ఆర్బిట్రేజ్ ఫండ్.. ఆకర్షణీయమేనా? | Arbitrage fund | Sakshi
Sakshi News home page

ఆర్బిట్రేజ్ ఫండ్.. ఆకర్షణీయమేనా?

Published Mon, Jul 13 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

ఆర్బిట్రేజ్ ఫండ్.. ఆకర్షణీయమేనా?

ఆర్బిట్రేజ్ ఫండ్.. ఆకర్షణీయమేనా?

మ్యూచువల్ ఫండ్స్‌లో డెరైక్ట్ ఆప్షన్ ద్వారా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపండి?
- సమీర, విజయవాడ


మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి డెరైక్ట్ ప్లాన్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి నేరుగా యూనిట్ల కొనుగోళ్లు/అమ్మకాలు జరపవచ్చు. మధ్యలో ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. ఈ డెరైక్ట్ ప్లాన్‌ల వల్ల  డిస్ట్రిబ్యూటర్లకు/ఏజెంట్లకు చెల్లించే కమీషన్ చార్జీలు ఇన్వెస్టర్లకు ఆదా అవుతాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రస్తుత, కొత్త స్కీమ్‌ల్లో డెరైక్ట్ ప్లాన్‌లను తప్పనిసరిగా ఆఫర్ చేయాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2013, జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి.

మీరు ఆశించే రాబడులు, మీరు భరించగలిగే రిస్క్‌లను బట్టి సరైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లను ఎన్నుకోగలను అన్న ధీమా ఉన్నప్పుడే మీరు డెరైక్ట్ ప్లాన్లల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్లల్లో మూడు రకాలైన (మేనేజ్‌మెంట్, నిర్వహణ, డిస్ట్రిబ్యూటర్)... వ్యయాలుంటాయి. అదే డెరైక్ట్ ప్లాన్లల్లో అయితే రెండు రకాలైన వ్యయాలు మాత్రమే ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్ వ్యయాలు ఉండవు. ఫలితంగా ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉండి రాబడులు ఎక్కువగా ఉంటాయి.  ఏ స్కీమ్ పోర్ట్‌ఫోలియో అయినా, డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్‌లకు ఒకే విధంగా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలు, నిధుల కేటాయింపు, ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహం, ఎగ్జిట్ లోడ్, రిస్క్ అంశాలు, తదితర అంశాలన్నీ ఒకే రకంగా ఉంటాయి.
 
డెట్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిగణించవచ్చా? పన్ను పరంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఆకర్షణీయమేనా ?
- విజయ్, కరీంనగర్

 
పన్ను అంశాల పరంగా చూస్తే డెట్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను పరిగణించవచ్చు. గత బడ్జెట్‌లో డెట్ ఫండ్స్‌కు సంబంధించి పన్ను అంశాల్లో మార్పులు వచ్చాయి. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లకు మించి కొనసాగిస్తేనే వాటిపై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలదన లాభాలుగా పరిగణించేలా పన్ను సంబంధిత అంశాల్లో మార్పులు,చేర్పులు చేశారు. దీంతో పన్ను పరంగా డెట్ ఫండ్స్‌కు ఉన్న ఆకర్షణ పోయింది. పన్ను అంశాల పరంగా చూస్తే ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఏడాది తర్వాత వీటిపై లభించే రాబడులపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ ఏడాదిలోపే విక్రయిస్తే 15 శాతం స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాల డెట్ ఫండ్స్ లేదా లిక్విడ్ ఫండ్స్ కన్నా ఇవి తక్కువ రాబడులనే ఇచ్చినప్పటికీ, వాటికి ఇవి మంచి ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా పరిగణించవచ్చు. పైగా పలు పన్ను ప్రయోజనాల కారణంగా ఇవి ఆకర్షణీయమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలని చెప్పవచ్చు.
 
నా వయస్సు 39 సంవత్సరాలు. ఆరోగ్యకరంగా ఫిట్‌గానే ఉన్నాను. నేను రూ.75 లక్షలకు గాని, రూ. కోటికి గానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్2 ప్రొటెక్ట్, మ్యాక్స్ లైఫ్ టర్మ్ పాలసీ రెండింటిల్లో దేనిని తీసుకోమంటారు ?
- భవానీ, నెల్లూరు


మ్యాక్స్ ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్, హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్2 ప్రొటెక్ట్ .. ఇవి రెండూ మంచి టర్మ్ పాలసీలే. కాకుంటే ప్రీమియమ్‌ల్లో తేడా ఉంది. రెండు కంపెనీలకు క్లెయిమ్‌ల సెటిల్మెంట్ విషయంలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. రెండింటిలో ఏదైనా ఎంచుకోవచ్చు. అలా కాకుండా 50 లక్షలకొక టర్మ్ పాలసీ చొప్పున రెండు కంపెనీలవీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడే అన్ని వ్యక్తిగత, ఆరోగ్య సంబంధిత వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. జరగరానిది ఏదైనా జరిగితే, క్లెయిమ్‌ల విషయంలో ఎలాంటి అసౌకర్యం తలెత్తదు. మీ వయస్సును బట్టి రూ.50 లక్షల టర్మ్ పాలసీకి మ్యాక్స్ ఆన్‌లైన్ టర్మ్ పాలసీకి అయితే ఏడాదికి రూ.6,400, హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్2 ప్రొటెక్ట్‌కు అయితే రూ.8,600 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
 
గత నాలుగు నెలల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. నా వార్షికాదాయం రూ.2.3 లక్షలలోపే ఉంది.నేను ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరా? ఏయే పరిస్థితుల్లో ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది?
 - శ్రీకాంత్, హైదరాబాద్


మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాలన్న నిబంధనేదీ లేదు. మీ వార్షికాదాయం రూ.2,50,000 దాటితేనే మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐదు రకాల ఆదాయాలు(వేతనం, గృహాస్తి, వ్యాపారం/వృత్తి ద్వారా లాభాలు, మూలధన లాభాలు(మ్యూచువల్ ఫండ్ విక్రయాల ద్వారా లభించే లాభాలు కలుపుకొని), ఇతర మార్గాలు) మొత్తాన్ని కలిపి ఆదాయపు పన్ను లెక్కిస్తారు.

ధీరేంద్ర కుమార్
సీఈవొ,వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement