పీఎఫ్‌లోనా ? మ్యూచువల్ ఫండ్‌లోనా...? | 5 questions you should ask a mutual fund | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌లోనా ? మ్యూచువల్ ఫండ్‌లోనా...?

Published Mon, Jan 26 2015 1:46 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM

పీఎఫ్‌లోనా ? మ్యూచువల్ ఫండ్‌లోనా...? - Sakshi

పీఎఫ్‌లోనా ? మ్యూచువల్ ఫండ్‌లోనా...?

నేనొక ప్రభుత్వ ఉద్యోగిని, ఇప్పటివరకూ నా పీఎఫ్‌లో కనీస మొత్తం మాత్రమే జమ అయ్యేలా చూసుకుంటున్నాను. ఇక ఇప్పటి నుంచి నెలకు రూ.5,000 పీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. పదేళ్ల వరకూ ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే ఆలోచనేదీ లేదు.  ఇంత మొత్తం పీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? లేక ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? ఒకవేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడమే కరెక్టయితే, ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారు?
-రాజేశ్ బాబు, కడప

 
నేనైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయమని చెబుతాను. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు రావాలంటే పీఎఫ్‌లో కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. పీఎఫ్‌లో సొమ్ములు భద్రంగా ఉంటాయి. కానీ, ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులు మాత్రం రావు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌తో కూడుకున్నది అయినప్పటికీ, పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మంచి రాబడులే వస్తాయి. ప్రతినెలా రూ.5,000 చొప్పున ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే ద్రవ్యోల్బణాన్ని దీటుగా తట్టుకునే రాబడులు పొందవచ్చు.

ఇక మీ ఇన్వెస్ట్‌మెంట్స్ విషయానికొస్తే, ఏవైనా రెండు లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ కేటగిరి ఫండ్స్‌లో కానీ, లేదంటే ఒక లార్జ్‌క్యాప్ ఫండ్, మరో మిడ్‌క్యాప్ ఫండ్‌లో వేర్వేరుగా ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పరిశీలించదగ్గ కొన్ని ఫండ్స్-హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ బిల్డర్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సిక్యాప్, క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్-క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాటిని ఎప్పటికప్పుడు కనీసం ఆరు నెలలకొకసారైనా సమీక్షించడం తప్పనిసరి.
 
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)కు సెక్షన్ 80 సీ కింద రూ.లక్ష వరకూ పన్ను మినహాయింపులు ఉన్నాయి. 2014 బడ్జెట్‌లో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.లక్షన్నర వరకూ పెంచారు. ఈ బడ్జెట్‌లో ఈఎల్‌ఎస్‌ఎస్‌ల పన్ను మినహాయింపులకు సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు జరిగాయా? 2014-15కు పన్ను రాయితీలు పొందేందుకు ఒక్క ఈఎల్‌ఎస్‌ఎస్‌లో రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చా?  అలా కాని పక్షంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ల నుంచి ఎంత ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు పొందవచ్చు?     -కామేశ్, అనంతపురం
 
ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు పరిమితి రూ. లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెరిగింది. అయితే పన్ను ఆదా చేసే స్కీమ్‌ల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. ఈఎల్‌ఎస్‌ఎస్‌కు గతంలో ఉన్న రాయితీలు ఇప్పుడు కూడా కొనసాగుతాయి. సెక్షన్ 80సీ కింద  రూ. లక్షన్నర పన్ను మినహాయింపు పొందడానికి ఇంత మొత్తంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఇది ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి, రిస్క్ ఉంటుందనే విషయం మరచిపోవద్దు.

మార్కెట్లు ఒడిదుడుకులుగా ఉంటాయి కాబట్టి ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో నష్టాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. సురక్షితమైన, ఇతర స్థిరాదాయ రాబడులున్నప్పుడు మాత్రమే మీరు ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒకే మ్యూచువల్ ఫండ్ ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో కాకుండా విభిన్నరకాలైన మ్యూచువల్ ఫండ్ ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. క్వాంటమ్ ట్యాక్స్ సేవింగ్స్, రిలయన్స్ ఈక్విటీ ట్యాక్స్ సేవర్, ఐసీఐసీఐ ప్రు ట్యాక్స్ ప్లాన్, యాక్సిస్ లాంగ్ టెర్మ్ ఈక్విటీలు... ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పరిశీలించదగ్గ కొన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌లు.
 
ఎలాంటి బ్రోకరేజ్ చెల్లింపులు లేకుండా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాముందా? ప్రస్తుతం నేను డీమ్యాట్ అకౌంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఒక్కో లావాదేవీకి రూ.25 ఖర్చవుతోంది. అయితే ఎలాంటి బ్రోకరేజ్ లేదా కనీస మొత్తం చెల్లింపులతో మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేసే వీలుందా?             -ప్రగతి, విజయవాడ
 
ఎలాంటి బ్రోకరేజ్ చెల్లింపులు లేకుండా మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్‌లలో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్ బ్రాంచ్ ఆఫీస్‌కు వెళ్లి సంబంధిత పత్రాలను నింపి ఈ ప్లాన్‌ల్లో ఎలాంటి బ్రోకరేజ్ చెల్లింపులు లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదంటే సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్‌సైట్ ద్వారా నేరుగా డెరైక్ట్ ప్లాన్‌ల్లో ఎలాంటి బ్రోకరేజ్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ యూనిట్లు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి.  ఆన్‌లైన్ స్టేట్‌మెంట్‌లు పొందవచ్చు.    డీమ్యాట్ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొన్నట్లయితే, మీ డీమ్యాట్ అకౌంట్‌ను నిర్వహించే డిస్ట్రిబ్యూటర్ బ్రోకరేజ్ ఫీజును గానీ, కమిషన్‌ను గానీ వసూలు చేస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement