నేను 2011లో ఒక యులిప్(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ)ని తీసుకున్నాను. ఐదేళ్ల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేశాను. బీమా మొత్తంలో 20 శాతానికి సమానమైన ప్రీమియమ్‌ను ఈ ఐదేళ్ల కాలంలో చెల్లించాను. ఈ పాలసీని సరెండర్ చేయడంవల్ల వచ్చిన సరెండర్ వేల్యూపై నేను ఏమైనా పన్నులు చెల్లించాలా? వివరించగలరు. – నందు, విజయవాడ
పన్ను అంశాల పరంగా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ(యులిప్)లను జీవిత బీమా పాలసీలాగానే పరిగణిస్తారు. యులిప్‌లకు సాధారణంగా లాక్–ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. మీ యులిప్‌కు ఈ ఐదేళ్ల లాక్–ఇన్ పీరియడ్ ముగిసినందున మీరు పొందిన సరెండర్ వేల్యూపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10డి) కింద మీకు ఈ వెసులుబాటు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద మీరు చెల్లించిన ప్రీమియమ్‌లకు పన్ను రాయితీ పొందినప్పటికీ, మీకు సరెండర్ వేల్యూపై ఎలాంటి పన్ను భారం ఉండదు.
నేను గత కొంత కాలంగా ఒక బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్ రాబడులపై పన్నులు ఎలా ఉంటాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులు ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా? ఉంటే ఏ రేంజ్‌లో ఈ పన్నులు ఉంటాయి ? – రవళి, విశాఖపట్టణం
బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను హైబ్రిడ్ ఫండ్స్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఫండ్స్ డెట్‌లో కొంత, ఈక్విటీలో మరికొంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తాయి. దేంట్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశారో దానిని బట్టి వీటిని ఈక్విటీ ఆధారిత లేదా డెట్ ఆధారిత ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక ఫండ్ ఈక్విటీలో కనీసం 65 శాతం ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ ఫండ్‌ను ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్‌గా భావిస్తారు. 65 శాతం కంటే తక్కువగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, దానిని డెట్ ఆధారిత ఈక్విటీ ఫండ్‌గా భావిస్తారు. ఈక్విటీ ఆధారిత బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏడాదికి మించి కొనసాగాయనుకోండి..మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు.
ఒకవేళ ఈ ఫండ్స్‌లో ఏడాదిలోపే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, వచ్చిన రాబడులపై మీరు 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ విషయానికొస్తే, ఈ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మూడేళ్లకు మించి కొనసాగితే, వాటిపై వచ్చే రాబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనాలతో కలుపుకొని ఇది 20 శాతంగా ఉంటుంది. ఈ ఫండ్స్‌ను మీరు మూడేళ్లలోపే విక్రయిస్తే, వచ్చిన రాబడులపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
నేను, నా భార్య ఇద్దరమూ ఉద్యోగులమే. మాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. మా నలుగురికి గరిష్టంగా ఎన్ని పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఖాతాలు ఉండొచ్చు? ఈ ఖాతాల్లో గరిష్టంగా ఎంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు? – ఈశ్వర్, వరంగల్
మీరు, మీ భార్య ఇద్దరూ చెరొక పీపీఎఫ్ ఖాతా ప్రారంభించవచ్చు. ఒక్కో ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా రూ. లక్షన్నర వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఇక మీలో ఎవరైనా ఒకరు మీ మైనర్ పిల్లల తరపున మరో పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు.
తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ పిల్లల్లో ఒకరికి ఒకటి చొప్పున పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఒక వ్యక్తి తన సొంత ఖాతా, గార్డియన్‌గా పిల్లల పేరు మీద తెరచిన పీపీఎఫ్ ఖాతాల్లో మొత్తం కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఇంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. అయితే రూ.లక్షన్నరకు మించి చేసిన డిపాజిట్‌పై ఎలాంటి వడ్డీ రాదు. పైగా లక్షన్నరకు మించి డిపాజిట్ చేసిన దానికి ఎలాంటి పన్ను రాయితీలు కూడా లభించవు.
క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తరచుగా వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు కాబట్టి ఇవి మంచి రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ?
–వెంకట్, హైదరాబాద్
ఓపెన్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ రెండింటికి కొన్ని ప్రయోజనాలు కొన్ని లోపాలూ ఉన్నాయి. క్లోజ్ ఎండెడ్ ఫండ్‌లో ఉన్న ప్రధాన లోపం.. ఇన్వెస్టర్లు రెగ్యులర్‌గా ఈ తరహా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే వీలు లేకపోవడం. క్లోజ్ ఎండెడ్ ఫండ్‌లో ఇన్వెస్టర్లు తరచుగా తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే వెసులుబాటు లేదు.
ఈ అంశం ఫండ్ మేనేజర్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో దీర్ఘకాలం రాబడులను దృష్టిలో ఉంచుకునే ఫండ్ మేనేజర్ పెట్టుబడి వ్యూహాలు రూపొందిస్తారు. అయితే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్.. అధిక రాబడులు సాధించిన దాఖలాలు ఏవీ ఇంతవరకూ లేవు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ పనితీరు ఇవి ప్రారంభమైనప్పుడు మార్కెట్ ఎలా ఉంది అనే విషయంపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
– ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment