మెరవని గోల్డ్ ఈటీఎఫ్‌లు
► ఏప్రిల్–ఆగస్టు మధ్య రూ.300 కోట్లు బయటకు!
► నిధుల ఆకర్షణలో ఈఎల్‌ఎస్‌ఎస్
గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) తమ కాంతిని కోల్పోవడం కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఇన్వెస్టర్లు రూ.300 కోట్ల మేర గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి వెనక్కు తీసుకున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లకన్నా ఈక్విటీల పనితీరు బాగుండటమే దీనికి కారణమన్నది విశ్లేషణ. తాజా గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలను చూస్తే...
♦ గడచిన నాలుగు సంవత్సరాలుగా గోల్డ్ ఈటీఎఫ్‌లు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. 2013–14లో రూ.2,293 కోట్లు ఈటీఎఫ్‌ల నుంచి వెనక్కు మళ్లింది. 2014–15 సంవత్సరం లో ఈ మొత్తం రూ.1,475 కోట్లుగా ఉంది. 2015–16లో రూ.903 కోట్లుకాగా, 2016–17లో రూ.775 కోట్లు. అయితే బయటకు వెళుతున్న మొత్తం తగ్గుతుండటం కొంత ఊరట.
♦ గోల్డ్ ఈటీఎఫ్‌ల పరిస్థితి ఇలా ఉంటే, ఈక్విటీ, ఈక్విటీ అనుసంధాన పొదుపు స్కీమ్‌లలోకి (ఈఎల్‌ఎస్‌ఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో రూ.61,000 కోట్లు వచ్చాయి. ఒక్క చివరి నెల వాటా ఇందులో రూ.20,000 కోట్లు
♦ యాంఫి (అసోచామ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య 14 గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్‌ల నుంచి దాదాపు రూ.300 కోట్ల నికర మొత్తం వెనక్కు మళ్లింది. మార్చి ముగిసే నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ కింద (ఏయూఎం) రూ.5,480 కోట్లు ఉంటే ఈ మొత్తం ఆగస్టు ముగిసే నాటికి రూ.5,189 కోట్లు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.462 కోట్లు.