గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయవచ్చా?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఒకేసారి ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయవచ్చా?
- అమృత, హైదరాబాద్
బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ అంటే దాదాపు ఈక్విటీ ఫండ్స్‌లాగానే ఉంటాయి. ఈ ఫండ్స్ నిధుల్లో 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈక్విటీల్లో 65% ఇన్వెస్ట్ చేస్తామని బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ పేర్కొంటాయి. కానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రం కనీసం 70 నుంచి 80%వరకూ ఉంటాయి. ఏతావాతా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ పనితీరు ఈక్విటీ ఫండ్స్‌లాగానే ఉంటుందని చెప్పవచ్చు.
స్టాక్‌మార్కెట్లు జోరుగా ఉన్నప్పుడు ఈ ఫండ్స్ వృద్ధి బావుంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లు పడిపోతే ఈ ఫండ్స్ కూడా క్షీణిస్తాయి. అందుకని ఈ ఫండ్స్‌లో ఒకేసారి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు పతనమైతే మీకు కూడా పెద్ద మొత్తంలోనే నష్టాలు వస్తాయి. అయితే దీనికి వ్యతిరేకంగా ధర బాగా తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు కళ్లజూడవచ్చు.
కానీ ధర తక్కువ అనేదానిని ఎవరూ పసిగట్టలేరు. ధర తగ్గుతుంటే ఇంకా తగ్గుతుందని ఎదురు చూస్తూ ఉంటాం. అప్పుడు ధర క్రమ క్రమంగా పుంజుకుంటుంది. అందుకని బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసే ఓపిక మీకు లేకపోతే, మీ దగ్గరున్న మొత్తాన్ని కనీసం ఆరు సమాన భాగాలుగా చేసైనా ఇన్వెస్ట్ చేయండి.
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నెలకు కొంత మొత్తం చొప్పున ఏదైనా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయని మిత్రులంటున్నారు. ఇది సరైన నిర్ణయమేనా?
-ప్రకాశ్, విజయవాడ
ఎంత మాత్రం సరైన నిర్ణయం కాదు. పుత్తడిలో పెట్టుబడులు వద్దని చెబుతూనే ఉన్నాం. గతంలో వివిధ కారణాల వల్ల బంగారంలో పెట్టుబడులకు మంచి రాబడులే వచ్చాయి. ఈక్విటీ మార్కెట్లలో అని శ్చితి, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, డిమాండ్ అధికంగా ఉండడం, సరఫరా తక్కువగా ఉండడం తదితర కారణాల వల్ల బంగారంలో పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చాయి.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజు కుంటోంది. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ కారణాల వల్ల చూస్తే, ఈక్విటీల్లో పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే సూచనలున్నాయి. ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి బంగారం కంటే ఈక్విటీలే ఉత్తమం. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పుత్తడిలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.
నేను ఇటీవలనే రిటైరయ్యాను. గతంలో నేను వేసిన ఫిక్సడ్ డిపాజిట్లు మరో రెండు నెలల్లో మెచ్యూర్ అవుతాయి. ఈ మొత్తాన్ని ఏవైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్ ల్లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకు ఎఫ్‌డీల కన్నా మెరుగైన రాబడి వస్తుందా? ఏయే ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయమంటారు?
- సంపత్‌కుమార్, కరీంనగర్
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్.. ఇవి రెండూ పూర్తిగా భిన్నమైన ఇన్వెస్ట్‌మెంట్ విధానాలు. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో స్థిరమైన ఆదాయం గ్యారంటీగా లభిస్తుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, ఇవి మార్కెట్ అనుసంధానత ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు, స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకులు కారణంగా వీటిల్లో కూడా ఒడిదుడుకులుంటాయి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వలె మ్యూచువల్ ఫండ్స్ నుంచి గ్యారంటీడ్ ఆదాయం పొందలేము. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందవచ్చు.
మీరు రిటైరయ్యారు కాబట్టి, మీ ఆదాయంలో వృద్ధి ఆగిపోతుంది. అందుకే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే ఆదాయంపైననే మీరు ఆధారపడాలి. మీ అసలు మొత్తం కొనుగోలు శక్తి అలాగే ఉండటంతో పాటు మీకు తగిన ఆదాయం మీ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి రావలసి ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా, మీ ఖర్చులకు సరిపడేలా నెలవారీ కొంత ఆదాయం మీకు కావాలి. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మీరు ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.