ఫండ్స్‌లో పెట్టుబడులు సురక్షితమేనా? | Investments in the funds are safe? | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌లో పెట్టుబడులు సురక్షితమేనా?

Published Mon, May 19 2014 1:30 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

ఫండ్స్‌లో పెట్టుబడులు సురక్షితమేనా? - Sakshi

ఫండ్స్‌లో పెట్టుబడులు సురక్షితమేనా?

 నేను గతంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. తర్వాతి కాలంలో నా బ్యాంక్ అకౌంట్‌ను మూసేశాను. ఇప్పుడు నాకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎలాంటి డివిడెండ్లు అందడం లేదు? దీనికి కారణమేమిటి?
 - అభినయ్, హైదరాబాద్

మీరు ఏవో కారణాల వల్ల బ్యాంక్ అకౌంట్‌ను మూసేసి, కొత్తగా వేరే బ్యాంక్ అకౌంట్ తెరిచినట్లున్నారు. ఈ విషయాన్ని మీరు మీ మ్యూచువల్ ఫండ్ సంస్థకు వెల్లడించాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ సంస్థ మీకు ఎలాంటి డివిడెండ్‌లు చెల్లించడం లేదని భావిస్తున్నాం. మోసాలను నివారించడానికి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల ఉపసంహరణ, డివిడెండ్‌ల చెల్లింపు మొదలైనవన్నీ తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌ల ద్వారానే జరపాలనే ఆదేశాలున్నాయి. అందుకని మీరు మీ పాత బ్యాంక్ అకౌంట్‌ను మూసివేసిన విషయాన్ని, కొత్త బ్యాంక్ అకౌంట్ వివరాలను మీ మ్యూచువల్ ఫండ్ సంస్థకు వీలైనంత త్వరగా తెలపండి.

 తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు సరియైన ఇన్వెస్ట్‌మెంట్ సాధానాలేంటి?       
- పల్లవి, మంగళగిరి

సాధారణ ప్రజలు ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం కోసమే మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టారు. నిర్ణీత కాలంలోగా మీకు ఇన్వెస్ట్‌మెంట్స్, దానిపై రాబడులను పొందాలని  మీరు భావిస్తే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడమే ఉత్తమం. నిర్దేశిత గడవులోగా ఇన్వెస్ట్‌మెంట్స్, దానిపై రాబడులు కావాలనుకుంటే,, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం మంచిది. దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకుంటే, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తం ఇప్పట్లో మీకు అవసరం లేనట్లయితే, ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేకపోతే... ఇలాంటి పరిస్థితుల్లో  మీకు మ్యూచువల్ ఫండ్స్ సరైన ఇన్వెస్ట్‌మెంట్ విధానం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సెక్టోరియల్, లేదా థీమాటిక్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయకండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్‌లో మొదటిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, ఏదైనా ఒక బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను ఎంచుకోండి. మీకు అసంతృప్తి కలగని రీతిలోనే ఈ ఫండ్స్ రాబడులుంటాయి.

 బాగా పేరున్న మ్యూచువల్ ఫండ్ పథకాల్లో తెలిసిన డిస్ట్రిబ్యూటర్ ద్వారా 2005లో ఇన్వెస్ట్ చేశాను. నా ఫోలియోలో నా వివరాలు. నంబర్లతో పాటు సదరు డిస్ట్రిబ్యూటన్ నంబర్ కూడా ఉంటోంది. ఈ నంబర్‌ను తొలగించమని ఎన్నోసార్లు సదరు సంస్థను కోరాను. కానీ ఫలితం లేకపోయింది. ఎందుకిలా? 
- క్రిష్టోఫర్, గుంటూరు

 మ్యూచువల్ ఫండ్ కంపెనీ పంపించే అకౌంట్ స్టేట్‌మెంట్‌లో డిస్ట్రిబ్యూటర్ వివరాలు కూడా ఉంటాయి. ఇక మీ విషయానికొస్తే, ఆ నంబర్ డిస్ట్రిబ్యూటర్‌దని, దానిని తొలగించమని మరో సారి విజ్ఞప్తి చేయండి. కానీ సదరు నంబర్ మీ ఫోలియోలో ఉండడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదని నేను భావిస్తున్నాను. మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నప్పుడు, ఆ నంబర్‌తో ఎలాంటి లావాదేవీలు జరిగే అవకాశమే లేదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాం. మరి మన ఇన్వెస్ట్‌మెంట్స్‌కు భద్రత ఉం టుందా? ఒక వేళ మ్యూచువల్ ఫండ్ సంస్థ బిచాణా ఎత్తేస్తే పరిస్థితి ఏమిటి? సహారా గందరగోళం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
 - ప్రకాశ్ జైన్, సికింద్రాబాద్.

 సహారా మొత్తం సమస్య ఏమిటంటే, ఆ సంస్థ సెబి పరిధిలోకి రాదు. కానీ మ్యూచువల్ ఫండ్స్ విషయం అలా కాదు. వీటిపై నియంత్రణ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులపై నియంత్రణ సంస్థలకు పూర్తి నియంత్రణ ఉందని చెప్పవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడులు మీ ఫండ్ అకౌంట్‌లోకి వెళతాయి. అంతేకాని మీ పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్ సంస్థకు వెళ్లవు. ఈ సొమ్ములతో కొనుగోలు చేసిన సెక్యూరిటీలు ఈ అకౌంట్‌లోనే ఉంటాయి.  పైగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మేనేజర్ కూడా ఉంటారు. ఈ సెక్యూరిటీలను కస్టోడియన్ అనే నియంత్రణ సంస్థ పర్యవేక్షిస్తుంది. ఈ అకౌంట్‌లోని సొమ్ములను మ్యూచువల్ ఫండ్ సంస్థ యాక్సెస్ చేయలేదు. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెందిన అన్ని ఆస్తులపై సెబి నియంత్రణ ఉంటుంది. ఫండ్ మేనేజర్ల అంచనాల తప్పటం వల్ల ఫండ్స్‌కు నష్టాలు వచ్చి మీ ఇన్వెస్ట్‌మెంట్స్ తరిగిపోతాయే కానీ, మరో విధంగా కాదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement