గిల్ట్‌ఫండ్స్‌కు క్రెడిట్ రిస్క్ ఉండదు | There is no credit risk gilt funds, | Sakshi
Sakshi News home page

గిల్ట్‌ఫండ్స్‌కు క్రెడిట్ రిస్క్ ఉండదు

Published Mon, Apr 7 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM

గిల్ట్‌ఫండ్స్‌కు క్రెడిట్ రిస్క్ ఉండదు

గిల్ట్‌ఫండ్స్‌కు క్రెడిట్ రిస్క్ ఉండదు

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించి రెగ్యులర్ ఆప్షన్‌నా లేదా డెరైక్ట్ ఆప్షన్‌నా దేనిని ఎంచుకోవాలి? దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించి ఏరకమైన ఫండ్స్‌ను ఎంచుకోవాలో సూచించండి?
 - సుకుమార్, హైదరాబాద్
 
ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌కు సంబంధించి రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్‌లలో  డెరైక్ట్ ప్లాన్‌కే వ్యయం తక్కువ. ఫలితంగా రిటర్న్‌లు అధికంగా వస్తాయని చెప్పవచ్చు. ఈ డెరైక్ట్ ప్లాన్‌లను మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రత్యక్షంగా విక్రయిస్తున్నందున రెగ్యులర్ ప్లాన్‌తో పోల్చితే ఇది చౌకగా లభ్యమవుతుంది. మీ ఆర్థిక లక్ష్యాలకు తగ్గ ఫండ్ ఏదో మీరు ఎంచుకోగలిగితే డెరైక్ట్ ప్లాన్‌లోనే పెట్టుబడులు పెట్టడం సముచితం.
 
ఇక దీర్ఘకాలిక పెట్టుబడుల విషయానికొస్తే మీరు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.  ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకూడదు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఐపి) విధానాన్ని అనుసరించడం ఉత్తమం. సెక్టోరియల్ లేదా థీమాటిక్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయకండి. విభిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేసే డైవర్సిఫైడ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కింది ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. .. క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, యూటీఐ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్‌లు.
 
ప్రస్తుతం రెండేళ్ల వయస్సున్న నా కూతురు చదువు, వివాహం కోసం రూ. కోటి నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దీని కోసం నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా పెట్టుబడులు ఎలా ఉండాలి? ప్రస్తుతం ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. అలాగే పీపీఎఫ్‌కు కొంత మొత్తం చెల్లిస్తున్నాను. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తగిన  సూచనలివ్వండి.
 - శరణ్య, ఈ మెయిల్ ద్వారా
 
 పీపీఎఫ్, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న యూలిప్.. ఇవి ఈ రెండు తక్కువ రాబడులనిచ్చే స్థిరాదాయ మార్గాలు. మీ ఆర్థిక లక్ష్యాలకు ఇవి సరిపోవు. మీరు మొదటగా చేయాల్సింది ఏమిటంటే మీ జీవన్ ఆనంద్ పాలసీ డాక్యుమెంట్‌ను పరిశీలించి ఈ పాలసీ నుంచి వైదొలిగే మార్గాలను చూడండి. అలాగే పీపీఎఫ్‌లో కనీస మొత్తమే ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన మొత్తాన్ని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రూ.10,000కు జత చేయండి. ఈ మొత్తాన్నంతటిని మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి.
 
మీరు మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, మొదటగా రెండు బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్ పనితీరు తదితర అంశాలపై మీకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికైతే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్,  కెనరా రొబెకొ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.
 
నేనొక సీనియర్ సిటిజన్‌ను. 12-18 నెలల కాలానికి ఏదైనా ఒక గిల్ట్‌ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ విషయమై తగిన సలహా ఇవ్వండి.  - రామకృష్ణయ్య, ఏలూరు

ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే గిల్ట్‌ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే వీటికి ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండదు. భద్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవి ఒడిదుడుకులకు గురవుతుంటాయి. వడ్డీరేట్లు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఒడిదుడుకులు మరీ తీవ్రంగా ఉంటాయి. గత సంవత్సరంన్నర కాలంలో డెట్ ఫండ్ కేటగిరిలో అత్యంత అధ్వాన పనితీరు కనబరిచింది ఈ గిల్ట్‌ఫండ్సే.

ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే, వడ్డీ రేట్లను తగ్గించబోమని ఆర్‌బీఐ గవర్నర్ ఇటీవలనే పేర్కొన్న సంగతి తెలిసిందే. గిల్ట్‌ఫండ్స్‌ల్లో పెట్టుబడులు పెట్టేముందు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. గిల్ట్‌ఫండ్స్‌కు బదులుగా డైనమిక్ బాండ్ ఫండ్‌లో గానీ ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌లో గానీ ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించండి.
 
నేను ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో నెలకు రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాను. మూడేళ్ల కాలానికి మరి కొంత ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్‌డ్ బ్లూచిప్‌లను షార్ట్‌లిస్ట్ చేశాను. తగిన సలహా ఇవ్వండి.
- రామ్మూర్తి, అనంతపురం
 
మూడేళ్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు ఈక్విటీ ఫండ్స్‌ను పరిశీలించడం సమంజసం కాదు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ ఫండ్స్ మీరు నిర్దేశించుకున్న మూడేళ్ల కాలానికి సరైన రాబడులనివ్వలేవు. స్వల్పకాలంలో వీటి నుంచి మీరు ఆశించే రాబడులు రావు. అందుకని బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం.
 
మూడేళ్ల కాలానికి వీటిల్లో రిస్క్ తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరింతగా పెంచవచ్చు. లేదంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను పరిశీలించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement