స్వల్పకాలానికి లిక్విడ్ ఫండ్స్ ఓకేనా? | Liquid funds are better to short-term ? | Sakshi
Sakshi News home page

స్వల్పకాలానికి లిక్విడ్ ఫండ్స్ ఓకేనా?

Published Mon, Jun 23 2014 12:49 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

స్వల్పకాలానికి లిక్విడ్ ఫండ్స్ ఓకేనా? - Sakshi

స్వల్పకాలానికి లిక్విడ్ ఫండ్స్ ఓకేనా?

నేను రూ.15 లక్షలను 45 రోజుల నుంచి 90 రోజుల కాలానికి ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 7.25 శాతం, సేవింగ్స్ అకౌంట్ అయితే 6 శాతం చొప్పున రాబడులు వస్తాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి రాబడులు ఇస్తాయోనని మీ వెబ్‌సైట్ ఆధారంగా మదింపు చేశాను. 3 శాతం రాబడి అని తేలింది. అయితే ఇది వార్షిక రాబడా ? లేక చక్రగతిన వస్తుందా? అనేది స్పష్టం చేయగలరు. స్వల్పకాలానికి  లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే మంచి రాబడులు వస్తాయని మిత్రులంటున్నారు. తగిన సలహా ఇవ్వండి.
- జగన్నాథ్, నిజామాబాద్
 
మ్యూచువల్ ఫండ్స్ విషయమై మీరు మదింపు చేసిన 3 శాతం రాబడి వార్షికమైనది కాదు. మూడు నెలలకు వచ్చే రాబడి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌పై 6 శాతం చొప్పున వార్షిక రాబడులు వస్తాయి. ఈ ఏడాది మే 22 నాటికి లిక్విడ్ ఫండ్స్ వార్షిక రాబడి 9.05 శాతంగా ఉంది. రాబడుల పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నదే ప్రాధాన్యతా అంశమైతే, స్వల్పకాలానికి లిక్విడ్ ఫండ్స్ ఉత్తమం. ఇక మీరు పన్ను విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
 
ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రాబడి రూ.10,000 మించితే మీ ట్యాక్స్‌స్లాబ్‌ను అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి సంవత్సరంలోనే సొమ్మును ఉపసంహరించుకుంటే షార్ట్‌టెర్మ్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, డివిడెండ్లను తాజా ఇన్వెస్ట్‌మెంట్స్‌గానే పరిగణిస్తారు. దీంతో మీ రాబడి తక్కువగానే ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే లిక్విడ్ ఫండ్స్ ఉత్తమమైన ఆప్షన్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
 
కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అప్పుడప్పుడు ఒక ఫండ్ లక్ష్యాలు/ఉద్దేశాలు/బెంచ్‌మార్క్‌ను మారుస్తుంటాయని విన్నాను. అలా ఎందుకు చేస్తాయి? ఇలా మార్చడానికి సెబీ/ఏఎంఎఫ్‌ఐల నుంచి ముందస్తు అనుమతులు తీసుకుంటాయా? ఇలా మార్చే విషయాన్ని ఇన్వెస్టర్లకు కూడా తెలియజేస్తారా? మార్పు, చేర్పుల విషయం నచ్చకపోతే ఇన్వెస్టర్లు సదరు ఫండ్ నుంచి వైదొలగడానికి కొంత సమయం ఇస్తారా?
 - పర్వీన్, హైదరాబాద్
 
సెబీ నియమనిబంధనల ప్రకారమే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏదైనా ఫండ్ లక్ష్యాలు/ఉద్దేశాలు/బెంచ్‌మార్క్‌ల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తాయి. ఈ మార్పుల విషయాలను మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇన్వెస్టర్లకు తప్పనిసరిగా రాతపూర్వకంగా తెలియజేస్తాయి. రెండు మ్యూచువల్ ఫండ్ సంస్థలు విలీనమైనా, లేదా ఒకే మ్యూచువల్ ఫండ్ సంస్థలోని రెండు స్కీమ్‌లను విలీనం చేసినా ఇలాంటి మార్పులు, చేర్పులు జరుగుతాయి. ఒకవేళ ఎలాంటి విలీనం జరగకపోయినా కూడా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇలాంటి మార్పులు, చేర్పులు చేయవచ్చు. ఇక ఈ మార్పులు నచ్చని ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకోవడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొన్ని రోజుల గడువునిస్తాయి. ఎలాంటి ఎగ్జిట్ లోడ్‌ను వసూలు చేయరు. అయితే పన్ను అంశాలు షరా మామూలుగానే ఉంటాయి. వీటికీ, మ్యూచువల్ ఫండ్ సంస్థలకూ ఎలాంటి సంబంధం లేదు.

నేను మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. లక్ష వరకూ పెట్టబడులు పెట్టగలను. సగటు స్థాయి రిస్క్‌ను భరించగలను, కానీ నాకు అధిక రాబడులు కావాలి. దీని కోసం నేను బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఫండ్ ఎన్‌ఏవీ ఆల్‌టైమ్ హైలో ఉంది. ఇప్పుడే ఇన్వెస్ట్ చేయమంటారా ? లేదా మార్కెట్ కొంత కరెక్షన్‌కు గురైన తర్వాత ఇన్వెస్ట్ చేయమంటారా?
 - డేనియల్, గుంటూరు

ఇటీవల మార్కెట్ పెరిగిన ఫలితంగా బాగా ప్రయోజనం పొందిన కొన్ని ఫండ్స్‌లో బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్ ఒకటి. మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ఫండ్ బాగా వృద్ధి సాధించింది. గత ఏడాది కాలంలో ఈ ఫండ్ 88 శాతం వృద్ధి సాధించింది. అయితే ఇదే మాదిరి రాబడులు భవిష్యత్‌లో కూడా వస్తాయని ఆశించకూడదు. ఏదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫండ్ ఇటీవలి పనితీరునే పరిగణనలోకి తీసుకోకూడదు. ఏది ఏమైనా ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి ఫండ్ అనే చెప్పవచ్చు. ఇది మీ పోర్ట్‌ఫోలియోలో ఒక భాగంగా ఉండాలి. ఒకే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలని మీరు భావిస్తే మాత్రం ఇది సరైన ఫండ్ కాదని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని 6-8 నెలల కాలానికి విస్తరిస్తే సముచితంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement