది సరైనదేనా? తగిన సూచనలు ఇవ్వండి. - దమయంతి, హైదరాబాద్ మీ కూతురి పెళ్లి కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం మీ లక్ష్యమైతే, ఎండోమెంట్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. అయితే మీరు ఇప్పుడు ఈ పాలసీ నుంచి వైదొలగడం కూడా సరైన విధానం కాదు. ఒకసారి మీ పాలసీ డాక్యుమెంట్లను అధ్యయనం చేసి సరెండర్ చార్జీలను పరిశీలించండి. పదేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఎస్బీఐ కాంట్రా, ఎస్బీఐ మ్యాగ్నమ్ ట్యాక్స్ గెయిన్లలో ఏడేళ్ల క్రితం ఒక ఏజెంట్ ద్వారా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. వాటిని ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. నేను పన్నులేమైనా చెల్లించాల్సి ఉంటుందా? వాటిని ఎలా ఉపసంహరించుకోవాలో కూడా వివరించండి? - లక్ష్మీ నాయక్, ఆదిలాబాద్ మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏ రోజునైనా ఉపసంహరించుకోవచ్చు. రెండు రోజుల్లో మీ సొమ్ము మీ చేతికందుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ రెండు ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ కావడం, మీరు ఏడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయడం వంటి కారణాల వల్ల మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ ఫండ్స్‌లో ఏడాదికి మించి ఇన్వెస్ట్ చేస్తే, క్యాపిటల్ గెయిన్స్‌పై ఎలాంటి పన్నులుండవు. రిడీమింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్‌ను పూర్తి చేసి మీ అకౌంట్ ఉన్న ఎస్బీఐ బ్రాం చీలో ఆ ఫామ్‌ను ఇస్తే చాలు. మీరు రిడంప్షన్ ఫామ్‌ను మెయిల్ కూడా చేయవచ్చు. నేనొక రిటైరైన ప్రభుత్వ ఉద్యోగిని. నా రిటైర్మెంట్ డబ్బులను సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లోనూ, బ్యాంక్ ఎఫ్డీల్లోనూ ఇన్వెస్ట్ చేశాను. వీటి నుంచి వచ్చే వడ్డీని - డీఎస్పీ బ్లాక్‌రాక్ టాప్ 100, యూటీఐ డివిడెండ్ ఈల్డ్, బిర్లా సన్‌లైఫ్ 95, యూటీఐ బ్యాలెన్స్డ్, హెచ్డీఎఫ్సీ ప్రుడెన్స్, రిలయన్స్ ఎంఐపీల్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఫండ్స్ అన్నింటికీ, ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండేది. ఇప్పుడు ఈ ఫండ్స్ రేటింగ్ తగ్గుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేనేం చేయాలి? - అబూ ఖాన్, కరీంనగర్ కొన్నేళ్ల క్రితం ఈ ఫండ్స్ పనితీరు బాగానే ఉండేది. కానీ ఇటీవల వీటి పనితీరు ఈ కేటగిరిలోని ఇతర ఫండ్స్‌తో పోల్చితే ఏమంత బాగా లేదనే చెప్పాలి. మీరు మీ రిటైర్మెంట్ సొమ్ములపై వచ్చే వడ్డీలను ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. మీ పోర్ట్‌ఫోలియోను ట్రిమ్ చేయండి. 2-3 బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ ఫండ్స్ రాబడులే బ్యాలెన్స్డ్ ఫండ్స్ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో ఒడిదుడుకులు తక్కువ. కొంచెం స్థిరత్వం ఎక్కువ. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్- కెనరా రొబెకో బ్యాలెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాండేజ్, టాటా బ్యాలెన్స్డ్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్లను పరిశీలించవచ్చు. -
స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి 2 సూత్రాలు
నా వయస్సు 37 సంవత్సరాలు. నేను నెలకు రూ.10,000 చొప్పున పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. ఏడాదికి 15-18 శాతం రాబడి ఆశిస్తున్నాను. నాకు సముచితమైన పెట్టుబడి మార్గాలు సూచించండి? - నవీన్, హైదరాబాద్ పదేళ్ల కాలానికి మీరు ఆశించిన రాబడులు రావాలంటే ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని చెప్పవచ్చు. 12-13% రాబడి కావాలనుకుంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. మీరు రిస్క్ ఎక్కువగా భరించలేని వాళ్లు, మీ పెట్టుబడి విలువ కొంత వరకూ తగ్గినా, ఆందోళనకు గురయ్యే మనస్తత్వం ఉన్నవాళ్లైతే ఒకటి లేదా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టండి. స్వల్పకాలంలో ఒడిదుడుకులను తట్టుకోగలిగితే లార్జ్, లేదా మిడ్-క్యాప్ లేదా మల్టీ-క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. నేను ఇటీవలనే రిటైరయ్యాను. నా పోర్ట్‌ఫోలియోలో డీఎస్పీ బ్లాక్‌రాక్ టాప్ 100, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూ చిప్, ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ ప్రుడెన్స్, డైనమిక్ బాండ్ ఫండ్, క్యాష్ మేనేజ్మెంట్ ఫండ్, సూపర్ సేవర్ ఇన్కమ్ ఫండ్, రిలయన్స్ ఎంఐపీ, రిలయన్స్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్ తదితర ఫండ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ ఫండ్స్‌లో రూ.12 లక్షలు పెట్టుబడులు పెట్టాను. కానీ ఈ ఫం డ్స్ పనితీరు నిరాశాజనకంగా ఉంది. ఈ ఫండ్స్‌లో మరో ఐదేళ్ల పాటు నా పెట్టుబడులను కొనసాగిద్దామనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా ? - మహ్మద్ ఇక్బాల్, కరీంనగర్ మీరు మంచి ఫండ్స్‌లోనే పెట్టుబడులు పెడుతున్నారు. అయితే మీ పెట్టుబడులు, పెట్టుబడుల వ్యూహం పట్ల మీకు సరైన అవగాహన లేదని తెలుస్తోంది. రానున్న మూడు, నాలుగేళ్లలో మీకు ఎంత సొమ్ములు అవసరమవుతాయో ముందు ఒక అవగాహన ఏర్పర్చుకోండి. అంత మొత్తానికి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్‌లో(ఒకటి కంటే ఎక్కువ వద్దు, ఒకటి చాలు) ఇన్వెస్ట్ చేయండి. ఒక వేళ మీరు సరైన ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్‌ను ఎంచుకోలేకపోతే, ఆ కాలానికి ఏదైనా బ్యాం క్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఇక ఐదేళ్ల కాలానికి తక్కువ నిర్వహణ పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోండి. దీని కోసం అధిక పన్ను ప్రయోజనాలిచ్చే బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. సాధారణంగా ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ 70% ఈక్విటీల్లోనూ, 30% ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. బ్యాలెన్స్డ్ ఫండ్స్‌పై వచ్చే రాబడులపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇటీవల వచ్చిన స్టాక్ మార్కెట్ ర్యాలీని నాలాంటి చిన్న ఇన్వెస్టర్లు చాలా మంది మిస్ అయ్యారు. గత ఐదేళ్లలో ఎన్నడు లేనట్లుగా స్టాక్ మార్కెట్ల కదలికలున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉన్న మాలాంటి చిన్న ఇన్వెస్టర్లకు మీరు ఎలాంటి సలహా, సూచనలిస్తారు? - అరవింద్ జైన్, సికిందరాబాద్ గత ఐదేళ్లలో స్టాక్ మార్కెట్లు చెప్పుకోదగ్గ స్థాయి రాబడులనివ్వనప్పటికీ, చిన్న ఇన్వెస్టర్లు మాత్రం రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. స్టాక్ మార్కెట్లు నిలకడగా వృద్ధి సాధించలేకపోతున్నప్పటికీ, మీరు స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండడం సమంజసం కాదు. రానున్న 3 లేదా ఐదేళ్లలో స్టాక్ మార్కెట్లు మంచి పనితీరు కనబరుస్తాయని అంచనాలున్నాయి. సరైన రాబడులు రాకపోవడంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. స్టాక్ మార్కెట్లు 2007లో శిఖర స్థాయిల్లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు పొలోమని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఆ అనుభవంతో వాళ్లు ఇప్పుడు స్టాక్ మార్కెట్లంటే ఆమడ దూరం ఉంటున్నారు. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు రెండు సాధారణ సూత్రాలున్నాయి. మొదటిది ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా కొద్ది మొత్తాల్లో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం, రెండోది. ఒకే రంగం కంపెనీల్లో కాకుండా విభిన్నమైన రంగాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం. కానీ చాలా మంది ఇన్వెస్టర్లు ఈ రెండు నియమాలను అనుసరించరు. నేను నెలకు రూ.2 లక్షల చొప్పున ఆరు నెలల పాటు పెట్టుబడులు పెట్టగలను. 11% వార్షిక రాబడిని ఆశిస్తున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా డబ్బులు తీసుకోగలిగే వీలుండాలి. తగిన సూచనలివ్వండి. - జాన్సన్, నెల్లూరు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ పెట్టుబడులను వెనక్కితీసుకోవాలంటే తక్కువ రాబడితో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. లిక్విడ్ ఫండ్ లేదా ఆల్ట్రా షార్ట్-టెర్మ్ బాండ్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే మీరు కోరుకున్నట్లు ఎప్పుడు పడితే అప్పుడు మీ పెట్టుబడులను తీసుకోవచ్చు. అయితే 11% కంటే తక్కువ రాబడులు(8-9%) వస్తాయి. 61 రోజుల మెచ్యూరిటీ ఉండే రుణ పత్రాల్లో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. ఆల్ట్రా షార్ట్‌టెర్మ్ ఫండ్స్ సగటు మెచ్యూరిటీ కాలం ఒక ఏడాది వరకూ ఉంటుంది. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెట్టుబడులను వెనక్కు తీసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగానూ ఉంటాయి.