డెరైక్ట్ ప్లాన్‌లకు డివిడెండ్‌లు తక్కువ ఎందుకు? | Direct plans dividends less, why? | Sakshi
Sakshi News home page

డెరైక్ట్ ప్లాన్‌లకు డివిడెండ్‌లు తక్కువ ఎందుకు?

Published Mon, Feb 22 2016 2:06 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM

డెరైక్ట్ ప్లాన్‌లకు డివిడెండ్‌లు తక్కువ ఎందుకు? - Sakshi

డెరైక్ట్ ప్లాన్‌లకు డివిడెండ్‌లు తక్కువ ఎందుకు?

నా పేరు మీద పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతా ఒకటి ఉంది. నా ఇద్దరు కుమారుల పేరు మీద రెండు పీఎఫ్ ఖాతాలు  నిర్వహిస్తున్నాను. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు పొందే మొత్తాన్ని ఇప్పటికే ఈ మూడు పీఎఫ్ ఖాతాల్లో జమ చేశాను. పన్ను మినహాయింపుకు మించిన మొత్తాన్ని ఈ పీఎఫ్ అకౌంట్లలలో ఇన్వెస్ట్ చేయవచ్చా?  
 - అరవింద్, విశాఖపట్టణం

 
ఒక వ్యక్తికి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఉన్నప్పటికీ, తన మైనర్ కుమారుల పేరు మీద ఖాతాలు తెరవడానికి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ నిబంధనలు అనుమతిస్తున్నాయి. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఖాతాల్లో కలిపి గరిష్టంగా ఇన్వెస్ట్ చేయగలిగేది రూ.1.50 లక్షలు మాత్రమే. అంటే మీరు ఈ మూడు పీఎఫ్ ఖాతాల్లో రూ.లక్షన్నరకు మించి ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదు.
 
ఇటీవల రెండు పెద్ద సంస్థలు(టాటా, యాక్సిస్) తమ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు సంబంధించి డివిడెండ్లను ప్రకటించాయి. టాటా ఇథికల్ ఫండ్, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్స్  ఈ డివిడెండ్‌లను ప్రకటించాయి. అయితే ఈ ఫండ్స్ రెగ్యులర్ ప్లాన్‌లకు మాత్రమే ఈ డివిడెండ్‌లు వర్తిస్తాయి. డెరైక్ట్ ప్లాన్‌లకు మాత్రం కాదు. ఇది డెరైక్ట్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన వారిని నిరుత్సాహపరచడమే అవుతుంది కదా? ఫండ్ హౌస్‌లు ఇలా ఎందుకు చేస్తాయి?        
- పవన్, హైదరాబాద్

 
తగినంత లాభాలు పొందలేకపోయినందున టాటా ఇథికల్ ఫండ్, యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్స్‌కు సంబంధించిన డెరైక్ట్ ప్లాన్‌లకు డివిడెండ్‌లను ఆయా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రకటించలేకపోయాయి. తగినంత లాభాలు పొందితేనే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్టర్లకు డివిడెండ్‌లను పంపిణి చేస్తాయి. గతంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ ప్రీమియం నిధుల నుంచే డివిడెండ్‌లను చెల్లించేవి. కానీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ పోర్ట్‌ఫోలియోలు ఆధారంగా ఆర్జించిన లాభాల నుంచే డివిడెండ్‌లను ఇవ్వాలని 2010, మార్చిలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఆదేశాలు జారీ చేసింది.

డెరైక్ట్ ప్లాన్‌లు 2013 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటితో పోల్చితే రెగ్యులర్ ప్లాన్‌లు చిరకాలం నుంచి రంగంలో ఉంటున్నాయి. కనుక వాటికి  భారీ నిధులు, తగినంత లాభాలు  ఉంటాయి. కాబట్టి సాధారణంగా రెగ్యులర్ ప్లాన్‌లు డివిడెండ్‌లు చెల్లిస్తాయి. మరోవైపు డెరైక్ట్ ప్లాన్‌లు అమల్లోకి వచ్చి కొంత కాలమే అయినందును వీటి లాభాలు స్వల్పంగా ఉండడం వల్ల అవి డివిడెండ్‌లను చెల్లించలేకపోతున్నాయని చెప్పవచ్చు.
 
నేను 2011 జూన్‌లో ఎల్‌ఐసీ ఎండోమెంట్ ప్లస్ పాలసీ తీసుకున్నాను. పాలసీ కాలవ్యవధి 10 సంవత్సరాలు. రూ.4 లక్షలకు బీమా రక్షణ తీసుకున్నాను. మూడు నెలలకొకసారి రూ.9,000 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్నాను. ఈ పాలసీని సరెండర్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? సరెండర్ వాల్యూ ఎంత ఉండొచ్చు?ఈ పాలసీలో తక్కువ రాబడులు వస్తున్నందున మంచి రాబడులు వచ్చే మరో స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వగలరు?
 - మృణాళిని, బెంగళూరు

 
ఎల్‌ఐసీ ఎండోమెంట్ ప్లస్ పాలసీ అనేది యులిప్, ఎండోమెంట్ ప్లాన్‌లను కలగలసిన పాలసీ. ఇది టూ-ఇన్-వన్ ఇన్వెస్ట్‌మెంట్-కమ్-ఇన్సూరెన్స్ పాలసీ. ఐదేళ్ల తర్వాత ఫండ్ వేల్యూ ఎంత అనేదానిపై సరెండర్ వేల్యూ ఆధారపడి ఉంటుంది. మీ ప్రశ్నను బట్టి చూస్తే ఈ పాలసీని సరెండర్ చేయాలని సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఇన్సూరెన్స్-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలు తగిన బీమా రక్షణను ఇవ్వలేవు. అంతేకాకుండా తగిన రాబడులు కూడా అందించలేవు.

బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడూ కలగలపవద్దు. బీమా రక్షణ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. తక్కువ ప్రీమియమ్‌తో ఎక్కువ బీమా రక్షణ పొందవచ్చు. ఇక మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఐదు, అంతకు మించిన సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రాబడులు పొందగలరు.
 
నేను 2002-13 సంవత్సరాల మధ్య ఒక కంపెనీలో ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నా సొంత వ్యాపారాన్ని ప్రారంభించాను. ఉద్యోగం నుంచి వైదొలిగాక ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ నుంచి నాకు రావలసిన సొమ్ములను తీసేసుకున్నాను. నాకు పెన్షన్ వస్తుందా?
 - సంతోష్, రాజమండ్రి

 
మీ సర్వీస్ 10 సంవత్సరాలకు మించి ఉన్నందున మీకు 50 ఏళ్లు దాటిన తర్వాత నుంచి మీకు పెన్షన్ వస్తుంది. మీరు చివరిసారి ఉద్యోగం చేసిన కంపెనీ ద్వారా ఫారమ్-10డి ద్వారా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఎక్కడ పెన్షన్ పొందాలనుకుంటున్నారో, ఆ ప్రాంతానికి సంబంధించిన బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ వివరాలను ఆ దరఖాస్తులో పేర్కొనాలి.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement