మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్‌కు మారాలంటే.. | Direct plan to become a mutual fund... | Sakshi
Sakshi News home page

మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్‌కు మారాలంటే..

Published Mon, Apr 25 2016 12:11 AM | Last Updated on Wed, Sep 5 2018 8:20 PM

మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్‌కు మారాలంటే.. - Sakshi

మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్‌కు మారాలంటే..

నేను ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. రెగ్యులర్ ప్లాన్ కంటే అదే స్కీమ్‌కు సంబంధించి డెరైక్ట ప్లాన్‌కు వ్యయాలు తక్కువగా ఉంటాయని, రాబడులు ఎక్కువగా ఉంటాయని మిత్రులంటున్నారు. నేను ఈ రెగ్యులర్ ప్లాన్ నుంచి  డెరైక్ట్ ప్లాన్‌కు మారవచ్చా? ఇలా మారడాన్ని మ్యూచువల్ ఫండ్ సలహాదారుకు తప్పనిసరిగా వెల్లడించాలా ? మారడానికి సంబంధించిన విధి విధానాలేంటి?
- సుధాకర్, ఖమ్మం

 
ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించి  రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారవచ్చు. ఈ విషయాన్ని మీ మ్యూచువల్ ఫండ్ సలహాదారుకు వెల్లడించాలా, వద్దా అనేది మీ ఇష్టం. రెగ్యులర్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారేటప్పుడు ఆన్‌లైన్‌లో డెరైక్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక ఆఫ్‌లైన్‌లో అయితే సదరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పేరు తర్వాత, ఏఆర్‌ఎన్ కోడ్ దగ్గర.. ఈ రెండు చోట్లా   డెరైక్ట్ అని స్పష్టంగా తెలియజేయాలి.

రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు ఇన్వెస్టర్లు మారితే వారిపై ఎగ్జిట్ లోడ్‌ను ఇప్పుడు చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు వసూలు చేయడం లేదు. అయినప్పటికీ, మీ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎగ్జిట్ లోడ్‌ను వసూలు చేస్తోందా లేదా అన్న విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇలా ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్‌కు మారడాన్ని... ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్లు విక్రయించి, మరో మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడంగా భావిస్తారు. కాబట్టి ఏమైనా మూలధన లాభాల పన్నులు చెల్లించాల్సి ఉంటుందేమోనని విషయాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి.
 
ప్రస్తుతం నేను ఎస్‌బీఐ మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్, ఎస్‌బీఐ ఫార్మా ఫండ్, యూటీఐ టాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్, యూటీఐ మిడ్ క్యాప్ ఫండ్, యూటీఐ ఎంఎన్‌సీ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్-క్యాప్ అపర్చునిటీస్ ఫండ్‌ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం నేను ఏమైనా పన్ను రాయితీలు పొందవచ్చా?
 - ప్రశాంతి, గుంటూరు

 
మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)ల్లో లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తేనే పన్ను రాయితీలు లభిస్తాయి. దురదృష్టవశాత్తూ మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్( ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్న వాటిల్లో ఏ ఒక్కటి కూడా ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్ కాదు. అందుకని మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు ఎలాంటి పన్ను రాయితీలు లభించవు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు.
 
స్థలం కొనుగోలు కోసం ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్) నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుందామనుకుంటున్నాను. దీనికి సంబంధించిన విధి విధానాలేంటి? ఏమేం డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది ?
 - భవానీ, హైదరాబాద్
 
నిర్దేశిత ఉద్యోగ సర్వీస్ పూర్తి చేస్తేనే మీరు ఈపీఎఫ్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.  స్థలం కొనుగోలు కోసం ఈపీఎఫ్ నుంచి మొత్తం కాకుండా పాక్షికంగానే డబ్బులను విత్‌డ్రా చేసుకునే వీలుంది. మీరు ఏ కారణం వల్ల డబ్బులను విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో, దానికి తగ్గట్లుగా మీ సర్వీస్ ఉండాలి. ఉదాహరణకు మీ ఉద్యోగ సర్వీస్ ఐదేళ్లు పూర్తయితేనే మీరు స్థలం కోసం ఈపీఎఫ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లతో పాటు పార్షియల్ విత్‌డ్రాయల్ పార్మ్‌ను మీ కంపెనీకి అందజేయాలి.

మీ బ్యాంక్ ఖాతా వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. మీ క్లెయిమ్‌ను వెరిఫై చేసి, డబ్బులను మీ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. కొత్త నిబంధనల ప్రకారం, విత్‌డ్రాయల్ దరఖాస్తును నేరుగా ఈపీఎఫ్‌ఓ కార్యాలయంలో కూడా  సమర్పించవచ్చు.
 
నేను 2009, మార్చిలో హెచ్‌డీఎఫ్‌సీ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్-2లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఏడేళ్ల పాటు ఏడాదికి రూ.12,000 చొప్పున ప్రీమియమ్‌లు చెల్లించాను. ఇప్పుడు నేను ఈ పాలసీని సరెండర్ చేస్తే, ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా?
 - ప్రకాశ్ జైన్, హైదరాబాద్

 
హెచ్‌డీఎఫ్‌సీ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్ టూ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూఎల్‌పీపీ), ఈ ప్లాన్‌ను ఇప్పుడు ఈ కంపెనీ నిలిపేసింది. ఈ పాలసీలో మీరు ఏడేళ్ల పాటు ప్రీమియమ్‌లు చెల్లించారు.  కాబట్టి మీపై ఎలాంటి సరెండర్ చార్జీల భారం ఉండదు. మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి సరెండర్ వేల్యూపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ పాలసీని సరెండర్ చేసేటప్పుడు ఆ ఫండ్ విలువ ఎంత ఉంటుందో అదే దాని సరెండర్ వేల్యూగా పరిగణిస్తారు.

యూఎల్‌పీపీలు కొంత సంక్లిష్టమైన ప్లాన్‌లే. ఈ ప్లాన్‌లపై మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అధిక చార్జీలు వసూలు చేస్తాయి. ఫలితంగా రాబడులు తగ్గుతాయి. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఇక బీమా కోసం తగిన బీమా కవరేజ్ ఉండే టర్మ్‌బీమా పాలసీ తీసుకోవాలి
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement