ఇన్వెస్ట్‌ చేసేందుకు పీపీఎఫ్‌ మంచిదా? ఈఎల్‌ఎస్‌ఎస్‌ మంచిదా? | What Is Difference Between Regular And Direct Mutual Fund | Sakshi
Sakshi News home page

ఇన్వెస్ట్‌ చేసేందుకు పీపీఎఫ్‌ మంచిదా? ఈఎల్‌ఎస్‌ఎస్‌ మంచిదా?

Published Mon, Feb 27 2023 7:16 AM | Last Updated on Mon, Feb 27 2023 7:30 AM

What Is Difference Between Regular And Direct Mutual Fund - Sakshi

ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పథకం రెగ్యులర్‌ ప్లాన్‌ ఎన్‌ఏవీ, డైరెక్ట్‌ ప్లాన్‌ ఎన్‌ఏవీకి భిన్నంగా ఉంటుందా? ఒకే పెట్టుబడికి ఈ రెండు ప్లాన్లలో కేటాయించే యూనిట్లలో వ్యత్యాసం ఉంటుందా? – శామ్‌ 

మీరు అడిగింది నిజమే. మ్యూచువల్‌ ఫండ్‌ రెగ్యులర్, డైరెక్ట్‌ ప్లాన్ల నెట్‌ అస్సెట్‌ వ్యాల్యూ (ఎన్‌ఏవీ) వేర్వేరుగా ఉంటాయి. కారణం ఏమిటంటే..? ఒక ఫండ్‌ ఎన్‌ఏవీని నిర్ణయించేవి రెండు అంశాలు. ఆ పథకం పోర్ట్‌ఫోలియోతోపాటు, ఎక్స్‌పెన్స్‌ రేషియో. కనుక ఒక పథకం పోర్ట్‌ఫోలియో, ఎక్స్‌పెన్స్‌రేషియో అనేవి భిన్నంగా ఉండొచ్చు. కనుక ఎన్‌ఏవీలో మార్పు ఉండొచ్చు. అయితే, ఒక పథకం రెగ్యులర్, డైరెక్ట్‌ ప్లాన్లకు సంబంధించి పోర్ట్‌ఫోలియో ఒకటే ఉంటుంది. కాకపోతే ఎక్స్‌పెన్స్‌ రేడియో మాత్రం వేర్వేరుగా ఉంటుంది. కనుక ఎన్‌ఏవీపై దీని ప్రభావం పడుతుంది. రెగ్యులర్‌ ప్లాన్లకు పంపిణీదారుల కమీషన్‌ను కూడా కలుస్తుంది. కనుక రెగ్యులర్‌ ప్లాన్ల ఎన్‌ఏవీ అధికంగా ఉంటుంది.

డైరెక్టర్‌ ప్లాన్లలో ఎలాంటి పంపిణీదారుల కమీషన్‌ ఉండదు. కనుక వాటి ఎన్‌ఏవీ తక్కువగా ఉంటుంది. ఒక పథకంలో ఇన్వెస్టర్‌ పెట్టుబడికి ఎన్ని యూనిట్లు వస్తాయనేది.. యూనిట్‌ ఎన్‌ఏవీపైనే ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్టర్‌ మొత్తం పెట్టుబడిని, ఎన్‌ఏవీతో భాగిస్తే ఎన్ని యూనిట్లు వస్తాయో తెలుస్తుంది. ఒక పథకం రెగ్యులర్‌ ప్లాన్‌ ఎన్‌ఏవీ రూ.11గా ఉండి.. రూ.10,000 పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం. అప్పుడు ఈ పెట్టుబడికి 909.09 యూనిట్లు వస్తాయి. డైరెక్ట్‌ ప్లాన్‌ ఎన్‌ఏవీ రూ.10 ఉందనుకుందాం. అప్పుడు అదే రూ.10,000 పెట్టుబడికి 1,000 యూనిట్లు లభిస్తాయి.  

నా వయసు 51 ఏళ్లు. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. 2023 మార్చితో 15 ఏళ్ల కాల వ్యవధి ముగుస్తుంది. దీన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉందని తెలిసింది. దాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను. నాకు ఇప్పట్లో డబ్బులతో పని లేదు. నెలకు రూ.12,500 చొప్పున పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే పీపీఎఫ్‌ను కొనసాగించుకోవాలా లేదా అది ముగిసిన తర్వాత.. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకంలో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసుకోవాలా? పీపీఎఫ్‌లో పెట్టుబడులు, రాబడులపై పన్ను లేదు. ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనూ పెట్టుబడులపై సెక్షన్‌ 80సీ కింద పన్ను లేదు. నేను 20 శాతం పన్ను పరిధిలో ఉన్నాను. మంచి సలహా ఇవ్వగలరు? – సెంతిల్‌ కుమార్‌ 

ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా డెట్‌తో పోలిస్తే మెరుగైన రాబడులు సొంతం చేసుకోవచ్చని వ్యాల్యూరీసెర్చ్‌ తరచూ చెబుతుంటుంది. మీకు సమీప కాలంలో డబ్బుతో అవసరం లేదంటున్నారు. కనుక పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మెరుగైన ఆలోచన అవుతుంది. మీకు ఈక్విటీల పట్ల తగినంత అనుభవం ఉందని అనుకుంటున్నాం. అలాగే, మీ పెట్టుబడుల కాల వ్యవధి కనీసం ఐదేళ్ల నుంచి ఏడేళ్లు ఉంటుందనే అంచనాతో ఈ సూచన చేస్తున్నాం.

ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుందని మర్చిపోవద్దు. ఈఎల్‌ఎస్‌ఎస్, పీపీఎఫ్‌ల్లో పన్ను మినహాయింపు పరిశీలిస్తే.. పీపీఎఫ్‌తో పోలిస్తే పన్ను చెల్లింపుల తర్వాత రాబడులు ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనే ఎక్కువ. పన్ను ఆదా కోసం పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనాల్లో ముందు రాబడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. 


ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement