
ఇటీవలి కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల విలువలు గణనీయంగా పెరిగిపోవడం, అక్కడి నుంచి అదే తీవ్రతతో దిద్దుబాటుకు గురికావడం చూస్తున్నాం. దీంతో ఇన్వెస్టర్లలో అప్రమత్త ధోరణి నెలకొంది. పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌క్యాప్ ప్రాధాన్యాన్ని వారు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. స్మాల్, మిడ్‌క్యాప్‌తో పోల్చిచూసినప్పుడు లార్జ్‌క్యాప్ కంపెనీల్లో (మార్కెట్ విలువలో టాప్100 కంపెనీలు) అస్థిరతలు తక్కువ. అంతేకాదు ఆయా రంగాల్లో ఇవి బలమైన కంపెనీలు కూడా. కనుక మొదటిసారి ఇన్వెస్టర్లకు సైతం లార్జ్‌క్యాప్ ఫండ్స్ పెట్టుబడులకు అనుకూలమని నిపుణులు సూచిస్తుంటారు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో నిపాన్ ఇండియా లార్జ్‌క్యాప్ ఫండ్ ఒకటి.
రాబడులు
ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో పెట్టుబడులపై 9 శాతం రాబడిని అందించింది. అదే మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే వార్షిక రాబడి 18 శాతానికి పైనే ఉంది. ఐదేళ్లలో ఏటా 26.64 శాతం, ఏడేళ్లలో 14.91 శాతం, పదేళ్లలో 12.89 శాతం చొప్పన ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. నిఫ్టీ 100 టీఆర్‌ఐ సూచీ, లార్జ్‌క్యాప్ ఫండ్స్ విభాగం కంటే ఈ పథకమే దీర్ఘకాలంలో మెరుగైన పనితీరు చూపించింది. పదేళ్ల క్రితం ఈ పథకంలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అది ఇప్పుడు రూ.4.78 లక్షలుగా మారేది. గత పదేళ్లలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ మొత్తం రూ.15.44 లక్షలు అయ్యేది. గత పదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఈ పథకం ప్రతికూల రాబడిని ఇవ్వలేదు. రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
మెరుగైన పనితీరు
మార్కెట్ కరెక్షన్ల సమయాల్లో పెట్టుబడుల విలువ క్షీణతను తక్కువకు పరిమితం చేయడంలో పోటీ పథకాలతో పోలిస్తే ఈ పథకం ముందుంది. ఈ పథకం కనీసం 80 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. మిడ్, స్మాల్‌క్యాప్‌లో మంచి అవకాశాలున్నాయని భావించినప్పుడు మిగిలిన పెట్టుబడులను ఆయా విభాగాలకు కేటాయిస్తుంది. వివిధ రంగాల్లో ఇప్పటికే దిగ్గజాలుగా అవతరించి, వ్యాపార పరంగా బలమైన మూలాలున్న వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంతేకాదు, భవిష్యత్‌లో దిగ్గజాలుగా అవతరించే వాటిని గుర్తించి పెట్టుబడులు పెడుతుంది. బలమైన మూలాలున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడమే కాదు, దీర్ఘకాలం పాటు కొనసాగడం ఈ పథకం మెరుగైన పనితీరుకు కారణాల్లో ఒకటి. మంచి వృద్ధికి అవకాశాలున్న కంపెనీలను సహేతుక విలువల వద్ద గుర్తించి పెట్టుబడి పెడుతుండడాన్ని గమనించొచ్చు.
ఇదీ చదవండి: ఇక ఒక రాష్ట్రం–ఒక ఆర్‌ఆర్‌బీ!
పోర్ట్‌ఫోలియో చూస్తే..
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.34,212 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 98.46 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, కేవలం 1.53 శాతం నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 91 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో 8.69 శాతం, స్మాల్‌క్యాప్‌లో 0.26 శాతమే పెట్టుబడులు కలిగి ఉంది. మిడ్, స్మాల్ క్యాప్ విలువలు అధిక స్థాయిలకు చేరడంతో ఈ విభాగాలకు పెట్టుబడులను తక్కువకు పరిమితం చేసినట్టు తెలుస్తోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో అత్యధికంగా 36 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఇంధన రంగ కంపెనీల్లో 12.34 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 11.23 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 11 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.