ఎన్‌పీఎస్.. పన్ను ప్రయోజనాలు | NPS tax benefits | Sakshi
Sakshi News home page

ఎన్‌పీఎస్.. పన్ను ప్రయోజనాలు

Published Mon, Aug 31 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

ఎన్‌పీఎస్.. పన్ను ప్రయోజనాలు

ఎన్‌పీఎస్.. పన్ను ప్రయోజనాలు

నేను ఈ ఏడాది మొదట్లో ఒక ఫండ్‌లో రూ.10,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.13,000కు చేరింది. అయితే ఈ ఫండ్ పనితీరుతో నేను సంతృప్తిచెందలేకపోతున్నాను. దీంతో ఇదే మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెందిన మరో ఫండ్‌కు ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ను బదిలీ చేద్దామనుకుంటున్నాను. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు మారడం కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు కదా ! ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై నేను ఈ ఏడాది పొందిన రూ.3,000పై మూలధన లాభాల పన్ను చెల్లించాలా?
 - ప్రసాద్, విశాఖపట్టణం

 
పన్ను విధింపు దృష్ట్యా, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌కు మార్చడాన్ని ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి యూనిట్లు విక్రయించి, మరో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసినట్లుగా పరిగణిస్తారు.  మీ విషయంలో ఏడాది గడవక ముందే మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటున్నారు కాబట్టి మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి  ఉంటుంది. ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్‌లో మీరు ఈ విషయం వెల్లడించాల్సి ఉంటుంది. ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌పై పొందిన రాబడులపై 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 
చార్జీలను పరిగణనలోకి తీసుకుంటే ఏ బీమాపాలసీలు ఉత్తమం. టర్మ్ పాలసీలు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్), మనీ బ్యాక్, ఎండోమెంట్ .. వీటిల్లో వేటిని ఎంచుకోవాలి?
 - క్రాంతి, నెల్లూరు

 
జీవిత బీమా కవర్ కావాలనుకుంటే టర్మ్ ప్లాన్‌లు తీసుకోవం ఉత్తమం. టర్మ్ పాలసీలు పూర్తిగా బీమా పాలసీలు. వీటిల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. అందుకనే ఇవి చౌకగా లభిస్తాయి. ఇక యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యూలిప్)వివిధ రకాల చార్జీలు వసూలు చేస్తాయి. వీటికి సంబంధించిన పాలసీ బ్రోచర్‌లో చార్జీలు అనే శీర్షిక కింద అన్ని చార్జీలను ఆ యులిప్‌ను ఆఫర్ చేసే సంస్థ వెల్లడిస్తుంది. సంప్రదాయబద్ధ పాలసీలైన మనీ బ్యాక్, ఎండోమెంట్ పాలసీలు..తాము విధించే చార్జీల వివరాలను వెల్లడించవు.
 
నేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో ఇన్వెస్ట్ చేయడం వల్ల  ఏమైనా పన్ను సంబంధిత ప్రయోజనాలున్నాయా?
 - తన్మయి, హైదరాబాద్

 
ఉద్యోగం చేస్తున్నప్పుడే రిటైర్మెంట్ అవసరాల కోసం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) కల్పిస్తోంది. ఇది మార్కెట్‌తో అనుసంధానమై ఉన్న స్కీమ్. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 50 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంది. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే ఈపీఎఫ్ వంటి స్థిరాదాయ ఆప్షన్స్ కన్నా ఇలా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ మంచి రాబడులను ఇస్తుంది. ఇది చాలా సరళమైన స్కీమ్. నెలకు తక్కువలో తక్కువ కనీసం రూ.500 ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సెక్షన్ 80 సీసీడీ(1) కింద ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి (వేతనంలో(బేసిక్ ప్లస్ డీఏ) 10 శాతానికి మించకుండా) పన్ను రాయితీలు లభిస్తాయి. సెక్షన్ 80సీసీఈ కింద లభించే మొత్తం రాయితీ రూ.1.5 లక్షల్లోనే ఇది కూడా కలిసి ఉంటుంది. అయితే కొత్త బడ్జెట్ ప్రకారం, ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే  రూ.1.5 లక్షల రాయితీకి అదనంగా రూ.50,000 వరకూ పొందే అవకాశం ఉంది. ఇక ఎన్‌పీఎస్ విత్‌డ్రాయల్స్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటంది. ఎన్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్ మెచ్యూర్ అయిన తర్వాత దాంట్లో 40 శాతం సొమ్ముతో యాన్యూటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ యాన్యూటిపై వచ్చే వడ్డీపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో టైర్ వన్, టైర్ టూ అని రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. టైర్ వన్ అకౌంట్‌లో ఏడాదికి కనీసం రూ.6.000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట మొత్తం ఏమీ లేదు. ఎన్‌పీఎస్ ప్రారంభించేటప్పుడు టైర్ టూ అకౌంట్‌లో కనీసం రూ.1,000 జమ చేయాలి. ఏడాదిలో కనీసం ఒకసారి జమ చేయాలి. ఆర్థిక సంవత్సరం చివరినాటికి కనీస మొత్తం బ్యాలెన్స్ రూ.2,000కు తగ్గకుండా ఉండాలి. టైర్ టూ అకౌంట్ అనేది స్వచ్ఛందమైన సేవింగ్స్ అకౌంట్. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎంత కావాలనుకుంటే అంత ఈ అకౌంట్ నుంచి మీ సొమ్ములను విత్‌డ్రా చేసుకోవచ్చు.
 
ఫిక్స్‌డ్ మెచ్యురిటీ ప్లాన్(ఎఫ్‌ఎంపీ)లో ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం ఏది ?
- భాస్కర్, వరంగల్


ఫిక్స్‌డ్ మెచ్యురిటీ ప్లాన్(ఎఫ్‌ఎంపీ)లో ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడూ సరైన సమయమే. అంచనా వేసిన రాబడులను నిర్దేశిత కాలానికి పొందవచ్చు. అయితే వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులున్నప్పుడు ఎఫ్‌ఎంపీల నుంచి మీరు ప్రయోజనం పొందలేరు.
 
నెలకు రూ.20,000 చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ డబ్బులు నాకు ఆరు నెలల నుంచి ఏడాది కాలానికి అవసరం. రికరింగ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడులనిచ్చే ఫండ్స్‌ను సూచించండి.
 - సతీష్, నెల్లూరు

 
రికరింగ్ డిపాజిట్ల కంటే కొంచెం ఎక్కువ రాబడులు కావాలనుకుంటే ఆల్ట్రా షార్ట్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, డీడబ్ల్యూస్ ఆల్ట్రా షార్ట్‌టెర్మ్ ఫండ్, టారస్ ఆల్ట్రా షార్ట్‌టెర్మ్ బాండ్‌ఫండ్, బరోడా పయనీర్ ట్రెజరీ అడ్వాంటేజ్ ఫండ్.. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు.

ధీరేంద్ర కుమార్
 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement