పీపీఎఫ్ కొత్త వడ్డీరేట్లు పాత ఖాతాలకు వర్తిస్తాయా? | ppf new rates apply to old accounts? | Sakshi
Sakshi News home page

పీపీఎఫ్ కొత్త వడ్డీరేట్లు పాత ఖాతాలకు వర్తిస్తాయా?

Published Mon, Apr 4 2016 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

పీపీఎఫ్ కొత్త వడ్డీరేట్లు పాత ఖాతాలకు వర్తిస్తాయా?

పీపీఎఫ్ కొత్త వడ్డీరేట్లు పాత ఖాతాలకు వర్తిస్తాయా?

నేను గత ఏడాది మార్చి నుంచి ప్రజా భవిష్య నిధి(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ -పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఖాతా మెచ్యూరిటీ వరకూ నాకు 8.7 శాతం వడ్డీ వస్తుందా? కొత్త వడ్డీరేట్లు కొత్త పీపీఎఫ్ ఖాతాలకే వర్తిస్తాయా ? పాత వాటికి కూడా అమలవుతుందా ? ఈ విషయాలపై తగిన స్పష్టతనివ్వండి.    - రాజశేఖర్, విశాఖపట్టణం

 
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్) వడ్డీరేట్లు మెచ్యూరిటీ వరకూ ఒకే విధంగా ఉండకపోవచ్చు. ప్రభుత్వం పీపీఎఫ్ వడ్డీరేట్లును కాలానుగుణంగా మారుస్తూ ఉంటుంది. ఇలా మార్పు చేసినప్పుడల్లా, ఆ మారిన వడ్డీరేట్లు పాత, కొత్త పీపీఎఫ్ ఖాతాలన్నింటికీ వర్తిస్తాయి. గతంలో పీపీఎఫ్ వడ్డీరేట్లు ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే నిర్ణయించేవాళ్లు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం(2016-17) నుంచి వడ్డీరేట్లను ప్రతి మూడు నెలలకొకసారి సవరిస్తారు. ఈ ఏడాది మార్చి వరకూ పీపీఎఫ్ వడ్డీరేటు 8.7 శాతంగా ఉంది.  ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలు(ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకూ) 8.1 శాతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

నా వయస్సు 28 సంవత్సరాలు. ఇటీవలనే ఉద్యోగ జీవితం ప్రారంభించాను.  నేను బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. నాకు తగిన పాలసీ సూచించగలరు.                      - ప్రభు, కరీంనగర్

చిన్న వయస్సులోనే బీమా పాలసీ తీసుకుంటే వార్షిక ప్రీమియమ్ తక్కువగా చెల్లించే ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా తగిన ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది. ఇక మీ వయస్సుకు తగ్గట్లుగా మూడు బీమా పాలసీలను సూచిస్తున్నాము. సంస్థ బీమా పాలసీ, రూ. కోటి బీమాకు మీరు 32 సంవత్సరాల పాటు (మీ రిటైర్మెంట్ వరకూ)చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం, తదితర వివరాలను కూడా అందిస్తున్నాం. పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి. మ్యాక్స్ లైఫ్ ఆన్‌లైన్ టెర్మ్ ప్లాన్- వార్షిక ప్రీమియమ్ రూ.6,900. ఈ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 98.63 శాతంగా ఉంది. ఇక ఏగాన్ రెలిగేర్ ఐటెర్మ్ ప్లాన్‌లోనైతే వార్షిక ప్రీమియమ్ రూ.7,866గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 96.59 శాతంగా ఉంది. ఇక మూడో పాలసీ విషయానికొస్తే, హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్2ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్‌కైతే ఏడాదికి రూ.9,380 ప్రీమియం చెల్లించాలి.   ఈ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 95.86 శాతంగా ఉంది. కొంత అదనపు ప్రీమియం చెల్లించి అదనపు రైడర్లు పొందవచ్చు. అన్ని విషయాలు సవివరంగా బీమా దరఖాస్తులో వెల్లడించండి. ఇలా చేస్తే పాలసీ క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు.

నేను గత కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరో మ్యూచువల్ ఫండ్‌లోకి మారుద్దామనుకుంటున్నాను. ఇలా ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సులభంగా బదిలీచేసుకునే మార్గాన్ని సూచించండి? - ప్రతిభ, హైదరాబాద్

ఒక మ్యూచువల్ ఫండ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరో మ్యూచువల్ ఫండ్‌లోకి మార్చుకోవడాన్ని.. ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించి, కొత్త మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడంగా పరిగణిస్తారు. ఇక ఒక మ్యూచువల్ ఫండ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరో మ్యూచువల్ ఫండ్‌లోకి మార్చుకునేటప్పుడు చెల్లించాల్సిన పన్నులు, ఎగ్జిట్ లోడ్, తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు డెట్ మ్యూచువల్ ఫండ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే మ్యూచువల్ ఫండ్‌లోకి మార్చాలనుకుంటున్నారనుకుందాం.... ఇన్వెస్ట్ చేసిన మూడేళ్లలోపే ఇలా మార్చాలనుకుంటే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను(షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుససరించి మీరు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మూడేళ్ల తర్వాత మార్చాలనుకుంటే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఇండేక్సేషన్ బెనిఫిట్‌తో 20 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కైతే పన్నులు భిన్నంగా ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఏడాదిలోపే విక్రయిస్తే, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా భావించి 15 శాతం  పన్ను విధిస్తారు. ఏడాది తర్వాత విక్రయిస్తే, ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఏడాది తర్వాత విక్రయిస్తే, వాటిని దీర్ఘకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇక కొన్ని మ్యూచువల్ ఫండ్స్ నిర్ణీత కాలానికి మ్యూచువల్ ఫండ్స్ విక్రయాలపై ఎగ్జిట్ లోడ్‌ను విధిస్తాయి.  అందుకని ఎగ్జిట్ లోడ్ పడనంత కాలం వేచి చూసి,  ఆ తర్వాత బదిలీ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ భారం తప్పించుకోవచ్చు. ఏ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఏ మ్యూచువల్ ఫండ్స్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో వివరాలను మీరు వెల్లడించలేదు.


అందుకని సవివర సలహా ఇవ్వలేకపోతున్నాం. ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రెండు సందర్భాల్లో బదిలీ చేయాలనుకుంటారు. మొదటిది. మీరు అనుకున్న/నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యం సాధించగలగడం, రెండోది మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్, ఆ కేటగిరి ఫండ్స్‌తో పోల్చితే సరైన రాబడులను ఇవ్వలేకపోవడం. మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఆశించిన పనితీరు కనబరచకపోవడానికి తగిన కారణాలేంటో అన్వేషించండి. భవిష్యత్తులో కూడా ఈ ఫండ్ పనితీరు అద్వానంగా ఉంటుందని భావిస్తే, అదే కేటగిరిలో మంచి పనితీరు కనబరుస్తున్న మరో మ్యూచువల్ ఫండ్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసుకోండి.

 

 ధీరేంద్ర కుమార్

 సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement