స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి 2 సూత్రాలు | two formulas for investment of stock market | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి 2 సూత్రాలు

Published Mon, Jan 20 2014 1:31 AM | Last Updated on Sat, Aug 25 2018 6:08 PM

two formulas for investment of stock market

నా వయస్సు 37 సంవత్సరాలు. నేను నెలకు రూ.10,000 చొప్పున పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. ఏడాదికి 15-18 శాతం రాబడి ఆశిస్తున్నాను. నాకు సముచితమైన పెట్టుబడి మార్గాలు సూచించండి?  - నవీన్, హైదరాబాద్

 పదేళ్ల కాలానికి మీరు ఆశించిన రాబడులు రావాలంటే ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని చెప్పవచ్చు. 12-13% రాబడి కావాలనుకుంటే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. మీరు రిస్క్ ఎక్కువగా భరించలేని వాళ్లు, మీ పెట్టుబడి విలువ కొంత వరకూ తగ్గినా, ఆందోళనకు గురయ్యే మనస్తత్వం ఉన్నవాళ్లైతే ఒకటి లేదా రెండు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టండి. స్వల్పకాలంలో ఒడిదుడుకులను తట్టుకోగలిగితే లార్జ్, లేదా మిడ్-క్యాప్ లేదా మల్టీ-క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.

 నేను ఇటీవలనే రిటైరయ్యాను. నా పోర్ట్‌ఫోలియోలో డీఎస్‌పీ బ్లాక్‌రాక్ టాప్ 100, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూ చిప్, ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్, డైనమిక్ బాండ్ ఫండ్, క్యాష్ మేనేజ్‌మెంట్ ఫండ్, సూపర్ సేవర్ ఇన్‌కమ్ ఫండ్, రిలయన్స్ ఎంఐపీ, రిలయన్స్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్  తదితర ఫండ్స్ ఉన్నాయి.

 ఇప్పటిదాకా ఈ ఫండ్స్‌లో రూ.12 లక్షలు పెట్టుబడులు పెట్టాను. కానీ ఈ ఫం డ్స్ పనితీరు నిరాశాజనకంగా ఉంది.  ఈ ఫండ్స్‌లో మరో ఐదేళ్ల పాటు నా పెట్టుబడులను కొనసాగిద్దామనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా ? - మహ్మద్ ఇక్బాల్, కరీంనగర్

 మీరు మంచి ఫండ్స్‌లోనే పెట్టుబడులు పెడుతున్నారు. అయితే మీ పెట్టుబడులు, పెట్టుబడుల వ్యూహం పట్ల మీకు సరైన అవగాహన లేదని తెలుస్తోంది. రానున్న మూడు, నాలుగేళ్లలో మీకు ఎంత సొమ్ములు అవసరమవుతాయో ముందు ఒక అవగాహన ఏర్పర్చుకోండి. అంత మొత్తానికి ఒక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్‌లో(ఒకటి కంటే ఎక్కువ వద్దు, ఒకటి చాలు) ఇన్వెస్ట్ చేయండి.

 ఒక వేళ మీరు సరైన ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్‌ను ఎంచుకోలేకపోతే, ఆ కాలానికి ఏదైనా బ్యాం క్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయండి. ఇక ఐదేళ్ల కాలానికి తక్కువ నిర్వహణ పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోండి. దీని కోసం అధిక పన్ను ప్రయోజనాలిచ్చే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. సాధారణంగా ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ 70% ఈక్విటీల్లోనూ, 30% ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌పై వచ్చే రాబడులపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

 ఇటీవల వచ్చిన స్టాక్ మార్కెట్ ర్యాలీని  నాలాంటి చిన్న ఇన్వెస్టర్లు చాలా మంది మిస్ అయ్యారు. గత ఐదేళ్లలో ఎన్నడు లేనట్లుగా స్టాక్ మార్కెట్ల కదలికలున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉన్న మాలాంటి చిన్న ఇన్వెస్టర్లకు మీరు ఎలాంటి సలహా, సూచనలిస్తారు? - అరవింద్ జైన్, సికిందరాబాద్

 గత ఐదేళ్లలో స్టాక్ మార్కెట్లు చెప్పుకోదగ్గ స్థాయి రాబడులనివ్వనప్పటికీ, చిన్న ఇన్వెస్టర్లు మాత్రం రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. స్టాక్ మార్కెట్లు నిలకడగా వృద్ధి సాధించలేకపోతున్నప్పటికీ, మీరు స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండడం సమంజసం కాదు. రానున్న 3 లేదా ఐదేళ్లలో స్టాక్ మార్కెట్లు మంచి పనితీరు కనబరుస్తాయని అంచనాలున్నాయి. సరైన రాబడులు రాకపోవడంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

 స్టాక్ మార్కెట్లు 2007లో శిఖర స్థాయిల్లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు పొలోమని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఆ అనుభవంతో వాళ్లు ఇప్పుడు స్టాక్ మార్కెట్లంటే ఆమడ దూరం ఉంటున్నారు. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు రెండు సాధారణ సూత్రాలున్నాయి.

 మొదటిది ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా కొద్ది మొత్తాల్లో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం, రెండోది. ఒకే రంగం కంపెనీల్లో కాకుండా విభిన్నమైన రంగాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం. కానీ చాలా మంది ఇన్వెస్టర్లు ఈ రెండు నియమాలను అనుసరించరు.

 నేను నెలకు రూ.2 లక్షల చొప్పున ఆరు నెలల పాటు పెట్టుబడులు పెట్టగలను. 11% వార్షిక రాబడిని ఆశిస్తున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా డబ్బులు తీసుకోగలిగే వీలుండాలి. తగిన సూచనలివ్వండి.  - జాన్సన్, నెల్లూరు

 మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ పెట్టుబడులను వెనక్కితీసుకోవాలంటే తక్కువ రాబడితో  సంతృప్తి చెందాల్సి ఉంటుంది. లిక్విడ్ ఫండ్ లేదా ఆల్ట్రా షార్ట్-టెర్మ్ బాండ్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే మీరు కోరుకున్నట్లు ఎప్పుడు పడితే అప్పుడు మీ పెట్టుబడులను తీసుకోవచ్చు. అయితే 11% కంటే తక్కువ రాబడులు(8-9%) వస్తాయి.

61 రోజుల మెచ్యూరిటీ ఉండే రుణ పత్రాల్లో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. ఆల్ట్రా షార్ట్‌టెర్మ్ ఫండ్స్ సగటు మెచ్యూరిటీ కాలం ఒక ఏడాది వరకూ ఉంటుంది. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు  పెట్టుబడులను వెనక్కు తీసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్ సురక్షితంగానూ ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement