రోజువారీ సిప్ విధానం.. ఓకేనా? | sip of everyday | Sakshi
Sakshi News home page

రోజువారీ సిప్ విధానం.. ఓకేనా?

Published Mon, Aug 17 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

రోజువారీ సిప్ విధానం.. ఓకేనా?

రోజువారీ సిప్ విధానం.. ఓకేనా?

మార్కెట్ రిస్క్‌ను తట్టుకోవడానికి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ మంచి మార్గమని మిత్రుడొకడు చెబుతున్నాడు. పన్ను రాయితీలు కావాలంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయాలని మరో మిత్రుడు అంటున్నాడు. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలా? తగిన సలహా ఇవ్వండి.
 - పార్థసారథి, హైదరాబాద్

 
మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాం. ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ తమ పెట్టుబడుల్లో 65 శాతం ఈక్విటీల్లో, మిగిలింది రుణ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి దాదాపు ఈక్విటీ ఫండ్స్‌లాగానే పనిచేస్తాయి. కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోలేరు.   స్వల్పకాలానికి స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతుంది. దీంతో ఈక్విటీ ఫండ్స్‌కు స్వల్పకాలంలో భారీగా నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. దీన్ని కొత్త ఇన్వెస్టర్లు జీర్ణించుకోలేరు. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ రుణ సాధనాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి ఈక్విటీ ఫండ్స్ అంత తీవ్రస్థాయి ఒడిదుడుకులకు ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ గురికావు.

ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే ఇవి కొంత స్థిరమైనవని చెప్పవచ్చు. అందుకని కొత్త ఇన్వెస్టర్లకు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇక పన్ను చెల్లించే ఇన్వెస్టర్లు పన్ను ప్రయోజనాలిచ్చే స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తాం. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే పలు మ్యూచువల్ ఫండ్ సంస్థల ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ ఈక్విటీల్లోనే 80% వరకూ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పన్ను ప్రయోజనాల కోసం బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని మీరు భావిస్తున్నట్లయితే.. ఫ్రాంక్లిన్ పెన్షన్ ప్లాన్, యూటీఐ రిటైర్మెంట్ బెని ఫిట్ ప్లాన్‌లను పరిశీలించవచ్చు. ఈ రెండు ఫండ్స్ ఈక్విటీ, డెట్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
 
పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ), సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు రోజువారీ సిప్‌విధానాన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. రోజువారీ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా?  వివరించగలరు.
 - సరళ, వరంగల్

 
సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ), సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లు ఇవి రెండూ వేర్వేరు ఉద్దేశాల కోసం మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎస్‌టీపీని వారం, లేదా నెల ప్రాతిపదికన, సిప్‌ను నెలవారీగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి.  పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి  సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్, ప్రతి నెలా కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారికి సిప్ విధానాలు శ్రేయస్కరం. ఎస్‌టీపీ విషయానికొస్తే, మీ దగ్గర భారీ మొత్తంలో డబ్బులున్నాయనుకోండి. వాటిని ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా, వారానికి, లేదా నెలకింత అని ఎస్‌టీపీ విధానం కింద ఇన్వెస్ట్ చేయాలి.

ఇలా చేస్తే మార్కెట్  ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని బట్టి ఎన్ని దఫాలుగా ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. ఇక ఒకేసారి భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేయదగ్గ డబ్బులు లేని వారికి సిప్ విధానం ఉత్తమమైనది. ఈ విధానంలో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫండ్స్ రోజువారీ సిప్ విధానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. కానీ ఈ విధానంలో లావాదేవీలు అధికంగా ఉండి ఇన్వెస్ట్‌మెంట్ మదింపు కొంత గందరగోళంగా ఉంటుంది. ఒక ఏడాదిలో దాదాపు 250 లావాదేవీలను గణించాల్సి ఉంటుంది. దీర్ఘకాలం పాటు సిప్ విధానంలో నెలవారీ కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
 
నా వయస్సు 30 సంవత్సరాలు. నా నెలవారీ సంపాదన రూ.50,000. నాకు యాభైఏళ్లు వచ్చేసరికి రూ.2 కోట్ల రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకోవడం నా లక్ష్యం. దీనికి గాను  ఇరవై ఏళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్‌లో రూ.3,000, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీలో రూ.3,000, యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీలో రూ.2,500, ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్‌లో రూ.2,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. ఇది సరిపోతుందా? నా లక్ష్యాన్ని సాధించాలంటే ఎంత మొత్తం నేను ఇన్వెస్ట్ చేయాలి?  మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ అవసరమా?  తగిన సూచనలివ్వండి ?
 - రియాజ్, గుంటూరు

 
మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీరు నెలకు రూ.10,500 చొప్పున 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఏడాదికి 12 శాతం రాబడులు వస్తాయనే అంచనాలను బట్టి చూస్తే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో 20 ఏళ్లలో 2 కోట్ల రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేయడం కష్టమే. 20 ఏళ్లలో 2 కోట్ల  నిధి కావాలంటే మీరు నెలకు దాదాపు రూ.20,217 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. (12 శాతం రాబడి లెక్కన). సెక్షన్ 80 సీ కింద పన్ను ఆదా చేయడం ప్రాధాన్యాంశంగా మీ పెట్టుబడులు ఉండాలి. ఈ సెక్షన్ కింద మీరు రూ.1.5 లక్షలు పన్ను తగ్గింపులు పొందవచ్చు. దీని కోసం యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. సెక్షన్ 80సీ పరిమితి దాటిన తర్వాతనే ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచించాలి. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డీ మ్యాట్ అకౌంట్ తప్పనిసరి ఏమీ కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో డెరైక్ట్‌గా కానీ, ఏజెంట్ల ద్వారా గానీ ఇన్వెస్ట్ చేయవచ్చు.

ధీరేంద్ర కుమర్
సిఈవో,వ్యాల్యూరీసెర్చ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement