పన్ను ఆదాయం ఉన్న వారు కొంత మొత్తంపై పన్ను పడకుండా చూసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇక్కడ పన్ను ఆదాయే కాదు, చేసే పెట్టుబడిపై మెరుగైన రాబడులు కూడా రావాలి. అప్పుడే పన్ను ఆదా, రాబడులు అనే రెండు లక్ష్యాలు సాకారం అవుతాయి. సరైన సాధనాన్ని ఎంపిక చేసుకుంటేనే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.
ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా కోసం ఏదో ఒకటి ఎంచుకుని పొరపాటు చేయవద్దు. ముఖ్యంగా సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలను తీసుకుంటే.. అందులో రాబడులు ఆశించిన మేర ఉండవు. అలాగే, బీమా రక్షణ విషయంలోనూ వీటికి మార్కులు తక్కువే. పన్ను ఆదా, రాబడులు ఈ రెండింటికీ అస్సలు నప్పని సాధనం ఎండోమెంట్ పాలసీలే. కనుక పన్ను ఆదా సాధనాల్లో వేటిల్లో రాబడులు ఏ మేర ఉన్నాయి, రిస్క్ తదితర వివరాలను తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయాన్ని సులభంగా తీసుకోవచ్చు. ఈ వివరాలను తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది.
పీపీఎఫ్
వడ్డీ రేటు ప్రస్తుత త్రైమాసికానికి (జనవరి–మార్చి) 7.9 శాతం. ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ గత ఏడాది కాలంలో గణనీయంగా తగ్గాయి. కానీ, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో పెద్దగా మార్పుల్లేవు. ఇప్పటికీ బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగైన రాబడులే ఉన్నాయి. అలాగే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)లో చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపైన కాకుండా, రాబడులపైనా పన్ను లేదు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడిపెట్టేది ఎక్కువగాసామాన్యులే. కనుక ప్రభుత్వం మరీ దూకుడుగా వడ్డీ రేట్లను తగ్గించలేదు. దీన్ని గమనంలోకి తీసుకోవాలి.
దీర్ఘకాలం కోసం ఈఎల్‌ఎస్‌ఎస్, ఎన్‌పీఎస్ తర్వాత అధిక రాబడులను ఇచ్చే సాధనం పీపీఎఫ్. బ్యాంకు పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో పోల్చితే పీపీఎఫ్ మెరుగైన సాధనం. 15 ఏళ్ల కాల వ్యవధి కలిగిన పెట్టుబడి పథకం ఇది. ఐదో ఏట తర్వాత పాక్షికంగా ఉపసంహరణకు వీలుంటుంది. పోస్టాఫీసులతో పోలిస్తే ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్‌లో పెట్టుబడులకు అనుమతిస్తున్న బ్యాంకుల్లో ఖాతా తెరవడం సౌలభ్యంగా ఉంటుంది. వార్షికంగా రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ఎన్‌ఎస్‌సీ
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ) కూడా చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటి. ఇందులో పెట్టుబడులపైనా సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. రాబడులు ప్రస్తుత త్రైమాసికానికి పీపీఎఫ్ మాదిరే 7.9%గా ఉన్నాయి. పెట్టుబడి సమయంలో ఉన్న రేటే ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. పెట్టుబడులపై లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. కాకపోతే రాబడులు పన్ను పరిధిలోకి వస్తాయి. ఇతర ఆదాయం కింద రిటర్నుల్లో చూపించాలి.
రాబడులపైనా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అదెలా అంటే.. ఉదాహరణకు 2020 జనవరిలో ఎన్‌ఎస్‌సీలో రూ.50 వేలు ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా పొందారనుకుందాం. ఏడాది తర్వాత రూ.3,950 రాబడి లభిస్తుంది. ఇది ఆటోమేటిగ్గా తిరిగి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక మరుసటి ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తంపైనా పన్ను ఆదా పొందొచ్చు. కాకపోతే కేవలం పోస్టాఫీసుల్లోనే అందుబాటులో ఉంది.
పెన్షన్ ప్లాన్లు
బీమా సంస్థలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్లు కూడా పన్ను ఆదా జాబితాలో ఉన్నాయి. కాకపోతే ఎన్‌పీఎస్ వచ్చిన తర్వాత ఇవి ఆదరణ కోల్పోయాయి. ఎన్‌పీఎస్‌లో మాదిరే బీమా ఆధారిత పెన్షన్ ప్లాన్లలో పెట్టుబడులపై అదనంగా రూ.50,000పై పన్ను మినహాయింపు ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. కానీ, ఎన్‌పీఎస్‌తో పోల్చి చూస్తే బీమా ఆధారిత పెన్షన్ ప్లాన్లలో చార్జీలు అధికంగా ఉంటాయి. పారదర్శకత కూడా తక్కువే. కనుక రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవాలనుకునే వారు, దానిపై పన్ను ఆదా కోరుకునే వారు ఎన్‌పీఎస్‌ను ఆశ్రయించడమే మంచిది. ఇక, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కూడా రిటైర్మెంట్ ఫండ్స్ పేరుతో పథకాలను తీసుకొస్తున్నాయి. ఎన్‌పీఎస్ మాదిరే వీటిల్లోనూ అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్న రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్స్‌పై ప్రస్తుతానికి ఎటువంటి పన్ను ప్రయోజనాలను కేంద్రం ఇవ్వడం లేదు.
బీమా పాలసీలు
మనలో ఎక్కువ మంది బీమా పాలసీలు తీసుకోవడం చూడొచ్చు. ముఖ్యంగా పన్ను ఆదా కోసమని, పెట్టుబడుల దృష్ట్యా బీమా పాలసీలు తీసుకునే వారు చాలా మందే ఉంటారు. కానీ, తాము అనుసరిస్తున్న మార్గం సరైంది కాదన్నది తర్వాతే తెలుస్తుంది. ఒక వ్యక్తి మరణానికి గురైతే ఆ వ్యక్తి కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకునేది బీమా రక్షణ. కానీ, దీన్నొక పెట్టుబడి సాధనంగా, పన్ను ఆదా సాధనంగా చూడడం సరైనది కాదు. అలాగే, ఇందులో పెట్టుబడులపై దీర్ఘకాలంలో రాబడులు 20 ఏళ్ల ప్లాన్లలో 4.5–5 శాతంగానే ఉంటాయి. అంటే చాలా తక్కువ రాబడులు. ద్రవ్యోల్బణం స్థాయిలోనే రాబడి రేటు ఉంటే, నికర రాబడి సున్నాయే అవుతుంది. బీమా కవరేజీ కూడా వీటిల్లో చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఒక వ్యక్తి కనీసం తన వార్షిక ఆదాయానికి 10 రెట్ల మొత్తానికి అయినా బీమా తీసుకోవాలి. అంటే వార్షికంగా రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారు రూ.50 లక్షల పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇంత కవరేజీ ఎండోమెంట్ ప్లాన్‌లో తీసుకోవాలంటే వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.4–5 లక్షలు ఉంటుంది. అదే టర్మ్ ప్లాన్‌లో కేవలం రూ.7,000–8,000 చెల్లించడం ద్వారా రూ.50 లక్షల కవరేజీ పొందొచ్చు. టర్మ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపుల మొత్తం కూడా సెక్షన్ 80సీ కింద పన్ను ఆదాకు అర్హమైనదే.
సుకన్య సమృద్ధి యోజన
కేవలం పన్ను ఆదా కోసం అని కాకుండా, కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులు వారి భవిష్యత్తు అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకోతగినది సుకన్య సమృద్ధి యోజన పథకం (ఎస్‌ఎస్‌వై). ఇది సంప్రదాయ పెట్టుబడి సాధనం. ఇందులో రూ.1.5 లక్షల పెట్టుబడిపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా చేసుకోవచ్చు. పదేళ్లలోపు బాలికల పేరిట తల్లిదండ్రులు (గరిష్టంగా ఇద్దరు పేరిటే) ఎస్‌ఎస్‌వై ఖాతా తెరుచుకోవచ్చు. ఖాతాలు రెండు అయినా కానీ, గరిష్ట పెట్టుబడి రూ.1.5 లక్షలుగా అమలవుతుంది. ఈ పథకంలో పెట్టుబడులపై వడ్డీ రేటు కూడా ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్‌తో అనుసంధానమై ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు మారిపోవచ్చు. ప్రస్తుతానికి (జనవరి–మార్చి త్రైమాసికం) 8.4 శాతం రేటు అమలవుతోంది. పీపీఎఫ్‌తో పోలిస్తే అధిక వడ్డీ రేటు ఈ పథకంలో కొనసాగుతోంది.
పీపీఎఫ్ మాదిరే ఎస్‌ఎస్‌వై పథకంలోనూ రాబడులు పూర్తిగా పన్ను రహితమే. పోస్టాఫీసులు, ఎంపిక చేసిన జాతీయ బ్యాంకుల్లో ఎస్‌ఎస్‌వై ఖాతా తెరవచ్చు. ఇందులో పెట్టుబడులు, రాబడులను కుమార్తెల ఉన్నత విద్య, వివాహ అవసరాల కోసమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా డెట్ పథకం. దీనికి బదులు భవిష్యత్తు అవసరాల కోసం అధిక రాబడులను ఇచ్చే మంచి ఈక్విటీ సాధనాల్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. కనుక ఈ పథకంతో పోలిస్తే కొంత రిస్క్ తీసుకునే వారు ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ వైపు మొగ్గు చూపొచ్చు.
యులిప్‌లు
ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌లు) కూడా సెక్షన్ 80సీ సాధనాల్లో ఒకటి. ఈ విభాగంలో గత మూడేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 8.09 శాతంగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ పథకాల్లో చార్జీలు భారీగా ఉండేవి. ఐఆర్‌డీఏఐ సంస్కరణలతో చార్జీలు కొంత మేర దిగొచ్చాయి. అయినా ఇప్పటికీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే వీటిల్లో చార్జీలు ఎక్కువ. ఎందుకంటే ఒకవైపు బీమా రక్షణనిస్తూనే, మరోవైపు పెట్టుబడులపై రాబడులను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాయి.
ఈ రెండింటి కోసం వసూలు చేసుకునే చార్జీలు ఎక్కువగానే ఉంటున్నాయి. కనుక దీర్ఘకాలానికి చూసుకుంటే ఇందులో పెట్టుబడులపై రాబడులు మోస్తరుగానే ఉంటున్నాయి. పోనీ బీమా రక్షణ అయినా తగినంతగా ఉంటుందా..? అనుకుంటే అదీ లేదు. వార్షికంగా రూ.24,000 ప్రీమియంపై 10 రెట్ల బీమా అంటే రూ.2.4 లక్షల బీమా వర్తిస్తుంది. దీర్ఘకాల రాబడులు ఆకర్షణీయంగా లేవు. తగినంత బీమా రక్షణకైతే కేవలం టర్మ్ పాలసీలను నమ్ముకోవడం మంచిది. అయితే యులిప్‌లలో ప్రయోజనాలూ ఉన్నాయి. యులిప్‌లో చెల్లించే ప్రీమియానికి బీమా రక్షణ 10 రెట్ల వరకే ఉంటే.. వచ్చే రాబడులపై సెక్షన్ 10(10డి) పూర్తిగా పన్ను ఉండదు.
పన్ను ఆదా ఎఫ్‌డీ
సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా కోసం ఉద్దేశించిన బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా ఉంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ అనే పేరుతో ఈ సాధనంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి పన్ను ఆదా చేసుకోవచ్చు. కాకపోతే ఐదేళ్ల పాటు మళ్లీ విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించరు. పైగా ఇందులో రాబడులు పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తాయి. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీపై రాబడి రేటు 6.5–7.6 మధ్య ఉంది. ఒక్కో బ్యాంకు ఒక్కో రేటు ఆఫర్ చేస్తోంది. అయితే, 5 శాతం పన్ను పరిధిలో ఉన్నవారు, అలాగే 10 శాతం, 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి రాబడులు మోస్తరుగా ఉన్నాయి కానీ, 30 శాతం శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను అనంతరం రాబడులు 5 శాతమే అని గమనించాలి. ముందస్తు ప్రణాళిక లేని వారు.. చివరి నిమిషంలో పన్ను ఆదా కోసం చూసే వారు.. తక్కువ పన్ను పరిధిలో ఉన్న వారు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీని పరిశీలించొచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ చేసుకునేందుకు కొన్ని బ్యాంకులు అనుమతిస్తున్నాయి.
ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్) పథకాలు గత మూడేళ్ల కాలంలో ఇచ్చిన సగటు వార్షిక రాబడులు 13%. అంతేకాదు సెక్షన్ 80సీ పన్ను ఆదా సాధనాల్లో అత్యధిక రాబడులు, తక్కువ లాకిన్ పీరియడ్ (మూడేళ్లు) ఉన్నది కూడా వీటిల్లోనే. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం వీటిల్లో మంచి పథకాలను ఎంచుకుని సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఈ పథకాలు నాణ్యమైన కంపెనీల ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి.
ఒకే విభాగానికి పరిమితం కాకుండా మల్టీక్యాప్ (భిన్న మార్కెట్ విలువలతో కూడిన కంపెనీలు) విధానాన్ని అనుసరిస్తుంటాయి. రూ.1.5 లక్షలను వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పూర్తి పన్ను ఆదా చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులపై దీర్ఘకాలిక లాభం రూ.లక్ష (విక్రయించినప్పుడు) వరకు ఉంటే పన్ను ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించిన లాభం వస్తే ఆ మొత్తంపైనే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధిక రిస్క్‌తో కూడిన సాధనాల కిందకు ఇవి వస్తాయి.
నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)
ఎన్‌పీఎస్‌లో గత ఐదేళ్ల కాలంలో రాబడులు.. అగ్రెసివ్ విభాగం(ఈక్విటీల్లో పెట్టుబడులు 50%)లో వార్షిక రాబడులు 9.11%. బ్యాలన్స్‌డ్ విభాగంలో (ఈక్విటీల్లో పెట్టుబడులు 33%) వార్షిక రాబడులు సగటున 9.26%. కన్జర్వేటివ్ విభాగంలో (ఈక్విటీ పెట్టుబడులు 20%) వార్షిక సగటు రాబడులు 9.39%. అలాగే, అల్ట్రా సేఫ్ విభాగంలో (పూర్తిగా డెట్ పెట్టుబడులు) ఐదేళ్ల వార్షిక సగటు రాబడులు 9.57%. అంటే మొత్తం మీద రాబడులు 9.11–9.57% మధ్య ఉన్నాయి.
ఈక్విటీ, డెట్ రెండింటి రాబడుల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడానికి ప్రధాన కారణం... ఇటీవలి సంవత్సరాల్లో ఈ రెండు విభాగాలు ర్యాలీ చేయడమే. దీర్ఘకాలంలో 20–30 ఏళ్ల కాలానికి ఈక్విటీ ఎక్స్‌పోజర్‌తో కూడిన విభాగాల్లోనే (అగ్రెసివ్, బ్యాలన్స్‌డ్, కన్జర్వేటివ్) అధిక రాబడులకు చాన్స్ ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలకు అదనంగా మరో రూ.50వేలను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 సీసీడీ (2) కింద పన్ను లేకుండా ప్రయోజనం పొందే అవకాశం ఇందులోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment