కరిగిపోతున్న పసిడి ‘పెట్టుబడులు’
ఏప్రిల్ – జూలై మధ్య గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రూ.256 కోట్లు బయటకు...
న్యూఢిల్లీ: పెట్టుబడుల రూపంలో పసిడి ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య వెలవెలబోయింది. ఈ కాలంలో 14 గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రూ. 256 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అంటే ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి 14 ఈటీఎఫ్ హౌస్ వద్ద నిర్వహణలో ఉన్న మొత్తం పసిడి పెట్టుబడుల విలువ మార్చిలో దాదాపు 5,354 కోట్ల వద్ద ఉంటే, ఈ మొత్తం జూలై ముగిసే నాటికి రూ.5,098 కోట్లకు పడిపోయింది. దీనికన్నా ఈక్విటీలే మంచిదని ఈ కాలంలో ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని ముఖ్యాంశాలు...
నెలవారీగా విత్‌డ్రాయెల్స్ చూస్తే... ఏప్రిల్‌లో రూ.66 కోట్లు, మేలో రూ.71 కోట్లు, జూన్‌లో రూ.81 కోట్లు, జూలైలో 38 కోట్లుగా నమోదయ్యాయి.
గత ఏడాది చిట్టచివరిసారి రూ.20 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. అటు తర్వాత నుంచీ నికరంగా విత్‌డ్రాయెల్స్ కొనసాగుతున్నాయి.
ఇక ఈక్విటీ, ఈక్విటీ సంబంధ పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కాలంలో (ఏప్రిల్–జూలై) రూ.41,000 కోట్లకుపైగా వచ్చి చేరాయి. ఈ కాలంలో స్టాక్ మార్కెట్ మంచి ఊపుమీద ఉండడం గమనార్హం.
అమెరికా వడ్డీరేట్ల పెంపు, 2018 నాటికి యూరోప్‌లో కూడా ఉద్దీపనలు వెనక్కు తీసుకునే అవకాశాలు పసిడిపై పెట్టుబడులకు సంబంధించి కొంత ప్రతికూల ప్రభావం చూపే అంశాలని ఫండ్స్ ఇండియా. కామ్‌లో పనిచేస్తున్న ఎంఎఫ్ రీసెర్స్ హెడ్ విద్యా బాల పేర్కొన్నారు.
బాల అభిప్రాయం ప్రకారం– యల్లో మెటల్ దిగుమతులు పెరుగుతున్నప్పటికీ, డీమోనిటైజేషన్, డాలర్ మారకంలో రూపాయి బలోపేతం వంటి అంశాలు పసిడి ధరను పెరక్కుండా అడ్డుకుంటున్నాయి. ఈ ఏడాది జూన్ వరకూ పసిడి దిగుమతుల పరిమాణాన్ని చూస్తే, ఇది 2016లో మొత్తం దిగుమతుల పరిమాణాన్ని అధిగమించింది.
ఆశలూ ఉన్నాయ్..!
భారత మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం– వార్షికంగా చూస్తే... గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల విషయంలో కొంత ఆశాజనకంగా ఉంది. ఇక్కడ నుంచి బయటకు వెళుతున్న డబ్బు క్రమంగా తగ్గుతూ వస్తుండడమే దీనికి కారణం. 2013–14లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి భారీగా రూ.2,293 కోట్లు బయటకు వెళ్లిపోయాయి.
2014–15లో ఈ మొత్తం రూ.1,475 కోట్లకు తగ్గగా, అటు తరువాత సంవత్సరాల్లో ఈ మొత్తాలు తగ్గుతూ రూ.903 కోట్లు (2015–16), రూ.775 (2016–17)కోట్లకు దిగివచ్చాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య ఈటీఎఫ్ నుంచి రూ. 256 కోట్లు బయటకు వెళ్లిపోతే, గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం ఏకంగా భారీ మొత్తంలో రూ.411 కోట్లుగా ఉంది.