ఉద్యోగం పోతే.. పీఎఫ్‌ను తీసేసుకోవాలా? | Expert advice on future plans | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పోతే.. పీఎఫ్‌ను తీసేసుకోవాలా?

Published Mon, Apr 23 2018 1:40 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM

Expert advice on future plans - Sakshi

నా దగ్గర ప్రస్తుతం రూ.25 లక్షలు ఉన్నాయి. నాలుగేళ్ల తర్వాత సొంత ఇల్లు సమకూర్చుకోవడం నా లక్ష్యం. అందుకని ఈ నాలుగేళ్ల కాలానికి ఈ మొత్తాన్ని ఏదైనా అగ్రెసివ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఫలితంగా నేను కొనుగోలు చేయబోయే ఇంటికి తీసుకోవలసిన రుణ మొత్తం తగ్గుతుంది కదా ! ఒకేసారి ఈ రూ.25 లక్షలను పూర్తిగా ఏదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైనదేనా ? తగిన సూచనలివ్వండి.   –వైభవ్, హైదరాబాద్‌  
పిల్లల ఉన్నత చదువుల కోసం, రిటైర్మెంట్‌ నిధి కోసం ఇప్పటి నుంచే ఇన్వెస్ట్‌ చేయడం... దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనలో మొదటి అడుగు. కానీ నాలుగేళ్లలో సొంత ఇల్లు సమకూర్చుకోవడం దీర్ఘకాల ఆర్థిక లక్ష్యం కాదు. నాలుగు లేదా ఐదేళ్లలోనే ఈ సొమ్ములు మీకు అవసరం పడతాయి. కాబట్టి ఈ సొమ్ముల ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అగ్రెసివ్‌ ఫండ్‌ కంటే కూడా బ్యాలెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లోనే ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమం.

స్వల్పకాలంలో మార్కెట్‌ గమనాన్ని అంచనా వేయడం చాలా కష్టం. మీరు ఒకేసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తే, మార్కెట్‌ బాగా లేకపోతే, నాలుగేళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలన్న మీ ప్లాన్‌ మొత్తం తల్లకిందులు కావచ్చు. అందుకని ఎప్పుడైనా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయడం సరైన వ్యూహం కాదు.  కాబట్టి మీ దగ్గర ఉన్న మొత్తాన్ని కనీసం 12 భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని ఒక నిర్దేశిత కాలానికి(నెల/మూడు నెలలు/ఆరు నెలలు) ఒక మంచి బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి.  

నా వయస్సు 42 సంవత్సరాలు. ఇటీవల నేను ఉద్యోగం కోల్పోయాను. మిత్రులతో కలసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను. వ్యాపారానికి పెట్టుబడి సమస్యలు లేవు. కాగా ఇప్పటివరకూ నా ప్రావిడెంట్‌ ఫండ్‌ మొత్తం రూ.35 లక్షలైంది. ఈ మొత్తాన్ని మరో 15 ఏళ్ల వరకూ వాడుకోకూడదనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని నేను ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి? మంచి సలహా ఇవ్వండి.   –రవి, విశాఖపట్టణం  
మరో పదిహేనేళ్ల పాటు ఈ ఈపీఎఫ్‌(ఎంప్లాయీ ప్రావిడెంట్‌ ఫండ్‌) సొమ్ములను వాడుకోకూడదని మీరు నిర్ణయించుకున్న పక్షంలో కొంచెం రిస్క్‌ తీసుకుంటే మంచిది. మీరు ఉద్యోగంలో ఉన్నంత వరకూ ఈపీఎఫ్‌లో నిల్వలు కొనసాగించడమే మంచిది. మీరు ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈపీఎఫ్‌లో ఉండే మీ మొత్తంపై వచ్చే వడ్డీఆదాయంపై పన్ను భారం పడుతుంది. అందుకని మీరు ఉద్యోగం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈపీఎఫ్‌ మొత్తాన్ని తీసేసుకోవడమే మంచి నిర్ణయం.

ఇటీవల కాలం నుంచే ప్రావిడెంట్‌ ఫండ్‌ నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ఆరంభించారు. అయితే  ఈ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పారదర్శకత పెద్దగా లేదు. అందుకని మీ పీఎఫ్‌ మొత్తాన్ని ఉపసంహరించి మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్స్‌(ఎమ్‌ఐపీ)కు సంబంధించిన గ్రోత్‌ ఆప్షన్‌ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. ఈ స్కీమ్‌లు తమ నిధుల్లో 10–15 శాతం మేర ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. అయితే ఈ రూ. 35 లక్షల మొత్తాన్ని ఒకేసారి వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయకండి.

ఈ మొత్తాన్ని కనీసం 12 నుంచి 18 నెలల్లో ఇన్వెస్ట్‌ చేసేలా ప్లాన్‌ చేసుకోండి. మీరు ఒకేసారి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసిన పక్షంలో మీ స్కీమ్స్‌ విలువ 5 శాతం తగ్గినా అది పెద్దమొత్తం నష్టం కిందే లెక్క. మీరు ఇటీవలే ఉద్యోగం కోల్పోయారు. సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తున్నారు. సొంత వ్యాపారంలో పూర్తి స్థాయిలో కుదురుకోకముందే మీ పీఎఫ్‌ సొమ్ములపై  నష్టాలు రావడం మంచిది కాదు కదా !  

నేను కొంత మొత్తాన్ని ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేశాను. ఈ ఫండ్స్‌ లాక్‌–ఇన్‌ పీరియడ్‌ పూర్తయింది. ఈ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని మరింత మెరుగైన రాబడులు వచ్చే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. కొంతమంది మిత్రులు ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లోనే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి?   –కళ్యాణ్, విజయవాడ  
ఈఎల్‌ఎస్‌ఎస్‌ల నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని మెరుగైన రాబడుల కోసం మరో ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం కాదు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ తగిన రాబడులు ఇవ్వని పక్షంలోనే లాక్‌–ఇన్‌ పీరియడ్‌ పూర్తయిన తర్వాత ఈఎల్‌ఎస్‌ఎస్‌ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలి.  లిక్విడిటీ సమస్య కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు ఈఎల్‌ఎస్‌ఎస్‌ల లాక్‌ ఇన్‌ పీరియడ్‌ పూర్తి కాగానే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటారు. ఇలా చేయడం సరైన పద్ధతి కాదు.

ఈఎల్‌ఎస్‌ఎస్‌ల నుంచి వెనక్కి తీసుకున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తగిన విధంగా ఇన్వెస్ట్‌ చేయకపోతే, మీకు తగిన రాబడులు రావు. పైగా అధికంగా పన్ను భారం పడుతుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కేవలం రెండు కారణాల వల్లే వెనక్కి తీసుకోవాలి. మొదటిది ఈ ఫండ్స్‌ పనితీరు సరిగ్గా లేకపోవడం, రెండవది... మీకు నగదు కొరత తీవ్రంగా ఉన్నప్పుడు.. కేవలం ఈ రెండు సందర్భాల్లోనే ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలి. అలా కానప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడమే మంచిది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించినప్పుడు మంచి రాబడులు పొందవచ్చు.  


- ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement