HDFC Balanced Fund
-
ఆటుపోట్లలోనూ స్థిరమైన రాబడులు
స్టాక్ మార్కెట్ అంటేనే తీవ్ర హెచ్చుతగ్గులు, ఆటుపోట్లు!!. ఈ తరహా పరిస్థితులు నచ్చని వారు ఒకింత స్థిరత్వంతో కూడిన పెట్టుబడి సాధనాల వైపు చూస్తారు. అలాంటి వారు తప్పక పరిశీలించాల్సిన పథకాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ ఫండ్ ఒకటి. ఇది పూర్తిగా ఈక్విటీ మార్కెట్‌పై ఆధారపడే పథకం కాదు. అలాగని అధిక రాబడులిచ్చే ఈక్విటీకి దూరంగానూ ఉండదు. అటు ఈక్విటీ రాబడులు, ఇటు డెట్ (బాండ్లు) నిలకడను కలిపి ఇన్వెస్టర్ల పెట్టుబడులపై స్థిరమైన రాబడులను అందించే దిశగా ఇది పనిచేస్తుంది. పథకం నిర్వహణ పరిధిలోని మొత్తం పెట్టుబడుల్లో 35 శాతం వరకు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. పెట్టుబడుల విధానం, పనితీరు 2011, 2013, 2015, 2016 సంవత్సరాల్లో మార్కెట్ల అస్థిరత సమయాల్లో పోటీ పథకం హెచ్డీఎఫ్సీ ప్రుడెన్స్ ఫండ్‌తో పోలిస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ ఫండ్ మెరుగైన రాబడులను అందించింది. కారణం ఆయా సమయాల్లో ఈక్విటీ పెట్టబడులను సాధ్యమైనంత తక్కువ స్థాయికి పరిమితం చేయడం వల్లే. 2014, 2017లో మార్కెట్ ర్యాలీల్లోనూ చక్కని రాబడులను అందించింది. మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేయడం ద్వారా అధిక రాబడులను పంచింది. 2014లో ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 40 శాతం వరకు స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌నే కొనసాగించింది. అలాగే, అదే ఏడాది ప్రభుత్వ సెక్యూరిటీలకు తగినంత నిధులు కేటాయించడం ద్వారా డెట్ విభాగంలోనూ మెరుగైన రాబడులను రాబట్టింది. ఇటీవలి కాలంలో బాండ్ ఈల్డ్స్ 6.6 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగిపోవడం, తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు తగ్గించుకుని కార్పొరేట్ బాండ్లకు పెట్టుబడులను మళ్లించింది. ఇక ఇటీవలి ఈక్విటీ మార్కెట్ల భారీ ర్యాలీతో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ వ్యాల్యూషన్లు విపరీతంగా పెరిగిపోవడంతో వాటిలో ఎక్స్పోజర్ తగ్గించుకుంది. తాజాగా వీటిలో కేవలం 11 శాతం పెట్టుబడులనే కలిగి ఉంది. ఈ విధమైన పెట్టుబడి వ్యూహలను అనుసరించడం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ ఫండ్ ఈ కేటగిరీకి మించి ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో అధిక రాబడులను అందించింది. ఈ రంగాలకు ప్రాధాన్యం బ్యాంకింగ్ రంగానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగానికి చెందిన షేర్లలో 20 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీబ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకులు పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు, సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ రంగాల పట్ల కూడా ఆశావహంగా ఉంది. ఏడాది కాలంలో ఈ పథకం 15.4 శాతం రాబడి అందించింది. మూడేళ్ల కాలంలో 10.1 శాతం, ఐదేళ్ల కాలంలో 18.4 శాతం, పదేళ్లలో 16 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చింది. టాప్ హోల్డింగ్స్ స్టాక్ పేరు పెట్టుబడుల శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు 6.57 ఇన్ఫోసిస్ 3.97 హెచ్డీఎఫ్సీ 3.50 ఐసీఐసీఐ బ్యాంకు 3.40 ఐటీసీ 3.30 ఎల్అండ్టీ 3.15 అరబిందో ఫార్మా 2 -
గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయవచ్చా?
హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఒకేసారి ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయవచ్చా? - అమృత, హైదరాబాద్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటే దాదాపు ఈక్విటీ ఫండ్స్‌లాగానే ఉంటాయి. ఈ ఫండ్స్ నిధుల్లో 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈక్విటీల్లో 65% ఇన్వెస్ట్ చేస్తామని బ్యాలెన్స్డ్ ఫండ్స్ పేర్కొంటాయి. కానీ, ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం కనీసం 70 నుంచి 80%వరకూ ఉంటాయి. ఏతావాతా బ్యాలెన్స్డ్ ఫండ్స్ పనితీరు ఈక్విటీ ఫండ్స్‌లాగానే ఉంటుందని చెప్పవచ్చు. స్టాక్‌మార్కెట్లు జోరుగా ఉన్నప్పుడు ఈ ఫండ్స్ వృద్ధి బావుంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లు పడిపోతే ఈ ఫండ్స్ కూడా క్షీణిస్తాయి. అందుకని ఈ ఫండ్స్‌లో ఒకేసారి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లు పతనమైతే మీకు కూడా పెద్ద మొత్తంలోనే నష్టాలు వస్తాయి. అయితే దీనికి వ్యతిరేకంగా ధర బాగా తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు కళ్లజూడవచ్చు. కానీ ధర తక్కువ అనేదానిని ఎవరూ పసిగట్టలేరు. ధర తగ్గుతుంటే ఇంకా తగ్గుతుందని ఎదురు చూస్తూ ఉంటాం. అప్పుడు ధర క్రమ క్రమంగా పుంజుకుంటుంది. అందుకని బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసే ఓపిక మీకు లేకపోతే, మీ దగ్గరున్న మొత్తాన్ని కనీసం ఆరు సమాన భాగాలుగా చేసైనా ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నెలకు కొంత మొత్తం చొప్పున ఏదైనా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయని మిత్రులంటున్నారు. ఇది సరైన నిర్ణయమేనా? -ప్రకాశ్, విజయవాడ ఎంత మాత్రం సరైన నిర్ణయం కాదు. పుత్తడిలో పెట్టుబడులు వద్దని చెబుతూనే ఉన్నాం. గతంలో వివిధ కారణాల వల్ల బంగారంలో పెట్టుబడులకు మంచి రాబడులే వచ్చాయి. ఈక్విటీ మార్కెట్లలో అని శ్చితి, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, డిమాండ్ అధికంగా ఉండడం, సరఫరా తక్కువగా ఉండడం తదితర కారణాల వల్ల బంగారంలో పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజు కుంటోంది. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ కారణాల వల్ల చూస్తే, ఈక్విటీల్లో పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే సూచనలున్నాయి. ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి బంగారం కంటే ఈక్విటీలే ఉత్తమం. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పుత్తడిలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. నేను ఇటీవలనే రిటైరయ్యాను. గతంలో నేను వేసిన ఫిక్సడ్ డిపాజిట్లు మరో రెండు నెలల్లో మెచ్యూర్ అవుతాయి. ఈ మొత్తాన్ని ఏవైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్ ల్లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంకు ఎఫ్‌డీల కన్నా మెరుగైన రాబడి వస్తుందా? ఏయే ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయమంటారు? - సంపత్‌కుమార్, కరీంనగర్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్.. ఇవి రెండూ పూర్తిగా భిన్నమైన ఇన్వెస్ట్మెంట్ విధానాలు. ఫిక్స్డ్ డిపాజిట్లలో స్థిరమైన ఆదాయం గ్యారంటీగా లభిస్తుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, ఇవి మార్కెట్ అనుసంధానత ఇన్వెస్ట్మెంట్ సాధనాలు, స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకులు కారణంగా వీటిల్లో కూడా ఒడిదుడుకులుంటాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల వలె మ్యూచువల్ ఫండ్స్ నుంచి గ్యారంటీడ్ ఆదాయం పొందలేము. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందవచ్చు. మీరు రిటైరయ్యారు కాబట్టి, మీ ఆదాయంలో వృద్ధి ఆగిపోతుంది. అందుకే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే ఆదాయంపైననే మీరు ఆధారపడాలి. మీ అసలు మొత్తం కొనుగోలు శక్తి అలాగే ఉండటంతో పాటు మీకు తగిన ఆదాయం మీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి రావలసి ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా, మీ ఖర్చులకు సరిపడేలా నెలవారీ కొంత ఆదాయం మీకు కావాలి. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మీరు ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. -
గిల్ట్‌ఫండ్స్‌కు క్రెడిట్ రిస్క్ ఉండదు
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించి రెగ్యులర్ ఆప్షన్‌నా లేదా డెరైక్ట్ ఆప్షన్‌నా దేనిని ఎంచుకోవాలి? దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించి ఏరకమైన ఫండ్స్‌ను ఎంచుకోవాలో సూచించండి? - సుకుమార్, హైదరాబాద్ ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌కు సంబంధించి రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్లలో డెరైక్ట్ ప్లాన్‌కే వ్యయం తక్కువ. ఫలితంగా రిటర్న్‌లు అధికంగా వస్తాయని చెప్పవచ్చు. ఈ డెరైక్ట్ ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రత్యక్షంగా విక్రయిస్తున్నందున రెగ్యులర్ ప్లాన్‌తో పోల్చితే ఇది చౌకగా లభ్యమవుతుంది. మీ ఆర్థిక లక్ష్యాలకు తగ్గ ఫండ్ ఏదో మీరు ఎంచుకోగలిగితే డెరైక్ట్ ప్లాన్‌లోనే పెట్టుబడులు పెట్టడం సముచితం. ఇక దీర్ఘకాలిక పెట్టుబడుల విషయానికొస్తే మీరు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకూడదు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(ఎస్ఐపి) విధానాన్ని అనుసరించడం ఉత్తమం. సెక్టోరియల్ లేదా థీమాటిక్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయకండి. విభిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేసే డైవర్సిఫైడ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కింది ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. .. క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, యూటీఐ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్‌లు. ప్రస్తుతం రెండేళ్ల వయస్సున్న నా కూతురు చదువు, వివాహం కోసం రూ. కోటి నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దీని కోసం నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా పెట్టుబడులు ఎలా ఉండాలి? ప్రస్తుతం ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. అలాగే పీపీఎఫ్‌కు కొంత మొత్తం చెల్లిస్తున్నాను. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తగిన సూచనలివ్వండి. - శరణ్య, ఈ మెయిల్ ద్వారా పీపీఎఫ్, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న యూలిప్.. ఇవి ఈ రెండు తక్కువ రాబడులనిచ్చే స్థిరాదాయ మార్గాలు. మీ ఆర్థిక లక్ష్యాలకు ఇవి సరిపోవు. మీరు మొదటగా చేయాల్సింది ఏమిటంటే మీ జీవన్ ఆనంద్ పాలసీ డాక్యుమెంట్‌ను పరిశీలించి ఈ పాలసీ నుంచి వైదొలిగే మార్గాలను చూడండి. అలాగే పీపీఎఫ్‌లో కనీస మొత్తమే ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన మొత్తాన్ని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రూ.10,000కు జత చేయండి. ఈ మొత్తాన్నంతటిని మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, మొదటగా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్ పనితీరు తదితర అంశాలపై మీకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికైతే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, కెనరా రొబెకొ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. నేనొక సీనియర్ సిటిజన్‌ను. 12-18 నెలల కాలానికి ఏదైనా ఒక గిల్ట్ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ విషయమై తగిన సలహా ఇవ్వండి. - రామకృష్ణయ్య, ఏలూరు ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే గిల్ట్‌ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే వీటికి ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండదు. భద్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవి ఒడిదుడుకులకు గురవుతుంటాయి. వడ్డీరేట్లు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఒడిదుడుకులు మరీ తీవ్రంగా ఉంటాయి. గత సంవత్సరంన్నర కాలంలో డెట్ ఫండ్ కేటగిరిలో అత్యంత అధ్వాన పనితీరు కనబరిచింది ఈ గిల్ట్ఫండ్సే. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే, వడ్డీ రేట్లను తగ్గించబోమని ఆర్బీఐ గవర్నర్ ఇటీవలనే పేర్కొన్న సంగతి తెలిసిందే. గిల్ట్ఫండ్స్ల్లో పెట్టుబడులు పెట్టేముందు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. గిల్ట్‌ఫండ్స్‌కు బదులుగా డైనమిక్ బాండ్ ఫండ్‌లో గానీ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్‌లో గానీ ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించండి. నేను ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్‌లో నెలకు రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాను. మూడేళ్ల కాలానికి మరి కొంత ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్‌లను షార్ట్‌లిస్ట్ చేశాను. తగిన సలహా ఇవ్వండి. - రామ్మూర్తి, అనంతపురం మూడేళ్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు ఈక్విటీ ఫండ్స్‌ను పరిశీలించడం సమంజసం కాదు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ ఫండ్స్ మీరు నిర్దేశించుకున్న మూడేళ్ల కాలానికి సరైన రాబడులనివ్వలేవు. స్వల్పకాలంలో వీటి నుంచి మీరు ఆశించే రాబడులు రావు. అందుకని బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. మూడేళ్ల కాలానికి వీటిల్లో రిస్క్ తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరింతగా పెంచవచ్చు. లేదంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను పరిశీలించవచ్చు.